Wednesday 18 July 2012

సలాం హైదరాబాద్ – నమస్తే తెలంగాణ


అక్టోబరు 30 2010 , నల్లగొండ జిల్లా కట్టంగూరులో తెలంగాణ జే ఏ సి ప్రచార రథ యాత్ర లో మాట్లాడుతుంటే ఒక పిల్లవాడు నిలబడి ‘అన్నా… తెలంగాణ, హైదరాబాదు చారిత్రకంగానే అన్ని రంగాల్ల వెనకబడి ఉన్నయట గదా..పేపర్ల అచ్చింది’ అని స్కూల్లో లెక్కల సార్ ను  ఎక్కాల గురించి ప్రశ్నించినంత అమాయకంగా అడిగిండు. అది ఎంత అబద్దమో నేను నాకున్నంత పరిమిత జ్ఞానంతో, నాకున్న జ్ఞాపక శక్తితో కొన్ని చారిత్రక సంఘటనలు చెప్పిన. నేను చెప్పిన కొన్ని ఉదాహరణలతోనే వారం ముందే దీపావళి పండుగ అచ్చిందా అన్న రీతిలో వెలిగింది వాని సూరత్. ఏదైతేనేం ఓ భీ ఖుష్ ఔర్ మే భీ ఖుష్.
అదే రోజు రాత్రి హైదరాబాద్ కి బస్సుల తిరుగు ప్రయాణం పట్టిన. పక్కన ఉన్న సీట్లో ఒక ఆంధ్ర పెద్ద మనిషి కూర్చొని నన్ను నిద్ర పోనియ్యకుండా తెలంగాణ గురించి ఏదో అడగటం మొదలు పెట్టిండు. నేను దేనికీ అంతగా స్పందించకపోవటంతో, నేను భావ దారిద్ర్యుడినని ఒక నమ్మకానికి వచ్చి, ఆ భాద్యతగల పెద్ద మనిషి “మా కారణంగానే హైదరాబాద్ నగరం అంత సుందరంగా తయరయ్యిందోయ్! అంతకు మునుపు అక్కడేమి ఉండేది ? సిమెంటు కాంక్రీటు భవనాలు ఉండేవా ? హై టెక్ సిటీ ఉండేదా? ఆకాశ హర్మ్యాలు ఉండేవా ? అన్నీ ఉత్త మట్టి గోడల భవనాల గోడలే కదా అబ్బాయ్” అని ఎద్దేవా చేస్తూ ఉంటే హైదరాబాద్ నగరంలోనే కాదు, తెలంగాణ ప్రాంతం లో పుట్టు పెరిగిన వాళ్ళందరికీ ఆవేదన కల్గిస్తది. ఆ మాటలకు ఆ పెద్దాయన వయసు చూసి కోపగించుకోకుంట, ఒకప్పుడు మన దేశానికి ప్రధానిగా ఉన్న ఇందర్ కుమార్ గుజ్రాల్ హైదరాబాద్ కి అచ్చి “నేను చూసిన అందమైన హైదరాబాదు ఏమయ్యింది? ఇప్పుడున్నది సిమెంటు కాంక్రీటు భవనాల అరణ్యమేనా ?” అని తన ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనను ఆ పెద్దాయనకు చెప్పిన. అంతే కాకుండా “ప్రజలను దోచుకున్న వాళ్ళే ప్రజల చరిత్రను, సంస్కృతిని కూడా దోచుకుంటారు” అని రెండు చురకలంటించిన.
ఇంతలోనే వెనక కూర్చున్న తెలంగాణ పెద్ద మనిషి “హైదరాబాదు లో ఆంధ్రోల్లు రాక ముందు దినపత్రికలు లేవంటగా, ఫ్యాక్టరీలు లేవంటగా, అవి లేవంటగా ఇవి లేవంటగా…” అంటూ ప్రశ్న మీద ప్రశ్న ఏసిండు. అప్పుడే వేణు సంకోజు గారు చెప్పిన కొన్ని మాటలు యాదికొచ్చినయ్.
ఇంకా కొంత మందికి తెలంగాణ అనేది ఒక శేష ప్రశ్నే.
ప్రశ్న నుండి ప్రశ్నకే ప్రయాణించే వాళ్ళు కొందరుంటారు ఎల్లప్పుడూ. తమకు తెలియకుండానే ప్రతీపశాకుతల వాదనకు బలై పోతుంటారు, తమ సమాచార లేమికి బిక్క మొఖం వేస్తుంటారు.
సమాచారం…సమాచారం… అప్పుడు అనిపించింది 400 ఏండ్ల హైదరాబాదు చరిత్ర గురించి నాకు తెల్సిన సమాచారం ఎంత ? వివిధ పుస్తకాల్లో ఉన్న తుటాలే వలె పేలే సమాచారాన్ని ఒక దగ్గర చేర్చే ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటది ? ఇందుకోసం నాకు విలువైన పుస్తకాల్ని అందజేసిన పరవస్తు లోకేశ్వర్ (తెలంగాణ రచయితల సంఘం కన్వీనర్), వేణు సంకోజు (తెలంగాణ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి) గార్లకు ధన్యవాదాలు.
చేయి తిరగిన రచయితను కాకపోయినా ..చేయి ఉన్న కూలీగా “ఇటుక మీద ఇటుక పేర్చి గోడ కట్టే మేస్త్రీగా” ముత్యాల వంటి చారిత్రక ఘట్టాలను కలిపే దారానిగా “మన చరిత్రను మళ్ళీ మరోసారి తనివి తీరా తవ్వి” నా చారిత్రక (ఉడుత) కర్తవ్యాన్ని ఒక బాధ్యతగా
“ఈ సమాచారాన్ని చదివితే ఒక ఉద్యమపు తలుపులే – సందేహం లేనే లేదు
చూస్తారేం తెరవండిక – చీకట్ల తెరను పర్రున చీరేయండిక !”
షానే షహర్ హైదరాబాద్ దక్కన్
ప్యారే షహర్ హైదరాబాద్ దక్కన్
చార్ సౌ సాల్ పురానా షహర్
ఏ షహర్ హమారా, ఏ షౌకత్ హమారా
ఏ హమారా షహర్ హైదరాబాద్ దక్కన్
ఇదేనండి ఇదేనండి మా హైదరాబాదు
1507 గోల్కొండ స్వతంత్ర రాజ్యంగా అవతరణ
1562 హుస్సేన్ సాగర్ నిర్మాణం
1578 పురానాపుల్ నిర్మాణం
1578 నగరం గోల్కొండ కోట నుండి ముసీకి దక్షిణంగా విస్తరణ
1580 నూతన నగరానికి (ప్రస్తుత పాత నగరానికి) ఆవిష్కరణ
1589 -91 చార్మినార్, గుల్జార్ హౌజ్, చార్ కమాన్ల నిర్మాణం
1793 సరూర్ నగర్ లో జనావాసాలు ఏర్పడటం
1803 సుల్తాన్ శాహీలో టంకశాల ఏర్పాటు
1805 మీరాలం మండీ ఏర్పాటు
1806 మీరాలం చెరువు ఏర్పాటు
1808 బ్రిటిష్ రెసిడెన్సీ భవన నిర్మాణం
1828 చందూలాల్ బారాదరీ నిర్మాణం
1831 చాదర్ ఘాట్ వంతెన నిర్మాణం
1859 -66 అఫ్జల్ గంజ్ వంతెన నిర్మాణం (నయాపుల్)
1862 పోస్టాఫీసులు (డాక్ ఖానాల) నిర్మాణం
1873 బాగే ఆం – పబ్లిక్ గార్డెన్ నిర్మాణం
1873 బొంబాయి – సికిందరాబాదు రైల్వే లైన్ల నిర్మాణం
1874 నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు
1884 ఫలక్ నుమా ప్యాలెస్ నిర్మాణం
1882 చంచల్ గూడా జైలు నిర్మాణం
1883 నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం
1884 ముస్లిం జంగ్ వంతెన నిర్మాణం
1885 టెలిఫోన్ ఏర్పాటు
1890 నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు ఏర్పాటు
1893 హనుమాన్ వ్యాయమాశాల (జిమ్) ప్రారంభం
1910 హైదరాబాద్ స్టేట్ విద్యుత్ సంస్థ ఏర్పాటు
1920 హైకోర్టు నిర్మాణం
1920 ఉస్మాన్ సాగర్ (గండిపేట) నిర్మాణం
1927 హిమాయత్ సాగర్ ఆనకట్ట నిర్మాణం
1927 చార్మినార్ యునానీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి నిర్మాణం
1930 హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల నిర్మాణం
1935 బేగంపేట విమానాశ్రయం ఏర్పాటు
1945 నిజాం – టాటాల ఉమ్మడి భాగస్వామ్యంలో డక్కన్ ఎయిర్ వేస్ ప్రారంభం
“తెలంగాణ చారిత్రకంగానే పారిశ్రామిక రంగం లో వెనకబడి ఉంది.” 1956 నవంబరు ఒకటి నుండి హైదరాబాదు ఆ రంగం ఈ రంగం అన్ని రంగాలలో వెనకబడి ఉంది అని తెలంగాణ ‘రంగ’స్థలం మీద ప్రతి రోజు ‘నిజం — it’s a lie’ అన్న నాటకం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్దనేదే నిజమైన నిజం. ఫలితంగా తెలంగాణ ఆత్మనున్యతా భావంలోకి తనకు తెలియకుండానే నెట్టివేయ బడింది. “హైదరాబాదు సంస్థానం లో పారిశ్రామికీకరణ” అన్న పరిశోధనా పత్రంలో (సి. వి. సుబ్బారావు, డిల్లీ విశ్వ విద్యాలయంలో ఆర్ధిక శాస్త్ర నిపుణులు) 1930 లోనే తెలంగాణలో పారిశ్రామిక పురోగతి ఎలా జరిగింది (కోస్తాంధ్ర, రాయలసీమలో ఎలాంటి ఫ్యాక్టరీలు లేనప్పుడే సుమారు 200 ఫ్యాక్టరీలు తెలంగాణ జిల్లాల్లో ఉండేవి) వివరించారు. ఒక వేళ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశంలోకి రాకపోతే ఈ దేశంలోని చేనేత పరిశ్రమ బ్రిటన్లోని చేనేత పరిశ్రమల కన్నా అభివృద్ధి చెందేదని కారల్ మార్క్స్ చెప్పినట్లు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో విలీనం కాకపోతే తెలంగాణాలోని పరిశ్రమలన్నీ ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేవన్నది నగ్న సత్యం.
నిజాం కాలంలో తెలంగాణలో పారిశ్రామిక పురోగతి

