source: missiontelangana.com
తెలుగు వారికొరకు ఒక రాష్ట్రం ఉండాలని, మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడివడాలనే కోరిక 1910ల నుండే ప్రారంభమైనా వివిధ కారణాల వల్ల ఆ స్వప్నం నిజం కావడానికి నాలుగు దశాబ్దాల కాలం పట్టింది.
అయితే ఈ ఆలస్యానికి చాలా వరకు కారణం బయటివారుకాక అప్పటి ఆంధ్ర నాయకుల మధ్య ఉన్న అపనమ్మకాలు, విభేధాలు, పరస్పర నమ్మకరాహిత్యం కావడమే విషాదం.
చూడడానికి అంతా హేమాహేమీలే అయినా తమతమ వ్యక్తిగత అహాలు, స్వార్ధాల కారణంగా ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యింది.
కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీ, ప్రజా పార్టీ, కృషికార్ పార్టీ, ఆంధ్ర మహాసభ, కిసాన్ మజ్దూర్ సభ…ఇలా అనేక పార్టీలు, సంస్థలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించే క్రమంలో రాష్ట్ర ఏర్పాటు ఒక కొలిక్కి రాకుండా చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం, మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం రెండూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించినా, కొందరు ముఠాకోర్లు మద్రాస్ నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలనే డిమాండును తెరపైకి తెచ్చి రాష్ట్ర ఏర్పాటును జటిలం చేసుకున్నారు.
పొట్టి శ్రీరాములు మరణానికి ప్రధానంగా నలుగురు సీమాంధ్ర నేతలు కారణమని అప్పటి ఘటనల క్రమం చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రకాశం పంతులు గురించి.
స్వాతంత్రం రాకపూర్వమే మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన, తన మొండిపట్టుదల వల్ల ఏడాదికాలం కూడా ఆ పదవిలో కొనసాగలేకపోయాడు.
చివరికి అప్పటి నెహ్రూతో కూడా విభేదించి కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చి ప్రజా పార్టీ అనే పార్టీని స్థాపించాడు.
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పంపకాలు చేయడానికి 1949లో ఏర్పాటైన పార్టీషన్ కమిటీలో, ఏడుగురు సభ్యులు మద్రాసు నగరం లేకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతిస్తే, ప్రకాశం పంతులు మాత్రం చెన్నపట్నం లేకుండా ఆంధ్ర రాష్ట్రం వద్దని తిరకాసు పెట్టాడు.
అయితే ఆనాడు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలకు మాత్రం మదరాసు నగరంపై పెద్ద వ్యామోహమేమీ లేదు. ఏదో ఒకలాగా రాష్ట్రం వస్తే చాలని ప్రజలనుకుంటుంటే, ప్రకాశం వంటి నాయకులేమో 1950, 1951 సంవత్సరాలు మొత్తం మద్రాసు నగరంతో పాటు ఆంధ్ర రాష్ట్రం కావాలని, లేదా మద్రాసును చీఫ్ కమీషనర్ స్టేట్ (కేంద్రపాలిత ప్రాంతం) చేయాలని ప్రకటనలు గుప్పించసాగారు.
(ఇప్పుడు సీమాంధ్ర నాయకులు హైదరాబాదును కేంద్రపాలితప్రాంతం చేయాలని అనడం వెనుక నేపధ్యం అర్థం అయ్యిందా?)
ఈ నాయకుల వలెనే మద్రాసులో పుట్టి పెరిగిన పొట్టి శ్రీరాములుకు కూడా మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలనే కోరిక ఉండేది.
అటు తమిళ, ఇటు తెలుగు నాయకులు మద్రాసు నగరంపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో నెలలు గడుస్తున్నా అసలు సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగుచెందిన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ద్వారా మద్రాసు భవితవ్యాన్ని తేల్చాలని నిర్ణయించుకున్నాడు.
అక్టోబర్ 20 1952 నాడు బులుసు సాంబమూర్తి ఇంటిలో పొట్టి శ్రీరాములు తన ఆమరణ దీక్ష మొదలుపెట్టాడు. ఆ సందర్భంగా ఆయన స్పష్టంగా మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కొరకే తాను దీక్షకు కూర్చున్నట్టు ప్రకటించాడు.
(ఆంధ్రప్రభ నుండి)
—
అయితే ఇక్కడొక విషయం గమనించాలి.
తెలుగువారికి మద్రాసు నగరంతో అనుబంధం ఉన్నమాట నిజమైనప్పటికీ ఏ విధంగా చూసినా వారికి ఆనాడు ఆ నగరం దక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆనాటికి మద్రాసు నగరంలో తమిళులే అధికం. దానికి తోడు అనేక ఏళ్ల నుండి ఉమ్మడి మదరాసు రాష్ట్రానికి రాజధానిగా ఉన్న మదరాసు నగరాన్ని వదులుకోవడానికి తమిళులు ఒప్పుకునే ప్రశ్నే లేదు.
