Wednesday 29 October 2014

బూటకాల బాబు!

నేను రైతులకు రుణమాఫీ ప్రకటిస్తే సాధ్యం కాదంటున్నారు? వారు దోచుకోవడానికి లక్ష కోట్లు వస్తాయి. కానీ రైతులకు మాఫీ చేయడానికి రాదా? నేను ఆర్థిక శాస్త్రవేత్తను, నాకు అంతా తెలుసు. జగన్ ఏమి చదువుకున్నాడు? ఆయనకేం తెలుసు? గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 24న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్న మాటలివి.


babuసీను కట్ చేస్తే...


పాదయాత్ర సమయంలో ప్రజల బాధలను చూశా. రైతు రుణమాఫీ, డ్వాక్రా పొదుపుసంఘాల రుణమాఫీకి హామీ ఇచ్చా. అప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉంది. ఇప్పుడు వేరు. రాష్ట్రం విడిపోయింది. ఆంధప్రదేశ్ ఎక్కడ ఉందో.. ఎంత బడ్జెట్ ఉందో నాకే కాదు,ఎవరికీ తెలియదు మే 18న ఈనాడు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే చంద్రబాబు చెప్పిన మాట.విషయానికి వస్తే.. మే 16నాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అంటే ఫలితాలు వెలువడ్డ రెండోరోజే నాయుడుగారి టోన్ మారిపోయింది.

ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన రైతు రుణమాఫీ పథకం మీద బాబుగారు ప్లేటు ఫిరాయించేశారు. హామీ ఇచ్చినపుడు ఉమ్మడి రాష్ట్రం.. ఇపుడు వేరు పడింది కదా అనేది లాజిక్కు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..రాష్ట్రం మార్చి 1నే విడిపోయింది. రాష్ట్ర విభజన బిల్లు మీద ఆరోజే రాష్ట్రపతి సంతకం చేశారు. ఆ తర్వాతే ఎన్నికల ప్రకటన వచ్చింది. ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులూ చంద్రబాబు రుణమాఫీ పాట పాడారు. ఎలా సాధ్యమన్న కాంగ్రెస్, వైఎస్సార్సీపీతో పాటు రాజకీయ విశ్లేషకులను సైతం దబాయించారు.నైన్ ఇయర్స్ గవర్నమెంట్ అంటూ గొప్పలు చెప్పారు. బచ్చాగాళ్లు మీకు ఏం తెలుసన్నారు. విజడమ్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నారు. మొత్తానికి ఎన్నికల ఓడ దాటేశారు.

papaకేంద్ర మంత్రుల ముందు సంతకాల బిల్డప్..


గమ్మత్తేమిటంటే రూ. 30 కోట్లు ఖర్చు చేసి భారీ ఏర్పాట్లతో బాబుగారి పట్టాభిషేకం జరుపుకున్నారు. కేంద్ర మంత్రులందరినీ విమానాలు పెట్టి మరీ పిలిపించారు. వెంకయ్య పౌరోహిత్యంలో సాగిన ఆ పట్టాభిషేకంలో కాగితాలు తెప్పించి రైతు రుణ మాఫీ తొలి సంతకాలు గీకి పారేశారు. కేంద్రమంత్రులతో శభాష్ అనిపించుకున్నారు. కొలువు తీరాక తొండి మొదలైంది. శ్వేతపత్రాలు అన్నారు. కోటయ్య కమిటీ అన్నారు. అటు లాగా ఇటు లాగి చివరకి మొత్తం రుణాలన్నీ మాఫీ పైసా కట్టొద్దు 

అన్న పిలుపు నిచ్చిన నోటితోనే లక్షన్నరకు కుదించారు. 
అంతే రుణమాఫీ ఫైలు మూమెంట్ అక్కడితో ఫుల్‌స్టాప్. అంగుళం కదిలిన జాడ లేదు. ధారాళంగా కురిపించిన మిగిలిన హామీలకు ఆ సంబరమూ దక్కలేదు.


మాఫీ చేసింది...హామీలనే..!


నాలుగు నెలలు దాటింది. రుణమాఫీ జరిగింది లేదు. పైసా విదిల్చింది లేదు. దాదాపు దశాబ్ధం పాటు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు వాగ్ధానాలిచ్చేటప్పుడు ఆర్థికపరిస్థితి తెలియదా ? ఎన్నికల తర్వాత మాట ఎందుకు మారిందన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు ఈ నాటికి చంద్రబాబు నుంచి సరైన సమాధానం లేదు. తొలిసంతకానికి ముందు నుంచే బాబు వైఖరిలో మార్పు మొదలైంది. ఆశపడ్డ అధికార పీఠం దక్కింది, ఇంకెవరూ ఏం చేయలేరన్న ధీమా వచ్చేసింది. బేషరతు రుణాల మాఫీ అన్న నోటితోనే ఎక్కడా లేని షరతులు విధించారు. కోతల వాతలు మొదలు పెట్టారు. 


ఏం చెప్పారు? ఏం చేశారు?


చంద్రబాబు ప్రచారం రుణమాఫీ అంశమే ప్రధానంగా చోటు చేసుకుంది. రైతు రుణాలే కాదు.. డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ఈ రుణభారం మొత్తం లక్ష60వేల కోట్ల వరకు ఉంటుందని అప్పట్లోనే పలువురు రాజకీయవాదులు, పాత్రికేయులు కూడా వెల్లడించారు. అసలే రాష్ట్రం విడిపోయి ఆర్థికపరిస్థితి దిగజారి ఉండగా అంతమాఫీ అసాధ్యమని ప్రతిపక్షమంతా వాదించింది. కానీ తనకు రాజకీయ అనుభవం ఉందని చంద్రబాబు దబాయించారు. చేసి చూపుతానని సవాళ్లు చేశారు. కానీ అధికారంలోకి రాగానే అన్నీ తుంగలో తొక్కారు. ముందుగా శాఖల వారీగా శ్వేతపత్రాలు అన్నారు. బ్యాంకులే కవచంగా..


