Wednesday 29 October 2014

బూటకాల బాబు!

నేను రైతులకు రుణమాఫీ ప్రకటిస్తే సాధ్యం కాదంటున్నారు? వారు దోచుకోవడానికి లక్ష కోట్లు వస్తాయి. కానీ రైతులకు మాఫీ చేయడానికి రాదా? నేను ఆర్థిక శాస్త్రవేత్తను, నాకు అంతా తెలుసు. జగన్ ఏమి చదువుకున్నాడు? ఆయనకేం తెలుసు? గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 24న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్న మాటలివి.


babuసీను కట్ చేస్తే...


పాదయాత్ర సమయంలో ప్రజల బాధలను చూశా. రైతు రుణమాఫీ, డ్వాక్రా పొదుపుసంఘాల రుణమాఫీకి హామీ ఇచ్చా. అప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉంది. ఇప్పుడు వేరు. రాష్ట్రం విడిపోయింది. ఆంధప్రదేశ్ ఎక్కడ ఉందో.. ఎంత బడ్జెట్ ఉందో నాకే కాదు,ఎవరికీ తెలియదు మే 18న ఈనాడు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే చంద్రబాబు చెప్పిన మాట.విషయానికి వస్తే.. మే 16నాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అంటే ఫలితాలు వెలువడ్డ రెండోరోజే నాయుడుగారి టోన్ మారిపోయింది.

ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన రైతు రుణమాఫీ పథకం మీద బాబుగారు ప్లేటు ఫిరాయించేశారు. హామీ ఇచ్చినపుడు ఉమ్మడి రాష్ట్రం.. ఇపుడు వేరు పడింది కదా అనేది లాజిక్కు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..రాష్ట్రం మార్చి 1నే విడిపోయింది. రాష్ట్ర విభజన బిల్లు మీద ఆరోజే రాష్ట్రపతి సంతకం చేశారు. ఆ తర్వాతే ఎన్నికల ప్రకటన వచ్చింది. ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులూ చంద్రబాబు రుణమాఫీ పాట పాడారు. ఎలా సాధ్యమన్న కాంగ్రెస్, వైఎస్సార్సీపీతో పాటు రాజకీయ విశ్లేషకులను సైతం దబాయించారు.నైన్ ఇయర్స్ గవర్నమెంట్ అంటూ గొప్పలు చెప్పారు. బచ్చాగాళ్లు మీకు ఏం తెలుసన్నారు. విజడమ్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నారు. మొత్తానికి ఎన్నికల ఓడ దాటేశారు.

papaకేంద్ర మంత్రుల ముందు సంతకాల బిల్డప్..


గమ్మత్తేమిటంటే రూ. 30 కోట్లు ఖర్చు చేసి భారీ ఏర్పాట్లతో బాబుగారి పట్టాభిషేకం జరుపుకున్నారు. కేంద్ర మంత్రులందరినీ విమానాలు పెట్టి మరీ పిలిపించారు. వెంకయ్య పౌరోహిత్యంలో సాగిన ఆ పట్టాభిషేకంలో కాగితాలు తెప్పించి రైతు రుణ మాఫీ తొలి సంతకాలు గీకి పారేశారు. కేంద్రమంత్రులతో శభాష్ అనిపించుకున్నారు. కొలువు తీరాక తొండి మొదలైంది. శ్వేతపత్రాలు అన్నారు. కోటయ్య కమిటీ అన్నారు. అటు లాగా ఇటు లాగి చివరకి మొత్తం రుణాలన్నీ మాఫీ పైసా కట్టొద్దు 

అన్న పిలుపు నిచ్చిన నోటితోనే లక్షన్నరకు కుదించారు. 
అంతే రుణమాఫీ ఫైలు మూమెంట్ అక్కడితో ఫుల్‌స్టాప్. అంగుళం కదిలిన జాడ లేదు. ధారాళంగా కురిపించిన మిగిలిన హామీలకు ఆ సంబరమూ దక్కలేదు.


