Friday 23 November 2012

తెలంగాణ వ్యతిరేకతే సీమాంధ్ర సినిమా పరిశ్రమ నైజం!


By: కొణతం దిలీప్
తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు తరచూ వల్లెవేసే మాట – “మేము కళాకారులం, మాకు ప్రాంతీయ భేధాలు లేవు” అని. కానీ వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆది నుండీ తెలంగాణ అంటే చిన్న చూపే. సినిమా పరిశ్రమ పెద్దలు తమ ఆంధ్ర పక్షపాత బుద్ధిని ఏనాడు దాచుకోలేదు.
1972 జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నిజస్వరూపం నగ్నంగా బయటపడింది. ఆనాడు ముల్కీ రూల్స్ రద్దు చేయాలని సాగిన ఆ హింసాత్మక ఉద్యమానికి తెలుగు సినీ ప్రముఖులు ఇతోధికంగా సాయపడటమే కాదు ఏకంగా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని  ఈ తరంలో చాలామందికి తెలవదు.
అంతకు మూడేండ్ల ముందు 1969లో తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎగిసింది. ప్రభుత్వ కౄర అణచివేతలో 369 మంది యువతీయువకులు నేలకొరిగారు. ఇదంతా జరుగుతున్నా అదేదో తనకు సంబంధించని అంశంలా పట్టించుకోకుండా ఉండిపోయింది తెలుగు సినిమా పరిశ్రమ.
తమ సినిమాలు తెలంగాణ ప్రాంతంలో కూడా ఆడతాయని, నైజాం ప్రాంతం నుండి వసూలైన సొమ్ము భారీమొత్తంలోనే ఉంటుందని తెలిసి కూడా ఆనాటి సినీ పరిశ్రమ ఎలాంటి సంకోచం లేకుండా 1972లో ”జై ఆంధ్రా” అంటూ తెలంగాణ వ్యతిరేక వైఖరి తీసుకుంది. అదే పరిశ్రమ ఇవ్వాళ కళకు ప్రాంతాలు లేవని బొంకితే నమ్మేది ఎవరు? ఆనాడు జై ఆంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, కృష్ణం రాజు, జమున, వాణిశ్రీ వంటివారు నేటికీ జీవించే ఉన్నారు.
ఒకసారి అప్పటి చరిత్ర పుటలు తిరగేస్తే దిగ్బ్రాంతికర వాస్తవాలెన్నో బయటపడతాయి. దాచేస్తే దాగని ఈ సత్యాలు, తెలుగు సినీ పెద్దల అసలు స్వరూపాలను మనముందు నిలబెడతాయి. “అందరివాళ్లు”గా చలామణి అవుతున్న ఈ హీరోలు నిజానికి “కొందరివాళ్ళు” అని, ప్రాంతీయ దురభిమానులు అని , గోముఖ వ్యాఘ్రాలని నిరూపణ అవుతుంది.
1972 జై ఆంధ్ర ఉద్యమంలో తెలుగు సినీ పరిశ్రమ పోషించిన పాత్ర స్థూలంగా ఇదీ:
- తమకు ఏ రాజకీయాలు లేవని చెప్పుకునే సినీ పరిశ్రమ ఏకంగా ముల్కీ రూల్స్ ను రద్దు చేయాలనే డిమాండుతో పత్రికా ప్రకటనలు ఇచ్చింది
- ఉద్యమానికి భారీ మొత్తంలో నిధులు సమకూర్చారు సినీ పరిశ్రమ పెద్దలు. విరాళాలు ఇచ్చిన వారిలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, వంటి అగ్ర హీరోలు ఉన్నారు. సినీ పరిశ్రమ నుండి భారీ ఎత్తున నల్లధనం ఉద్యమానికి అందుతున్నదనే అనుమానంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సి.ని.ఐ. విచారణకు కూడా అదేశించిందట.
- ఉద్యమంలో కాల్పులు జరిగి ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు సంఘీభావంగా తెలుగు సినిమా పరిశ్రమలోని అనేక మంది హీరోలు, హీరోయిన్లు పత్రికా ముఖంగా ప్రకటనలు ఇచ్చారు. ఇందులో  కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, జమున, రామకృష్ణ, ఎస్వీరంగారావు, వాణిశ్రీ, చలం, శారద, చాయాదేవి వంటి వారున్నారు. ఇవ్వాళ వందలాది మంది తెలంగాణ యువతీయువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నా ఒక్క సినీ పరిశ్రమ ప్రముఖుడూ పట్టించుకున్న పాపానపోలేదు.
- జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా సమ్మె చేసిన ఎన్.జివో లకు ఒక సహాయ నిధి ఏర్పాటుచేస్తే సినీ పరిశ్రమ ప్రముఖులు దానికి విరాళాలు ఇచ్చిండ్రు.
- ఆ సమయలో రిలీజ్ అయిన కొన్ని చిత్రాల ఒక్క రోజు కలెక్షన్లు ఉద్యమంలో చనిపోయిన వారి సహాయనిధికి ఇచ్చిండ్రు.
- ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలనే డిమాండుతో సినీ హీరో కృష్ణ, విజయ నిర్మల స్వయంగా మద్రాసులో నిరాహారదీక్షకు కూర్చున్నారు.
- కొంగర జగ్గయ్య, గుమ్మడితో సహా అనేకమంది నటీనటులు జై ఆంధ్ర ఉద్యమ బహిరంగ సభలలో పాల్గొని ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రసంగించారు.
తెలుగు సినిమా పరిశ్రమ సీమాంధ్ర పక్షపాతానికి నిలువెత్తు సాక్ష్యాలు ఆనాటి పత్రికల్లో ప్రచురితమైన ఈ వార్తా క్లిప్పింగులు. ఆ ప్రకటనల్లో భాష చూడండి ఒక సారి. వారికి సీమాంధ్ర ప్రాంతంపై ఎంత ప్రేమ ఉన్నదో ఇట్టే అర్థం అవుతుంది.