కమిటీతో రెండు నెలలు లాగిన ఏపీ సర్కారు ఈసారి బ్యాంకులను కవచంగా వాడుకుంది. బ్యాంకుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు రాలేవని సాకులు మొదలు పెట్టింది. ఐదు విడతల్లో చెల్లిస్తామంది. రుణాలకు కూడా రైతు సాధికారిక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. సర్కార్ కార్పొరేషన్‌కు చెల్లిస్తే కార్పొరేషన్ బ్యాంక్‌లకు చెల్లిస్తుందన్నమాట. తొలివిడతగా 5వేల కోట్ల రూపాయలు ఇస్తానంది. ఐదు విడతలుగా రుణాలకు బాండ్లను ఇస్తామంది. విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగలేదు. ఈ జాప్యం పుణ్యమా అని వల్ల రైతులకు ఈసారి పంట భీమా పోయింది. సర్కారు కడుతుందో లేదో తెలియక తీసుకున్న రుణాలపై వడ్డీలు పెరుగుతుంటే సీమాంధ్ర రైతు గందరగోళంలో ఉన్నాడు. బ్యాంకుల నుంచి బకాయి కట్టమని నోటీసులు వస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది పరిస్థితి.


వాగ్దానాలకు మంగళం...!


టీడీపీ ఎన్నికల్లో గెలవడానికి కుప్పలు తెప్పులు వాగ్దానాలు చేసింది. అవన్నీ ఎన్నికల ప్రచారంలో బాబు పదేపదే ప్రకటించారు. రైతులకు పంట రుణమాఫీ, డ్వాక్రా పొదుపు సంఘాలకు రుణాల మాఫీ, నిరుద్యోగులకు భృతి, ఇంటికో ఉద్యోగం, రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ , ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, బెల్ట్ షాపుల రద్దు , రైతుల వారీగా పంటభీమా, పరిశ్రమలకు, ఇళ్లకు 24గంటల విద్యుత్‌సరఫరా, పేద బ్రాహ్మణులకు ఇండ్లు , 

పేపర్ బాయ్‌లు, ఫుట్‌పాత్ దుకాణదారులకు వడ్డీలేని ద్విచక్ర వాహన రుణం చంద్రబాబునాయుడు ఇచ్చిన హమీలలో ప్రధానమైనవి. మరో అంశం ఇంటికో ఉద్యోగం. ఇలా ఇస్తామంటే ఎలా సాధ్యమని నాయకులు నన్ను తప్పుపడుతున్నారు. ఎందుకు రావు? ..బాగా చదివితే పరిశ్రమల స్థాపన జరిగితే అని చిత్తూరు జిల్లా ప్రచారసభల్లో చంద్రబాబు సమర్థించుకున్నారు. కానీ తొలిసంతకాల్లోనే దాన్ని వదిలేశారు. ఆ తర్వాత కూడా పొరబాటున ఆయన కానీ ఆయన పార్టీ వారు గానీ ఆ ఊసే ఎత్తడం లేదు. 


డిమాండ్ లేని చోట్ల 24 గంటల విద్యుత్..


కేంద్రం సాయంతో 24గంటల విద్యుత్‌ను ఇస్తామన్నారు.ఏపీని రోల్‌మోడల్‌గా చేస్తామన్నారు. రాష్ట్రమంతా ఇస్తారేమోననుకుంటే అది పెద్దగా విద్యుత్ డిమాండ్ లేని కొన్ని పట్టణాలకు మాత్రమే పరిమితమైంది. ఎక్కడా అమలు జరగడం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ దాదాపు 100 గ్రామాలలో అసలు విద్యుత్‌వెలుగులు ప్రసరించడం లేదని సమాచారం. 

papపింఛన్లు గాయబ్...


తొలిసంతకంలో వృద్ధులకు, వికలాంగులకు పెంచిన ఫించన్లను అక్టోబర్ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. వృద్ధులకు వేయి రూపాయలు, వికలాంగులకు 1500 పెంచినట్లు ప్రకటించారు. ఫించన్లను జారీ చేస్తున్నామని సర్కార్ ప్రకటించినా చాలా ప్రాంతాలలో అమలు కాలేదు. ఫించన్లు పొందాల్సిన వారు 47 లక్షలుంటే వారిని 5 లక్షలకు తగ్గించినట్లు ఆరోపణలున్నాయి. వృద్ధులకు, వికలాంగులకు చెల్లించాల్సిన 3,700కోట్ల మొత్తాన్ని రెండువేల కోట్లకు తగ్గించినట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.


తప్పదారి పట్టించేందుకే వివాదాలు..


ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక సతమతమవుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు కావాలని తెలంగాణతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారన్న వాదన వినిపిపస్తున్నది. వాస్తవానికి పక్కన తెలంగాణ రాష్ట్రం లేకపోయినా.. టీఆర్‌ఎస్ వాగ్దానలు చిత్తశుద్ధితో అమలు చేయకపోయినా చంద్రబాబు ఏ ఒక్క వాగ్దానం అమలుకు కూడా పూనుకునే వారే కాదని అక్కడి మేధావులు అంటున్నారు. టీఆర్‌ఎస్ సర్కారు పనులు బాబుకు సంకటంగా మారాయని ప్రజలు తనను నిలదీస్తారనే భయం ఏర్పడిందని అంటున్నారు. అందుకే కావాలని వివాదాలు రేపుతున్నారన్న వాదన ఉంది. ఇరు ప్రాంతాల మధ్య ద్వేషభావం రగిలిస్తే హామీలనుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ఆయన వ్యూహంగా ఉందంటున్నారు. 

అందులో భాగంగానే తెలంగాణలో సమస్యలను ఆయన ఆయన ఆస్థాన పత్రికలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు. అడుగడుగునా తెలంగాణ సర్కారుకు అడ్డంకులు సృష్టించేందుకే వారు ప్రయత్నిస్తున్నారు. రుణమాఫీ మెట్రోరైలు నుంచి ప్రతి వివాదాన్ని పనిగట్టుకుని రెచ్చగొడుతున్నారని వారు గుర్తు చేశారు. 


ప్రజల్లో అసహనం..


ఎన్నికల్లో బోలెడు వరాలు ప్రకటించి అధికారపగ్గాలు చేపట్టిన బాబు ఒక్కో హామీ విస్మరిస్తూ రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ వర్గాల్లో అసహనం పెరుగుతున్నది. ఎన్నికల ముందు ఎన్నో ఆశలు రేపిన చంద్రబాబు పాలనకు వచ్చే సరికి చతికిల బడ్డారు. పైపెచ్చు తెలంగాణలో ప్రభుత్వం ప్రగతి కార్యక్రమాల్లో దూసుకుపోతుంటే ఇక్కడ పాలన పట్టాలకే ఎక్కలేదనే అసంతృప్తి పెరుగుతున్నది. రాజధాని విషయంలో జరిగిన దాదాగిరి మీద రాయలసీమలో ఆవేదన పెరుగుతున్నది. 