మాఫీ చేసింది...హామీలనే..!


నాలుగు నెలలు దాటింది. రుణమాఫీ జరిగింది లేదు. పైసా విదిల్చింది లేదు. దాదాపు దశాబ్ధం పాటు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు వాగ్ధానాలిచ్చేటప్పుడు ఆర్థికపరిస్థితి తెలియదా ? ఎన్నికల తర్వాత మాట ఎందుకు మారిందన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు ఈ నాటికి చంద్రబాబు నుంచి సరైన సమాధానం లేదు. తొలిసంతకానికి ముందు నుంచే బాబు వైఖరిలో మార్పు మొదలైంది. ఆశపడ్డ అధికార పీఠం దక్కింది, ఇంకెవరూ ఏం చేయలేరన్న ధీమా వచ్చేసింది. బేషరతు రుణాల మాఫీ అన్న నోటితోనే ఎక్కడా లేని షరతులు విధించారు. కోతల వాతలు మొదలు పెట్టారు. 


ఏం చెప్పారు? ఏం చేశారు?


చంద్రబాబు ప్రచారం రుణమాఫీ అంశమే ప్రధానంగా చోటు చేసుకుంది. రైతు రుణాలే కాదు.. డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ఈ రుణభారం మొత్తం లక్ష60వేల కోట్ల వరకు ఉంటుందని అప్పట్లోనే పలువురు రాజకీయవాదులు, పాత్రికేయులు కూడా వెల్లడించారు. అసలే రాష్ట్రం విడిపోయి ఆర్థికపరిస్థితి దిగజారి ఉండగా అంతమాఫీ అసాధ్యమని ప్రతిపక్షమంతా వాదించింది. కానీ తనకు రాజకీయ అనుభవం ఉందని చంద్రబాబు దబాయించారు. చేసి చూపుతానని సవాళ్లు చేశారు. కానీ అధికారంలోకి రాగానే అన్నీ తుంగలో తొక్కారు. ముందుగా శాఖల వారీగా శ్వేతపత్రాలు అన్నారు. బ్యాంకులే కవచంగా..


కమిటీతో రెండు నెలలు లాగిన ఏపీ సర్కారు ఈసారి బ్యాంకులను కవచంగా వాడుకుంది. బ్యాంకుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు రాలేవని సాకులు మొదలు పెట్టింది. ఐదు విడతల్లో చెల్లిస్తామంది. రుణాలకు కూడా రైతు సాధికారిక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. సర్కార్ కార్పొరేషన్‌కు చెల్లిస్తే కార్పొరేషన్ బ్యాంక్‌లకు చెల్లిస్తుందన్నమాట. తొలివిడతగా 5వేల కోట్ల రూపాయలు ఇస్తానంది. ఐదు విడతలుగా రుణాలకు బాండ్లను ఇస్తామంది. విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగలేదు. ఈ జాప్యం పుణ్యమా అని వల్ల రైతులకు ఈసారి పంట భీమా పోయింది. సర్కారు కడుతుందో లేదో తెలియక తీసుకున్న రుణాలపై వడ్డీలు పెరుగుతుంటే సీమాంధ్ర రైతు గందరగోళంలో ఉన్నాడు. బ్యాంకుల నుంచి బకాయి కట్టమని నోటీసులు వస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది పరిస్థితి.


వాగ్దానాలకు మంగళం...!


టీడీపీ ఎన్నికల్లో గెలవడానికి కుప్పలు తెప్పులు వాగ్దానాలు చేసింది. అవన్నీ ఎన్నికల ప్రచారంలో బాబు పదేపదే ప్రకటించారు. రైతులకు పంట రుణమాఫీ, డ్వాక్రా పొదుపు సంఘాలకు రుణాల మాఫీ, నిరుద్యోగులకు భృతి, ఇంటికో ఉద్యోగం, రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ , ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, బెల్ట్ షాపుల రద్దు , రైతుల వారీగా పంటభీమా, పరిశ్రమలకు, ఇళ్లకు 24గంటల విద్యుత్‌సరఫరా, పేద బ్రాహ్మణులకు ఇండ్లు , 