Thursday 22 November 2012

దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు!!


జగనన్న విడిచిన బాణం షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రలు జేస్తుంటే కర్నూలులో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ వై.ఎస్.విజయమ్మ ఇలాగందట. "ఒక రామోజీరావు, ఒక మురళీమోహన్, నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్, ఒక సుజనా చౌదరి... వీళ్లందరికీ ఏ మార్గదర్శకాల ప్రకారం మీరు కేటాయింపులు చేశారు? అదే గైడ్‌లైన్స్ ప్రకారం రాజశేఖర్‌రెడ్డి గారు చేస్తే తప్పవుతుందా?"

అమ్మా, విజయమ్మా సత్యం బలికినవు. చంద్రబాబు ఏగైడ్‌లైన్స్ మీద ప్రభుత్వ సంపదను తన అణుచరులు, బినామీలకు పంచి పెట్టిండో మీఆయన గుడ అదే గైడ్‌లైన్స్ మీద ప్రభుత్వ సొమ్మును నీకొడుక్కు పంచి ఇచ్చిండు. ఒకడు దోపిడీకి తలుపులు తెరిస్తే ఇంకొకడు గోడలే కూలగొట్టి మరీ దోచేశిండు. ఒకడు దోచింది సింగపూరు, స్విస్స్ బ్యాంకులకు తరలిస్తే మరొకడు నన్నెవడడుగుతడనే ధీమాతో బాజాప్తుగ దోచుకుని పత్రికలు, టీవీలు, సిమెంటు ఫ్యాక్టరీలు పెట్టుకుండు.  ఒకడు పగటి దొంగ, మరొకడు గజదొంగ. ప్రజలదృష్టిలో ఇద్దరూ దొంగలే.

మీకు దోచుకోవడంలో ఒకరితో ఒకరికి పోటీ. ప్రజలను మోసం జెయ్యడానికి పోటీ, పాదయాత్రలు జెయ్యడానికి పోటీ. ఒకడిది రెండు కళ్ళసిద్ధాంతం, మరొకడిది రెండు నాల్కల సిద్ధాంతం. మొత్తంగా మీరిద్దరూ ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు అన్నవిషయం ప్రజలకు సరిగ్గా తెలిసొచ్చింది.ఇంతకూ తమరిబాధ మీకొడుకును జైల్లో పెట్టినందుకా, చంద్రబాబును తోడుగా జైల్లో పెట్టనందుకా?

Wednesday 21 November 2012

మోసగాడి డిక్లరేషన్లు



చంద్రబాబు పాదయాత్ర మొదలు పెట్టడానికి ఒక నెలరోజులు ముందుగా డిక్లరేషన్లమీద డిక్లరేషన్లు జేసిండు. బిసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ డిక్లరేషన్. ఇన్నిరోజులు లేనిది ఒక్కసారిగా పాదయాత్రముందే ఈడిక్లరేషన్లు ఎందుకు జేసిండు అని ఆలోచిస్తే ఈపాదయాత్రకీ డిక్లరేషన్లకూ ఉన్న లింకేందో తెలుస్తది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు పాదయాత్ర సీమాంధ్రలో జేసినా, తెలంగాణలో జేసినా జనం చేత తిట్లు తిట్టించుకోవాల్సిందే.

జనం వచ్చి తెలంగాణకు ఎందుకు అడ్డుపడ్డవు అని అడిగితే సమాధానం లేదు. నువ్వు ముఖ్యమంత్రిగ ఉన్నప్పుడు మాబతుకులెందుకు  రైతులకేం జేసినవ్, ఇప్పుడు లెస్స జెప్పుతున్నవ్ అంటె సమాధానం లేదు.ఏదో రెండు మూడు డిక్లరేషన్లు జేస్తె జనం అందరినీ గాకపోయినా కనీసం కొన్నివర్గాలవారిని మంచి జేసుకోవచ్చు. పాదయాత్రలో ఈవర్గాల మనుషులను తనతోపాటు నడిపిస్తే కొంచెం రక్షణగా ఉంటది అనేది బాబు ఐడియా.

మాదిగ దండోరా నాయకుడు మందక్రిష్ణ నిజంగ చంద్రబాబు వర్గీకరణ డిక్లరేషన్ను నమ్మండో, ఇంకేదయినా లోపాయికారీ ఒప్పందం జేసుకుండో మనకు తెలువదు కానీ మందక్రిష్ణ బహిరంగంగా చంద్రబాబు పాదయాత్రకు మద్దతు ఇవ్వడమే కాకుండా పాదయాత్రలో తన మనుషులను చంద్రబాబు చుట్టూ రక్షణవలయంలా నడిపించి తెలంగాణలో ప్రజలు చంద్రబాబును తెలంగాణపై వైఖరేందని నిలదీయకుండా జేస్తుండు.

వర్గీకరణ డిక్లరేషన్ ఐడియా బాగానే వర్కయినట్టుంది గానీ ఇంతకూ చంద్రబాబు డిక్లరేషన్లకు విలువెంత?మోసగాడి మాటలను నమ్మేదెట్ల? చంద్రబాబు ఇంతవరకు ఎప్పుడు మాటమీద నిలబడ్డడని ఇప్పుడు నిలబడడానికి? వర్గీకరణపై నిర్ణయాత్మక సమయం వచ్చినప్పుడు చంద్రబాబు నేను వర్గీకరణకు వ్యతిరేకం కాదని అన్నా గానీ అనుకూలమన్నానా అంటే? నాకు మాలలూ, మాదిగలూ రెండు కళ్ళలాంటివారు, మాపార్టీ రెండువర్గాల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటుంది, రెండువర్గాల్లో మాపార్టీనాయకులను ఉద్యమాలు జేయమంటాం అని జెపితే?