ప్రకృతి వైపరీత్యాల సమయంలో పత్రికల్లో ప్రచారాలే తప్ప సహాయం అందక బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త రాష్ట్రం పాలనానుభవం గల వాళ్ల చేతిలో ఉండాలని ఎన్నుకుంటే పాత రీతిలోనే పైపై పూతలతోనే బండి లాగుతున్నారని మేధావులు విమర్శిస్తున్నారు. ఆరునెలల్లో రాజధాని కడతానని చెప్పి కనీసం ఏవైపు కడతారో కూడా ఇంత వరకూ తేల్చకపోవడమే ఏపీ సర్కారు పనితీరుకు నిదర్శనంగా నిలిచిందని అక్కడి మేధావులు అంటున్నారు. 

ఇవి చాలవన్నట్టు భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకోకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిపోటి మాటలతో రెచ్చగొట్టడం ఇరు ప్రాంతాల మధ్య ద్వేషాన్ని రాజేయడాన్నీ వారు తూర్పారపడుతున్నారు. ఎప్పటికైనా సీమాంధ్రప్రజలు తెలంగాణ మీద ఆధారపడే వారే తప్ప తెలంగాణకు సీమాంధ్రతో పని ఉండదని అంటున్నారు. తాత్కాలికంగా విద్యుత్తు, నీటి విషయాల్లో సీమాంధ్రతో అవసరాలున్నా, ఆ మేరకు పైచేయిగా కనిపించినా ఒకసారి కేంద్రం లేదా ట్రిబ్యునల్ కేటాయింపులు నిర్దారిస్తే ఆ తర్వాత తెలంగాణ ఏపీ వైపు కన్నెత్తి చూసే అవసరమే ఉండదని అంటున్నారు. ఆస్తులు వ్యాపారాలు బంధుత్వాల కారణంగా ఏపీకే ఆ అవసరం ఉంటుందని అంటున్నారు. పదేళ్ల తర్వాత రాజధాని విద్య వైద్యంతో సహా ఏ అంశంలోనూ ఏపీకి హక్కులు మిగలవని గుర్తు చేస్తున్నారు. 


తెలంగాణలో అమలు..


తెలంగాణలోనూ రుణమాఫీ ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకుంది. ఏపీలాగే ఇక్కడా మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ కంగారు పడి రెండు లక్షల అంటూ వేలం పాట పాడింది. కానీ టీఆర్‌ఎస్ నిజాయితీగా లక్ష రూపాయల వరకూ మాఫీ అని స్థిరంగా నిలబడింది. అంతే తప్ప పోటీకి పోయి పాటను పెంచలేదు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను విశ్వసించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వమూ ప్రజల విశ్వాసాన్ని నిలుపుకుంది. రైతు రుణాల మాఫీ అమలు చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇవాళ ఏపీ రాజకీయ వర్గాల్లో చెప్పుకునేదేమంటే తెలంగాణలో మాఫీ జరక్కుంటే ఏపీలోనూ చంద్రబాబు ఎగ్గొట్టే వాడని..


కమిటీలతో, షరతులతో కాలయాపన ..


సమస్యను నాన్చాలన్నా వాయిదా వేయాలన్నా ప్రభుత్వాలు ఆశ్రయించేది కమిటీలనే. ఆ ఎత్తుగడల్లో చంద్రబాబు ఆరితేరారు. రుణమాఫీపై తొలిసంతకం చేసిన బాబు మార్గదర్శకాల ఖరారు అంటూ నాబార్డు మాజీ ఛైర్మన్ కోటయ్య అధ్యక్షతన కమిటీ వేశారు. ఇబ్బంది లేకుండా రెండు నెలల గడిచాయి. ఆ తర్వాత ఆ కమిటీ మొత్తం పంటరుణాలు 87వేల కోట్లకు పైనే అని తేల్చింది. పాత మాటలన్నీ మరిచి లక్ష యాభైవేల రూపాయలలోపు పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. 

కుటుంబంలో ఒకరికే మాఫీ నిబంధన పుట్టించారు. అది కూడా పంటల వారీగా మాఫీమొత్తాన్ని నిర్ణయిస్తామనిచెప్పారు. వరికి 25వేలు. వేరుశనగకు 25వేలు అంటూ కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు. అవీ చాలక ఆధార్ ఉండి తీరాలన్నారు. అలవికాని షరతులతో రైతు పంటరుణాలను 40వేల కోట్లకు కుదించారు. చెల్లింపులు మాత్రం జరగలేదు. 


డ్వాక్రామహిళల పరిస్థితి దయనీయం..


డ్వాక్రా మహిళలకు పంగనామాలే మిగిలాయి. మొత్తం రుణాలను మాఫీ చేస్తామన్న బాబు సర్కార్ ప్లేటు ఫిరాయించి ఒక్కో డ్వాక్రా సంఘానికి లక్ష మాత్రమే అంది. అది కూడారుణమాఫీ కాదు వ్యాపార అభివృద్ధి అంది. అదికూడా 20 శాతం చొప్పున దశల వారీగా ఇస్తామంటోంది. ఇంతవరకు పైసా రాలేదు. 


ఎన్టీఆర్ సుజల స్రవంతి...ఎక్కడ...?


మిగతా వాటి విషయం ఎలా ఉన్నా కనీసం ముఖ్యమంత్రి చేసిన తొలిసంతకాలలో ఉన్న హామీలు కూడా అమలు జరగడం లేదు. ఎన్టీ ఆర్ సుజల స్రవంతి పథకం అందులో ఒకటి. రెండురూపాయలకే 20 లీటర్ల రక్షిత నీటినందిస్తామని ప్రకటించారు. దానికి ముహుర్తాల మీద ముహుర్తాలు పెడుతూ వాయిదా వేస్తున్నారు. జన్మభూమిలో భాగంగా కొన్ని చోట్ల నామమాత్రంగా ప్రారంభించినా అది అమలుకు నోచుకోలేదు. ఇంతవరకు ఎక్కడ నీటిని సరఫరా చేశారో చెప్పమని అక్కడి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.


ఉద్యోగులకు హామీలే మిగిలాయి..


ఉద్యోగులతో ఇకపై సఖ్యంగా ఉంటా అని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. పే రివిజన్, హెల్త్‌కార్డులు ఇస్తానన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఆ రెండు హామీలను అమలు చేసింది. ఏపీలో ప్రభుత్వ పరిశీలనలోనే ఆ అంశాలున్నట్టు కనిపించడం లేదు. అపుడపుడూ ఇస్తా చూస్తాం అనే హామీలు తప్ప. బెల్డ్ షాపుల రద్దు వాగ్దానం వైన్‌షాపులను సృష్టించి మరింత చేటు చేసిందని అంటున్నారు.

