Sunday 5 January 2014

చేనులో గొడ్డు


(కథ - నమస్తే తెలంగాణ నుండి)
‘చేనులో గొడ్డు పడితే చేను ఆసామి లబోదిబోమనాలా?... గొడ్డు ఆసామా?.... గొడ్డు ఆసామే’ అంటాడు గంగయ్య మేస్త్రి. మేస్త్రి అంటే తాపీ మేస్త్రి కాదని, ముఠామేస్త్రి అవునని గమనించాలి.
ముఠామేస్త్రి గంగయ్య వాదన ఏమిటంటే ‘గొడ్డు పడింది అంటే దెబ్బ తగిలి ఉండాలి. అందువల్ల గొడ్డు ఆసామి లబోదిబోమనడం సబబు. అదే రైటు డబుల్ రైటు’ అంటాడు.
గంగయ్య మేస్త్రి వాదన విని... చేనులో గొడ్డు పడిన వార్తను బొడ్రాయి దగ్గరికి మోసుకొచ్చిన చెంద్రయ్య చేష్టలుడిగిన వాడై చూస్తుండిపోయాడు.
బొడ్రాయి దగ్గరున్న నలుగురు గంగయ్య మేస్త్రి వాదన విని ముక్కున వేలేసుకున్నారు. ఒకాయన ముక్కుతో పాటు నోటిమీద కూడా వేలేసుకున్నాడు.
తమ అపర చాణక్య రాజకీయ నాయకుడిని చూసి గంగయ్య ముఠామేస్త్రి శాల్తీలన్నీ పరమానందభరితమై ఉబ్బి తబ్బిబ్బయి పోతుండగా...
‘‘కాదు...’’ అని బిగ్గరగా అరుపు వినిపించింది. బొడ్రాయి దగ్గరి తలలన్నీ అటువైపు చూశాయి. అట్లా ధైర్యంగా అరిచింది, గర్జించింది రంగయ్య మేస్త్రి. ఇతను కూడా పైన చెప్పిన విధంగా ఒక ముఠామేస్త్రి అని గమనించాలి.
chenulo
‘రంగయ్య మేస్త్రి ముక్కుసూటి మనిషి’ అని పేరు తెచ్చుకొని చాలా కాలమయింది. తెచ్చుకున్నాడు, కొనుక్కోలేదు.
‘‘చేనులో గొడ్డు పడింది అంటే... ఆ గొడ్డు కింద పడింది అని అర్థం కాదు. చేనులో చొరబడింది... ఆవురావురుమని చేను మేస్తున్నదని అర్థం...’’
రంగయ్య మేస్త్రి మాటలు బొడ్రాయి దగ్గరి గంగయ్య మేస్త్రి ముఠాకు ఆగ్రహం తెప్పించడంలో ఆశ్చర్యం లేదు. వాళ్లకు వేదాలు వేదాలు కావు. గంగయ్య మేస్త్రి చెప్పిందే వేదం. ఇజాలు నిజాలంటే వాళ్లకు ఎలర్జీ... ఎర్రకారం మంట!
ఇంకా రంగయ్య మేస్త్రి ఇట్లా వివరణ ఇచ్చాడు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవని రంగయ్య చిన్నప్పుడే చదువుకున్నాడు. గంగయ్య ముఠా వాళ్ల అరుపులకు అతడు బెదరలేదు.
‘‘పనిలో పడి మరచిపోయాం అంటాం... అంటే ఏమిటి? పనిలో ఉండి ఫలాని విషయం మరచి పోయాం అని కదా తాత్పర్యం. అందువల్ల చెంద్రయ్య బొడ్రాయి దగ్గరికి తెచ్చిన వార్త‘ చేనులో గొడ్డు పడింది అంటే.. చేనులోకి గొడ్డు చొరబడింది’ అని అర్థం... చేనులోకి గొడ్డు ఎందుకు చొరబడుతుంది? ఫొటో దిగడానికా... పొట్ట నింపుకోడానికి... అంటే చేను మేయడానికి. అందువల్ల చేను ఆసామి లబోదిబోమనాలి కాని... గొడ్డు ఆసామి ఎందుకంటాడు?