అయినా వర్గీకరణపై మాత్రం తేల్చడానికి చంద్రబాబెవరు, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే గదా? దళితుల్లో మాదిగల శాతం సమైక్యాంధ్రలో కంటే తెలంగాణలో అధికం. అంటే తెలంగాణ మాదిగలకు నిజమైన న్యాయం తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలయినపుడే జరుగుతుంది. వర్గీకరణ డిక్లరేషన్ జూసి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం జేస్తే నాడా కొనుక్కోవడానికి గుర్రాన్ని అమ్ముకున్నట్టే. మందక్రిష్ణా, జెర సోంచాయించు!!

Monday 19 November 2012

ఆంధ్రజ్యోతి సమర్పించు..వేమూరి వారి సీమాంధ్రోపనిషత్!


తెలంగాణ ఎప్పుడు తెస్తారు, ఎలా తెస్తారని నిగ్గదీసి అడగాలట.. ఎవరినో తెలుసా?
తెలంగాణ ప్రకటన చేసి వెనుక్కుపోయిన కేంద్రాన్ని కాదట! తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్‌ను కూడా కాదట!! తెలంగాణ అష్టవంకరలు పోయిన మన్‌మోహన్‌సింగ్‌ను, సోనియాగాంధీని అంత కన్నా కాదట!!!
తెలంగాణ రాజకీయ బానిసలను చేతుల్లో పెట్టుకుని తెలంగాణకు అడ్డం పడిన టీడీపీని కాదట!
ఎన్టీఆర్ ట్రస్టుభవన్ నుంచి సీమాంధ్ర రాజీనామా డ్రామాలాడించిన చంద్రబాబును కూడా కాదట!!
ఒక్క లేఖతో పోయేదానిని వంద తాలుమాటలతో మభ్యపెడుతున్న నారావారిని అంత కన్నా కాదట!!!
చంద్రబాబు బిస్కట్లకు అలవాటు పడి తెలంగాణ ఉద్యమంపై దాడి చేస్తున్న టీటీడీపీ బాంచలను,
సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకొని పార్లమెంటులో వీరంగం వేసిన జగన్‌మోహన్‌రెడ్డి, ఆయనకు అంటకాగుతున్న వైఎస్సార్ పార్టీ నాయకులు … వీరెవరిని కాదంటా!
మరెవరినో తెలుసా….తెలంగాణ ఎప్పుడు, ఎలా తెస్తాడో కేసీఆర్, టీఆర్‌ఎస్ మాత్రమే చెప్పాలంట!
100 అసెంబ్లీ స్థానాలు, 16 లోక్‌సభ స్థానాలు వస్తే తెలంగాణ ఎలా వస్తుందో చెప్పాలట!!
కేసీఆర్‌కు ఈయన కత్తే కాదు, డాలు కూడా ఇస్తాడట!!!
ఏమి జాణతనం, ఎంత వక్రనీతి, తమరు వెనక నుంచి పొడవకుంటే చాలు…
తెలంగాణ ఎలా వస్తుందో వేమూరి వారికి తెలియక కాదు ..
తెలంగాణ ఉద్యమాన్ని దొంగదెబ్బ తీసే కుహకం…
అసంతృప్తుల దాడిని తెలంగాణ ఉద్యమం మీదకు మళ్లించే కుట్ర …
చీలి కూలి కునారిల్లుతున్న చంద్రబాబును ఆయన పార్టీని క్రేన్లు పెట్టి లేపాలని తాపత్రయం!
అయ్యా వేమూరీ,
తెలంగాణలో సీమాంధ్ర నాయకత్వంలోని పార్టీలన్నింటినీ ఓడిస్తే మా పని సగం పూర్తయినట్టే!
తెలంగాణ ప్రజల చేతికి సగం అధికారం వచ్చినట్టే…స్వయం నిర్ణయాధికారం మా చేతికి వచ్చినట్టే!!
తెలంగాణలోని సీమాంధ్ర పార్టీలను తుడిచిపెడితే ఏ ప్రభుత్వమైనా హైదరాబాద్‌లో ఎలా బతికి బట్టకడుతుంది?
అప్పుడు ప్రత్యేక రాష్ట్రం నడుచుకుంటూ వస్తుంది!
ఇవన్నీ మీకు తెలిసినా.. ఎందుకీ సీమాంధ్రోపనిషత్తులు?
(ఒక జర్నలిస్టు మిత్రుడు)

16రీళ్ల తెలుగు సినీమాయ!

 
Cinema44
కోస్తా మిగులు సంపద సృష్టించిన కోట్లు
గతం వైభవం.. నేడు దిగజారుడే నైజం
కొన్ని సామాజికవర్గాలదే ‘డైరెక్షన్’
కొందరు తెరపైనే కథానాయకులు.. వేషం తీస్తే ఫక్తు వ్యాపారవేత్తలు.. కబ్జాకోరులు
రాజధానిలో వందల ఎకరాలు స్వాహా
స్టూడియోల పేరుతో భూములు కట్ చేస్తే మల్టీప్లెక్సుల వ్యాపారాలు
కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వంనమస్తే తెలంగాణ
రీళ్ల డబ్బాల్లోకి కోస్తా సంస్కృతి..అదే రాష్ట్ర సంస్కృతిగా ‘షాట్’

మద్రాస్ నుంచి తరలి వచ్చి.. తెలంగాణ నడిబొడ్డున పాగావేసిన సీమాంధ్ర సినీ పెద్దలు.. తెలుగు సినిమా రంగాన్ని దిగజార్చిన తీరుపై.. హైదరాబాద్‌ను గుప్పిటపట్టిన వైనంపై.. తెర అసలు స్వరూపాలపై నమస్తే తెలంగాణ సంధిస్తున్న అక్షర శస్త్రాలు.. రేపటి నుంచి..

