చేగొండి రామజోగయ్య అనబడే విశ్రాంత బ్యాంకు అధికారి ఈమధ్య విశ్రాంతి లేకుండా ఆంధ్రప్రభలో ఎడాపెడా తెలంగాణపై విషాన్ని గుప్పిస్తున్నాడు. ఇతని రాతల్లో ఒక అర్ధం, పర్ధం ఉండదు, ఒక్క విషయంపై నిలకడగా తార్కిక వివరణ ఇవ్వలేడు, ఎంతసేపూ ఉద్యమాన్ని ఎలా వెక్కిరిద్దామా అన్నట్టు నంగి మాటలతో వ్యంగ్యాన్ని గుప్పించడం తప్ప పస ఉన్న వాదనలు ఒక్కటీ ఉండవు. ఈయన చత్తరాతలను కూడా ఆంధ్రప్రభలో ప్రచురిస్తాన్నరంటే అసలు ఆంధ్రప్రభ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అనిపిస్తుంది.
ఇంతకూ ఈయన రాతల సారాంశం ఏమిటీ అంటే "విభజనవాదం విషతుల్యం, రాష్ట్రాన్ని విభజిస్తే అది దేశ సమగ్రతకే ముప్పు, రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్రం రెండు ముక్కలు కాదు, యాభై ముక్కలవుతుంది, అందులో తెలంగాణాయే ముప్పై ముక్కలవుతుంది(?!)". ఎందుకూ, ఎలా అన్న వివరణలు ఆరాతల్లో మచ్చుకు కూడా కనపడవు. ఎందుకు ముప్పై ముక్కలవుతుందీ అంటే చేగొండి గారు తమ బ్యాంకు అధికారి అనుభవంతో చెప్పారు గనక మనం ఒప్పుకుని తీరాల్సిందే. చేగొండి మాష్టారు గారూ, ఇప్పుడు తెలంగాణ ఏకారణాలతో విడిపోవాలనుకుంటుందో సరిగ్గా అదేకారణాలవల్ల తమరి ఆంధ్రా ప్రాంతం మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవడం కోసం ఉద్యమించి తమరి భాషలో దేశంలో మొట్టమొదటి వేర్పాటువాదానికి తెరలేపింది. ఎంత విషతుల్యమైందో కదా మీఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోరిక?
అసలు నిజంగా ఒక రాష్ట్రం విడిపోతే దేశసమగ్రతకే ముప్పు వస్తే, రాష్ట్రవిభజన నిజంగా అంత ప్రమాదకరమయిందే అయితే మీరు చెయాల్సింది తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం కాదు, అంతప్రమాదానికి కారణమయిన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడును ఎత్తివేయడంకోసం మీరు ఉద్యమించాలి, ప్రయత్నించండి మరి. యాభై ఏల్లు ఉద్యమిస్తే ఒక్క రాష్ట్రం ఏర్పాటు కాలేదు గానీ, విభజిస్తే ఈరాష్ట్రం గాజుగ్లాసును నేలకేసి కొడితే పగిలినట్లు ముక్కలవుతుందా? ఆహా, ఏం తెలివండీ తమరిది?
ఇటీవల ఈమహానుభావుడి కలంలోనుంచి జాలువారిన మరో ఆణిముత్యం ఏమిటంటే "విడిపోతే తెలంగాణ ప్రజలు నష్టపోతారట, ఆంధ్రా ప్రజలకు లాభమట, అయినా వారు పెద్దమనసుతో తెలుగుజాతి సమగ్రతకోసం విభజనను అడ్డుకుంటున్నారట". ఆహా, ఎంత తెలివీ? ఇంతకాలం ఈమాత్రం తెలియకుండానే తెలంగాణ ప్రజలు విడిపోదామనుకుంటున్నారే. ఏదయితే అదయింది, మీరిలాగే రాస్తూ ముందుకుపోండి..మీరాతలను చదివి సీమాంధ్ర జనం తమకు రాష్ట్రవిభజన వలన జరిగే లాభాలను తెలుసుకుని విభజనకు ఒప్పుకుంటే మరీమంచిది.
ఈయన తనవ్యాసంలో విభజన జరిగితే తెలంగాణకే నష్ట ం అంటూ రాసిన ఎనిమిది పాయింటలో కనీసం ఒక్కటి కూడా చర్చించడం కూడా అనవసరమైనటువంటి చత్త రాతలు. దేశంలో అధిక సంఖ్యాకప్రజలు విభజనకు వ్యతిరేకమత.. అది ఈఅయనే కనుక్కున్నాడు మరి. హైదరాబాదులో నలభై ఐదుశాతం మంది సీమాంధ్రులేనంట..ఇరవై శాతం భాషాపర మైనారిటీలు, మరో ఇరవై శాతం మతపర మైనారిటీలూనూ. ఇదీ ఈయన లెక్క. అంటే హైదరాబాదులో తెలంగాణ ప్రజలు కేవలం 15 శాతం..మరి ఈమాత్రానికే విభజన జరిగితే మాకు రక్షణ ఉండదూ, గట్రా, కాబట్టి హైదరాబాదును యూనియన్ టెర్రిటరీ చెయ్యాలీ అని నసుగుతున్నారెందుకంట?
చివరగా ఈయన వివరించిన గొప్పసందేషం ఏమంటే విభజన జరిగితే సీమాంధ్రులు అసాధ్యులు, నదీజలల్లో ఎక్కువ వాటా కొట్టేస్తారూ, కనుక తెలంగాణకు పెద్దలాభం ఉండదూ అని. మరి విడిపోయి వేరే రాష్ట్రంలో ఉంటేనే వీరి అసాధ్యం ఇలాగుంటే ఒక్కరాష్ట్రంలో ఉన్నప్పుడు ఈఅసాధ్యులు ఇంకెంత వాటానొక్కేయాలి? అందుకేగదా ఇప్పుడు ఒక్కనీటిచుక్క గూడా విదిల్చడం లేదు?
నీరుపల్లమెరుగుతుంది అంటూ జలదోపిడీని సమర్ధించుకునే వీరు పైరాష్ట్రాల నీటివాటాలో మాత్రం ఆ సూత్రాన్ని అమలు చెయ్యరు. పైగా స్వభాషీయులు దోచుకున్నా ఫరవాలేదంటకానీ పైరాష్ట్రం వాన్ని నిలదీయాలట. ఆహా చేగొండి! ఏందండీ ఈతొండి?