‘‘చేను ఆసామి లబోదిబోమనడం డబుల్ రైటు.. త్రిబుల్ రైటు. ఆ మాటకొస్తే త్రిబుల్ క్యూబ్ రైటు...’’ అన్నాడు రంగయ్య మేస్త్రి.
చిన్నప్పట్నించి రంగయ్య మేస్త్రికి లెక్కలంటే ఇష్టం. లెక్కల సారంటే ఇష్టం... లెక్కల పుస్తకాలన్నా, ఎక్కాల పుస్తకాలన్నా మరీ మరీ ఇష్టం... ఎక్కాలు రాని.. లెక్కలు రాని గంగయ్య మేస్త్రీ కాకి లెక్కలంటే రంగయ్య మేస్త్రికి ఒళ్లు మంట.... అరికాలి మంట.
బొడ్రాయి దగ్గర రంగయ్య మేస్త్రీ ముఠా కూడా ఉన్నది. రంగయ్య మాటలకు ఆ ముఠా బిగ్గరగా చప్పట్లు చరిచేసరికి చుట్టూ చెట్ల మీదున్న పిట్టలు ఎగిరిపోలేదు- సంబరంగా చూశాయి.
‘‘చెంవూదయ్యా... చేన్ల పడిన గొడ్డును గెదుమక ఇక్కడిదాక ఆ వార్త మోసుకొచ్చినవా..’’ చెంద్రయ్య వంక తిరిగి అడిగాడు రంగయ్య మేస్త్రి.
చెంద్రయ్య.... ఆ గొడ్డు గంగయ్య దొర మేనమామ గారిదని చెబుతుంటే ‘‘ష్’’ అని చెంద్రయ్య నోరు మూయించాడు గంగయ్య మేస్త్రి. ఆ తరువాత రంగయ్య మేస్త్రి వంక ఉరిమి చూస్తూ.... ‘‘ఏం మాట్లాడుతున్నవ్, నువ్వు ఏ స్కూళ్ల చదువుకున్నవయ్యా? ఎన్నో క్లాసు దాకా చదువుకున్నావు? నీకు తెలుగు చెప్పిన పంతులు ఎవరు? తెలుగు తల్లినే అవమానిస్తున్నావ్... నేలమీద నువ్వు పడితే నీకు దెబ్బ తగులుతుందా?...నేలకా? నీకే కదా... మరి చేనులో గొడ్డు పడితే గొడ్డుకే తగలాలె కదా..’’
‘‘అంతేకదా...’’ గంగయ్య ముఠా వాళ్లంతా ఖుషి ఖుషి ....
గంగయ్య మేస్త్రి వితండ వాదం విని రంగయ్య మేస్త్రి సూటిగా ఒక ప్రశ్న వేశాడు.
‘‘అసలు గొడ్డు చేనులోకి ఎందుకు రావాలి?’’
‘‘ఎందుకంటే... చేను ఏపుగా పచ్చగా కనిపించింది... వచ్చింది- అది గొడ్డు బుద్ధి... అంత పచ్చగా ఏపుగా చేను కనిపించకపోతే గొడ్డు తన దారిన తాను పోయేది. తప్పు ఏపుగా పెరిగిన చేనుది. గొడ్డుది కాదు...’’
ఆహహా... ఓహొహో... తిమ్మిని బమ్మి.... బమ్మిని తిమ్మి చేయడంలో తమ మేస్త్రిని మించిన ముఠామేస్త్రి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు.... ఆలోవర్ వరల్డ్‌లోనే లేడని గంగయ్య మేస్త్రి ముఠా వాళ్లంతా ఏకక్షిగీవంగా తీర్మానం చేసి, ఆనందం పట్టలేక ఒకరి అంగి ఒకరు చింపుకొని, ఒకరి జుట్టు ఒకరు పీక్కొని ఎగిరి గంతులు వేశారు.