నిన్న మొన్నటి సినిమా అంటే.. ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. అండ్.. ఎంటర్‌టైన్‌మెంట్! ది డర్టీ పిక్చర్!! విద్యాబాలన్ మాట నూటికి నూరుపాళ్లూ తప్పు! ఇప్పుడు సినిమా ఒక ఎంటర్‌ప్రైజ్! తండ్రుల నుంచి కొడుకులకు.. కొడుకుల నుంచి వాళ్ల కొడుకులకు.. వాళ్ల నుంచి వాళ్ల కొడుకులకు! ఇదో వారసత్వ పరిక్షిశమ! పాలకులు ‘మన’వాళ్లే! కోరుకోవడం ఆలస్యం. కోట్లు పలుకుతున్న ఎకరాలకెకరాలు.. కారుచౌకగా దఖలు పడతాయి! స్టూడియోల నిర్మాణానికి తెచ్చుకున్న భూమిలో మల్టీప్లెక్స్‌లు మొలిచి.. వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదుగుతాయి! అడ్డికి పావుశేరుకు కొట్టేసిన భూములు అమ్మకానికి వీల్లేకపోయినా.. కోట్లకు చేతులు మారుతుంటాయి!ఇది పదహారు రీళ్ల తెలుగు సినీమాయా ప్రపంచం! పుష్కలంగా పారే నీళ్లతో మూడు పంటలూ పండగా పేరుకున్న మిగులు సొమ్ముతో కామందులు ఆక్రమించిన కళా సామ్రాజ్యం!! నలుపు-తెలుపు కాలం నుంచి.. సప్తవర్ణాల దాకా..! మూకీ.. టాకీల నుంచి.. డాల్బీ డిజిటల్ సరౌండ్ స్టీరియో సౌండ్ ఎఫెక్ట్‌ల దాకా! పౌరాణికాల నుంచి జానపదాలకు ఎదిగి.. సాంఘిక, సామాజిక అంశాలను స్పృశిస్తూ.. అభ్యుదయాన్ని కాంక్షించి.. విప్లవనాదాలు చేసి.. ఫక్తు వ్యాపార ధోరణికి జారి.. బూతును, ఆడపడుచు అర్ధ నగ్న అందాలను వెండితెరపై అమ్మకానికి పెట్టే దిగజారుడు స్థాయికి పడిపోతున్న నాలుగు ఆటల.. మూడు గంటల దందా! మాఫియా, మత్తుమందుల వ్యాపారాలతో ఇప్పుడు మరింత పాతాళంలోకి! కళను నమ్ముకున్న కొందరు దర్శక నిర్మాతలు.. వారు తీసిన కొన్ని ప్రగతిశీల సినిమాలకు మినహాయింపు! ఎక్కువ మందికి సినిమా పెట్టిన పెట్టుబడికి..

అంతకు రెట్టింపు.. వీలైతే పదింతలు సంపాదించుకునే యావే! అందుకే వారికేమీ పట్టవు! సమాజం పట్ల కొరవడిన బాధ్యత.. ఉపాధ్యాయులంటే హాస్యగాళ్లు.. పురోహితులంటే అర్భకులు.. సామాజిక వర్గాలంటే చులకన భావం.. బడుగు జీవులంటే అవహేళన.. అస్తిత్వ ఉద్యమాలంటే ఎక్కడలేని అలుసు! మద్రాస్ నుంచి వస్తూ.. అనేక రాయితీలు తెచ్చుకుని, చట్టాలు మార్పించేసుకుని, హైదరాబాద్‌లో మకాం వేశారు! అంతా ఒక ప్రాంతం వారే! వారు తీసిందే సినిమా.. వారు చూపిందే బొమ్మ! రాష్ట్రం మొత్తం చూసే సినిమా! కానీ.. ఒక ప్రాంతంలో ఒకటిండు సామాజికవర్గ కుటుంబాల భావనలే కథాంశాలు! ఒకే ఒక్కడు.. హీరో! ఎక్కడో కోనసీమ పల్లెల నుంచి వచ్చి.. వంద మందిని ఒకేసారి మట్టికరిపించేస్తాడు! ఒకప్పుడు పాత్రల్లో జీవించేవారు.. ఇప్పుడు నటించడం మానేశారు! గొంతు బాగాలేకపోతే.. డబ్బింగ్.. ఫేస్‌లో హీరో చార్మ్ లేకుంటే ప్లాసిక్ సర్జరీ! అంతా బ్లూస్క్రీన్ మాయ! నాటి తారలు మృదు మధుర శృంగారభావనలను హావభావాలతో ఒలికిస్తే.. నేడు ఒక్కటే సూత్రం ఎక్స్‌పోజింగ్! ఒకప్పుడు సినిమారంగం అంటే కళాపోషణ! ఇప్పుడు ‘కళ’ తప్పి.. పోషణే మిగిలింది! ఆ పోషణ కుటుంబం గడిచేందుకు కాదు.. తరతరాలు గడించకపోయినా.. ఇబ్బంది లేకుండా! నిన్న మొన్నటి సినిమా అంటే..

ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. అండ్.. ఎంటర్‌టైన్‌మెంట్! ది డర్టీ పిక్చర్!! విద్యాబాలన్ మాట నూటికి నూరుపాళ్లూ తప్పు! ఇప్పుడు సినిమా ఒక ఎంటర్‌ప్రైజ్! తండ్రుల నుంచి కొడుకులకు.. కొడుకుల నుంచి వాళ్ల కొడుకులకు.. వాళ్ల నుంచి వాళ్ల కొడుకులకు! ఇదో వారసత్వ పరిక్షిశమ! పాలకులు ‘మన’వాళ్లే! కోరుకోవడం ఆలస్యం. కోట్లు పలుకుతున్న ఎకరాలకెకరాలు.. కారుచౌకగా దఖలు పడతాయి! స్టూడియోల నిర్మాణానికి తెచ్చుకున్న భూమిలో మల్టీప్లెక్స్‌లు మొలిచి.. వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదుగుతాయి! అడ్డికి పావుశేరుకు కొట్టేసిన భూములు అమ్మకానికి వీల్లేకపోయినా.. కోట్లకు చేతులు మారుతుంటాయి! స్థానిక డిస్ట్రిబ్యూటర్లు.. దుకాణాలు మూసేసుకోవాల్సిందే! థియేటర్లు రాసిచ్చేయాల్సిందే! కార్మిక నాయకుడిగా కదనరంగాన దూకిన కథానాయకులు..