1871 సింగరేణి బొగ్గు గనులు
1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు
1876 ఫిరంగుల ఫ్యాక్టరి
1910 ప్రభుత్వ ప్రింటింగు ప్రెస్
1910 ఐరన్ ఫ్యాక్టరి
1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరి
1919 వి.ఎస్.టి. ఫ్యాక్టరి
1921 కెమికల్ లాబొరేటరి
1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరి
1929 డి. బి. ఆర్. మిల్ల్స్
1931 ఆజంజాహి మిల్ల్స్, వరంగల్
1932 ఆర్. టి. సి. స్థాపన
1937 నిజాం షుగర్ ఫ్యాక్టరి
1939 సిర్పూర్ పేపర్ మిల్
1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరి
1942 హైదరాబాద్ స్టేట్ బ్యాంక్
1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
1943 ప్రాగా టూల్స్
1946 హైదరాబాద్ ఆస్బెస్టాస్
1947 హైదరాబాద్ లామినేషన్ ప్రోడక్స్
-
1956లో తుంటరి ఆంధ్రతో అమాయక తెలంగాణ పెండ్లి జరగ్గానే, ఆంధ్రా ఆఫీసర్ల జులుం మొదలైంది. ప్రభుత్వ కార్య కలాపాలను నిర్వహించటంలో మేం మీ కన్న “దీ బెస్ట్” అని తమకు తామే శభాష్ శభాష్ అంటూ సర్టిఫికెట్లు ఇచ్చుకున్రు. ఆ ఆధిక్యతా భావాల్ని ఇప్పటికీ సెక్రటేరియట్లో అట్లనే కొనసాగుతున్నాయ్. ఆరవ నిజాం కాలంలో అప్పటి ప్రధాన మంత్రి సర్ సాలార్ జంగ్ (మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ 1, GCSI, 1829 -1883) ప్రవేశ పెట్టిన పరిపాలనా సంస్కరణల వలన వివిధ శాఖలు ఎప్పుడు స్థాపించబడినాయో చుడండి:
సర్ సాలార్ జంగ్ కాలంలో “సుపరిపాలన”

