Tuesday 11 February 2014

సమాఖ్య స్ఫూర్తి!?


సుబ్బారావును కలిసి చాన్నాళ్ళయ్యింది, ఎలా ఉండోచూద్దామని సుబ్బారావు ఆఫీసుకు వెళ్ళి చూద్దును కదా, సుబ్బారావు కళ్ళు చింతనిప్పుల్లా మండిపోతున్నాయి. 

ఏమయింది సుబ్బారావ్? ఎందుకంత కోపంగా ఉన్నావ్?

కేంద్రం రాష్ట్రవిభజన వ్యవహారం అస్సలు సరిగా చేయడం లేదు.బొత్తిగా సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించడం లేదు తెలుసా?

హమ్మయ్య! అయితే నీకోపం నాపైన కాదు కేంద్రం మీదన్నమాట. ఇంతకూ ఇలాగని ఎవరన్నారు?

ఇంకెవరంటారు? మన చంద్రబాబు, జగన్ బాబు, కిరణ్‌బాబూ రోజూ టీవీల్లో చెబుతున్నారు.

వాళ్ళకీవిషయం ఎలా తెలిసిందబ్బా? వాళ్ళకంత బుర్ర ఉన్నట్టు లేదే?

మన జయప్రకాశ్ నారాయణ వాళ్ళకు చెప్పాడంట.  

ఓహో! అయితే ఇది ఆయన తెలివితేటలన్నమాట. అనుకున్నా. అవును సుబ్బారావ్, ఇంతకూ మన దేశం ఒక సమాఖ్య వ్యవస్థేనంటావా?

నీతెలివితేటలు ఏడ్చినట్టే ఉన్నాయి. కాదు గాబట్టే గదా సమాఖ్య స్ఫూర్తి అంటూ ఏడిచేది? లేకపోతే సమాఖ్యవ్యవస్థకు వ్యతిరేకమని కోర్టుకు వెళ్ళేవాళ్ళు గదా.

అదన్నమాట అసలు సంగతి. కేంద్రం చేయడం చట్టబద్దమే కానీ స్ఫూర్తిని చూపించి రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించాలా? అంటే అప్పుడప్పుడూ మన క్రికెటర్లు అంపైర్ ఔటివ్వకపోయినా క్రీజు వదిలి వెలుతుంటారు, అలాగే కేంద్రం చేయాలంటావా?

కరెక్ట్. ఇప్పుడూ నీకు విషయం సరిగ్గా అర్ధమయింది. ఒకప్పుడు కోర్ట్నీ వాల్ష్ ఇలాగే క్రీడా స్ఫూర్తిని చూపించి ప్రపంచ కప్ క్రికెట్ సెమి ఫైనల్లో ఆఖరు వికెట్ అని తెలిసి కూడా క్రీజుకు ఆమడ దూరంలో ఉన్న సలీం జాఫర్‌ను రన్అవుట్ చేయలేదు తెలుసా? అదీ స్ఫూర్తి అంటే. కేంద్రం దగ్గర ఏమాత్రం స్ఫూర్తిలేదు. ఉంటే అస్సలు ఇలా చేయలేదు.

బాగుంది. మనం మాత్రం పాకిస్తాన్లా  తొండాట ఆడతాం, కేంద్రం మాత్రం కోర్ట్నీవాల్ష్‌లా  స్ఫూర్తిని ప్రదర్శించాలనుకోవడం అత్యాశ కదా సుబ్బారావ్? మన కిరణ్ బాబు ముప్పై సెకన్లలో రాష్ట్ర అసెంబ్లిలో విభజనకు వ్యతిరేకంగా ఒక బిల్లును ప్రవేశపెట్టి స్పీకర్ ఏం చెబుతున్నాడో ఎవరికి అర్ధం కాకముందే గెలిపించుకున్నాడు. మన చంద్రబాబు విభజన జరిగిపోయే దశకు వచ్చినా తన వైఖరి ఏంటో చెప్పక కొబ్బరికాయలు, రెండు కళ్ళు, ఎంతమంది పిల్లలు అంటూ అందరినీ భయపెడుతాడు. మన జగన్‌బాబేమో అసలు అందరికంటే ముందే నిర్ణయం తీసుకోవాల్సింది ఆర్టికల్ మూడు ప్రకారం కేంద్రమే అని తేల్చి ఇప్పుడు ఎవర్నడిగి నిర్ణయం తీసుకున్నారంటున్నాడు. ఇదంతా తొండి కాదా సుబ్బారావ్? 

అంతేనంటావా?

ఖచ్చితంగా అంతే . అసలు కేంద్రం స్ఫూర్తిని ప్రదర్శించాలని అడగడానికి వీళ్ళెవరికైనా అర్హత ఉందంటావా? పైగా ఇన్నాళ్ళూ తెలంగాణవారు విభజనకోసం కొట్లాడుతుంటే ఏనాడైనా వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం కోసమైనా ప్రయత్నం చేశారా చెప్పు? ఒక్కనాడైనా ఈవిషయంపై అసెంబ్లీలో చర్చ పెట్టారా పోనీ? ఇప్పుడు ఏమొహం పెట్టుకుని సమాఖ్యస్ఫూర్తి అంటూ గోలపెడుతారు? అందుకే మనవాళ్ళ వాదనకు దేశంలో ఏఒక్క పార్టీకూడా మద్దతియ్యట్లేదు. నువ్వూరికే ఆవేశపడిపోయి బీపీ తెచ్చుకోక ఇంటికెళ్ళి మీఅబ్బాయితో తొక్కుడుబిల్లాడుకుని అక్కడ నీక్రీడాస్ఫూర్తిని ప్రదర్శించు. 

సుబ్బారావుకి నేను చెప్పింది తలకెక్కిందో లేదోగానీ ఆరోజు సాయంత్రమే పార్కులో వాళ్ళబ్బాయితో తొక్కుడూబిల్లాడుతూ నాక్కనిపించాడు. 

2 comments:

  1. బాగా చెప్పారు. మొదటి నుండి ఇదే పరిస్తితి కదా. సమక్య వాళ్ళు చేస్తే ఒప్పు, వాళ్లకు వ్యేతిరేకంగా అదే పని ఇంకెవరైనా చేస్తే తప్పు.

    అసెంబ్లీలో తిరస్కరించటం, విగ్రహాలు పగల గొట్టటం, హైదరాబాదులో సభలు పెట్టుకోవటం, పోలీసులు ఉద్యమకారులపై దండెట్టటం .....

    ReplyDelete
  2. Legal aspects of the so called federal spirit:

    http://jaigottimukkala.blogspot.in/2014/02/article-3-federalism-and-bommai-case.html

    ReplyDelete

Your comment will be published after the approval.