Thursday, 20 February 2014

అప్పుడే ఒప్పుకుని ఉంటే!!


చివరికి అనివార్యమైన రాష్ట్ర విభజన జరిగిపోతుంది. తెలంగాణ ప్రజల అరవై ఏళ్ళ కళ సాకారం కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు.

అలాగే సీమాంధ్ర ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు. సీమాంధ్ర ప్రజలకు ఈవిభజన వలన ఒక అస్తిత్వం వచ్చింది. ఇకనుంచి సీమాంధ్రకు మాత్రమే లాభించే ఏవిషయాన్ని కూడా తెలుగుజాతికి లాభంగా చెప్పుకుని తమను తము మోసం చేసుకోనక్కర్లేదు, సీమాంధ్రకు లాభం అని చెప్పుకోవచ్చు. ఇకనుంచైనా తమ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టుకోవచ్చు. విభజన జరిగేవరకూ ఈసమస్య రగులుతూనే ఉంటుంది కాబట్టి సమస్య పరిష్కారం అందరికీ మంచిదే. 
   
ఈవిభజన జరిగిన విధానం సీమాంధ్రకు అన్యాయం జరిగేట్లు ఉంది, బిల్లును తమపైకి బుల్‌డోజు చేశారు అని బాధపడేవారు ఇలాంటి పరిస్థితి రావడానికి తమనేతలే కారణమని తెలుసుకోవాలి. బిల్లులో సీమాంద్ర కోరికలు పూర్తిగా తీరలేదు అనుకునేవారు తెలంగాణప్రజల కోరికలుకూడా పూర్తిగా తీరలేదని గ్రహించాలి. ఉమ్మడి రాజధాని, ఉద్యోగులు పంపిణీ విధానం, విద్యాసంస్థల్లో ప్రవేశార్హతలు లాంటి పలు విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. అలాగే పోలవరంకు తెలంగాణ అంగీకారం చేసినట్లు ఉన్న క్లాజు, పోలవరంకోసం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపి గిరిజనులను నిట్టనిలవునా ముంచడం లాంటివి అస్సలు బాగోలేవు. కాకపోతే పంపకాల్లో అన్నీ అనుకూలంగా ఉండాలనుకుంటే కుదరదు, పట్టువిడుపులు అవసరం కాబట్టి తెలంగాణ నేతలు ఇవి అన్యాయం అని తెలిసీ ఒప్పుకోవడం జరిగింది. 

అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది 2009లోనే యూపీయే ప్రభుత్వం తెలంగాణను ప్రకటించడం జరిగితే సీమాంధ్రలో పోటీ ఉద్యమం లేవదీసి విభజనను ఇన్నిరోజులు ఆపడం వలన సీమాంధ్ర ప్రాంత ప్రజలు పొందిన లాభమేమీ లేదు. పైగా అనేక నష్టాలు జరిగాయి.

రెండువేలతొమ్మిదిలోనే విభజన జరిగిఉంటే అప్పుడు సీమాంధ్ర ఎంపీల మద్దతు యూపీయేకు అవసరమైన తరుణంలో సీమాంధ్ర ఇంకాస్త గట్టిగా తమ ప్రాంత ప్రజల అవసరాలగురించి నెగోషియేట్ చేసే అవకాశం ఉండేది. దానివల్ల సీమాంధ్రకు లాభాలు బాగానే జరిగేవనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆఖరు నిముషంలో జరిగిన విభజన వలన సీమాంధ్ర ఎంపీల మద్దతు ఎవరికీ అవసరంలేని సమయంలో ఎన్ని డ్రామాలు చేసినా ఎలా తుస్సుమన్నాయో చూశాం. బ్రహ్మాస్త్రాలన్నీ తోకపటాకుల్లా తుస్సుమన్నాయి తప్ప పేలలేదు.

ఈమూడేల్లలో సీమాంధ్ర రాజధాని నిర్ణయం జరగడమేకాక షుమారు కావల్సిన ఇంఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తయేది.  ఎవరి బడ్జెట్ వారేసుకుని ఎవరి ప్రాంత అభివృద్ధిని వారు చూసుకునేవారు. సీమాంధ్రకు కేంద్రం ప్రతిపాదించిన IIT,IIM లాంటివాటిలో కొన్నైనా ఈపాటికి పూర్తయేవి. అన్నివిధాలుగా సీమాంధ్ర ప్రజలకు విభజన మూడేళ్ళకిందట జరిగిఉంటే లాభం అధికంగా ఉండేది. 