Saturday 30 August 2014

వినాయకుడి భూలోక యాత్ర -2


ప్రభూ, మరిచితిరా నేడు వినాయక చవితి. మనం ఉండ్రాళ్ళవేటలో భూలోకయాత్రకు వెల్లాల్సిన రోజు. మీరేమిటి తీరిగ్గా కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయారు?

మరువలేదు వినాయకా! పోయినసారి వినాయకచవిత సమయంలో తెలుగు రాష్ట్రంలో సమైక్యాంధ్రపేరుతో నానాయాగీ జరుగుతుండేది. అప్పుడు మనం సీమాంధ్ర జోలికి పోకుండా తెలంగాణ ప్రాంతం మాత్రం వెల్లి వచ్చాం. మరి ఇప్పుడు సంవత్సరం గడిచింది కదా, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలాఉంది, ఎక్కడికెలితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను. ఇంతకూ ఆఉద్యమం ఆగిపోయిందా? ఇప్పుడు రాష్ట్రం కలిసి ఉందా, విడిపోయిందా, అక్కడి పరిస్థితులెలా ఉన్నాయి? నీదగ్గరేమన్నా సమాచారం ఉందా మూషికా?

ఏముంది ప్రభూ! వీరి దొంగ ఉద్యమాలను పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్రాన్ని విభజించింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండూ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయాయి. ఎన్నికలు జరగడంతో కొత్తప్రభుత్వాలు వచ్చాయి. ఇక ఉద్యమం సంగతంటారా... మేము బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాం, సునామి సృష్టిస్తాం అంటూ ప్రగల్భాలు పలికినవారు కేంద్రం బిల్లును ఆమోదించగానే దెబ్బకు దిమ్మతిరిగి మన్నుతిన్నపాముల్లాగ పడిఉన్నారు. 

అలాగా. పోనీలే, సమైక్య ఉద్యమాన్ని నడిపినందుకు ఆనాయకులు ప్రజల మనసులను గెలుచుకునే ఉంటారుగా. వారి భవిష్యత్తుకు మాత్రం ఢోకా ఉండదులే.

అలా జరుగలేదు ప్రభూ. పైగా ప్రజల ఆమోదం లేని ఉద్యమాన్ని సొంతలాభాలకోసం తమపైన రుద్దారని ప్రజలు వారికి దిమ్మతిరిగేలా బుద్ధిచెప్పారు. సమైక్యసింహాలమని ఘర్జించిన వారెవరికీ అడ్రసు దొరక్కుండా చేశారు. సమైక్యాంధ్ర పార్టీ అంటూ ఒక కొత్త పార్టీ పెట్టిన మాజీముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏంచేస్తున్నాడో ఎవరికీ తెలియదు. పైగా విభజనకు మద్దతు ఇస్తూ లేఖ రాసిన పార్టీనీ, విభజన కోసం కేంద్రాన్ని నిలద్దీసిన పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీనీ గెలిపించి అక్కడి ప్రజలు ఈమేడిపండు సమైక్యవాదులకు బుద్దొచ్చేలా చేశారు.  

ఇప్పుడు విభజన జరిగిపోయింది కదా? ఇప్పుడు రెండు రాష్ట్రాలూ ఎలాగున్నాయి? అందరూ నాపుట్టినరోజును ఘనంగా పండగ చేసుకుంటున్నారా? 

తెలంగాణలో ప్రజలు తాము ఇన్నాళ్ళూ కలలుగన్న తమ రాష్ట్రం వచ్చినందుకు పండుగ ఘనంగా చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా మీవిగ్రహాలూ, ఉండ్రాల్లూ, లడ్డూలూ. సీమాంధ్రలో సామాన్య ప్రజలకు కలిసున్నా విడిపోయినా వచ్చేదిగానీ, పోయేదిగానీ ఏమీలేదని తెలుసు కాబట్టి అక్కడి ప్రజలు ఎప్పటిలాగే ఎవరికి తోచినరీతిలో వారు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల రికార్డ్ డాన్సులు అదిరిపోతున్నాయట.

అలాగా పోన్లే. ఇంతకూ కొత్త ప్రభుత్వాల పాలనలెలా ఉన్నాయి? 

తెలంగాణలో అధికారంలోకొచ్చిన తెలంగాణ పార్టీ దూసుకుపోతుంది ప్రభూ. అక్కడి ముఖ్యమంత్రి రోజుకొక కొత్త ఆలోచనతో ప్రజాక్షేమం గురించి ఆలోచిస్తూ పాలన చేస్తున్నాడు. మచ్చుకు కొన్ని మంచి నిర్ణయాలు: 
- సమైక్య రాష్ట్రంలో అనుమతులు తెచ్చుకున్న పనికిమాలిన నూట ఎనభై ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులను రద్దు చేశాడు. తద్వారా ఫీజు మాఫీ పేరుతో జరుగుతున్న ప్రజాధనం లూటీని ఆపేసి కేవలం అర్హత కలిగిన కాలేజీలకు మాత్రం అనుమతినిచ్చాడు. 
- ఇటీవలే విప్లవాత్మకంగా ఒక్కరోజు సర్వే నిర్వహించి ప్రజాధనం పక్కదారులు పట్టకుండా ఆపేప్రయత్నం చేస్తున్నాడు.
- ఇల్లపంపిణీలో అక్రమాలపై దర్యాప్తు చేయిస్తున్నాడూ
- క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాడు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ప్రైజుమనీని ఇప్పుడు వెంటనే ఇప్పించాడు.
- కబ్జాలపై కొరడా ఝులిపించాడు.

అయితే అంతా బాగున్నా అక్కడ కరెంటు కోతలు మాత్రం విపరీతంగా ఉన్నాయి ప్రభూ. గత ప్రభుత్వం చేసిన పాపపు నిర్ణయాల కారణంగా ఇక్కడ కరెంటు ఉత్పత్తి తక్కువ, వినిమయం ఎక్కువ. విభజన తరువాత గడ్డుపరిస్థితే వచ్చింది ప్రభూ. పక్క రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉన్నా, కోతలకు కారణం తమ గత విధానాలే అయినా సీమాంధ్ర రాష్ట్రం మాత్రం సాయం చేయడం లేదు సరికదా,  పీపీయేల రద్దు, ప్లాంటు మైంటనెన్సు పేరుతో రోజుకో కుట్రపన్నుతూ తెలంగాణప్రజల ఉసురు పోసుకుంటున్నారు. పైగా తెలంగాణలో కూడా రాబోయే కాలంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్నాడు ప్రభూ.

