Saturday 30 August 2014

వినాయకుడి భూలోక యాత్ర -2


ప్రభూ, మరిచితిరా నేడు వినాయక చవితి. మనం ఉండ్రాళ్ళవేటలో భూలోకయాత్రకు వెల్లాల్సిన రోజు. మీరేమిటి తీరిగ్గా కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయారు?

మరువలేదు వినాయకా! పోయినసారి వినాయకచవిత సమయంలో తెలుగు రాష్ట్రంలో సమైక్యాంధ్రపేరుతో నానాయాగీ జరుగుతుండేది. అప్పుడు మనం సీమాంధ్ర జోలికి పోకుండా తెలంగాణ ప్రాంతం మాత్రం వెల్లి వచ్చాం. మరి ఇప్పుడు సంవత్సరం గడిచింది కదా, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలాఉంది, ఎక్కడికెలితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను. ఇంతకూ ఆఉద్యమం ఆగిపోయిందా? ఇప్పుడు రాష్ట్రం కలిసి ఉందా, విడిపోయిందా, అక్కడి పరిస్థితులెలా ఉన్నాయి? నీదగ్గరేమన్నా సమాచారం ఉందా మూషికా?

ఏముంది ప్రభూ! వీరి దొంగ ఉద్యమాలను పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్రాన్ని విభజించింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండూ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయాయి. ఎన్నికలు జరగడంతో కొత్తప్రభుత్వాలు వచ్చాయి. ఇక ఉద్యమం సంగతంటారా... మేము బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాం, సునామి సృష్టిస్తాం అంటూ ప్రగల్భాలు పలికినవారు కేంద్రం బిల్లును ఆమోదించగానే దెబ్బకు దిమ్మతిరిగి మన్నుతిన్నపాముల్లాగ పడిఉన్నారు. 

అలాగా. పోనీలే, సమైక్య ఉద్యమాన్ని నడిపినందుకు ఆనాయకులు ప్రజల మనసులను గెలుచుకునే ఉంటారుగా. వారి భవిష్యత్తుకు మాత్రం ఢోకా ఉండదులే.

అలా జరుగలేదు ప్రభూ. పైగా ప్రజల ఆమోదం లేని ఉద్యమాన్ని సొంతలాభాలకోసం తమపైన రుద్దారని ప్రజలు వారికి దిమ్మతిరిగేలా బుద్ధిచెప్పారు. సమైక్యసింహాలమని ఘర్జించిన వారెవరికీ అడ్రసు దొరక్కుండా చేశారు. సమైక్యాంధ్ర పార్టీ అంటూ ఒక కొత్త పార్టీ పెట్టిన మాజీముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏంచేస్తున్నాడో ఎవరికీ తెలియదు. పైగా విభజనకు మద్దతు ఇస్తూ లేఖ రాసిన పార్టీనీ, విభజన కోసం కేంద్రాన్ని నిలద్దీసిన పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీనీ గెలిపించి అక్కడి ప్రజలు ఈమేడిపండు సమైక్యవాదులకు బుద్దొచ్చేలా చేశారు.  

ఇప్పుడు విభజన జరిగిపోయింది కదా? ఇప్పుడు రెండు రాష్ట్రాలూ ఎలాగున్నాయి? అందరూ నాపుట్టినరోజును ఘనంగా పండగ చేసుకుంటున్నారా? 

తెలంగాణలో ప్రజలు తాము ఇన్నాళ్ళూ కలలుగన్న తమ రాష్ట్రం వచ్చినందుకు పండుగ ఘనంగా చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా మీవిగ్రహాలూ, ఉండ్రాల్లూ, లడ్డూలూ. సీమాంధ్రలో సామాన్య ప్రజలకు కలిసున్నా విడిపోయినా వచ్చేదిగానీ, పోయేదిగానీ ఏమీలేదని తెలుసు కాబట్టి అక్కడి ప్రజలు ఎప్పటిలాగే ఎవరికి తోచినరీతిలో వారు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల రికార్డ్ డాన్సులు అదిరిపోతున్నాయట.

అలాగా పోన్లే. ఇంతకూ కొత్త ప్రభుత్వాల పాలనలెలా ఉన్నాయి? 

తెలంగాణలో అధికారంలోకొచ్చిన తెలంగాణ పార్టీ దూసుకుపోతుంది ప్రభూ. అక్కడి ముఖ్యమంత్రి రోజుకొక కొత్త ఆలోచనతో ప్రజాక్షేమం గురించి ఆలోచిస్తూ పాలన చేస్తున్నాడు. మచ్చుకు కొన్ని మంచి నిర్ణయాలు: 
- సమైక్య రాష్ట్రంలో అనుమతులు తెచ్చుకున్న పనికిమాలిన నూట ఎనభై ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులను రద్దు చేశాడు. తద్వారా ఫీజు మాఫీ పేరుతో జరుగుతున్న ప్రజాధనం లూటీని ఆపేసి కేవలం అర్హత కలిగిన కాలేజీలకు మాత్రం అనుమతినిచ్చాడు. 
- ఇటీవలే విప్లవాత్మకంగా ఒక్కరోజు సర్వే నిర్వహించి ప్రజాధనం పక్కదారులు పట్టకుండా ఆపేప్రయత్నం చేస్తున్నాడు.
- ఇల్లపంపిణీలో అక్రమాలపై దర్యాప్తు చేయిస్తున్నాడూ
- క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాడు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ప్రైజుమనీని ఇప్పుడు వెంటనే ఇప్పించాడు.
- కబ్జాలపై కొరడా ఝులిపించాడు.

