యాభై ఏళ్ళ పోరాటానికి ఫలితం ఆలస్యంగానైనా దక్కింది. అంతిమ విజయం తెలంగాణా ప్రజలనే వరించింది. ఈ విజయం ఒక సమిష్ఠి కృషి. ప్రొఫెసర్ జయశంకర్ తపన, దూరదృష్టి, ప్రొఫెసర్ కోడండరాం పట్టుదల, కేసీఆర్ మొండితనం, విద్యార్థుల ఉడుకుతనం, లాయర్లు, ఎంజీవోల దీక్షల ఫలితం.
కాంగ్రేసు లేటుగానైనా తనమాట నిలబెట్టుకుంది. చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతం వల్ల కన్ను లొట్టబోగొట్టుకున్న తరువాత ఈసారి జాగ్రత్తగా తటస్థంగానే వ్యవహరించాడు. జగన్ జైల్లోనుంచి సమైక్యాంధ్ర చక్రం తిప్పుదామనుకుని చివరికి తెలంగాణలో తనపార్టీ ఆనవాళ్ళు లేకుండా చేసుకున్నాడు. ఏదయితేనేం తెలంగాణ ప్రజల కల ఫలించింది. సోనియమ్మ కరుణించింది. తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న లగడపాటి ఈసారి డ్రామాలాపి కిక్కురుమనకుండా ఉన్నాడు.
ఈవిభజన సీమాంధ్ర ప్రజలకు కూడా విజయమే. అనిశ్చితి కొనసాగడం వలన రెండువైపులా నష్టం తప్ప లాభం లేదు. అనిశ్చితి తొలగించడానికి విభజన తప్ప మరో పరిష్కారం లేదు. పెద్ద సముద్ర తీరం, గ్యాస్, బరైటీస్ నిక్షేపాలు కలిగిన సీమాంధ్ర విభజన తరువాత మరో హర్యానాలా సంపన్నరాష్ట్రం కాగలదు. మనది కానిదానికి పాకులాడటం కంటే మనదైనదాన్ని వృద్ధి చేసుకోవడం మిన్న. రాష్ట్రంగా విడిపోయినంతమాత్రాన హైదరాబాదులోఐటీ, ఫార్మా ఉద్యోగాలు సీమాంధ్ర యువతకు దూరం కావు, పైగా కొత్త కంపనీలు ఆంధ్రా పట్టణాలకు కూడా వచ్చి అవకాశాలు పెరుగుతాయి. గుప్పెడు మంది నాయకుల,పెట్టుబడిదారుల లాభం కోసం ఐక్యత లేని సమైక్యాంధ్రను కొనసాగించడం వల్ల నష్టపోయేది సామాన్యులే. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతిగా కలిసే ఉందాం, తెలుగు భాషకు సేవ చేద్దాం.
ఈసందర్భంగా నేను గతంలో రాసిన ఒక పద్యం!!
చం!!
అమరుల త్యాగముల్ ఫలియ అంతిమ తీర్పు నొసంగు రాష్ట్రమున్
సమరపు బావుటా లెగుర సాకరమౌ తెలగాణ నిక్కమున్
సమసమ రాజ్యమౌ మనదె సస్యపు శ్యామల ప్రాంతమౌ
నమవస నాఁడు విస్తరిలు నాకసమందు మనోజ్ఞకాంతులే