అలాగా! వీడెవడో సాడిస్టులాగున్నాడు. మరి సీమాంధ్ర ముఖ్యమంత్రి పార్టీకి చెందిన తెలంగాణ నాయకులైనా అడగొచ్చు గదా?

అంత ధైర్యమే వారికుంటే అసలు విభజనే అవసరం ఉండేది కాదు ప్రభూ. ఈసీమాంధ్ర పార్టీలు ఎప్పుడూ తమ మోచేతి నీటిని తాగేవారికే తెలంగాణలో నాయకత్వం ఇస్తారు.

ఇంతకూ మూషికా, సీమాంధ్ర రాష్ట్రంలో పాలన ఎలాగుంది? 

ఎలాగుంటుంది ప్రభూ! అధికారంలోకి రావడానికి అక్కడి ముఖ్యమంత్రి అడ్డమైన వాగ్దానాలన్నీ చేశాడు. ఇప్పుడు వాటిని తీర్చలేక జుట్టు పీక్కుంటునాడు. అసలే లోటు బడ్జెట్, ఆపైన ఆచరణ సాధ్యం కాని హామీలు. అందుకే ఆముఖ్యమంత్రి కుట్రలు తప్ప పాలన చేయడంలేదు. ఇప్పుడు ఈరాష్ట్రానికి కొత్త రాజధాని అవసరం ఉంది. తమ కులం వారు బాగా ఉండే ప్రాంతమూ, తమ పార్టీ నేతలకు భూములున్న ప్రాంతంలో రాజధాని కావాలని ఇతని పంతం. కేంద్రకమిటీనేమో అక్కడొద్దంటుంది. 

ప్రతిపక్షనేత ఏం చేస్తున్నాడు? అసెంబ్లీలో ఈవిషయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడా?

లేదు ప్రభూ! అసెంబ్లీలో తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, హత్యలు చేశారు అంటూ అసెంబ్లిని స్థంభంపజేస్తున్నాడు. ప్రజల సమస్యలగురించి మాత్రం ఒక్కమాట కూడా మాట్ల్లాడడం లేదు. ఇదే మంచిదనుకొని అధికార పక్షం వీరి తండ్రిగారి పాలనలో జరిగిన హత్యలను లేవనెత్తుతుంది. దొందు దొందే. ఎక్కడైనా కర్ర ఉన్నవాడిదే బర్రె కానీ సీమాంధ్రలో మాత్రం బాంబులు, తుపాకులు ఉన్నవాడిదే అధికారం కనుక ఈరెండు పార్టీల నాయకులూ హత్యారాజకీయాలద్వారా పైకొచ్చినవారే. వీరి మధ్య నలిగిపోతున్నది సామాన్య ప్రజలే. ఎలాగోలా తెలంగాణ ప్రజలు మాత్రం  వీళ్ళబారినుండి తప్పించుకున్నారు.  

చూడబోతే ఇప్పట్లో సీమాంధ్ర బాగుపడేట్టు లేదు గానీ ఈసారికూడా మనం తెలంగాణ వెల్లి ఉండ్రాల్లు తిందాం పద మూషికా. పనిలో పనిగా విద్యత్ సమస్య నుంచి తొందరగా బయటపడాలని ఆరాష్ట్రాన్ని ఆశీర్వదిద్దాం!!

చిత్తం ప్రభూ!  Sunday 25 May 2014

ఎవరు తాగుబోతులు?(సాక్షి రిపోర్ట్)

Sakshi | Updated: May 25, 2014 02:18 (IST)
తెలంగాణలో ‘కిక్కు’ తక్కువే!
ఐఎంఎల్ విక్రయాలు సీమాంధ్రలోనే అధికం
సీమాంధ్రలో రూ.10,972 కోట్ల మద్యం విక్రయాలు
గ్రేటర్‌ను మినహాయిస్తే తెలంగాణ జిల్లాల్లో రూ.5 వేల కోట్ల అమ్మకాలే
బీర్ల అమ్మకాల్లో మాత్రం తెలంగాణ టాప్
ఏకంగా 2.75 కోట్ల కేసుల బీర్లు అమ్మకాలు
2013-14 ఏపీబీసీఎల్ తేల్చిన లెక్కలివీ
 
 సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలవారీగా జరిగిన మద్యం విక్రయూలపై ఏపీబీసీఎల్ తేల్చిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎక్సైజ్, మద్యం విక్రయూలపై లభించే వ్యాట్ ఆదాయూల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చునని తేలుతోంది. ఈ మద్యం విక్రయాల్లోనూ కొన్ని ఆసక్తికరమైన విశేషాలు కనిపిస్తున్నాయి. ఐఎంఎల్ (ఇండియున్ మేడ్ లిక్కర్) విక్రయూలు సీవూంధ్రలో అధికంగా ఉండగా... బీర్ల అమ్మకాల్లో మాత్రం తెలంగాణ టాప్‌లో ఉంది. ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీర్ల అమ్మకాలు గణనీయుంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా కోటి కేసుల బీరును లాగించేశారు! భారత తయారీ మద్యం (ఐఎంఎల్) మూడు రకాలుగా తయారవుతుంది.
 
 బాందీ, విస్కీ మొదలైన ఈ బ్రాండ్లలో ఆర్డినరీ, మీడియం, ప్రీమియం విభాగాలుగా తయారవుతుంది. మూడు రకాల లిక్కర్ అమ్మకాల్లోనూ తెలంగాణ కన్నా సీమాంధ్ర ముం దుంది. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 47.11 లక్షల మద్యం కేసులు అమ్ముడైతే, రెండు, మూడు స్థానాల్లో హైదరాబాద్, కరీంనగర్ నిలిచాయి. సీమాంధ్రలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 29.84 లక్షల ఐఎంఎల్ పెట్టెలు అమ్ముడయ్యాయి. మరో ఏడు జిల్లాల్లో 25 లక్షల నుంచి 29 లక్షల చొప్పున మద్యం పెట్టెలు విక్రయించడం గమనార్హం. మొత్తంగా తీసుకుంటే రెండు ప్రాంతాల్లో కలిపి 4.74 కోట్ల ఐఎంఎల్ అమ్మకాలు ఉంటే, అందులో సీమాంధ్రలో 2.83 కోట్లు, తెలంగాణలోని 8 జిల్లాల్లో 1.23 కోట్లు, హైదరాబాద్, రంగారెడ్డిలో 76.64 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో అత్యల్ప ఐఎంఎల్ విక్రయాలు సాగాయి.
 
 బీరులో తెలంగాణ జోరు..
 