1864 రెవెన్యు శాఖ
1866 కస్టమ్స్ శాఖ (కరోడ్గిరి)
1866 జిల్లాల ఏర్పాటు
1866 వైద్య శాఖ
1866 మొదటి రైల్వే లైను
1867 ప్రింటింగు మరియు స్టేషనరీ
1867 ఎండోమెంట్ శాఖ
1867 అటవీ శాఖ (జంగ్లాత్)
1869 మున్సిపల్ శాఖ
1869 పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్
1870 విద్యా శాఖ
1870 హైకోర్టు ఏర్పాటు
1875 సర్వే, సెటిల్మెంట్ శాఖ
1876 ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ
1881 జనాభా లెక్కల సేకరణ
1882 ఎక్సైజు శాఖ (ఆబ్కారీ)
1883 పోలీసు శాఖ
1892 గనుల శాఖ
1892 పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు
1893 లోకల్ ఫండ్ శాఖ
1896 నీటిపారుదల శాఖ
1911 స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్
1912 సిటి ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ బోర్డు (నేటి హుడా లెక్క)
1913 వ్యవసాయ శాఖ
1913 హైదరాబాద్ సివిల్ సర్వీసు (నేటి A.P.P.S.C. లెక్క)
1914 ఆర్కియాలజీ శాఖ
1932 ఆకాశవాణి హైదరాబాద్
1945 కార్మిక శాఖ
-
తెలంగానాంధ్ర పెండ్లి అయిన మొదటి రాత్రి నుండే తెలంగాణ తల్లి బిడ్డల మీద ఆంధ్ర ఆంగ్ల దొరల కూతలు: తెలంగాణ వారికి తెలివి లేదు, అంబటి గాళ్ళు, తెలుగు రాదు, చదువు రాదు. మేమే మీకు “అక్షరాభ్యాసం” చేస్నమని ఇప్పటికీ పోజులు. అందుకే ‘విజయవాడ శ్రీ చైతన్య, గుంటూరు నారాయణ’ అని ఇప్పటికీ (విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించి రక్తాన్ని పీల్చే) ఇంటి ముందు దిష్టి బొమ్మల్లా, హైదరాబాదు లో బోర్డులు వేలాడుతూనే ఉన్నాయి. ప్రస్తుత వలసాంధ్ర పాలనలో విద్య అంగడి సరుకుగా మారలేదా? విద్య సంస్కరణలన్నీ తెలంగాణలోనే ముఖ్యంగా ఉస్మానియా ఉనివర్సితీ లోనే ఎందుకు అమలు జరుగుతున్నాయి? ఒ.యు. 1939 వందేమాతరం ఉద్యమం నాటి నుండి ఈనాటి వరకు సమకాలీన సామాజిక ఉద్యమాలకు, చైతన్యానికి వేదిక నిలబడింది. “1969 జనవరి ౨౪ న కాల్పుల్లో గాయపడిన వారిని గాంధి ఆసుపత్రిలో చేర్చిన్రు. ఇంజనీరింగు కాలేజి వద్ద విద్యార్ధుల సభ జరుగుతుండగా ‘గాయపడిన వారు చావు బత్కుల్లో ఉన్రు. వారికి ఎక్కించటానికి ఆసుపత్రిలో రక్తం కావాలె’ – అన్న మేఘ సందేశం అందింది. అది విన్న పిల్లలు రక్త దానం కోసం యునివర్సిటీ నుండి గాంధీ ఆసుపత్రి వరకు పరిగెత్తే దృశ్యం ఒక అపూర్వ సన్నివేశం (అప్పట్లో విద్యార్ధులకు స్కూటర్లు, బైకులు లేవు, బందు కారణంగా బస్సులు ఆటోలు లెవ్వు).”
హైదరాబాద్ లో వెళ్లి విరిసిన విద్యాలయాలు