పేపర్ బాయ్‌లు, ఫుట్‌పాత్ దుకాణదారులకు వడ్డీలేని ద్విచక్ర వాహన రుణం చంద్రబాబునాయుడు ఇచ్చిన హమీలలో ప్రధానమైనవి. మరో అంశం ఇంటికో ఉద్యోగం. ఇలా ఇస్తామంటే ఎలా సాధ్యమని నాయకులు నన్ను తప్పుపడుతున్నారు. ఎందుకు రావు? ..బాగా చదివితే పరిశ్రమల స్థాపన జరిగితే అని చిత్తూరు జిల్లా ప్రచారసభల్లో చంద్రబాబు సమర్థించుకున్నారు. కానీ తొలిసంతకాల్లోనే దాన్ని వదిలేశారు. ఆ తర్వాత కూడా పొరబాటున ఆయన కానీ ఆయన పార్టీ వారు గానీ ఆ ఊసే ఎత్తడం లేదు. 


డిమాండ్ లేని చోట్ల 24 గంటల విద్యుత్..


కేంద్రం సాయంతో 24గంటల విద్యుత్‌ను ఇస్తామన్నారు.ఏపీని రోల్‌మోడల్‌గా చేస్తామన్నారు. రాష్ట్రమంతా ఇస్తారేమోననుకుంటే అది పెద్దగా విద్యుత్ డిమాండ్ లేని కొన్ని పట్టణాలకు మాత్రమే పరిమితమైంది. ఎక్కడా అమలు జరగడం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ దాదాపు 100 గ్రామాలలో అసలు విద్యుత్‌వెలుగులు ప్రసరించడం లేదని సమాచారం. 

papపింఛన్లు గాయబ్...


తొలిసంతకంలో వృద్ధులకు, వికలాంగులకు పెంచిన ఫించన్లను అక్టోబర్ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. వృద్ధులకు వేయి రూపాయలు, వికలాంగులకు 1500 పెంచినట్లు ప్రకటించారు. ఫించన్లను జారీ చేస్తున్నామని సర్కార్ ప్రకటించినా చాలా ప్రాంతాలలో అమలు కాలేదు. ఫించన్లు పొందాల్సిన వారు 47 లక్షలుంటే వారిని 5 లక్షలకు తగ్గించినట్లు ఆరోపణలున్నాయి. వృద్ధులకు, వికలాంగులకు చెల్లించాల్సిన 3,700కోట్ల మొత్తాన్ని రెండువేల కోట్లకు తగ్గించినట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.


తప్పదారి పట్టించేందుకే వివాదాలు..


ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక సతమతమవుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు కావాలని తెలంగాణతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారన్న వాదన వినిపిపస్తున్నది. వాస్తవానికి పక్కన తెలంగాణ రాష్ట్రం లేకపోయినా.. టీఆర్‌ఎస్ వాగ్దానలు చిత్తశుద్ధితో అమలు చేయకపోయినా చంద్రబాబు ఏ ఒక్క వాగ్దానం అమలుకు కూడా పూనుకునే వారే కాదని అక్కడి మేధావులు అంటున్నారు. టీఆర్‌ఎస్ సర్కారు పనులు బాబుకు సంకటంగా మారాయని ప్రజలు తనను నిలదీస్తారనే భయం ఏర్పడిందని అంటున్నారు. అందుకే కావాలని వివాదాలు రేపుతున్నారన్న వాదన ఉంది. ఇరు ప్రాంతాల మధ్య ద్వేషభావం రగిలిస్తే హామీలనుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ఆయన వ్యూహంగా ఉందంటున్నారు. 

అందులో భాగంగానే తెలంగాణలో సమస్యలను ఆయన ఆయన ఆస్థాన పత్రికలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు. అడుగడుగునా తెలంగాణ సర్కారుకు అడ్డంకులు సృష్టించేందుకే వారు ప్రయత్నిస్తున్నారు. రుణమాఫీ మెట్రోరైలు నుంచి ప్రతి వివాదాన్ని పనిగట్టుకుని రెచ్చగొడుతున్నారని వారు గుర్తు చేశారు. 


