గత రెండురోజుల్లో రెండు పెద్ద రోడ్డుప్రమాదాలు ప్రధానవార్తలయ్యాయి. ఒకటి ఔటర్ రింగ్‌రోడ్ మీద డీసీఎం ట్రక్కును ఢీకొన్న ప్రమాదమయితే మరొకటి వోల్వో బస్సు దగ్ధం.
వోల్వో బస్సులు గంటకు నూటనలభై కిలోమీటర్ల వేగంతో వెల్లినా బ్యాలన్స్ తప్పవు, ప్రయాణీకులకు కుదుపులుండవు కనుక వేగంగా పోతుందని భయం ఉండదు. అయితే ఈవోల్వో బస్సులు డిజైన్ చేసింది ఫారిన్ రోడ్లను దృష్టిలో పెట్టుకొని. అక్కడి రోడ్లపై గంటకు నూటనలభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళీనా ప్రమాదాలు జరగవు. అయితే మన డ్రైవర్లు మన డొక్కురోడ్లపై కూడా వోల్వో దొరికింది గదా అని అదే స్పీడుతో వెలుతుంటారు. కానీ మన రోడ్లు అంత వేగంతో వెళ్ళడానికి అనుకూలంగా ఉండవు. ఎప్పుడు రోడ్డుపై ఏ కుక్క వస్తుందో, మేకలగుంపు వస్తుందో, పశువులు వస్తాయో తెలియని పరిస్థితి. రోడ్లకు ఆనుకునే ఊర్లు ఉంటాయి. హైవేలపై అప్పుడప్పుడూ చిన్నపిల్లలు ఆడుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో నూటనలభైపై వెలుతున్న బస్సుకు సడన్‌గా ఏదైనా అడ్డువస్తే కంట్రోల్ చేయడం కష్టం. బహుషా వోల్వోలకు మన రోడ్లపై స్పీడ్ లాక్ చేయాల్సిన అవసరం ఉందేమో.
రెండోప్రమాదం జరిగిన ఔటర్ రింగ్ రోడ్డు ఫారిన్ రోడ్లకు ఏమాత్రం తీసిపోనిది. నాలుగు లేన్లతో కూడిన ఈ చక్కటిరోడ్డుపై స్పీడుగా వెల్లినా ప్రమాదాలు జరగగూడదు. కానీ అంత వేగంతో వెల్లడానికి అవసరమయిన రక్షణ వ్యవస్థ, సిగ్నలింగ్ సిస్టం లేని వాహనాలు కూడా ఈరోడ్డుపై వెలతాయి. ఇలాంటి వాహనాలు కూడా రోడ్డు బాగుంది కదా అని అంతే వేగంతో వెలతాయి. రోడ్డు మధ్యన ఆగిన ట్రక్కువాడు ఎమర్జెన్సీ బ్లింకర్ వేయకపోవడం ఒక తప్పు అయితే డీసీఎం అదుపు చేయలేనంత వేగంగా రావడం మరో తప్పు.
ఏతా వాతా తేలేదేమంటే వేగంగా వెళ్ళడానికి మంచి వాహనం, మంచి రోడ్డు రెండూ అవసరం. ఏదో ఒకటి ఉంది కదా అని స్పీడు పెంచితే పరిస్థితి ఇదే అవుతుంది.