Saturday, 26 May 2012

సౌతిండియాలో అగ్రస్థానంలో ఉస్మానియా



దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీల పనితీరుపై ఇండియాటుడే, నిల్సన్ సమ్యుక్తంగా చేసిన సర్వేలో ఉస్మానియాకి దేశంలో ఆరోస్థానం, సౌతిండియాలో అగ్రస్థానం లభించింది. గత మూడేళ్ళుగా నిర్వహిస్తున్న ఈసర్వేలో 2012కు గానూ ఉస్మానియాకు ఈగౌరవం దక్కింది. పీజీ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో బోధనలో నాణ్యత, వసతులు, విద్యార్థుల శ్రద్ధ మొదలైన విషయాల్ళో ఈసర్వే జరిగింది.

కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నట్లుగా తెలంగాణ ఉద్యమం ఉస్మానియాలో చదువులపై ప్రభావం చూపలేదని ఈ సర్వే స్పష్టం చేస్తుంది. అలాగే చదువుల్లో వెనకబడినవారు ఉద్యమాలు చేయిస్తున్నారనే గోబెల్స్‌లకు ఈసర్వే చెంపపెట్టు.

Link: http://www.eenadu.net/News/Statenewsinner.aspx?qry=state12

Tuesday, 22 May 2012

సీమాంధ్రలో ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి?


ఫొటో: సమైక్యాంధ్ర “ఉద్యమం”లో భాగంగా కడపలో ఒక పెట్రోల్ బంకును ధ్వంసం చేస్తున్న టిడీపీ గూండాలు



ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం:

1952 లో ఆంధ్రాలో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులదెబ్బకు ఆంధ్రాలో బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం లాంటివారు ఓడిపోయి రాజకీయనిరుద్యోగులయిపోయారు. టంగుటూరి ప్రకాశం గారు ముఖ్యమంత్రి పదవికోసం కష్టపడ్డా అది తమిలుడు రాజాజీకే దక్కింది. దీంతో వీల్లందరికీ తెలుగువారి ఆత్మగౌరవం గుర్తుకు వచ్చింది. అంతకుముందు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజన ఊసెత్తని ప్రకాశం, ఎప్పుడో ముప్పైల్లో వచ్చిన ప్రతిపాదనకు మోకాలడ్డిన నీలం ఆంధ్రులకు స్వరాష్ట్రం కావాలన్నారు. తప్పు లేదు..వాళ్ల వాళ్ళ సొంత అజెండాలు మనకనవసరం..ఉద్యమం మంచి చెడ్డలు తప్ప.

రాజాజీ అప్పటి ప్రతిపాదిత నందికొండ ( ఇప్పటి నాగార్జునసాగర్) నుండి కొంత నీటిని మద్రాసుపట్టణానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇది క్రిష్ణా, గుంటూరులో ఉన్న భూస్వామ్యవర్గాలకు నచ్చలేదు. ఇదే అదను అనుకొని రాజకీయంగా దెబ్బతిన్న బెజవాడ, నీలం, ప్రకాశం లాంటి నాయకులు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమం మొదలు పెట్టారు. ఇక్కడ ఆంధ్రా నాయకుల, క్రిష్ణా, గుంటూరు భూస్వాముల ప్రయోజనాలే ఈఉద్యమానికి కీలకమయ్యాయన్నది గమనించాల్సిన విషయం.

అంతకుముందు గుంటూరులో కొన్ని గుమస్తా ఉద్యోగాలు తమిలులకు ఇచ్చారంటూ చిన్న గొడవ కూడా బయల్దేరింది. తమిలులు తమ అవకాశాలను దోచుకుంటున్నారనేది ఉద్యమంలో ముఖ్యంగా ప్రచారం అయింది. అంటే ఇప్పటి తెలంగాణ ఉద్యమం లాగానే అప్పుడు కూడా ఉద్యోగాలు, నీళ్ళు ప్రధానాంశాలు కాగా తరువాత అది తెలుగువారి ఆత్మగౌరవంగా మారిపోయింది.

అప్పటి జేవీపీ కమిటీ మద్రాసు లేకుండా రాష్ట్రాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంది. అయితే అప్పటి ఉద్యమంలో ఎవరికీ పక్కన తెలంగాణలో ఉన్న తెలుగు వారు గుర్తుకు రాలేదు. మద్రాసు లేకపోతే సరే తెలంగాణలో ఉన్న తెలుగువారిని కూడా కలపాలి అని ఎవరూ ప్రతిపాదించలేదు, ఉద్యమించలేదు. కానీ తమకి రాని, తమిలులు అధికమయిన మద్రాసుకోసం మాత్రం పోరాడారు, అమాయకుడు పొట్టి శ్రీరాములును పొట్టన బెట్టుకున్నారు.