వేషం తీసేస్తే ఇక్కడ కబ్జాకోరులు! తెరపై హీరోయిన్‌కు కన్నుగీటి.. ప్రేమను బకెట్ల కొద్దీ కురిపించే హీరోలు.. తెర వెనుక కాసుల లెక్కల్లో మునిగితేలుతుంటారు! మానవతావాదాన్ని చాటే మహానటులు.. నిజ జీవితంలో నటులే! హీరోయిన్ బొడ్డు అందంగా చూపడంపై ఎంత శ్రద్ధ పెడతారో.. నగరం నడిబొడ్డున భూములు కొట్టేయడానికీ అంతే తపన! రీళ్ల డబ్బాలు కురిపించిన నోట్ల కట్టలతో జూబ్లీ.. బంజారా గుట్టలను భక్షించి.. మయసభలు కట్టుకున్న సినీమాంవూతికులు! ఇప్పుడు ఆ గుట్టల పరిరక్షణే ధ్యేయం! అందుకే అస్తిత్వ ఉద్యమాలంటే వారికి అసహ్యం.. ఉద్యమాలు విజయం సాధిస్తే తాము కట్టుకున్న కోటలు ఎక్కడ కూలిపోతాయోనని! తెలంగాణ జీవనశైలి అంటే అదేదో పరాయి దేశపుదన్న ఆలోచన! తెలంగాణ యాస అంటే రౌడీలు గూండాలు, అనాగరికులు, లేబరోళ్లు మాట్లాడే భాషగా నిర్ణయం.. ఈ ప్రాంతంలో ఉండేది వారేనని ఒక తీర్మానం! కోస్తా జిల్లాల సంస్కృతే రాష్ట్ర సంస్కృతిగా చిత్రీకరణ.. ఒకటి కాదు.. వంద కాదు.. వేల రీళ్లు తిరిగినా ఇదే దృశ్యం! ఇడ్లీ సాంబారు ప్రస్తావనలే తప్ప.. జొన్న రొట్టెలు, అంబలి కనిపించవు! పండుగల్లోనూ అదే తీరు! ఒకానొక కాలంలో సంక్రాంతి పండుగ ప్రస్తావన లేని సినిమాల్లేవంటే ఆశ్చర్యమే! ఇప్పటికీ అదే తీరు! రాష్ట్రంలో సగభాగం ఎంతో గొప్పగా జరుపుకొనే బతుకమ్మ పండుగ పేరే ఇటీవలి కాలంవరకూ రాష్ట్రంలోని ఏ సినిమా హాల్‌లోనూ వినిపించలేదంటే తెలంగాణపై ఏ స్థాయిలో ఉందో వివక్ష! జమీందారు అకృత్యాలపై హీరో పోరాటాలే తప్ప.. రజాకార్లపై తెలంగాణ రైతులు చేసిన పోరాటాలు, చేసిన త్యాగాలు వెండితెర వేల్పులకు కనిపించలేదు. ఇక వామపక్ష అభ్యుదయ, విప్లవ భావజాలాలను ఏం చేస్తారు? తీసే సినిమాల్లోనూ వాస్తవాల వక్రీకరణలు..

ఒక ప్రాంతంపై దూషణభాషణలు! అదే సొంత ప్రాంతమైతే.. పాత్రలకు అత్యున్నత శిఖరాలు! అందుకే వారికి కొమురం భీమ్ పోరాటం కనిపించదు! మన్యంవీరుడెవరంటే అల్లూరి సీతారామరాజే! నటశేఖరుడు చెప్పాడుగా మరి! ఖాకీ నిక్కరు చొక్కా వేసుకుని.. యోగిలా జీవితం గడుపుతూ గిరిజనులను ఏకం చేసిన అల్లూరి సీతారామరాజు.. కాషాయ వస్త్రాలతో.. విల్లంబులతో వెండితెరపై కొత్త.. నాగరిక ముద్ర వేసుకుంటాడు! కొమురం భీం సినిమా విడుదలకు ఏళ్లు పడుతుంది.. నైజాం నవాబును గడగడలాడించిన కొమురం భీం మన్యంవీరుడంటే వాళ్ల మనసు నచ్చదు! ఆ యోధుడి జీవితాన్ని తెరకెక్కించాలంటే మళ్లీ ఆ ప్రాంతపువాడే తలపెట్టాలి! జీవన శైలిలోనూ అదే తీరు. ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు..అంటూ భార్యాభర్తలు సాగునీటి కాల్వల నుంచి నీళ్లు చేదుతున్న పాటల దృశ్యాలే! ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండించి.. ఎన్నడూ మెతుకెరుగని తెలంగాణ రైతు కష్టాన్ని పాట సినిమా కథలో తేవాలంటే మళ్లీ తెలంగాణ కలమే రావాలి! ఇప్పుడు పైత్యం మరింత ముదిరింది. మొన్నటిదాకా తెలంగాణపై పరోక్షంగా విషం కక్కిన దర్శకాక్షిగేసరులు.. ఇక నేరుగా యుద్ధం చేస్తున్నారు. తెలంగాణవాదంపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడుతున్నారు.. కెమెరామెన్ గంగతో రాంబాబు ఒక ఉదాహరణ మాత్రమే! సినిమా ఒకనాడు వినోదం, కళ.. తదుపరి వినోదం, అభ్యుదయం.. కొన్నాళ్లకు వినోదం, వ్యాపారం..కాలం గడిచే కొద్దీ ఆస్తుల సేకరణ.. ఇప్పుడు ఆస్తుల రక్షణ! తెలుగు సినిమా పరివర్తనా క్రమమిది!