1856 దారుల్ ఉలూమ్ స్కూలు
1872 చాదర్ ఘాట్ స్కూలు
1879 ముఫీడుల్ అనం హైస్కూల్
1879 ఆలియా స్కూల్
1884 సికిందరాబాద్ మహబూబ్ కాలేజి
1884 నిజాం కాలేజి
1887 నాంపల్లి బాలికల స్కూలు
1890 వరంగల్ లో మొదటి (తెలుగు) స్కూలు
1894 ఆసఫియా స్కూలు
1894 మెడికల్ కాలేజి
1904 వివేక వర్ధిని స్కూలు
1910 మహాబుబియా బాలికల స్కూలు, గన్ ఫౌండ్రి
1918 ఉస్మానియా యునివర్సిటీ
1920 సిటీ కాలేజి
1923 హైదరాబాద్ పబ్లిక్ స్కూలు
1924 మార్వాడి హిందీ విద్యాలయా
1926 హిందీ విద్యాలయ
1930 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి
1946 కాలేజి ఆఫ్ వెటర్నరి సైన్స్

రోగి వెళ్ళగానే రూపాయిని ప్రేమించకుండా, రోగిని రోగాన్ని ఆప్యాయతతో, ప్రేమతో, భరోసా ఇచ్చే ధైర్య వచనాలతో బలవంతంగా దవాఖానాలో అడ్మిట్ చేస్కొని ఉచితంగా మందులు మాకులతో పాటు అన్నం, డబుల్ రొట్టె, మోసంబీ పండ్లు, టమాట రసం, గుడ్లు, వోద్దన్నా ఇచ్చి ఆరోగ్యం బాగు చేసి పేషెంట్ ఇంటికి వెళ్తానని బతిమిలాడుకుంటే డిశ్చార్జ్ చేసేటోల్లు. ఏవీ ఆ బంగారు దినాలు ? ఏందీ ఈ కంపు కొట్టే నక్షత్రాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్?
అలనాటి పేద రోగుల్ని ప్రేమించిన ‘దవాఖానాలు’

1890 ఆయుర్వేదం, యునాని వైద్యశాల ఏర్పాటు
1894 మెడికల్ కాలేజి
1897 మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ
1905 జిజ్గిఖాన (విక్టోరియా మెమోరియల్ ప్రసూతి దవాఖానా)
1916 హోమియోపతి కాలేజి
1927 చార్మినార్ యునాని ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం
1925 ఉస్మానియా జనరల్ హాస్పిటల్
1945 నీలోఫర్ చిన్నపిల్లలా దవాఖానా
గాంధి దవాఖానా,
టి. బి. దవాఖానా, ఎర్రగడ్డ,
క్యాన్సర్ దవాఖానా,
ఇ. ఎన్. టి. దవాఖానా,
నిజాం ఆర్దోపెడిక్ హాస్పిటల్,
కోరాంతి దవాఖానా
-
నిజాం కాలం లో తెలుగు, ఉర్దూ, హిందీ పత్రికలు

సం||      పేరు,   సంపాదకులు
1886  శేద్యచంద్రిక, ప్రభుత్వ పత్రిక
1890  దినవర్తమాన్, నారాయణ స్వామి మోదిలియార్
1909  సంయుక్త సంఘవర్తమాని, సిమోన్ పశుమలె
1913  హితబోధిని, శ్రీనివాస శర్మ
1920  ములాగ్ – వర్తమాని, ఏం. పి. టాక్
1921  సువార్తామణి, ఆల్బర్టు సామేలు
1922  తెనుగు, ఒద్దిరాజు సీతారామచంద్రరావు
1922  నీలగి,రి ఎస్. వి. నరసింహా రావ్
1923  శైవప్రచారిణి, ఎం. వి. శాస్త్రి
1923  రయ్యత్, ఎం. నర్సింగరావు
1925  భాగ్యనగర్, భాగ్యరెడ్డి వర్మ
1925  నేడు, శ్రీ భాస్కర్
1926  గోల్కొండ పత్రిక, సురవరం ప్రతాప రెడ్డి
1927  ఆది హిందూ, భాగ్య రెడ్డి వర్మ
1927  సుజాత, పి. నృసింహా శర్మ
1934  దక్కన్ కేసరి, డి. శర్మ
1936  విభూతి, చెదిరి మఠం వీరబద్ర శర్మ
1937  దివ్యవాణి, చివుకుల అప్పయ్య శాస్త్రి
1937  శోభ, దేవులపల్లి రామానుజ రావు
1944  తెలంగాణ, బుక్కపట్నం రామానుజాచార్యులు
1947  ఇమ్రోజ్, షోయభుల్లా ఖాన్
-
హైదరాబాద్ స్టేట్ లో గ్రంధాలయాల స్థాపన
1872 ముదిగొండ శంకరాచార్యుల లైబ్రరి, సికింద్రాబాద్
1892 ఆసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
1895 భారత్ గుణ వార్ధక్ సంస్థ లైబ్రరీ, శాలిబండ
1896 బొల్లారం లైబ్రరీ
1901 శ్రీ కృష్ణదేవరాయ ఆంద్ర భాషా నిలయం, సుల్తాన్ బజార్
1904 రాజరాజనరేంద్ర ఆంద్ర భాష నిలయం, హన్మకొండ
1905 విజ్ఞాన చంద్రికా గ్రంధ మండలి, హైదరాబాద్
1913 ప్రతాపరుద్ర ఆంద్ర భాష నిలయం, మడికొండ, వరంగల్ జిల్లా
1913 సంస్కృత కళా వరదనీ గ్రంధాలయం, సికిందరాబాద్
1923 బాలసరస్వతీ గ్రంధాలయం, హైదరాబాద్
1930 జోగిపేట గ్రంధాలయం, మెదక్ జిల్లా
“వీర తెలంగాణ నాది
వేరు తెలంగాణ నాది
వేరై కూడా తెలంగాణ -
వీర తెలంగాణ ముమ్మాటికీ
తెలంగాణ వేరై నిలిచి భారతానవేలయు ముమ్మాటికీ” — కాళోజి
***
రచయిత గురించి:
Nishanth Dongari, Lecturer (EC Marie Curie Fellow), University of Strathclyde, Glasgow, UK. Email-nishanth.uk(AT)gmail.com