 వేసవిలోనే ఎక్కువగా సాగే బీర్ల అమ్మకాలు గ్రేటర్ సహా తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. తెలంగాణలో 2.75 కోట్ల బీర్ల పెట్టెలు (ఒక్కో పెట్టెకు 12 చొప్పున) విక్రయించగా, సీమాంధ్రలో ఆ సంఖ్య 1.65 కోట్లకే పరిమితమైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే కోటికిపైగా పెట్టెల బీర్లు విక్రయించడం గమనార్హం. తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత బీర్ల అమ్మకాల్లో కరీంనగర్ ముందుండగా, సీమాంధ్రలో వైజాగ్ 21.93 లక్షల పెట్టెల విక్రయాలతో ముందుంది. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 7 లక్షల బీర్ల పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి.

మరికొన్ని ముఖ్యాంశాలు..
 
 ఏడాదిలో రూ.వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు సాగిన జిల్లాలు తెలంగాణలో రంగారెడ్డి (రూ.2,403.12 కోట్లు), హైదరాబాద్(రూ.1,533.82 కోట్లు), కరీంనగర్(రూ.1,064.17 కోట్లు) ఉన్నాయి. సీమాంధ్రలో విశాఖపట్నం(రూ.1,194.66 కోట్లు), తూర్పు గోదావరి(రూ.1,114.62 కోట్లు), గుంటూరు(రూ.1,102.16కోట్లు),  కృష్ణా(రూ.1,068.15 కోట్లు), చిత్తూరు(రూ.1,001.36 కోట్లు) ఉన్నాయి.
 
 రూ.474.98 కోట్లతో అత్యల్ప మద్యం విక్రయాలు సాగిన జిల్లాగా నిజామాబాద్ నిలిచింది.
 
  2012- 13 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే తరహాలో విక్రయాలు సాగాయి. ఆ సంవత్సరం సీమాంధ్రలో రూ.9,534.58 కోట్ల విక్రయాలు జరగ్గా.. తెలంగాణలో 8,575 .65 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ.3,500 కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే నికరంగా తెలంగాణలో 2012-13లో జరిగిన మద్యం విక్రయాలు రూ.5 వేల కోట్ల పైచిలుకు మాత్రమే.

Sunday 18 May 2014

పవన్ పార్టీ అంతా డ్రామాయేనా?ఒక అయిదారు నెలలకిందటివరకూ సీమాంధ్రలో ఏసర్వే చూసినా జగన్‌దే గెలుపని తేల్చింది. జగన్ కూడా మితిమీరిన ఆత్మ విశ్వాసంతో తానే గెలుస్తానని అనుకున్నాడు. అయితే చివరికి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబుదే పైచేయి అయింది. ఇందుకు చంద్రబాబు కలిసొచ్చిన రెండు అంశాలు ఒకటి దేశమంతటా మోడి గాలి వీస్తున్న తరుణంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కాగా రెండోది పవన్ కల్యాన్ ద్వారా కలిసొచ్చిన కాపు వోటు బ్యాంకు.

సీమాంధ్రలో ఎన్నికల ఫలితాలు మూడు అగ్రకులాల చుట్టూనే తిరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో తెదేపా కమ్మల పార్టీ కాగా జగన్‌కు రెడ్డి, దళిత క్రిస్టియన్ల మద్దతు ఉన్నది. కమ్మలకంటే దళిత క్రిస్టియన్లు కలిపి ఎక్కువ వోట్లు ఉంటాయి కాబట్టి నిన్నమొన్నటిదాకా జగన్‌దే పైచేయిగా ఉంది. ఎప్పుడైతే కాపు వోట్లు కూడా కలిసొచ్చాయో అప్పుడు సమీకరణం తారుమారయింది.

క్రితంసారి ఎన్నికల్లో కాపులు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి మద్దతు ఇచ్చారు. ఈసారి చిరంజీవి కాంగ్రేసులో ఉన్నాడూ కనుక కాపులు కాంగ్రేసుకు వోటువేయాల్సింది. కానీ కాంగ్రేసు గెలుస్తుందని చిరంజీవి సహా ఎవ్వరికీ నమ్మకం లేదు కాబట్టి కాపులు జగన్ వైపు ఉండటమే బెటరనుకునారు. ఎప్పుడైతే పవన్ జనసేన పార్టీ అంటూ పెట్టి ఎండీయేకి మద్దతు ఇచ్చాడో అప్పుడు కొందరు ఇటువైపు తిరిగారు.

అయితే ఇప్పుడొస్తున్న సందేహం పవన్ కళ్యాన్ పార్టీ పెట్టినందున నిజంగా చిరంజీవి ఫామిలీ రాజకీయంగా విడిపోయిందా లేక అంతా ఉత్తుత్తి డ్రామానా అని. బహుషా చిరంజీవి కూడా ఊహించి ఉంటాడు.."ఎలాగూ కాంగ్రేస్ గెలిచేది లేదు. కాపులంతా కాంగ్రేస్‌కు వోటు వేస్తే అది జగన్‌కే లాభం. దానిబదులు టీడీపీకి వోటు వేస్తే జగన్ను వోడించొచ్చు. కానీ కాంగ్రేస్లో ఉండి అలా చేయమని చెప్పే ధైర్యం చిరంజీవికి లేదు. పోనీ తానే పార్టీ మారుదామన్నా అప్పుడే రెండు పార్టీలు మార్చిన చిరంజీవికి మరో పార్టీ మార్చే ధైర్యం లేదు. అందుకే బహుషా చిరంజీవి తమ్ముడు పవన్ను ముందు పెట్టి కాపు వోట్లు టీడీపీకి వేయించి ఉంటాడు. ఏమో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.  

Thursday 15 May 2014

గజదొంగ, మోసగాడుఊర్లో రెండే సినిమా హాళ్ళున్నాయి. రెండిట్లో ఒకదాంట్లో గజదొంగ సినిమా, ఇంకో దాంట్లో మోసాగడు సినిమా నడుస్తుంటే సినిమాకెల్దామనుకున్న ప్రేక్షక మహానుభావుడు ఏసినిమాకు వెలతాడు? రెండిట్లో ఏదో ఒకదానికి వెల్లాలి. రెండింటికీ వెల్లకుండా ఇంట్లో కూచుంటే బోరు తప్ప మరో ఫలితం లేదు. రెండిట్లో దేనికి వెల్లాలంటే ఏసినిమా మన అభిమాన హీరో నటించిందయితే దానికెలతాడు. అందులో హీరోలిద్దరి కులాలు వేర్వేరు అయ్యుంటే కొందరు వారి వారి కులాలను బట్టికూడా ఏసినిమాకెల్లాలో నిర్ణయించుకోవచ్చు.

