Monday, 19 December 2011

పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నది ఎవరు? (మూడవ భాగం)


అక్టోబర్ 30, 1952 నాడు మదరాసులో జరిగిన లా కాలేజి విద్యార్ధుల సభలో పలువురు ఆంధ్ర రాష్ట్ర నేతలు, మేధావులు పాల్గొన్నారు. ఆనాడు సభకు అధ్యక్షతవహించిన ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
“ఒక కొసన ఉన్న చెన్నపురి (మదరాసు) ఆంధ్ర రాష్ట్రనికిగాని, తమిళ రాష్ట్రానికిగానీ ముఖ్యపట్టణంగా పనికిరాదనీ, చెన్నపురి తమకు దూరం కాబట్టి తాము ఒరిస్సాలో చేరగలమని శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలవారు అనవచ్చునని కాబట్టి చెన్నపురి సమస్యను రాష్ట్ర నిర్మాణానికి ప్రతిబంధకం కానివ్వరాదని అన్నారు.
పొట్టి శ్రీరాములు దీక్ష కొనసాగినన్నాళ్ళూ ఆయన ప్రాణాలు రక్షించడానికి పాపం నార్ల గారు చేయని ప్రయత్నం లేదు. ఆనాడు ఆంధ్ర ప్రభ తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ గలిగిన పత్రిక. తన పత్రికలో రోజూ వార్తలు, కార్టూన్లు, సంపాదకీయాల ద్వారా ప్రకాశం వంటి ఆంధ్ర నాయకుల మూర్ఖపు, నిర్హేతుక వైఖరులను, ఫట్టుదలలను విమర్శించేవారు నార్ల వెంకటేశ్వరరావు గారు.
అయితే ఆంధ్ర రాష్ట్రోద్యమ నాయకులు మాత్రం ఎవరి హితోక్తులూ వినలేదు.
రోజులు గడుస్తున్నా, పొట్టిశ్రీరాములు ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతున్నా పట్టించుకోకుండా ఇటు ప్రకాశం పంతులు, అటు నీలం సంజీవరెడ్డిలకు తోడు దీక్ష వేదికగా తన ఇల్లును ఇచ్చిన బులుసు సాంబమూర్తి, ఇంతకు ముందొకసారి ఆంధ్ర రాష్ట్రం కొరకు దీక్షచేసి విరమించిన స్వామిసీతారాం – ఈ నలుగురూ వివిధ వేదికలపై మదరాసు నగరంపై వింతవింత వాదనలు చేయడం మొదలుపెట్టారు.
మచ్చుకు 30 అక్టోబర్, 1952 నాడు లా కాలేజీ విద్యార్ధుల సభలో నీలం సంజీవరెడ్డిగారు అన్న ఈ ఆకుకు, పోకకు అందని ఈ వ్యాఖ్యలు చూడండి.
“అపుడూ మదరాసుపై హక్కులు వదులుకున్నాం అని చెప్పాం, కానీ అది అరవలకు ఇస్తున్నామని అంగీకరించలేదు….మదరాసులో అరవలు ఎక్కువ ఉన్నారని ఒప్పుకోవచ్చు, కాని, అరవేతరులు అంతకన్న ఎక్కువ కనుక మదరాసును అరవలు కోరరాదు…మదరాసు అరవలకు, ఆంధ్రులకు ఉమ్మడిగానుంటే కష్టమేమిటి? మదరాసులో వారు చెప్పినట్లు అరవలు 80మంది ఉన్నా, 16గా ఉన్న ఆంద్రుల హక్కులు కాపాడడానికైనా, అది ఉమ్మడిగా ఉండాలి”
చూశారుగా, ఇది చూస్తే ఇప్పుడు సీమాంధ్ర నేతలు తెలంగాణపై చేసే అడ్డగోలు వాదనలు గుర్తుకురావట్లేదూ?
ఇటు ఆంధ్ర నేతలు, అటు తమిళ నేతలు మదరాసు నగరంపై సవాళ్లూ ప్రతిసవాళ్లూ విసురుకుంటూ, పొట్టి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటం చూసి, మదరాసు యువజన ఫెడరేషన్ కు చెందిన కేశవలాల్ తరవాది అనే గుజరాతి యువకుడు చేసిన ఈ హెచ్చరిక చూడండి.
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి)
6 నవంబర్, 1952 నాడు మదరాసు నగరంలో సమావేశమైన ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణమే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, మదరాసును ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది.
దీనికి సరిగ్గా వారం రోజుల ముందు తమిళ కాంగ్రెస్ పార్టీ మదరాసుపై తెలుగు వారికి ఎట్టి హక్కు లేదని తీర్మానం చేయడం గమనార్హం.
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి)
పొట్టి శ్రీరాములు గారి దీక్ష మొదలై దాదాపు నెలగడిచాక మదరాసులో ఆంధ్ర విద్యార్ధి విజ్ఞానసమితి వారి విజ్ఞానోత్సవం సభలో పాల్గొంటూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒక గొప్ప మాట చెప్పారు.