అంతటితో ఆగిపోలేదు గంగయ్య వాదన. ‘‘మిస్టర్ రంగయ్యా... చేను ఆసామి చేరాలు మీ బామ్మరిదికి దగ్గరి వాడా... బావకు దగ్గరి వాడా...అతనికి వత్తాసు పలుకుతున్నావ్. ఆ మాటకొస్తే చేనును ఏపుగా పెంచి, గొడ్డును ఆకర్షించి, అది చేనులో పడటానికి కారణమైన చేరాలు గొడ్డు ఆసామికి నష్టపరిహారం చెల్లించాలి...’’
ఆ వాదన విని, ఏనుగును దాని ఎత్తు తక్కువనుకుంటే ఒంటెను ఎక్కినంత సంతోషంతో గంగయ్య ముఠా కేరింతలు కొట్టింది...
తల దిమ్మెక్కిపోయింది రంగయ్యకు...
‘‘తెలివి...అతి తెలివంటే నీదయ్యా గంగయ్యా... ఎద్దు చేనులో పడి చేను ఆసామి నష్టపోతే అతన్నే నష్టపరిహారం చెల్లించమంటావా...’’
‘‘అవును, చెల్లించాల్సిందే...’’ గంగయ్యతో పాటు అతని ముఠా వాళ్లంతా బిగ్గరగా అరిచారు.
అప్పుడు కథలో ఒక చిన్న ట్విస్ట్. అదేవిటంటే- గంగయ్య మేస్త్రి ఏకైక పుత్రికా రత్నం, వజ్రం, వైడూర్యం, మరకతం, మాణిక్యం తండ్రి చెవిలో గుసగుసగా అంది-
‘‘డాడ్...’’
‘‘ఎస్ బేబీ...’’
‘‘తొందర పడ్తున్నారు...’’
‘‘ఎందుకు బేబీ....’’
‘‘మన అస్మదీయుల పట్ల వాదిస్తున్నారు. మన ఓట్లు సేఫ్. బాగానే ఉంది. కానీ, చేను ఆసామి చేరాలు బంధుమివూతులు చాలామంది ఉన్నారట. అందుకే రంగయ్య మేస్త్రి చేరాలుకు అనుకూలంగా వాదిస్తున్నాడు. వచ్చే ఎలెక్షన్లలో ఆ ఓట్లన్నీ అతనికే పడతాయి. మనకు రెండువైపులా ఓట్లు రావాలంటే తటస్థంగా ఉండటం మంచిది. వన్ సైడ్ వాదన డేంజర్ డాడ్...’’
‘‘అవునా బేబీ డియర్...’’
‘‘ఎస్ డాడ్...’’
ఊసర కంటే వేగంగా గంగయ్య రంగులు మార్చగలడు. గొంతు మార్చగలడు. మార్చేశాడు.
‘‘చేనులో గొడ్డుపడింది సరే... మిత్రులారా! నా కార్యకర్తలారా, చేను ఆసామి చేరాలు కూడా మన వాడే. అతనికీ అన్యాయం జరగొద్దు. ఇటు గొడ్డు ఆసామికీ అన్యాయం జరగొద్దు. ఇద్దరికి సమన్యాయంగా నేను తీర్పు చెబుతున్నా...’’ అన్నాడు.
‘‘చెప్పండి... చెప్పండి...’’ చెవులు చేటంత, ఏనుగు చెవులంత చేసి వినడానికి సిద్ధంగా ఉన్నారు గంగయ్య ముఠా వాళ్లు.
‘‘సమన్యాయం అంటే ఏమిటి దొరా...?
‘‘ఏవిటి నాయకా...?’’
‘‘ఏవిటి నాయకుల నాయకా...’’
‘‘ఏవిటి నాయకుల నాయకుల ఆలోవర్ దునియా నాయకుల నాయకా...నాయకా గ్రేసరా....’’
