By: కొణతం దిలీప్
తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు తరచూ వల్లెవేసే మాట – “మేము కళాకారులం, మాకు ప్రాంతీయ భేధాలు లేవు” అని. కానీ వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆది నుండీ తెలంగాణ అంటే చిన్న చూపే. సినిమా పరిశ్రమ పెద్దలు తమ ఆంధ్ర పక్షపాత బుద్ధిని ఏనాడు దాచుకోలేదు.
1972 జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నిజస్వరూపం నగ్నంగా బయటపడింది. ఆనాడు ముల్కీ రూల్స్ రద్దు చేయాలని సాగిన ఆ హింసాత్మక ఉద్యమానికి తెలుగు సినీ ప్రముఖులు ఇతోధికంగా సాయపడటమే కాదు ఏకంగా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఈ తరంలో చాలామందికి తెలవదు.
అంతకు మూడేండ్ల ముందు 1969లో తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎగిసింది. ప్రభుత్వ కౄర అణచివేతలో 369 మంది యువతీయువకులు నేలకొరిగారు. ఇదంతా జరుగుతున్నా అదేదో తనకు సంబంధించని అంశంలా పట్టించుకోకుండా ఉండిపోయింది తెలుగు సినిమా పరిశ్రమ.
తమ సినిమాలు తెలంగాణ ప్రాంతంలో కూడా ఆడతాయని, నైజాం ప్రాంతం నుండి వసూలైన సొమ్ము భారీమొత్తంలోనే ఉంటుందని తెలిసి కూడా ఆనాటి సినీ పరిశ్రమ ఎలాంటి సంకోచం లేకుండా 1972లో ”జై ఆంధ్రా” అంటూ తెలంగాణ వ్యతిరేక వైఖరి తీసుకుంది. అదే పరిశ్రమ ఇవ్వాళ కళకు ప్రాంతాలు లేవని బొంకితే నమ్మేది ఎవరు? ఆనాడు జై ఆంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, కృష్ణం రాజు, జమున, వాణిశ్రీ వంటివారు నేటికీ జీవించే ఉన్నారు.
ఒకసారి అప్పటి చరిత్ర పుటలు తిరగేస్తే దిగ్బ్రాంతికర వాస్తవాలెన్నో బయటపడతాయి. దాచేస్తే దాగని ఈ సత్యాలు, తెలుగు సినీ పెద్దల అసలు స్వరూపాలను మనముందు నిలబెడతాయి. “అందరివాళ్లు”గా చలామణి అవుతున్న ఈ హీరోలు నిజానికి “కొందరివాళ్ళు” అని, ప్రాంతీయ దురభిమానులు అని , గోముఖ వ్యాఘ్రాలని నిరూపణ అవుతుంది.
1972 జై ఆంధ్ర ఉద్యమంలో తెలుగు సినీ పరిశ్రమ పోషించిన పాత్ర స్థూలంగా ఇదీ:
- తమకు ఏ రాజకీయాలు లేవని చెప్పుకునే సినీ పరిశ్రమ ఏకంగా ముల్కీ రూల్స్ ను రద్దు చేయాలనే డిమాండుతో పత్రికా ప్రకటనలు ఇచ్చింది
- ఉద్యమానికి భారీ మొత్తంలో నిధులు సమకూర్చారు సినీ పరిశ్రమ పెద్దలు. విరాళాలు ఇచ్చిన వారిలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, వంటి అగ్ర హీరోలు ఉన్నారు. సినీ పరిశ్రమ నుండి భారీ ఎత్తున నల్లధనం ఉద్యమానికి అందుతున్నదనే అనుమానంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సి.ని.ఐ. విచారణకు కూడా అదేశించిందట.
- ఉద్యమంలో కాల్పులు జరిగి ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు సంఘీభావంగా తెలుగు సినిమా పరిశ్రమలోని అనేక మంది హీరోలు, హీరోయిన్లు పత్రికా ముఖంగా ప్రకటనలు ఇచ్చారు. ఇందులో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, జమున, రామకృష్ణ, ఎస్వీరంగారావు, వాణిశ్రీ, చలం, శారద, చాయాదేవి వంటి వారున్నారు. ఇవ్వాళ వందలాది మంది తెలంగాణ యువతీయువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నా ఒక్క సినీ పరిశ్రమ ప్రముఖుడూ పట్టించుకున్న పాపానపోలేదు.
- జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా సమ్మె చేసిన ఎన్.జివో లకు ఒక సహాయ నిధి ఏర్పాటుచేస్తే సినీ పరిశ్రమ ప్రముఖులు దానికి విరాళాలు ఇచ్చిండ్రు.
- ఆ సమయలో రిలీజ్ అయిన కొన్ని చిత్రాల ఒక్క రోజు కలెక్షన్లు ఉద్యమంలో చనిపోయిన వారి సహాయనిధికి ఇచ్చిండ్రు.
- ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలనే డిమాండుతో సినీ హీరో కృష్ణ, విజయ నిర్మల స్వయంగా మద్రాసులో నిరాహారదీక్షకు కూర్చున్నారు.
- కొంగర జగ్గయ్య, గుమ్మడితో సహా అనేకమంది నటీనటులు జై ఆంధ్ర ఉద్యమ బహిరంగ సభలలో పాల్గొని ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రసంగించారు.
తెలుగు సినిమా పరిశ్రమ సీమాంధ్ర పక్షపాతానికి నిలువెత్తు సాక్ష్యాలు ఆనాటి పత్రికల్లో ప్రచురితమైన ఈ వార్తా క్లిప్పింగులు. ఆ ప్రకటనల్లో భాష చూడండి ఒక సారి. వారికి సీమాంధ్ర ప్రాంతంపై ఎంత ప్రేమ ఉన్నదో ఇట్టే అర్థం అవుతుంది.


–

–
–
–

–

–
–
–
–
–
–

–

–

–
–
–