Tuesday 30 April 2013

సీల్డ్‌కవర్ ముఖ్యమంత్రి చిల్లర మాటలు

ముఖ్యమంత్రి పీథమ నుంచి రోశయ్య తప్పుకున్నతరువాత కిరణ్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తున్నారనేవార్త వచ్చినప్పుడు బహుషా ఆకిరణ్ రెడ్డి కూడా నమ్మి ఉండడు. కాస్సేపు పిచ్చి చూపులు చూసి, చేయిని ఒకసారి గిల్లి చూసుకుని ఇది కలకాదు అని నిర్ధారించుకుని ఉంటాడు. ఎంత అజారుద్దీన్‌తో చిదంబరం దగ్గర రికమెండెషన్ పెట్టుకున్నా ఇంతగా అదృష్టం కలిసి వస్తుందని, పోయి పోయి సోనియమ్మ ఈఅనామకున్ని ముఖ్యమంత్రిని చేస్తుందని ఎవరు మాత్రం అనుకుంటారు?

లక్కు కలిసొచ్చి సీనియర్లు ఎందరో ఉండగా తనకు ముఖ్యమంత్రి పీఠం దక్కేప్పటికి అప్పటినుంచీ కిరణ్ రెడ్డి ఆగడాలకు అంతు లేకుండా పోయింది. తానొక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని మరిచిపోయి గల్లీ రౌడీ లాగా సవాల్లు జేస్తున్నాడు. సొంత మంత్రివర్గంలో సగానికి ఎక్కువమంది తనను ఖాతరు చెయ్యకపోయినా, మిగిలినవారిలో అయిదుగురిని సీబీఐ దోషులుగా తేల్చినా కిరణ్ రెడ్డి మాత్రం తొడ గొట్టడం ఆపడం లేదు.

సొంత ఎమ్మెల్యేల మద్దతు లేకున్నా హైకమాండు జెయ్యబట్టి దక్కించుకున్న పదవి, అది కూడా తుమ్మితో ఊడిపోయేట్టున్న మైనారిటీ గవర్నమెంటు. ప్రతిపక్ష నేతకు ఎన్నికలను ఎదుర్కొనే ధమ్ము లేక మద్దతు ఇస్తుంటే అధికారాన్ని వెలగబెడుతున్న ముఖ్యమంత్రికి తెలుగు రాకపోయినా తన తత్తర బిత్తర మాటలతోనే సవాల్లు విసురుతున్నాడు.


ఒక ప్రాంతాని చెందిన నాయకులు తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనుకున్నప్పుడూ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అది వారి భాద్యత. ముఖ్యమంత్రి పీఠం మీడ గూర్చున్నవాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాలి గాని ఒక జిల్లాకో, ప్రాంతానికో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా వ్యవహరించి మాట్లాడగూడదు. ఎన్నడొ మంత్రిపదవి కూడా వెలగబెట్టని ఈముఖ్యమంత్రికి ఆవిషయం తెలిసినట్టులేదు. నిండు సభలో "మీప్రాంతానికి ఒక్క పైసా గూడా ఇవ్వం, ఏం జేసుకుంటవో జేసుకో" అనగలిగే పెద్దమనిషి ఈముఖ్యమంత్రి. ఈయనేమన్న ఈయన జేబునుంచి తీసి నిధులిస్తున్నాడా? పన్నులు కట్టించుకునేప్పుడు ఇక్కడ కట్టించుకోవడం మానేశాడా? నిధులు ఇవ్వడానికి ఇవ్వను అనడానికి ఈయనకు అధికారం ఎక్కడిది? ఇదేమన్నా రాజరికమనుకుంటుండా ఈ ముఖ్యమంత్రి?

ఆవిషయం కాస్త సద్దుమణిగిందో లేదో ఇప్పుడు బయ్యరం గనుల వ్యవహారంలో "నేను జీవో రద్దు జెయ్యను, ఏం జేసుకుంటరో జేసుకో" అని అంటుండు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా పరిపాలన జేస్తూ ఏం జేసుకుంటరో చేసుకుకోండి అని ఎందుకు సవాళ్ళు జేస్తున్నడంటే ఈయనకు ప్రజాస్వామ్యమంతే తెల్యదు కాబట్టి..ఈయనను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదు గాబట్టి..భవిష్యత్తులో ప్రజలు తనను ఎన్నుకుని తాను మల్లీ ముఖ్యమంత్రినవుతాననే నమ్మకం లేదు గాబట్టి.