Friday 16 November 2012

సీమాంధ్ర పత్రికల కుట్రను అర్థం చేసుకుందాం. కోదండరాం వెంట నిలబడుదాం


జనంసాక్షి ఎడిటోరియల్

సీమాంధ్ర పత్రికలు మరో కుట్ర పన్నాయి. వీలున్నపుడల్లా తెలంగాణ ఉద్యమంపై దుష్ప్రచారం చేసే సీమాంద్ర మీడియా ఈ సారి ఏకంగా ఉద్యమ సారధిపైనే తమ కుట్ర బాణాలను ఎక్కుపెట్టాయి..తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చడంలో కీలకభూమిక పోషించిన తెలంగాణ ఉద్యమ రథసారధి కోదండరాంపై దుష్ప్రచారానికి తెరతీశాయి..తెలంగాణ కోసం రాజీలేకుండా పోరాడుతున్న ఒకే ఒక్క గొంతుక కోదండరాం సార్‌పై సీమాంధ్రుల పత్రికలు కత్తికట్టాయి. తన జీవితంలో చాలాకాలం పౌరహక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛా, సౌభ్రాతృత్వం పోరాడిన ఓ వ్యక్తి అగ్రవర్ణమట..ఎవరు ఏకులంలో పుట్టారన్న దాని కంటే ఏ ప్రజల వైపు పోరాడుతున్నారు, ఆ వ్యక్తి నినాదమేంది, ఏ శక్తులతో కలిసి పనిచేస్తున్నాడు, ఏప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడన్నది ముఖ్యం. ఆలోచనలో, ఆచరణలో తను ఏ సిద్ధాంతానికి మద్ధతుగా పోరాడుతున్నదే ప్రస్తుతం.  అతని ఆచరణ, విధివిదానాలను బట్టి అతను ఏ వర్గ శత్రువో, ఏ వర్గ మిత్రువో అంచనా వేస్తాం. ఆ శక్తులతో కలిసి ఏ మేరకు పనిచేయాలో నిర్ణయించకుంటాం. నిజానికి కోదండరాం అసలు పేరు కోదండరాం రెడ్డి. అంబేద్కర్‌ సభలలో, దళిత బహుజన పోరాటాలు ఉవ్వెత్తున సాగుతున్న రోజులలో మీపేరు చివర రెడ్డి ఉంది కదా అని ప్రశ్నించగానే వెంటనే రెడ్డి అనే పదాన్ని తొలగించుకొని ఇక నుంచి తనను కోదండరాంగానే పిలవాలని అందరికీ విజ్ఞప్తి చేశాడు. ఆయన జీవిత కాలంలో ఎక్కువ కాలం పనిచేసింది కూడా దళిత, బహుజన వర్గాల కోసమే..పౌరహక్కుల సంఘంలో మనిషికి మాట్లాడే, పోరాడి స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు, జీవించే స్వేచ్ఛకోసం ఆయన పోరాడారు..ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఆయన పేరు కన్నా, తన పేరు చివరలోని రెడ్డి అనే పదం కన్నా దళితుల కోసమే ఎక్కువ ఆలోచించాడు.  ఆయన గతానికి, ప్రస్తుతానికి పెద్దగా తేడా ఏమీ లేదు..కోదండరాం రెడ్డిగా ఉన్నా, కోదండరాం గా ఉన్నా ఆయన పోరాడింది దళితులు, పౌర హక్కుల కోసమే..అసలు ఆయన ఏకులంలో పుట్టాడన్న విషయం బహుశా ఆయనే మర్చిపోయాడేమో..అయినా ఓట్లు, నోట్ల కోసమే పాకులాడే నాయకులు ప్రతిసారి కోదండరాం రెడ్డి అని గుర్తు చేస్తే తప్ప ఆయన కులం ఆయనకు గుర్తు రాకపోవచ్చు. అయినా ఆయన ఏనాడు తన కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయలేదు..తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నడపాలి..తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించాలో అన్న ఆలోచనలే ఆయన చేస్తుంటాడు..నాలుగు కోట్ల ప్రజల ఆశ, శ్వాస అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ఏం చేయాలో అని ఉద్యమ కార్యాచరణను రచించే కోదండరాంను ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని తన రాజకీయాల కోసం వాడుకొనే పలువురు రాజకీయ నాయకులు పలువురు టార్గెట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ కులంలో పుట్టినా అణగారిన ప్రజల వైపు నిలబడడం, వారి పోరాటాలకు మద్ధతు, వారి ఉద్యమాల్లో పాల్గొనడం, వారి వెంట నడవడం, వారితో భుజం,భుజం కలిపి వారితోపాటు పోరాటాలలో పాల్గొనడం, వారి కోసమే జీవించిన వారిని పీడిత ప్రజలకు మిత్రులు కాదని ఎలా చెప్పగలం. ప్రొఫెసర్‌ కోదండరాం కూడా అంతే. కారంచేడు, లక్ష్మింపేట ఘటన వరకు కోదండరాం దళితులుల వైపు మాట్లాడారు. దళితులుగా పుట్టి నామోషీగా పేరు చివర రెడ్డి తగలించికున్న  వారు కొందరు కోదండరాంను ఒంటరి చేసి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలన్న ఓ కుట్ర తెలంగాణ ఉద్యమ నాయకత్వం దళితుల వ్యతిరేకుల చేతుల్లో ఉందని చూపించేందుకు చేసే సీమాంధ్ర పత్రికల కుట్రలను మనం అర్థం చేసుకోలేమా…ఈ పత్రికలు కారంచేడులో దళితుల్ని చంపిన సామాజికవర్గానికి చెందిన వారి చేతుల్లో ఉన్న పత్రికలు. నిజానికి కట్టుకథలు, పెట్టుబడులకు పుట్టిన విష పుత్రికలు ఈ పత్రికలు. తమ విషాన్ని మనపై విరజిమ్మేందుకు ఈ పత్రికలు ప్రయత్నిస్తున్నాయి..తమ రాతలతో కోదండరాంను దళిత వ్యతిరేకంగా ప్రచారం చేసి, తెలంగాణ ఉద్యమం దళిత వ్యతిరేక ఉద్యమంగా వక్రీకరించేందుకు సీమాంధ్ర పత్రికలు కుట్రలు పన్నుతున్నాయి..తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించగలమేమోనని పగటికలలు కంటున్నాయి..నిజానికి కోదండరాం చరిత్ర గురించి ఈ పత్రికలు రాయవు..కోదండరాం ఉద్యోగంలో చేరినప్పటినుంచే సగం జీతం పేద దళిత విద్యార్థులకు పంచుతున్నాడు..దీనికి ఈ పత్రికలు ప్రాధాన్యత ఇవ్వవు..పిచ్చి ప్రేలాపనలు, విషబీజాలను మనమెదళ్లలో నాటే సీమాంధ్ర కుట్రపూరిత ద్రోహాన్ని అడ్డుకొందాం..కోదండరాం వెంట నిలబడదాం..తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకుందాం..

