Sunday 3 June 2012

జేపీ మెల్లకన్ను సిద్ధాంతం






చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతం తరువాత ఇప్పుడు మన లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ కూడా బాబు అడుగుజాడల్లో నడుస్తూ కొత్తగా  మెల్లకన్ను సిద్ధాంతం ప్రవచిస్తున్నాడు. మెల్లకన్ను ఎటు చూస్తుందో ఎవరికీ అర్ధం కాదు కనుక ఎప్పటి అవసరాన్ని బట్టి అప్పుడు అటే చూస్తున్నానని చెప్పుకోవచ్చు. ఈసిద్ధాంతంతో జేపీ కూడా తానెటు మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్ధం కాకుండా రకరకాల మెలికలు పెట్టి విన్యాసాలు చేస్తూ ప్రజలను బోల్తాకొట్టిద్దామని ఎత్తువేస్తున్నాడు.


"కేంద్ర ప్రభుత్వం మరియు రాజకీయ పక్షాలు తాత్సారం చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వెంటనే సమగ్రమైన సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని సాధించాలి, ఆపరిష్కారం వలన వచ్చే తెలంగాణాను లోక్‌సత్తా పార్టీ స్వాగతిస్తుంది" ఇది మన రాజకీయ అమీబా బాబా జయప్రకాశ్ నారాయణ తాజా కామెంటు. పైగా తమ పార్టీ కాడర్ కూడా తెలంగాణలో అలాగే చెప్పి ప్రజలదగ్గరికి వెల్లాలని చెబుతున్నాడు.

ఒకవైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వ్యవహరించాలంటూ మరోపక్క అన్నిరాజకీయపక్షాలకూ అంగీకారమయిన సామరస్యపూర్వకమైన పరిష్కారం అంటూ ఒక మెలిక. అదెలాగూ ఇప్పట్లో సాధ్యంకాదు కాబట్టి ఎలాగూ పరిష్కారం రాదు అనే ధీమా. పోనీ సమగ్రమయిన పరిష్కారానికి తానేదయినా ప్రతిపాదన ఇస్తాడా అంటే అదీ లేదు. పోనీ ఇదివరకు డిసెంబరు 9 2009 న చిదంబరం చేసిన ప్రకటన అన్ని రాజకీయపక్షాల ఆమోదంతో జరగలేదా అంటే అదీ లేదు. అప్పుడు అఖిలపక్ష సమావేశంలో అందరి ఆమోదం తరువాతే నిర్ణయం జరిగింది, ఇంకా ఎన్ని సార్లు అందరి ఆమోదం కావాలి?

రాజ్యాంగాన్ని చంకలో పెట్టుకుని తిరిగే మహాశయుడికి రాష్ట్రాల విభజన వ్యవహారంలో అన్నిసార్లూ అన్నిపక్షాలూ సామరస్యపూర్వకమయిన ఏకాభిప్రాయానికి రావడం సాధ్యం కాదు, యధాతధ స్థిథిలో  లాభపడుతున్న పక్షాలు మార్పుకు ఒప్పుకోవు, అందుకే రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాల పునర్విభజన అధికారాన్ని ఆర్టికల్ 3 ద్వారా కేంద్రానికి ఇచ్చారు అన్న విషయం తెలియదా? రాష్ట్రాలన్నీ తమసమస్యలు తామే పరిష్కరించుకుంటే ఇంకా కేంద్రం ఎందుకు మధ్యలో? మరి తెలంగాణకు మేం వ్యతిరేకం కాదని చెప్పుకుంటున్న ఈజేపీ మధ్యలో ఇలా మెలిక పెట్టడం ఎందుకంట?

శ్రీక్రిష్ణ కమిటీకి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా గణాంకాలను తనకి ఇష్టం వచ్చినట్టు వండి వార్చి మరీ రిపోర్టును సమర్పించిన ఈమహాశయుడు, కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై ఇచ్చినమాటని వెనక్కి తీసుకుని కమిటీలతో కాలయాపన చేయడంలో ప్రధానపాత్ర వహించినవాడు ఇప్పుడూ హఠాత్తుగా వోట్లకోసం తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు అనగానే ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు. జేపీగారూ, ప్రజలు మీరనుకున్నంత అమాయకులు కాదు. ఇప్పటికే ప్రజలు చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతం, జగన్ రెండు కాళ్ళసిద్ధాంతంతో విసిగి ఉన్నారు, ఇప్పుడు మీరు మెల్లకన్ను సిద్ధాంతాన్ని వినిపిస్తే తన్ని తరిమేస్తారు, జాగ్రత్త.