వంకర రాతల సుంకర వెంకటేసు


విశాలాంధ్ర మహాసభ తరఫున నేణు ప్రశ్నలడుగుతున్నాను, సత్తా,చేవ,దమ్ము,ఖలేజా,తెలివి ఉంటే సమాధానం ఇమ్మని సుంకర వెంకటేసు అనే పెద్దమనిషి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ పెద్దమనిషి రాతలు అత్యంత అభ్యంతరకరంగా సంస్కారహీనంగా ఉన్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలు ఇప్పటికే ఎన్నోసార్లు సమాధానాలు చెప్పబడిన తర్కహీనమయిన నాసిరకం వాదనలు. అలాంటి చెత్త వాదనలకు సమాధానాలు ఇస్తూ అటెన్షన్ సీకర్లకు లేని ప్రాముఖ్యాన్ని ఇవ్వడం మాకు ఎంతమాత్రం ఇష్టం లేకపోయినా ఒకవేల సమాధానం ఇవ్వకపోతే ఎవరైనా తెలియనివారు ఈనాసిరకం వాదనలను నిజమని నమ్మే ప్రమాదం ఉంది కనుక సమాధానాలు ఇవ్వల్సి వస్తుంది.

సుంకర గారి సవాలు పూర్తి పాఠం:
**********
విశాలాంధ్ర మహాసభ తరపున నేను చేస్తున్న  సవాలు కి ఈ "తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు" సంస్కారముతో ,సహనముతో సమాధానము ఇవ్వాలి....ఇవ్వగలరా...? ఆ ఇవ్వగలిగే సత్తా మీకు ఉందా..?
మా పరకాల ప్రభాకర్ గారి గురించి మాటమాటకి ప్రతి ఒక్క బొడ్డు ఊడని ,తాడు బొంగరము లేని,సంస్కారము లేని,మేధస్సు అనేది అసలు ఏ కోశానా మచ్చుకు కూడా కనిపించని ప్రతి ఒక్క తెలంగాణా వేర్పాటువాది "నువ్వు బీజేపీ లో ఉన్నప్పుడు ఒక వోటు రెండు రాష్ట్రాలు అనే  కాకినాడ తీర్మానము లో నువ్వు కూడా పాల్గోన్నావు కదా....పీఆర్పీ లో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణా అని అన్నావుకదా....మీ భార్య ఇప్పుడు బీజేపీ లో అధికార ప్రతినిధి కదా  ఒక ప్రశ్న అడగటము పరిపాటి అయ్యిపోయింది.....ఇప్పుడు నేను మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతాను మీకు సత్తా,చేవ,దమ్ము,ఖలేజా,తెలివి ఉంటె ఈ దిగువ అడుగుతున్న కొన్ని  ప్రశ్నలకు మాత్రము సమాధానము ఇవ్వండి ప్లీజ్.
1 . ఇప్పుడు మీకు ,మీ ఉద్యమానికి నాయకత్వము వహిస్తున్న శ్రీ కే.చంద్రశేఖర్ రావు ఒకప్పుడు సమైఖ్య వాదా కాదా...? (రుజువులు ఉన్నాయి)(            26 - 02 - 1997       )
2 . శ్రీ కే చంద్రశేఖర రావు అసెంబ్లీ లో జోనల్ వ్యవస్థ రద్దు చెయ్యమని అడిగాడా లేదా...?(రుజువులు ఉన్నాయి) (            18 - 07 -1996       )
౩.  శ్రీ కొండ లక్ష్మణ్ గారు మంత్రి గా ఉన్నప్పుడు ,1969 ,1972 లో రాష్ట్రము సమైఖ్యముగా 
ఉండాలని అన్నారా లేదా...?(రుజువులు ఉన్నాయి)
4 . మీ వేర్పాటువాద నాయకుల పిల్లలు ఇప్పుడు ఆంధ్రా రాయలసీమ వారితో వ్యాపార భాగస్వాములు కాదా...?(రుజువులు ఉన్నాయి)
5 .వేర్పాటు  వాద పార్టీ 2004 లో సమైఖ్య ప్రభుత్వములో మంత్రి పదవులు పొంది  అధికారము అనుభవించలేదా...?(రుజువులు ఉన్నాయి)
6 . శ్రీ నాగం జనార్ధనరెడ్డి నేను ఒకప్పుడు తెలంగాణా వాదిని , ఇప్పుడు సమైఖ్యవాదిని అని అసెంబ్లీ లో అనలేదా...?(రుజువులు ఉన్నాయి)(            22 -08 -1988       )
 మమ్ములను చర్చలలో ఎదుర్కోలేక,మా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారంటే మీ వాదములో పసలేదు కాబట్టే....!
మీరు చేస్తున్న ఇప్పటి ఈ అప్రజాస్వామిక వేర్పాటువాద  ఉద్యమము మీలో చాలా మందికి  బ్రతుకుదెరువు ఉద్యమము ,ఉపాధి హామీ ఉద్యమము, స్వయం ఉపాధి ఉద్యమము లాంటిది  కాదా అని అడుగుతున్నా...!
మీకు ఈ అప్రజాస్వామిక  వేర్పాటువాద ఉద్యమము మీలో చాలా మందికి "బంగారు బాతు" లాగా అవ్వలేదా ...?
ఈ అప్రజాస్వామిక  వేర్పాటువాద ఉద్యమము ముసుగులో మీలో ఎంతమంది కోటీశ్వరులు అయ్యారో , కొండవీటి చేంతాడు లాంటి వారి వివరాలు , పేరులతో సహా ఎక్కడైనా రుజువులతో సహా   చెప్పటానికి మేము సిద్ధము.. ఈ దోచుకున్న డబ్బు ఆంధ్రా , తెలంగాణా రైతులది,వ్యాపారస్తులది,బడుగు జీవులది కూడా కాదా అని అడుగుతున్నా.....?
ఇట్లు ,
మీ భవదీయుడు
వెంకటేశ్వర్