దళిత నాయకులు విమర్శలకు అతీతులు కారు


జహీరాబాద్‌లో మొన్న జరిగిన ఒక విద్యార్థి జేయేసీ మీటింగులో మాట్లాడుతూ ప్రొ.కోదండరాం అక్కడి లోకల్ ఎమ్మెల్యే మరియు మంత్రిఐన గీతారెడ్డిపై కొన్ని విమర్శలు చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఈశ్వరీభాయి చేసిన వీరోచిత పోరాటాన్ని గుర్తుకుచేస్తూ అటువంటి వీరనారికి గీతారెడ్డి వంటి బిడ్డ ఉండటం దురదృష్టకరం అనే ధోరణిలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో ఎలా చీలికలు తీసుకురావాలా అని చూస్తున్న కొన్ని సీమాంధ్ర పత్రికలు వెంటనే కోదండరాం విమర్శను గోరంతలు కొండంతలుగా రాయడం, దళితసంఘాలు రంగంలోకి దిగి కోదండరాం దిష్టిబొమ్మను తగలబెట్టడం, కోదండరాంపై ఎస్సి,ఎస్టీ అట్రాషిటీ కేసు నమోదు కావడం అంతా స్క్రిప్టుప్రకారం చకచకా జరిగిపొయ్యాయి.
తెలంగాణ మంత్రులను టార్గెట్ చేస్తూ ఉద్యమం చేయాలని జేయేసీ సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్ నాడు నిర్ణయించింది. తదనుగుణంగానే సమావేశం జరిగిన జహీరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గీతారెడ్డిని విమర్శించడం జరిగింది. ఇదే సభ ఇంకో చోట జరిగితే అక్కడి ప్రజాప్రతినిధులపై విమర్శించడం జరిగేది.
మీడియా స్థాయిని రోజురోజుకూ దిగజారుస్తున్న వేమూరి రాధాక్రిష్ణ ఏబీఎన్ ఛానెల్ నిప్పురాజేసి, పెట్రోలు పోసి పెద్దది చేసి రెచ్చగొట్టుడు కధనాలు చూపించగా మంత్రి గీతారెడ్డి, దళిత సంఘాలు దీన్ని దళితులపై దాడిగా చిత్రించడం అత్యంత దారుణం. దళిత నాయకులు కావడం వలన ఎవరూ విమర్శలకు అతీతులు కారు. ఒక ఇష్యూపై దళితేతర నాయకులు ఎంతవరకూ విమర్శలకు గురవుతారో దళిత నాయకులు కూడా అంతే.
తాను మంత్రిగా ఉన్నప్పుడూ ఏనాడూ దళిత క్షేమం పట్టని గీతా”రెడ్డి”కి, భర్త దగ్గరనుండి అరువు తెచ్చుకున్న తోకను పేరుకు తగిలించుకుని దళిత ఐడెంటిటీని పేరులోనే తొలగించుకున్న గీతా”రెడ్డి”కి ఒక్కసారిగా తాను దళిత మహిళనన్న విషయం గుర్తొచ్చింది. అనునిత్యం పీడిత, తాడిత ప్రజల పక్షాన్ ఉంతూ తన పేరు నుంచి రెండు దశాబ్దాల క్రితమే “రెడ్డి”ని తొలగించుకున్న కోదండరాం మాటలను, అరువుతెచ్చుకున్న “రెడ్డి”తోక తగిలించుకున్న మంత్రి “అగ్రకుల దాడి”గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించడం నీచం, దిగజారుడుతనం.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం రాజకీయంగా, ఆర్ధికంగా పోరాటం చెయ్యలేని బీదాబిక్కి దళితులకు అండగా ఉండాలి, అంటెకానీ చట్టం తన చేతిలో ఉన్న మంత్రులకు అండగా కాదు. దళిత సంఘాలు తమ కమ్యూనిటీలో వివక్షకు గురవుతున్న, అగ్రకుల దాడులకు గురవుతున్న బలహీన వర్గాలకు మద్దతుగా పోరాటాలు చెయ్యాలి, మంత్రుల వ్యక్తిగత రాజకీయాలకు మీ మద్దతు అవసరం లేదు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళిత యువకులపై కేసులుపెట్టి జైళ్ళొ పెట్టినప్పుడు గానీ, దళిత యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడుగానీ స్పందించని మంత్రిణి గూర్చి దళితసంఘాలు గోలపెట్టడం అనవసరం. ఇలాంటి చర్యలు ఎస్సీ, ఎస్టీ అట్రాషిటీ యాక్టును దుర్వినియోగం చెయ్యడంతో బాటు సామాన్య ప్రజానీకానికి ఈ ఆక్టు గురించి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుంది.
చివరగా ఉద్యమంలో చిచ్చుపెట్టి నాయకత్వాన్ని విడదీయాలని చూస్తున్న సీమాంధ్ర పత్రికలను, ఛానెళ్ళనూ తెలంగాణనుండి తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతయినా ఉంది. లేకుంటే వాళ్లు ఇటువంటి కుట్రలకు తెగబదుతూనే ఉంటారు.

Thursday 1 November 2012

సినిమాల్లో బ్రాహ్మణులపై కామెడీలెందుకు?