అయితే అంతా బాగున్నా అక్కడ కరెంటు కోతలు మాత్రం విపరీతంగా ఉన్నాయి ప్రభూ. గత ప్రభుత్వం చేసిన పాపపు నిర్ణయాల కారణంగా ఇక్కడ కరెంటు ఉత్పత్తి తక్కువ, వినిమయం ఎక్కువ. విభజన తరువాత గడ్డుపరిస్థితే వచ్చింది ప్రభూ. పక్క రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉన్నా, కోతలకు కారణం తమ గత విధానాలే అయినా సీమాంధ్ర రాష్ట్రం మాత్రం సాయం చేయడం లేదు సరికదా,  పీపీయేల రద్దు, ప్లాంటు మైంటనెన్సు పేరుతో రోజుకో కుట్రపన్నుతూ తెలంగాణప్రజల ఉసురు పోసుకుంటున్నారు. పైగా తెలంగాణలో కూడా రాబోయే కాలంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్నాడు ప్రభూ.

అలాగా! వీడెవడో సాడిస్టులాగున్నాడు. మరి సీమాంధ్ర ముఖ్యమంత్రి పార్టీకి చెందిన తెలంగాణ నాయకులైనా అడగొచ్చు గదా?

అంత ధైర్యమే వారికుంటే అసలు విభజనే అవసరం ఉండేది కాదు ప్రభూ. ఈసీమాంధ్ర పార్టీలు ఎప్పుడూ తమ మోచేతి నీటిని తాగేవారికే తెలంగాణలో నాయకత్వం ఇస్తారు.

ఇంతకూ మూషికా, సీమాంధ్ర రాష్ట్రంలో పాలన ఎలాగుంది? 

ఎలాగుంటుంది ప్రభూ! అధికారంలోకి రావడానికి అక్కడి ముఖ్యమంత్రి అడ్డమైన వాగ్దానాలన్నీ చేశాడు. ఇప్పుడు వాటిని తీర్చలేక జుట్టు పీక్కుంటునాడు. అసలే లోటు బడ్జెట్, ఆపైన ఆచరణ సాధ్యం కాని హామీలు. అందుకే ఆముఖ్యమంత్రి కుట్రలు తప్ప పాలన చేయడంలేదు. ఇప్పుడు ఈరాష్ట్రానికి కొత్త రాజధాని అవసరం ఉంది. తమ కులం వారు బాగా ఉండే ప్రాంతమూ, తమ పార్టీ నేతలకు భూములున్న ప్రాంతంలో రాజధాని కావాలని ఇతని పంతం. కేంద్రకమిటీనేమో అక్కడొద్దంటుంది. 

ప్రతిపక్షనేత ఏం చేస్తున్నాడు? అసెంబ్లీలో ఈవిషయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడా?

లేదు ప్రభూ! అసెంబ్లీలో తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, హత్యలు చేశారు అంటూ అసెంబ్లిని స్థంభంపజేస్తున్నాడు. ప్రజల సమస్యలగురించి మాత్రం ఒక్కమాట కూడా మాట్ల్లాడడం లేదు. ఇదే మంచిదనుకొని అధికార పక్షం వీరి తండ్రిగారి పాలనలో జరిగిన హత్యలను లేవనెత్తుతుంది. దొందు దొందే. ఎక్కడైనా కర్ర ఉన్నవాడిదే బర్రె కానీ సీమాంధ్రలో మాత్రం బాంబులు, తుపాకులు ఉన్నవాడిదే అధికారం కనుక ఈరెండు పార్టీల నాయకులూ హత్యారాజకీయాలద్వారా పైకొచ్చినవారే. వీరి మధ్య నలిగిపోతున్నది సామాన్య ప్రజలే. ఎలాగోలా తెలంగాణ ప్రజలు మాత్రం  వీళ్ళబారినుండి తప్పించుకున్నారు.  

చూడబోతే ఇప్పట్లో సీమాంధ్ర బాగుపడేట్టు లేదు గానీ ఈసారికూడా మనం తెలంగాణ వెల్లి ఉండ్రాల్లు తిందాం పద మూషికా. పనిలో పనిగా విద్యత్ సమస్య నుంచి తొందరగా బయటపడాలని ఆరాష్ట్రాన్ని ఆశీర్వదిద్దాం!!

చిత్తం ప్రభూ!  







1 comment:

  1. devotional story.
    https://goo.gl/Yqzsxr
    plz watch and subscribe our channel.

    ReplyDelete

Your comment will be published after the approval.