వాదనలో న్యాయం లేనివాడికి, తనవాదన తనకే తప్పుగా తోచేవాడికీ ఎప్పుడైనా చర్చంటే భయమే. అలాగే మనరాష్ట్రంలో సమైక్యవాదులకు కూడా చర్చంటే భయమే. చర్చను తప్పించుకోవడానికి గందరగోళం సృష్ఠించడం, గొడవలు చేయడం, తిట్లకు పూనుకోవడం కూడా తరుచుగా సమైక్యవాదుల్లో చూస్తుంటాం. ఎందుకంటే ఈసమైక్యభావన ఇసుమంతైనా లేనివారు సమైక్య రాష్ట్రం కోరితే ఆవాదనకు ఎప్పుడూ విలువుండదు కదా.
ఇప్పుడు సమైక్యవాదులకు విభజనలో తమకు జరిగే నష్టాలను చెప్పుకోవడానికి ఒక అద్భుత అవకాశం వచ్చింది. అదేమంటే రాష్ట్ర విభజన అసెంబ్లీకి చర్చకు వచ్చింది. అయితే చర్చంటే సమైక్యవాదులకు సహజంగా భయం కదా, మరి వారు చర్చను ఎలా జరగనిస్తారు? అందుకే వారం రోజులుగా సీమాద్ణ్ర శాసనసభ్యులు చర్చలకు అడ్డుపడుతూ ఇప్పుడు అసెంబ్లీని వాయిదా వేయించగలిగారు. వాయిదాలతో విభజన ఆగిపోతుందని సీమాంధ్ర ప్రజలకు భ్రమ కలిగిస్తున్నారు.
చర్చకు అడ్డుపడే ప్రక్రియలో అందరికంటే ముందుండాలని తాపత్రయపడుతున్న జగన్ పార్టీ రాష్ట్రపతినుండి వచ్చిన బిల్లును పక్కనబెట్టి సమైక్యతీర్మానాన్ని చెయ్యాలని పట్టుబడుతూ తాము పట్టిన కుందేటికి అసలు కాళ్ళే లేవంటుంది. దేశంలో ప్రధమ పౌరుడిదగ్గరనుండి స్వయంగా ఒక బిల్లు వచ్చినప్పుడు దాన్ని కాదని మరొక తీర్మానం చేయడం రాష్ట్రపతిని అవమానించడమే. అంతేకాక విభజనకు అనుకూలంగా బిల్లు ప్రవేశపెట్టాలని మూడేళ్ళుగా తెరాస అడుగుతుంటే పెట్టనివారు ఇప్పుడు వైకాప చెబుతున్నట్లు సమైక్య తీర్మానం ఎలా చేయగలరు? అయినా అసెంబ్లీ తీర్మానం చేసిననంత మాత్రాన విభజన ఆగిపోతుందా?
మొత్తానికి సీమాంధ్రనేతలంతా కలిసి తమను ఎన్నుకున్న సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారు. వారికి చెందాల్సిన హక్కులగురించి మాట్లాడ్డానికి తమకు వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్నారు. సీమాంధ్ర ప్రజలను తామింకా విభజనను ఆపగలమని మభ్యపెడుతున్నారు.
No comments:
Post a Comment
Your comment will be published after the approval.