****************


>>>తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు" సంస్కారముతో ,సహనముతో సమాధానము ఇవ్వాలి....ఇవ్వగలరా...? 



ఆర్యా, పెద్దలు కాస్త నోరు అదుపులో పెట్టుకుని రాతలు రాయవలసి ఉంటుంది. ఇవ్వాల మీరు తమ సొంత నామధేయంతో విశాలాంధ్ర మహాసభ తరఫున అని చెబుతూ, తెలంగాణ నడిబొడ్డున నివసిస్తూ కూడా   తెలంగాణ వాదులపై ఇంత అభ్యంతరకరంగా రాతలు రాయగలుగుతున్నారంటే కారణం మీరు రాసినట్టు తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, నాయకత్వం కానీ తీవ్రవాదులూ, వేర్పాటువాదులూ కారు కాబట్టి.

ఒక్కసారి తమరు తమ సమైక్యవాద నాయకత్వాన్ని గమనిస్తే అందులో సగం మంది ఫాక్షన్ చరిత్ర కలిగిన వారూ, నేర చరిత్ర కలిగిన వారూ అని తప్పక గమనిస్తారు. కానీ మీకళ్ళు నిజాలని చూడడానికి సిద్ధంగాలేవుకదా? ఇదే రకం మాటలు సమైక్యవాదనాయకత్వంపై ఎవరైనా ఉపయోగించి ఉంటే తెల్లారేసరికి తెలంగాణపై దాడిచేసి కడప బాంబులూ, కర్నూలు వేటకొడవల్లు, గుంటూరు నాటుబాంబులూ (కోడెల శివప్రసాదు ఇంట్లో పేలిన రకం) ఉపయోగించి యుద్ధం చేసి ఉండేవారని మనవి.   

మరో మాట: ఒకవైపు  తీవ్రవాదులూ, వేర్పాటువాదులూ అనే భాషను ఉపయోగిస్తూ ఎదుటివారిని మాత్రం సంస్కారంతో, సహనంతో సమాధానం ఇమ్మని అడగడం మీబుద్ధిలేమిని, అఙ్యానాన్ని, మదాన్ని తెలియజేస్తుందని మనవి. కనుక ఇకనైనా నిజాలు తెలుసుకుని సంస్కాయుతంగా రాతలు రాయగలరు. పైగా మీరు విశాలాంధ్ర మహాసభ తరఫున సవాలు విసురుతున్నారు కనుక అందులో భాష సరిగా వాడకపోతే మీరాతలు విశాలాంధ్ర మహాసభకు చెరుపు. 

సంస్కారము లేని,మేధస్సు అనేది అసలు ఏ కోశానా మచ్చుకు కూడా కనిపించని ప్రతి ఒక్క తెలంగాణా వేర్పాటువాది 

ఆహా, తమరి రాతల్లో సంస్కారం ఉట్టిపడుతుంది కదా! ఇది కేవలం మీ కుసంస్కారమే అనుకోవాలా, లేక మీవిశాలాంధ్ర మహాసభకూ, సమైక్యవాదులందరికీ కట్టగలిపి ఆపాదించాలా?


"నువ్వు బీజేపీ లో ఉన్నప్పుడు ఒక వోటు రెండు రాష్ట్రాలు అనే  కాకినాడ తీర్మానము లో నువ్వు కూడా పాల్గోన్నావు కదా....పీఆర్పీ లో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణా అని అన్నావుకదా....మీ భార్య ఇప్పుడు బీజేపీ లో అధికార ప్రతినిధి కదా  ఒక ప్రశ్న అడగటము పరిపాటి అయ్యిపోయింది.



తమరు సరిగ్గా విన్నట్లు లేరు. వారడిగేది అదికాదు, "మానోరు నొక్కేస్తున్నారు కదయ్యా" అంటూ అమాయకత్వం నటించే "విషవృక్షాలు",  "మేంఉ తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తాం, అన్నదమ్ముల్లా విడిపోదాం" (రుజువులు కావాలా?) అన్నప్పుడు తమ నోరు ఎవరైనా నొక్కేసారా అని అడుగుతున్నారు.