గతవారం విదుదలయిన సినిమా "దేనికైనా రెడీ" బ్రాహ్మణులను కించపరిచేవిధంగా ఉన్న సన్నివేశాలవలన వివాదాలకు గురయింది. బ్రాహ్మణులపై, అర్చకులపై సినిమాల్లో సెటైర్లు కొత్తకాదు గానీ ఇందులోకాస్త శృతిమించడంతో బ్రాహ్మణవర్గానికి బాధ కలిగించింది. అసలింతకూ సినిమాల్లో బ్రాహ్మణవర్గాన్ని ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు? మోహన్‌బాబు, పెద్ద ఎన్‌టీఆర్, చిన్న ఎన్‌టీఆర్ సినిమాల్లో, పరుచూరి బ్రదర్స్ కధ, మాటలు రాసిన సినిమాల్లో ఇవి ఎందుకు శృతి మించుతున్నాయి? కమ్మసామాజికవర్గానికి చెందినవారిదగ్గరినుండి ఎందుకు ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి?

మొదట్లో  కమ్మసామాజికవర్గం భూమి, డబ్బూ కలిగి ఉన్నప్పటికీ రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఎక్కువగా రాణించలేదు. ఈరంగాల్లో విద్యాధికులయిన బ్రాహ్మణుల ఆధిపత్యం నడిచేది. అయితే 1920 దగ్గర్లో ఏర్పడ్డ "కమ్మ మహాజనసభ" తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం ఒక ఫార్ములా తయారుచేసింది. ఇంది రెండంచెల ఫార్ములా: తమకంటే  ముందున్న బ్రాహ్మణుల ఆధిపత్యానికి గండి కొట్టాలి. దానికోసం తమ పిల్లలను అన్ని రంగాల్లో చదివించడమే కాకుండా అవసరమయితే బ్రాహ్మణులను కిందకి లాగి దెబ్బకొట్టాలి. తమకంటే తక్కువలో ఉన్న దళితబహుజన వర్గాలను అణగదొక్కాలి, అవసరమయితే కత్తులు వాడాలి.

ఈ రెండంచల పధకంలో  రెండవదాని ఫలితం కారంచేడు, పదిరికుప్పం తరహా దాడులు. మొదటిదాని ఫలితం మెడికల్, ఇంజినీరింగ్, రాజకీయ, సాహిత్య, సినిమా, మీడియా రంగాలను తమ గుప్పిట్లోకి తీసుకోవడం, బ్రాహ్మణుల పొట్టగొట్టడంకోసం కమ్మలే పౌరోహిత్యం చేయడం, బ్రాహ్మణులను ఎగతాళి చేస్తూ సినిమాలు తీయడం.

ఈఫార్ములా ఆధారంగానే సినిమాల్లో ఎడాపెడా బ్రాహ్మణులపై సెటైర్లు వేయడం, సినిమాల్లో కమ్మ జమీందారీ వర్గాన్ని గ్లోరిఫై చేయడం, అక్కడి భాష, వీరి జమీందారీ అలవాట్లను ఎలివేట్ చేయడం, దానికోసం పక్కప్రాంతాలైన ఉత్తరాంధ్ర, తెలంగాణ యాసలను, అక్కడి అలవాట్లను, అక్కడి ప్రజలను కించపరిచినట్లు సినిమాలు తీయడం.

ఈకమ్మ భావజాళ వ్యాప్తికి కమ్మ ఐకన్ త్రిపురనేని రామస్వామి చౌధరి ఎక్కువ ప్రచారం చేశాడు. ఆభావజాళవ్యాప్తి ఫలితమే ఎన్‌టీఆర్ అధికారంలోకి రావడం. ఈయన రుణం తీర్చుకునేందుకు ఎన్‌టీఆర్ త్రిపురనేని విగ్రహాన్ని ట్యాంకుబండుపై పెట్టాలనుకున్నాడట, అయితే ఒక్కడిదే పెడితే బాగుండదని తెలుగు వైతాళికులని కొందరి ఎంపిక చేసి విగ్రహాలు పెట్టి అందులో త్రిపురనేనిది కూడా కలిపేశాడు. ఆ విగ్రహాల్లో ఎక్కువ ఎన్‌టీఆర్ మొహంతోనే ఉంటాయనేది మరో విషయం.

కమ్మ మహాజనసభ భావజాళవ్యాప్తి ఫలితంగా ఇప్పుడు కమ్మలు సినిమా, మీడియా, పారిశ్రామిక, రాజకీయరంగాలలో సమైక్యాంధ్రలో ఆధిపత్యం వహిస్తున్నారు. వీటిద్వారా రాజకీయరంగంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటున్నారు. వీరు అన్నిపార్టీలలో చేరి ఏపార్టీ అధికారంలోకి వచ్చినా తమదగ్గర అధికారం ఉండేలా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణను అడ్డుకుంటుంది కూడా ఈశక్తులే. కారణం విడిపోతే అటు సీమాంధ్రాలోనూ, ఇటు తెలంగాణాలోనూ అధికారం తమకు దక్కదనే వీరి భయం.

ఆర్ధిక, రాజకీయరంగాల్లో వెనుకబడి అగ్రకుల బలహీనవర్గంలా తయారయిన బ్రాహ్మణులు ఇలా సినిమాల్లో హేళనకు గురవుతుంటే ఇప్పుడేం చేయాలి? ఇప్పటికైనా తాము ఏదో ప్రత్యేకవర్గం, హిందూ సమాజానికి తాము మెలు చేస్తున్నాం, తమమీద దాడులు మొత్తం హిందూ సమాజం మీద దాడి లాంటి భ్రమలను వదలాలి. వీళ్ళు అందరిలా ఒక సామాజిక వర్గం, దళిత బహుజనుల్లా ఇప్పుడు వీరు కూడా వివక్షకు గురవుతున్నారనే సత్యాన్ని గ్రహించాలి. తమను కించపరుస్తున్న వారిపై సంఘటితంగా పోరాడాలి, దానికోసం తమశక్తి సరిపోకపోతే దళిత బహుజన వర్గాలను కలుపుకుపోవాలి.