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర వోటరు పరిస్థితి ఇది. ఉన్న రెండూ పార్టీల్లో ఏదో ఒకదానికి వెయ్యాల్సిందే. మిగతా పార్టీలకు ఎలాగూ హెలిచే అవకాశమే లేదు. నెగ్గబోయేది గజదొంగా, మోసగాడా అనేది తెలియబోయేది ఇంకొన్ని గంటల్లోనే.

Thursday 20 February 2014

అప్పుడే ఒప్పుకుని ఉంటే!!


చివరికి అనివార్యమైన రాష్ట్ర విభజన జరిగిపోతుంది. తెలంగాణ ప్రజల అరవై ఏళ్ళ కళ సాకారం కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు.

అలాగే సీమాంధ్ర ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు. సీమాంధ్ర ప్రజలకు ఈవిభజన వలన ఒక అస్తిత్వం వచ్చింది. ఇకనుంచి సీమాంధ్రకు మాత్రమే లాభించే ఏవిషయాన్ని కూడా తెలుగుజాతికి లాభంగా చెప్పుకుని తమను తము మోసం చేసుకోనక్కర్లేదు, సీమాంధ్రకు లాభం అని చెప్పుకోవచ్చు. ఇకనుంచైనా తమ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టుకోవచ్చు. విభజన జరిగేవరకూ ఈసమస్య రగులుతూనే ఉంటుంది కాబట్టి సమస్య పరిష్కారం అందరికీ మంచిదే. 
   
ఈవిభజన జరిగిన విధానం సీమాంధ్రకు అన్యాయం జరిగేట్లు ఉంది, బిల్లును తమపైకి బుల్‌డోజు చేశారు అని బాధపడేవారు ఇలాంటి పరిస్థితి రావడానికి తమనేతలే కారణమని తెలుసుకోవాలి. బిల్లులో సీమాంద్ర కోరికలు పూర్తిగా తీరలేదు అనుకునేవారు తెలంగాణప్రజల కోరికలుకూడా పూర్తిగా తీరలేదని గ్రహించాలి. ఉమ్మడి రాజధాని, ఉద్యోగులు పంపిణీ విధానం, విద్యాసంస్థల్లో ప్రవేశార్హతలు లాంటి పలు విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. అలాగే పోలవరంకు తెలంగాణ అంగీకారం చేసినట్లు ఉన్న క్లాజు, పోలవరంకోసం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపి గిరిజనులను నిట్టనిలవునా ముంచడం లాంటివి అస్సలు బాగోలేవు. కాకపోతే పంపకాల్లో అన్నీ అనుకూలంగా ఉండాలనుకుంటే కుదరదు, పట్టువిడుపులు అవసరం కాబట్టి తెలంగాణ నేతలు ఇవి అన్యాయం అని తెలిసీ ఒప్పుకోవడం జరిగింది. 

అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది 2009లోనే యూపీయే ప్రభుత్వం తెలంగాణను ప్రకటించడం జరిగితే సీమాంధ్రలో పోటీ ఉద్యమం లేవదీసి విభజనను ఇన్నిరోజులు ఆపడం వలన సీమాంధ్ర ప్రాంత ప్రజలు పొందిన లాభమేమీ లేదు. పైగా అనేక నష్టాలు జరిగాయి.

రెండువేలతొమ్మిదిలోనే విభజన జరిగిఉంటే అప్పుడు సీమాంధ్ర ఎంపీల మద్దతు యూపీయేకు అవసరమైన తరుణంలో సీమాంధ్ర ఇంకాస్త గట్టిగా తమ ప్రాంత ప్రజల అవసరాలగురించి నెగోషియేట్ చేసే అవకాశం ఉండేది. దానివల్ల సీమాంధ్రకు లాభాలు బాగానే జరిగేవనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆఖరు నిముషంలో జరిగిన విభజన వలన సీమాంధ్ర ఎంపీల మద్దతు ఎవరికీ అవసరంలేని సమయంలో ఎన్ని డ్రామాలు చేసినా ఎలా తుస్సుమన్నాయో చూశాం. బ్రహ్మాస్త్రాలన్నీ తోకపటాకుల్లా తుస్సుమన్నాయి తప్ప పేలలేదు.

ఈమూడేల్లలో సీమాంధ్ర రాజధాని నిర్ణయం జరగడమేకాక షుమారు కావల్సిన ఇంఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తయేది.  ఎవరి బడ్జెట్ వారేసుకుని ఎవరి ప్రాంత అభివృద్ధిని వారు చూసుకునేవారు. సీమాంధ్రకు కేంద్రం ప్రతిపాదించిన IIT,IIM లాంటివాటిలో కొన్నైనా ఈపాటికి పూర్తయేవి. అన్నివిధాలుగా సీమాంధ్ర ప్రజలకు విభజన మూడేళ్ళకిందట జరిగిఉంటే లాభం అధికంగా ఉండేది. 

అయితే మూడేళ్ళు ఈవ్యవహారాన్ని సాగదీయడం వలన లాభపడింది ఎవరు ఎంటే సీమాంధ్ర ముఖ్యమంత్రి, మంత్రులూ, ఎంపీలో ఇతర నేతలు. ఎలాగు విభజన జరిగిపోతుందని వీరికి ముందే తెలుసు కనుక తెలంగాణను సాధ్యమయినంత దోచుకున్నారు. జలయగ్నం కాంట్రాక్టులు, ఇతర సివిల్ కాంట్రాక్టుల్లో సీమాంధ్ర పొలిటికో బుజినెస్‌మెన్ అయిన ఎంపీలు కోట్లు దండుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి ఆఖరి వారంలో పెట్టిన సంతకాలద్వారానే కోట్లు చేతులు మారాయని వినికిడి, ఈమూడేళ్ళలోకూడా బాగానే వెనకేసి ఉంటాడు.
  
అప్పుడే విభజన జరిగి ఉంటే ఎందరో యువకుల ప్రాణాలు మిగిలి ఉండేవి, పోలీసుల లాఠీచార్జీల్లో దెబ్బలు తిని కాళ్ళిరగ్గొట్టుకునే బాధ తప్పేది, తెలంగాణ ప్రజలు కూడా మూడేళ్ళ స్వయంపాలన అనుభవించేవారు.

కనుక సీమాంధ్ర ప్రజలారా, మిమ్మల్ని ఇన్నిరోజులూ విభజన జరగనే జరగదు, మేము జరగనివ్వం అని చెప్పి మోసగించిన నేతలకు ఈఆలస్యం కోట్లు తెచ్చిపెడితే సామాన్యులైన మీకు మాత్రం నష్టమే జరిగింది.    సీమాంధ్ర నేతలు తాములేవదీసిన దొంగ ఉద్యమం, రాజీనామా నాటకాలతో సీమాంధ్ర ప్రజల కళ్ళళ్ళనే పొడిచారని ఇకనైనా గ్రహించాలి. 

ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవడం వలన తెలంగాణకు లాభం కూడా జరిగింది. తెలంగాణలో ప్రజలంతా ఒక్క నినాదంతో ఒక్కటయ్యారు. ఉద్యమం అన్ని వర్గాలను దగ్గర చేర్చింది. ప్రజల్లో పోరాట పటిమను నింపింది. రాష్ట్రావశ్యకత చిన్న పిల్లవాడిదగ్గరినుండి ముసలివాళ్ళందరికీ స్పష్టంగా అర్ధం అయింది. ప్రజాఉద్యమాలపట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఈస్పిరిట్ ఇలాగే కొనసాగితే తెలంగాణ ప్రజలు తమ చైతన్యంతో తమ రాష్ట్రాన్ని కుల, మత భేధాలు లేని ఒక చక్కని రాష్ట్రంగా తీర్చి దిద్దుకునే అవకాశం ఉంది. 


తెలంగాణ గెలిచింది, సమైక్యాంధ్ర కోల్పోయింది


తెలంగాణ ప్రజల ఉద్యమం ఫలించింది. తెలంగాణ రాష్ట్రం కళ నిజమయింది. అయితే గత నాలుగేళ్ళలో తెలంగాణ ఉద్యమకారులు సాధించిందేమిటి, సమైక్యాంధ్ర మద్దతుదారులు కోల్పోయింది ఏమిటి అని ఆలోచిస్తే చాలానే అది ఒక్క రాష్ట్రసాధన మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది.

తెలంగాణ ఉద్యమం ప్రజల్లో ఐక్యతను నింపింది. ఉద్యమం బీజేపీ దగరినుండి సీపీఐ, న్యూడెమాక్రసీ వరకూ అందరినీ ఒకేవేదికపై పనిచేసేలా చేసింది. యూనివర్సిటీల్లో కుల మతభేదాలు మరిచి అందరు కలిసికట్టుగా పోరాడారు. బీద, దళిత వర్గాలు ఉద్యమంలో ముందున్నారు.

తెలంగాన ఉద్యమం ప్రజల్లో న్యాయం గెలుస్తుందనే నమ్మకాన్ని మిగిల్చింది. ఉద్యమం మూలంగా ప్రజలు తమ చారిత్రక, సాంస్కృతిక మూలాల్లోకి వెల్లగలిగారు. తెలంగాణ పాట, డప్పు, బతుకమ్మ పునరుజ్జివనం పొందాయి.

తెలంగాణ కళాకారులకు ఆదరణ పెరిగింది, తెలంగాణ పల్లెల్లో చైతన్యం వచ్చింది. తెలంగాణ ఉద్యమం తమనుండి దాచబడిన తురేబాజ్‌ఖాన్, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డిలగురించి ప్రజలకు తెలియజేసింది. ఇప్పుడు ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజానీకానికి తమకు జరిగిన అన్యాయం లెక్కలతో సహా తెలిసింది. ఇది ఇప్పుడూ రాష్ట్రం ఏర్పడ్డాక తాము సాధించాల్సిన అభివృద్ధిని గుర్తుచేస్తుంది.

తెలంగాణ ఉద్యమం ప్రజలకు మంచి నాయకత్వాన్ని అందించింది. కేవలం రాజకీయపార్టీలు మాత్రమే కాక వివిధ రంగాలనుండి నాయకులు ఏర్పడగలిగారు.

మరి సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఉద్యమకారులకేం ఒరిగింది? ఉద్యమం ప్రజలను కులాలుగా విడదీసింది. దళితులు ఉద్యమానికి దూరంగా ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఉద్యమ నాయకత్వంకోసం పోటీ వచ్చింది. ఒక అగ్రవర్ణంపై ప్రజలకు వ్యతిరేకత ఏర్పడింది.

మొదట్నుంచీ సమైక్యాంధ్ర మద్దతుదారులు తెలంగాణ ప్రజలకు తెలంగాణ వస్తుందని చెప్పి నాయకత్వం మోసగిస్తుందని ప్రచారం చేసింది. కానీ చివరికి వారికి తమనాయకులే తాము విభజనను ఆపగలమని చెప్పి మోసగించారని అర్ధమయింది.

ఇప్పుడు కనీసం సీమాంధ్ర ప్రజలు తాము ఏరాజకీయపార్టీని సమర్ధించాలో కూడా తెలియని పరిస్థితి. ఉన్న ప్రతి రాజకీయపార్టీ కూడా విభజన నిర్ణయానికి ముందొకలాగ తరువాత ఇంకోలాగ మాట్లాడి మోసగించినవారే. ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే ముఖ్యమంత్రి పార్టి లక్ష్యం ఏమిటో కూడా తెలియదు.

ఇక సమైక్యాంధ్ర అనే నినాదంలో నిజాయితీ లేదని ఆనినాదాన్ని ఎత్తుకున్నవారందరికీ తెలుసు. ఒక ప్రాంతం వారి భాగస్వామ్యం లేకుండా కేవలం మరో ప్రాంతం కలిసి ఉండాల్సిందేనని బలవంతపెట్టడం, ఉద్యమం అంటే కేవలం అవతలి పక్ష నేతలను తిట్టడం, దిష్టిబొమ్మలు తగలబెట్టడం తప్ప సమైక్యాంధ్ర వలన ఎందుకు లాభమో తెలంగాణ ప్రజలకు చెప్పలేకపోయారు. వారికీ తెలుసు, సమైక్యతవలన తెలంగాణకు నష్టం తప్ప లాభం లేదని.


ఒక అబద్ధపు లక్ష్యాన్ని ఎంచుకుని, తమ హక్కుల సాధనకోసం కాక అవతలివారి హక్కులను ఆపడానికి మాత్రమే ఉద్యమం చేయబోయి చివరికి ఓటమి తరువాత కనీసం పోరాడిన సంతృప్తికూడా లేకుండా చేసుకున్నారు. 
సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలో నాయకత్వలేమిని స్పష్టంగా బయట పెట్టింది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పుకున్న కిరణ్, జగన్, బాబు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని తామే ఛాంపియన్లుగా చెప్పుకోవడానికి ప్రయత్నించారు. లగడపాటి, కావూరు , చిరంజీవి లాంటివారు చివరికి జోకర్లుగా మిగిలిపోయారు.