పైగా ఇంట్లో సొంతభార్యను నీవాదనతో ఒప్పించనివాడివి ఇక్కడ ప్రజలను మేము ఒప్పిస్తాం అని గొంతెమ్మ కబుర్లెందుకు చెబుతున్నావని అడుగుతున్నారు.

1 . ఇప్పుడు మీకు ,మీ ఉద్యమానికి నాయకత్వము వహిస్తున్న శ్రీ కే.చంద్రశేఖర్ రావు ఒకప్పుడు సమైఖ్య వాదా కాదా...? (రుజువులు ఉన్నాయి)(            26 - 02 - 1997       )
2 . శ్రీ కే చంద్రశేఖర రావు అసెంబ్లీ లో జోనల్ వ్యవస్థ రద్దు చెయ్యమని అడిగాడా లేదా...?(రుజువులు ఉన్నాయి) (            18 - 07 -1996       )
౩.  శ్రీ కొండ లక్ష్మణ్ గారు మంత్రి గా ఉన్నప్పుడు ,1969 ,1972 లో రాష్ట్రము సమైఖ్యముగా 
ఉండాలని అన్నారా లేదా...?(రుజువులు ఉన్నాయి)
6 . శ్రీ నాగం జనార్ధనరెడ్డి నేను ఒకప్పుడు తెలంగాణా వాదిని , ఇప్పుడు సమైఖ్యవాదిని అని అసెంబ్లీ లో అనలేదా...?(రుజువులు ఉన్నాయి)


ఆర్యా, చంద్రశేఖరరావు గానీ కొండా లక్ష్మన్ బాపూజీ గానీ, మరొకరు కానీ తాము ఒక రాజకీయపార్టీలో ఉన్నప్పుడు ఆపార్టీ నాయకత్వం యొక్క స్టాండుకు కట్టుబడి మాట్లాడారు. అయితే ఆఇద్దరూ కూడా తెలంగాణ విషయంపైనే పార్టీతో విభేదించి బయటికి వచ్చి ఆ తరువాత తెలంగాణవాదాన్ని వినిపించారు.


తమరి అవకాశవాద పరకాల ప్రభాకర్‌లాగా పార్టీలో ఉన్నప్పుడు పార్టీపాట పాడుతూ, ఏనాడూ రాష్ట్ర విభజన విషయంపై తమ పార్టీ నాయకత్వాన్ని నిలదీయక, విభేదించక డూడూ బసవన్నలాగా తలూపుతూ కేవలం టిక్కెట్టివ్వని కారణం చేత పార్టీని విషవృక్షం అని తూలనాడీ బయటికి వచ్చి ఆతరువాత తమ వాదన మార్చుకోలేదు.


ఈతేడా తమలాంటి బుద్ధిహీనులకు అర్ధం అవుతుందని అనుకోను. మీరు ఎందుకు బుద్ధిహీనులో ఇప్పటికే నిరూపించబడిందని గమనించగలరు


4 . మీ వేర్పాటువాద నాయకుల పిల్లలు ఇప్పుడు ఆంధ్రా రాయలసీమ వారితో వ్యాపార భాగస్వాములు కాదా...?(రుజువులు ఉన్నాయి)


 ఆర్యా, తమరు వేర్పాటువాదము అనేపదానికి అర్ధం తెలియనంత మూర్ఖులని నేననుకోలేదు. మీ సమైక్యవాద నాయకులకు హైదరాబాదు, చుట్టుపక్కలా పుష్కలంగా వ్యాపారాలు ఉన్నాయి, వేల ఎకరాల భూములు కబ్జా చేశారు, వాటిపై లాంకో హిల్స్ లాంటి భవంతులు నిర్మించారు.

5 .వేర్పాటు  వాద పార్టీ 2004 లో సమైఖ్య ప్రభుత్వములో మంత్రి పదవులు పొంది  అధికారము అనుభవించలేదా...?(రుజువులు ఉన్నాయి)




సమైఖ్య కాదు, సమైక్య.  సమైక్య ప్రభుత్వంలో తెలంగాణ నుండి ఎవరూ ఉండకూడదని మీవిషాంధ మహాసభవారేమయినా తీర్మానించారా? 




సుంకర వెంకటేస్వర్లు గారూ, మీవాదనలు ఎంత చప్పగా ఉన్నాయంటే వీటికి సమాధానాలు ఇవ్వడానికి మీరు భ్రమపడుతున్నట్లు మేధస్సు, దమ్ము, ఖలేజా లాంటివేవీ అవసరం లేదు, బొడ్డూడని బుడ్డోడు కూడా సమాధానం ఇవ్వగలరు. దానికి కారణం మీవాదనలో పటుత్వం లేకపోవడం తప్ప మరొకటి కాదని మనవి




Friday 13 July 2012

మరోసారి న్యాయం గెలిచింది





తెలంగాణ ప్రజలు తమ హక్కులకోసం చేస్తున్న పోరులో మరో విజయం లభించింది. ఇప్పటికే మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసి తక్కువ సీట్లు కేటాయింపులు జరపగా కొత్తగా అనుమంతించిన నూటయాభై సీట్లను పూర్తిగా ఆంధ్రా ప్రాంతంలో ఉన్న కాలేజీల్లోనే కేటాయించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పక్షపాత బుద్ధిని బయట పెట్టుకున్నాడు. అయితే ప్రభుత్వానికి చెంపపెట్టులాగా కోర్టు తన తీర్పుతో న్యాయాన్ని గెలిపించింది.