ఇక మదరాసు నగరం తెలుగువారికే హక్కుభుక్తం కావాలని మొదటినుండీ మంకుపట్టు పడుతున్న టంగుటూరి ప్రకాశం పంతులు వాదన ఎంత అర్ధరహితమో ఒక ఉదాహరణ చెప్పాలిక్కడ.
1952 జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మదరాసు నగరంలోని హార్బర్ నియోజకవర్గం నుండి శాసనసభకు ప్రకాశం పంతులు పోటీచేసాడు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి కృష్ణారావు గెలవగా, రెండో స్థానంలో నిలిచిన ఇబ్రహీం అనే ఇండిపెండెంటుకు 11 వేల ఓట్లు వస్తే, అప్పటికే మహా నాయకుడిగా, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కీలక వ్యక్తిగా నిలిచిన ప్రకాశం పంతులు 7 వేల ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్ కూడా దక్కక చిత్తుచిత్తుగా ఓడిపోయాడు.
Source – Election Commission of India
మరి ఇలాంటి పరిస్థితిలో మదరాసు నగరం తెలుగువారికి దక్కుతుందని ప్రకాశం వంటి ఆంధ్ర నాయకులు ఎలా అనుకున్నారు?
ఇక పొట్టి శ్రీరాములు దీక్ష ప్రారంభం అయిన మరునాడే అప్పటి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు పి. సుబ్బరాయన్ చెన్నపురి (మద్రాసు) ను వదులుకుంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం సులభం అవుతుందని ప్రకటించాడు.
కానీ, దీక్ష మొదలైన రెండో రోజు నీలం సంజీవరెడ్డి మదరాసు నగరాన్ని ప్రత్యేక కమీషనర్ రాష్ట్రంగా (కేంద్రపాలిత ప్రాంతం)గా ప్రకటించాలని డిమాండ్ చేశాడు.
శ్రీ రాములు దీక్ష మొదలైన వారం రోజులకు రాష్ట్రోద్యమంలో చురుకుగా ఉన్న ప్రధాన పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీ మొదట పరిస్థితి తీవ్రతను గ్రహించింది. నిర్వివాద ప్రాంతాలతో (మదరాసు లేకుండా) వెంటనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ కమిటీ తీర్మానించింది.
(ఆంధ్రప్రభ నుండి)
—
అయితే అదే రోజు ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాధం వంటి నాయకులు మాత్రం ఇంకా మదరాసులో అరవవారికన్నా తెలుగువారే అధికంగా ఉన్నారనే అసంబద్ధపు ప్రకటన చేశారు.
అక్టోబర్ 27 నాడు పార్లమెంటు సభ్యుడు లంకా సుందరం నిర్వివాద ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం నిర్మించి మదరాసును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని రాష్ట్రపతిని కోరాడు.
అక్టోబర్ 28 నాడు బులుసు సాంబమూర్తి కూడా ఒక సభలో మాట్లాడుతూ మదరాసును కేంద్రపాలిత ప్రాంతం చేసి ఆంధ్ర రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్ చేశాడు.
ఇక పొట్టి శ్రీరాములు దీక్ష మొదలైన 10 రోజులకు అన్నిటికన్నా ఘోరమైన విషయం జరిగింది.
అప్పటిదాకా మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించిన ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రెండేళ్ల కిందటి తీర్మానానికి మద్ధతు పలికిన నేత నీలం సంజీవరెడ్డి ఇప్పుడు ప్లేటు ఫిరాయించి మదరాసుపై ఆంధ్రులు హక్కును వదులుకోరని ప్రకటించాడు.
అంతే కాదు ఇంకో అయిదేళ్ల వరకూ ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి లేకపోవడం వల్లనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్ధించుకున్నాడు.
(ఆంధ్రప్రభ నుండి)
—
ఎంత దుర్మార్గమో చూడండి. ఒకవైపు నిరాహార దీక్షకు కూర్చున్న పొట్టి శ్రీరాములు ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణిస్తున్న వేళ సాక్షాత్తూ నీలం సంజీవ రెడ్డే ఇంకో అయిదేళ్ల వరకూ రాష్ట్రం రాదని చెబుతున్నాడు.
మరి అటువంటి పరిస్థితులో పొట్టి శ్రీరాములు దీక్ష కొనసాగిస్తుంటే దాన్ని ఆపకుండా ఎందుకు ఉన్నట్టు?
—
(ఇంకా ఉంది)