“ఇక మదరాసు సమస్య ఇటీవల వచ్చింది. దీనికోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే, పొలంగట్టు కోసం దావాలకు దిగి, ఖర్చులకోసం పొలం అమ్ముకున్నట్లవుతుంది. ఆంధ్ర రాష్ట్రం సంపాదించడం మన ప్రధాన సమస్యా లేక మదరాసు సంగతి తేల్చడం ప్రదాన సమస్యా? అని ఆలోచించాలి. మదరాసు గురించి మనవారు సూచిస్తున్న మూడు ప్రతిపాదనలతో మదరాసు ఆంధ్ర రాష్ట్రంలో భాగం కాదని రుజువవుతున్నది. మనదీ అనడానికి దమ్ములు లేక, చెరిసగం అని, ప్రత్యేక రాష్ట్రమని, అరవలకు పోరాదని అంటునారు, కనుక, వివాదం లేని ప్రాంతాలతో రాష్ట్రం తీసుకొని, తరువాత తక్కినవాటికై పోట్లాడాలని, నెహ్రూని లొంగదీయగల ఉద్యమం నేడు లేవదీయలి. దానికి విద్యార్ధులు పూనుకోవాలి”
డిసెంబర్ మొదటి తారీఖు కల్లా పొట్టి శ్రీరాములు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.
3వ తారీఖునాడు ఆచార్య ఎన్ జి రంగా, నల్లారెడ్డి నాయుడు, వి. రాజగోపాలరావు, ఎన్ శేషయ్యగార్లతో కూడిన నలుగురు పార్లమెంటు సభ్యుల బృందం వెంటనే నిర్వివాద ప్రాంతాలతో (మదరాసు లేకుండా) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడాలని ప్రధాని నెహ్రూకు ఒక లేఖ రాసింది.
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి)
పొట్టి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఆంధ్ర నాయకులంతా డిసెంబర్ 7 నాడు ఒక అత్యవసర అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సమావేశం జరిగేనాడు ఆంధ్రప్రభ ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావుగారు తన దినపత్రికలో ఆంధ్ర నాయకులు ఇలాగే జాగుచేస్తే పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడుకోవడం కష్టమని అత్యంత ఆవేదనతో ఇలా రాశారు:
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి)
కానీ కొండకు (మదరాసుకు) వెంట్రుక (పొట్టి శ్రీరాములు ప్రాణం) కట్టి లాగుతున్నాం, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది అన్న చందాన వ్యవహరించారు అప్పటి సీమాంధ్ర నాయకులు.
ఆనాటి సభలో ప్రకాశం పంతులు చాలా అన్యాయంగా ప్రవర్తించాడు. ఆద్యంతం నవ్వుతూ, చలోక్తులతో, జోకులేస్తూ ప్రసంగించాడు. దీక్ష మొదలుపెట్టాక తాను పొట్టి శ్రీరాములును ఒక్కసారి మాత్రమే కలిసానని చెప్పుకున్నాడు. ఆయన ప్రసంగంలో ఈ వాక్యం చూడండి:
“గత కొలది దినాలుగా ఆయన పరిస్థితి ప్రమాదంలో పడింది. ఏ క్షణంలో అయినా ఆయన ప్రాణం కాస్తా హరీ అనవచ్చు. అప్పుడు ఆంధ్ర దేశంలో, మద్రాసు నగరంలో ప్రజలలో ఉద్రేకం విపరీతంగా పెరిగిపోవడం తధ్యం”
పొట్టి శ్రీరాములు ప్రాణాల పట్ల ఆంధ్ర రాష్ట్రోద్యమ ముఖ్య నాయకుడిది ఎంత నేరపూరిత నిర్లక్ష్యమో చూశారా?
ఈ సభలో ప్రకాశంతో పాటు అనేక మంది ఆంధ్ర నాయకులు మళ్ళీ పాత పాటనే పాడారు. మదరాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, కుదరని పక్షంలో మదరాసును కేంద్రపాలిత ప్రాంతం చేసి ఉమ్మడి రాజధానిగా అన్నాఉంచాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాన్ని గౌతు లచ్చన్న వంటి కొంత మంది ఆంధ్ర నాయకులు, ముఖ్యంగా కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. సభలో ఇరు పక్షాలూ కేకలు వేసుకున్నారు. ప్రకాశం పంతులు, తరిమెల నాగిరెడ్డి అయితే వేదికపైనే పరస్పరం వాదనలకు దిగారు.
చివరికి వేదికను ఎక్కిన ప్రముఖ కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి మాట్లాడుతూ:
ఈ తీర్మానం కనుక ఆమోదిస్తే రాష్ట్ర ఏర్పాటు 50 సంవత్సరాలు వాయిదా పడుతుందని, ఈ తీర్మానం వల్ల రాష్ట్రమూ రాదు, శ్రీరాములు గారి ప్రాణమూ రక్షించడం సాధ్యం కాదన్నారు.
చివరికి మందబలంతో ప్రకాశం పంతులు వాదనే నెగ్గింది. ఆ సభలో అమోదం పొందిన తీర్మానం ఒకవిధంగా పొట్టి శ్రీరాములు మరణశాసనం!
డిసెంబర్ 9 నాడు స్టేట్ కౌన్సిల్ లో మాట్లాడుతూ నిర్వివాద ప్రాంతాలతో (మదరాసు లేకుండా) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాని నెహ్రూ ప్రకటించాడు.
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి)
అయినా ఆంధ్ర నాయకులు తమ మూర్ఖపు పట్టుదల విడువలేదు.
(ముగింపు రేపు)


2 comments:

  1. వాళ్ళ బుద్ది అప్పుడు ఇప్పుడు మరలేదన్నమాట
    Amazing work brother!!!
    Jai telangana.

    ReplyDelete

Your comment will be published after the approval.