అట్లా అస్మదీయులంతా ఉత్సాహంగా, ఉత్కం అడిగేసరికి గంగయ్య మేస్త్రి సంతోషించి, సంతృప్తి చెంది సమన్యాయాన్ని ఇట్లా వినిపించాడు-
‘‘చేను ఆసామి చేరాలు నష్ట పరిహారం చెల్లించనవసరం లేదు. అందుకు బదులుగా గొడ్డును దాని ఇష్టం వచ్చినంత సేపు చేనును మేయనిస్తే చాలు. అటు చేను ఆసామి చేరాలుకు నష్టపరిహారం చెల్లించే బాధ తప్పుతుంది. ఇటు గొడ్డు ఆసామికి తన గొడ్డుకు దెబ్బ తగిలింది కనుక దానికి పరిహారంగా అతడు గొడ్డుకు మేత పెట్టే బాధ తప్పుతుంది.’’
‘ఆహా! ఏమి సమన్యాయం...ఏమి సమన్యాయం...’ అని గంగయ్య ముఠా వాళ్లంతా గంగయ్యను పొగడ్తలతో ఆకాశానికి...అంతకంటే పైన ఇంకేదైనా ఉంటే అక్కడి దాకా ఎత్తుతుంటే...
‘‘చాల్లే నోర్మూయండి... సమన్యాయమంటే ‘నీ కంట్లో నేను వేలుపెడతా... నా నోట్లో నువ్వు వేలు పెట్టు’ అన్నట్టా... ఇదేనా మీ సిద్ధాంతం, రాద్ధాంతం...’’ రంగయ్య గొంతులో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.
అప్పుడు ఆ ఊరి గోపయ్య అటువేపు వచ్చాడు- అతణ్ణి అందరూ ఆప్యాయంగా కాకా అని పిలుస్తారు.
‘‘తప్పు గంగయ్యా... ముందా గొడ్డును చేను నుంచి తరిమేయమని చెప్పు’’ అన్నాడు గోపయ్య వస్తూనే...
గోపయ్య కాక పలికిన హితవు మాటలు గంగయ్య చెవి కెక్కలేదు. నిప్పు తొక్కిన కోతిలా అనకూడదు- కోతి మన అన్న. నిప్పు తొక్కిన క్రూరమృగంలా గఁయ్‌న గోపయ్య మీదికి లేచాడు గంగయ్య.
‘‘కాటికి కాళ్లు చాపిన ముసలోళ్లు కూడా మాకు నీతులు చెప్పుడేనా... నీకెందుకు ముసలాయనా ఈ రాజకీయాలు. గొడ్డును చేను నుంచి తరిమేయడం అంత సులువు కాదు. అందుకు ఇద్దరు ఆసాములు ఒప్పుకోవాలి..’’
‘‘పరాయి చేనులో పడి మేస్తున్న గొడ్డును తరమడానికి గొడ్డు ఆసామి అంగీకారం కావాలా!?’’ బీరిపోయి చూశాడు గోపయ్య కాక. బీరిపోయి చూశాడు రంగయ్య మేస్త్రి.
‘‘గొడ్డు ఆసామి ఒప్పుకునేదాకా చేను ఆసామి గొడ్డును తరిమేయకుండా తన చేనును మేయనివ్వాలా!!’’ అడిగాడు రంగయ్య మేస్త్రి ఆశ్చర్యంగా...
‘‘అవును- అదే సమన్యాయం అంటే...’’
గంగయ్య తన ముఠా వాళ్ల వంక చూస్తూ అన్నాడు.
‘‘అవును...అవును... అదే సమన్యాయం...’’ ముఠా నుండి కేకలు...కేరింతలు!!
అప్పుడు భుజానికి ఒక సంచి, పొడుగాటి లాల్చి పైజామాతో ఒక ఆకారం అక్కడ ప్రత్యక్షమయింది.