2011 జనాభా లెక్కలప్రకారం తెలంగాణ(OU లోకల్), AU లోకల్, SVU లోకల్ జనాభాలు 3.52 కోట్లు, 3.12 కోట్లు, 1.81 కోట్లు. ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లు OU - 600, AU- - 650, SVU - 550. అంటే లక్ష జనాభాకి SVUలో 3.03 సీట్లు, AUలో 2.08 సీట్లు ఉండగా  OU (తెలంగాణ) లో మాత్రం 1.7 సీట్లు మాత్రమే ఉన్నాయి. గత ఇరవై ఏళ్ళుగా తెలంగాణలో ప్రభుత్వ కోటాలో కొత్తగా ఒక్క కాలేజీ మాత్రం స్థాపించగా ఆంధ్రాలో మూడు, రాయలసీమలో నాలుగు కొత్తగా వెలిశాయి. ఇప్పుడు కొత్తగా కేటాయించబడిన నూటయాభై సీట్లను మొత్తంగా ఆంధ్రా, రాయలసీమలోని కాలేజీలకు మాత్రమే కేటాయించారు.

మెడికల్ సీట్ల కేటాయింపు విషయంలో జరిగిన అన్యాయంపై తెలంగాణవాదులు గత రెండు వారాలుగా చేస్తున్న పోరాటం చివరికి గెలిచింది. హైకోర్టు యాభై సీట్లను ఉస్మానియా, కాకతీయా మెడికల్ కాలేజీల్లో కేటాయించాలని మెడికల్ కౌన్సిల్‌ను ఆదేశించింది.

Thursday 12 July 2012

చలసాని --ఆంధ్రా మేతావుల ఫోరం





టీవీల్లో వార్తాఛానెల్లు క్రమం తప్పకుండా చూసేవారికి చలసాని శ్రీనివాస్ సుపరిచితుడు. ఆంధ్రా మేధావులఫోరం అంటూ ఒకటి స్థాపించి, తనను తానే మేధావిగా ప్రకటించుకున్న ఇతగాడు ఎక్కడ ఎప్పుడు తెలంగాణ, ఆంధ్రాలకు సంబంధించిన చర్చ జరిగినా నేనున్నానంటూ వాలిపోయి  తీర,సీమాంధ్ర వాసుల హక్కులంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఈయన తనవాదన మొదలు పెట్టాడంటే చాలు, వాదనలో తర్కమూ, హేతువూ పారిపోతాయి. నిజాలు కనుమరుగయిపోతాయి, అసలు వినేవాళ్ళకు ఇలాకూడా మాట్లాడొచ్చా అనిపిస్తాయి.

ఒకవైపు మెడికల్ సీట్లలో తమకన్యాయం జరిగింది, కొత్తగా అనుమతిలభించిన సీట్లలో తెలంగాణాకు వాటా రాలేదని తెలంగాణావాదులు చెబుతుంటే కాదు, అసలు మా తీర, సీమాంధ్రలకే అన్యాయం జరిగిందని ఈయన వాదిస్తాడు. పైగా ఆరు సూత్రాలపధకం వచ్చినప్పటినుంచీ నేటివరకూ తెలంగాణా జనాభా పెరిగిందీ అని వాదిస్తాడు. మరి సీట్లు జనాభా పెరిగిన చోట ఇవ్వాలో పెరగని చోట ఇవ్వాలో వినేవారికి అర్ధం కాక బుర్రగోక్కోవాల్సి వస్తుంది.

14F ఒక అన్యాయమైన నిబంధన, దీనివలన హైదరాబాదులో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయపార్టీల, అన్ని ప్రాంతాల నాయకులు నిర్ద్వందంగా ఒప్పుకున్నప్పుడు ఈయన మాత్రం లేదు 14F ఉండాల్సిందే అని వాదిస్తాడు.

పోనీ ఈయన తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమా అంటే అదేం కాదు. అందరు సీమాంధ్ర నాయకులూ, మేధావులమని చెప్పుకునేవారికి భిన్నంగా ఈయన తెలంగాణ ఏర్పాటు మాకు సమ్మతమే అంటాడు. కానీ హైదరాబాదును మాత్రం దేశానికి రెండో రాజధానిని చేసి కేంద్రపాలితప్రాంతం చెయ్యాలట. ఎందుకూ అంటే 17వ శత్తాబ్దంలో కోస్తానుండి హైదరాబాదుకు నిధులు (పన్నులు) వెల్లాయని వాదన మొదలు పెడతాడు.. అందరిలా ఇప్పుడు మేం పెట్టుబడులు పెట్టాం కాబట్టి మాకూ వాటాకావాలి అంటూ తెలివితక్కువమాటలు మాట్లాడనందుకు అభినందించాల్సిందేకానీ 17వ శతాబ్దంలో పన్నులు కడితే ఇప్పుడు కేంద్రపాలితప్రాంతం చెయ్యడం వల్ల ఈయనకు ఏం ఒరుగుతుందో?

చీటికీ మాటికీ అసలు తెలంగాణ, ఆంధ్రాలు కలవడంవల్ల మాతీరసీమాంధ్రలు వెనుకబడిపొయ్యాయంటూ చిత్రవిచిత్రమైన వాదనలు చేసే ఈయన మరి వెనుకబడిపోతే ఎందుకు కలిసిఉందామంటున్నారు, విడిపోవచ్చుగా అంటే చెప్పడు. ఇలాంటివారి వాదనలు కూరలో కరివేపాకులాంటివి... ఇవి ప్రేక్షకులకు కాస్సేపు కాలక్షేపం నింపుతాయి..అంతే.