అయితే మూడేళ్ళు ఈవ్యవహారాన్ని సాగదీయడం వలన లాభపడింది ఎవరు ఎంటే సీమాంధ్ర ముఖ్యమంత్రి, మంత్రులూ, ఎంపీలో ఇతర నేతలు. ఎలాగు విభజన జరిగిపోతుందని వీరికి ముందే తెలుసు కనుక తెలంగాణను సాధ్యమయినంత దోచుకున్నారు. జలయగ్నం కాంట్రాక్టులు, ఇతర సివిల్ కాంట్రాక్టుల్లో సీమాంధ్ర పొలిటికో బుజినెస్‌మెన్ అయిన ఎంపీలు కోట్లు దండుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి ఆఖరి వారంలో పెట్టిన సంతకాలద్వారానే కోట్లు చేతులు మారాయని వినికిడి, ఈమూడేళ్ళలోకూడా బాగానే వెనకేసి ఉంటాడు.
  
అప్పుడే విభజన జరిగి ఉంటే ఎందరో యువకుల ప్రాణాలు మిగిలి ఉండేవి, పోలీసుల లాఠీచార్జీల్లో దెబ్బలు తిని కాళ్ళిరగ్గొట్టుకునే బాధ తప్పేది, తెలంగాణ ప్రజలు కూడా మూడేళ్ళ స్వయంపాలన అనుభవించేవారు.

కనుక సీమాంధ్ర ప్రజలారా, మిమ్మల్ని ఇన్నిరోజులూ విభజన జరగనే జరగదు, మేము జరగనివ్వం అని చెప్పి మోసగించిన నేతలకు ఈఆలస్యం కోట్లు తెచ్చిపెడితే సామాన్యులైన మీకు మాత్రం నష్టమే జరిగింది.    సీమాంధ్ర నేతలు తాములేవదీసిన దొంగ ఉద్యమం, రాజీనామా నాటకాలతో సీమాంధ్ర ప్రజల కళ్ళళ్ళనే పొడిచారని ఇకనైనా గ్రహించాలి. 

ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవడం వలన తెలంగాణకు లాభం కూడా జరిగింది. తెలంగాణలో ప్రజలంతా ఒక్క నినాదంతో ఒక్కటయ్యారు. ఉద్యమం అన్ని వర్గాలను దగ్గర చేర్చింది. ప్రజల్లో పోరాట పటిమను నింపింది. రాష్ట్రావశ్యకత చిన్న పిల్లవాడిదగ్గరినుండి ముసలివాళ్ళందరికీ స్పష్టంగా అర్ధం అయింది. ప్రజాఉద్యమాలపట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఈస్పిరిట్ ఇలాగే కొనసాగితే తెలంగాణ ప్రజలు తమ చైతన్యంతో తమ రాష్ట్రాన్ని కుల, మత భేధాలు లేని ఒక చక్కని రాష్ట్రంగా తీర్చి దిద్దుకునే అవకాశం ఉంది. 


4 comments:

  1. ఈ దిక్కుమాలిన విభజన ఏదో 1972లోనే జరిగి ఉంటే బాగుండేది. అప్పుడూ ఇప్పుడూ‌ కూడా మోసం జరిగింది సీమాంధ్రకే.

    ReplyDelete
    Replies
    1. మనకు అప్పనంగా వొచ్చే సొమ్ముకు, పెత్తనానికి కొంత గండిపడితే మోసం జరిగినట్టుకాదు, అవతలి పక్షానికి కొంత న్యాయం జరిగినట్టు. శ్యామలరావుగారికీవిషయం తెలుసనుకుంటాను.

      Delete
    2. 1956లొ ప్రజలు వద్దని మొత్తుకున్నా వినకుండా ఆంధ్రోల్లతో కలిసినందుకు మనకు తగిన శాస్తి జరిగింది. ఇకనైనా "తెలుగు జాతి ఐక్యత" అనే శనిపీడ పొతే చాలు.

      Delete
    3. రఘు నాథ్20 February 2014 at 13:46

      ఒప్పందాలు ఉల్లంఘన చేసి తెలంగాణను మోసం జరిగిన వారే తము మోసపోయమనటం అంతా కలికాలం. రేపు సీమాంధ్రలో ఎవరైనా తనను ఎవరో మోసం చేసారని పోలీసులను ఆశ్రయిస్తే మోసం చేసిన వాడిని వదిలి మోసపోయిన వాడిని జైల్లో పెట్టమని అంటారేమో.

      Delete

Your comment will be published after the approval.