ఆ ఆకారం గల మనిషి ప్రజల పక్షాన నిలబడే పార్టీ నాయకుడు కనుక ‘గంగయ్య మేస్త్రి సమన్యాయాన్ని చీల్చి చెండాడి చేను నుంచి తక్షణమే గొడ్డును తరిమేయాలి. చేను ఆసామికి నష్టపరిహారం చెల్లించాలి. అదే సమన్యాయం...న్యాయం’ అని చెబుతాడు...అరుస్తాడు...ఘీంకరిస్తాడు...గాండ్రిస్తాడు...గర్జిస్తాడు అనుకొని రంగయ్య మేస్త్రి కళ్లు ఆశగా అతని వంక చూశాయి.
‘‘గంగయ్య మేస్త్రి చెప్పిన సమన్యాయమే సరియైనది. గొడ్డును తన ఇష్టం వచ్చినంత సేపు చేనులో మేయనివ్వాలి...’’ అని ఆ ఆకారం పిల్లిలా మ్యావ్ మ్యావ్ అనేసరికి అక్కడున్న వాళ్లంతా బిత్తరపోయారు. గంగయ్య మేస్త్రి ముఠా కూడా నమ్మలేకపోయంది. అంత సులభంగా ఆ ఆకారం తమ వాదనను ఒప్పుకునేసరికి వారి ఆనందానికి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. దగ్గరున్న పందిరిని పీకి పడేసేదాకా వారి కాళ్లు చేతులు నిలువనంటున్నాయి.
చేనులో గొడ్డు పడిన వార్త తెచ్చి అప్పటి దాకా మౌనంగా ఉన్న చెంద్రయ్య ఒక్కసారిగా నోరు విప్పి గట్టిగా అరిచాడు- ‘‘ఛీ...ఇంత ఘోరమా!!’’.
‘‘ఏవిట్రా... ఏమంటున్నావ్...’’ పందిరి పీకే ప్రయత్నంలో ఉన్న గంగయ్య ముఠాలోని ఒక శాల్తీ చెంద్రయ్య మీదికి లంఘించింది.
‘‘ఎర్ర చీమ ఈయన్ని చూసి సిగ్గుపడాలె’’ అన్నాడు చెంద్రయ్య బెదరకుండా... లాల్చీ ఆకారాన్ని చూస్తూ-
‘‘ఎందుకురా...?’’
‘‘దాని పేరులో ఎర్ర అనే పదం ఉన్నందుకు...’’
చెంద్రయ్య మీదపడి గంగయ్య ముఠా వాళ్లు తమ పిడిగుద్దుల ఇష్టాన్ని తీర్చుకునే వాళ్లే...
ఇంతలో... ‘‘పారిపోండ్రి పారిపోండ్రి...’’ అంటూ ఆ ఊరి వీరసామి అటు పరుగెత్తుకుంటూ వచ్చాడు.
‘‘ఏవిట్రా వీరసామి, ఏమయింది...?’’ అని ఎవరో అడిగితే...
‘‘తమ చేన్ల గొడ్డు పడితే ఊర్కుంటడా... చేరాలు కొడుకు... గొడ్డును తరిమేసి పోతరాజు లెక్క వార్ కట్టె పట్టుకొని ఇటే వస్తున్నడు... ఎవరి మీద పడ్తడో ఏమో...’’
పోతరాజు... వార్ కట్టె అనే పదాలు వినేసరికి గంగయ్య ముఠా వాళ్లు గజగజ వణికిపోయారు. అశ్శరబశరబ....
‘‘డాడ్... వార్ కట్టె అంటే మన మద్రాస్ ఇంగ్లీషులో హంటర్ కదా...’’ అని అడిగింది గంగయ్య మేస్త్రి పుత్రికా రత్నం.
‘‘ముందు ఇక్కణ్నుంచి పదమ్మా... అసలేవాడు పోతరాజులా వస్తున్నడట...’’ కూతురు చేయి పట్టుకొని గంగయ్య మేస్త్రి తన బంగళాకు పరుగో పరుగు...

1 comment:

Your comment will be published after the approval.