ప్రజల్లో అసహనం..


ఎన్నికల్లో బోలెడు వరాలు ప్రకటించి అధికారపగ్గాలు చేపట్టిన బాబు ఒక్కో హామీ విస్మరిస్తూ రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ వర్గాల్లో అసహనం పెరుగుతున్నది. ఎన్నికల ముందు ఎన్నో ఆశలు రేపిన చంద్రబాబు పాలనకు వచ్చే సరికి చతికిల బడ్డారు. పైపెచ్చు తెలంగాణలో ప్రభుత్వం ప్రగతి కార్యక్రమాల్లో దూసుకుపోతుంటే ఇక్కడ పాలన పట్టాలకే ఎక్కలేదనే అసంతృప్తి పెరుగుతున్నది. రాజధాని విషయంలో జరిగిన దాదాగిరి మీద రాయలసీమలో ఆవేదన పెరుగుతున్నది. 

ప్రకృతి వైపరీత్యాల సమయంలో పత్రికల్లో ప్రచారాలే తప్ప సహాయం అందక బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త రాష్ట్రం పాలనానుభవం గల వాళ్ల చేతిలో ఉండాలని ఎన్నుకుంటే పాత రీతిలోనే పైపై పూతలతోనే బండి లాగుతున్నారని మేధావులు విమర్శిస్తున్నారు. ఆరునెలల్లో రాజధాని కడతానని చెప్పి కనీసం ఏవైపు కడతారో కూడా ఇంత వరకూ తేల్చకపోవడమే ఏపీ సర్కారు పనితీరుకు నిదర్శనంగా నిలిచిందని అక్కడి మేధావులు అంటున్నారు. 

ఇవి చాలవన్నట్టు భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకోకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిపోటి మాటలతో రెచ్చగొట్టడం ఇరు ప్రాంతాల మధ్య ద్వేషాన్ని రాజేయడాన్నీ వారు తూర్పారపడుతున్నారు. ఎప్పటికైనా సీమాంధ్రప్రజలు తెలంగాణ మీద ఆధారపడే వారే తప్ప తెలంగాణకు సీమాంధ్రతో పని ఉండదని అంటున్నారు. తాత్కాలికంగా విద్యుత్తు, నీటి విషయాల్లో సీమాంధ్రతో అవసరాలున్నా, ఆ మేరకు పైచేయిగా కనిపించినా ఒకసారి కేంద్రం లేదా ట్రిబ్యునల్ కేటాయింపులు నిర్దారిస్తే ఆ తర్వాత తెలంగాణ ఏపీ వైపు కన్నెత్తి చూసే అవసరమే ఉండదని అంటున్నారు. ఆస్తులు వ్యాపారాలు బంధుత్వాల కారణంగా ఏపీకే ఆ అవసరం ఉంటుందని అంటున్నారు. పదేళ్ల తర్వాత రాజధాని విద్య వైద్యంతో సహా ఏ అంశంలోనూ ఏపీకి హక్కులు మిగలవని గుర్తు చేస్తున్నారు. 


తెలంగాణలో అమలు..


తెలంగాణలోనూ రుణమాఫీ ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకుంది. ఏపీలాగే ఇక్కడా మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ కంగారు పడి రెండు లక్షల అంటూ వేలం పాట పాడింది. కానీ టీఆర్‌ఎస్ నిజాయితీగా లక్ష రూపాయల వరకూ మాఫీ అని స్థిరంగా నిలబడింది. అంతే తప్ప పోటీకి పోయి పాటను పెంచలేదు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను విశ్వసించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వమూ ప్రజల విశ్వాసాన్ని నిలుపుకుంది. రైతు రుణాల మాఫీ అమలు చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇవాళ ఏపీ రాజకీయ వర్గాల్లో చెప్పుకునేదేమంటే తెలంగాణలో మాఫీ జరక్కుంటే ఏపీలోనూ చంద్రబాబు ఎగ్గొట్టే వాడని..


కమిటీలతో, షరతులతో కాలయాపన ..


సమస్యను నాన్చాలన్నా వాయిదా వేయాలన్నా ప్రభుత్వాలు ఆశ్రయించేది కమిటీలనే. ఆ ఎత్తుగడల్లో చంద్రబాబు ఆరితేరారు. రుణమాఫీపై తొలిసంతకం చేసిన బాబు మార్గదర్శకాల ఖరారు అంటూ నాబార్డు మాజీ ఛైర్మన్ కోటయ్య అధ్యక్షతన కమిటీ వేశారు. ఇబ్బంది లేకుండా రెండు నెలల గడిచాయి. ఆ తర్వాత ఆ కమిటీ మొత్తం పంటరుణాలు 87వేల కోట్లకు పైనే అని తేల్చింది. పాత మాటలన్నీ మరిచి లక్ష యాభైవేల రూపాయలలోపు పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. 

కుటుంబంలో ఒకరికే మాఫీ నిబంధన పుట్టించారు. అది కూడా పంటల వారీగా మాఫీమొత్తాన్ని నిర్ణయిస్తామనిచెప్పారు. వరికి 25వేలు. వేరుశనగకు 25వేలు అంటూ కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు. అవీ చాలక ఆధార్ ఉండి తీరాలన్నారు. అలవికాని షరతులతో రైతు పంటరుణాలను 40వేల కోట్లకు కుదించారు. చెల్లింపులు మాత్రం జరగలేదు. 


డ్వాక్రామహిళల పరిస్థితి దయనీయం..


డ్వాక్రా మహిళలకు పంగనామాలే మిగిలాయి. మొత్తం రుణాలను మాఫీ చేస్తామన్న బాబు సర్కార్ ప్లేటు ఫిరాయించి ఒక్కో డ్వాక్రా సంఘానికి లక్ష మాత్రమే అంది. అది కూడారుణమాఫీ కాదు వ్యాపార అభివృద్ధి అంది. అదికూడా 20 శాతం చొప్పున దశల వారీగా ఇస్తామంటోంది. ఇంతవరకు పైసా రాలేదు. 


ఎన్టీఆర్ సుజల స్రవంతి...ఎక్కడ...?


మిగతా వాటి విషయం ఎలా ఉన్నా కనీసం ముఖ్యమంత్రి చేసిన తొలిసంతకాలలో ఉన్న హామీలు కూడా అమలు జరగడం లేదు. ఎన్టీ ఆర్ సుజల స్రవంతి పథకం అందులో ఒకటి. రెండురూపాయలకే 20 లీటర్ల రక్షిత నీటినందిస్తామని ప్రకటించారు. దానికి ముహుర్తాల మీద ముహుర్తాలు పెడుతూ వాయిదా వేస్తున్నారు. జన్మభూమిలో భాగంగా కొన్ని చోట్ల నామమాత్రంగా ప్రారంభించినా అది అమలుకు నోచుకోలేదు. ఇంతవరకు ఎక్కడ నీటిని సరఫరా చేశారో చెప్పమని అక్కడి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.


ఉద్యోగులకు హామీలే మిగిలాయి..


ఉద్యోగులతో ఇకపై సఖ్యంగా ఉంటా అని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. పే రివిజన్, హెల్త్‌కార్డులు ఇస్తానన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఆ రెండు హామీలను అమలు చేసింది. ఏపీలో ప్రభుత్వ పరిశీలనలోనే ఆ అంశాలున్నట్టు కనిపించడం లేదు. అపుడపుడూ ఇస్తా చూస్తాం అనే హామీలు తప్ప. బెల్డ్ షాపుల రద్దు వాగ్దానం వైన్‌షాపులను సృష్టించి మరింత చేటు చేసిందని అంటున్నారు.