జై ఆంధ్రా ఉద్యమం:


1969 తెలంగాణ ఉద్యమం తరువాత ముల్కీ నిబంధనల అంశం సుప్రీం కోర్టుకు చేరింది. చివరికి సుప్రీం కోర్టు తమ తీర్పులో ముల్కీ నిబంధనలు న్యాయమయినవే అని తేల్చింది. దీనికి కొద్దినెలలు ముందుగానే అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసిమ్హారావు సీమాంధ్రలో భూసంస్కరణలను అమలు చెయ్యడానికి ప్రయత్నిస్తుంటే అప్పటి ఆంధ్రా మంత్రులు, ఇతర నాయకులకు ఇది నచ్చడంలేదు. పీవీపై ఈవిషయంపై ఆంధ్రా నాయకులు కోపంతో రగులుతున్నారు.

ముల్కీ నిబంధనల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుతో వీరికి చక్కగా అదును చిక్కింది. ఇంకేం ఒక్కసారిగా ఆరుగురు మంత్రులు రాజీనామా చేసి జై-ఆంధ్ర ఉద్యమం లేవనెత్తారు. ఇక్కడ కూడా ఉద్యమం కొందరు భూస్వామ్య వర్గాల ప్రయోజనాలకోసమేనని తెలుస్తుంది.

అయితే ముల్కీ రూల్స్ ఏపక్షపాత నేతో బలవంతంగా వీరిపై రుద్దలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రులు వీరికి అన్యాయం చేయలేదు. కేవలం సుప్రీం కోర్టు ఇది న్యాయమేనని ధృవీకరించింది. అయినా దేశంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించకుండా వీరు ఉద్యమాన్ని లేపారు. కొన్ని నెలలు అల్లకల్లోలం సృష్టించారు.

ఎలాగయితేనేం ఈఉద్యమం ద్వారా వీరు తాము కోరుకున్న ఫలితాన్ని రాబట్టగలిగారు. ముల్కీ రూల్స్ రద్దయ్యాయి,పీవీ ముఖ్యమంత్రి పదవినుండి దిగిపోయాడు, భూసంస్కరణలు ఆగిపోయాయి. ఒక్కసారిగా ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ కూడా ఆగిపోయింది. ఈఉద్యమం మొదలవడం, ఆగిపోవడం అంతా కూడా తెలంగాణకు న్యాయం జరుగుతుంటే అడ్డుకోవడానికే తప్ప నిజంగా విడిపోవడానికి కాదనీ, కలిసి ఉండడంలో విపరీతంగా లాభపడుతున్నవీరికి విడిపోవాలని లేదనీ తెలుస్తుంది.


సమైక్యాంధ్ర ఉద్యమం:

2009 డిసెంబరు తొమ్మిదిన చిదంబరం తెలంగాణ ప్రకటించగానే సీమాంధ్రలో రాత్రికి రాత్రే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయింది. అంతకుముందు పదేళ్ళుగా తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఏనాడూ అడ్డుచెప్పనివారు, పైగా తెలంగాణ వస్తే రాజధాని గుంటూరు దగ్గరొస్తుందని భూముల ధరలు పెంచిన వారు, అన్నిపార్టీలూ తెలంగాణ అంశాన్ని మానిఫెస్టోల్లో చేర్చినప్పుడు, మద్దతు ప్రకటించినపుడు అడ్డుచెప్పక వారినే గెలిపించినవారు, కనీసం బిల్లు పెట్టండి మేం మద్దతు ఇవ్వకపోతే అడగండి అని రెండ్రోజులముందు చంద్రబాబు అన్నా అడ్డు చెప్పనివారికి ఒక్కసారి సమైక్యతలోని సద్భావన గుర్తొచ్చింది. ఇంకేముంది వెంటనే తెలంగాణ ప్రజలను "మీరు మాతో కలిసుండాల్సిందే" అంటూ సమైక్యాంధ్ర ఉద్యమం చేశారు.


ఎవరైనా తమ హక్కులకోసం ఉద్యమం చేస్తారు. మీరు మాతో కలిసి ఉండాల్సిందే అంటూ ఎదుటివారి హక్కులకు అడ్డుపడడానికి చేసిన ఉద్యమం చరిత్రలో ఇదే మొట్టమొదటిది.

ఈఉద్యమం కూడా మిగతా రెండు ఉద్యమాల లాగే సమైక్య రాష్ట్రంలో అమితంగా లాభపడుతున్న కొద్దిమంది ధనిక, భూస్వామ్య, పెట్టుబడిదారులకోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఉద్యమానికి దలితులెవరూ మద్దతివ్వకపోగా వారు విభజనే కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈవిధంగా సీమాంధ్రలో జరిగిన మూడు ప్రధాన ఉద్యమాలు ధనిక భూస్వామ్య వర్గాలు, కొందరు నేతల ప్రయోజనం కోసం చేసినవి కాగా ఈ మూడు ఉద్యమాల్లో మూడు రకాలుగా ఉద్యమాలు చేశారు. ఒకసారి ఇప్పుడు తెలంగాణలో ఏఅంశాలమీద ఉద్యమం జరుగుతుందో అదే అంశాలమీద జరిగిన ఉద్యమం. అప్పుడు అవేకారణాలమీద విడిపోవడం వీరికి ఒప్పుగా తోచగా ఇప్పుడది తప్పుగా తోస్తుంది. మరో ఉద్యమంలో ఇప్పటివాదనకు పూర్తిభిన్నంగా ఇప్పుడు కలిసి ఉందామన్న వారు అప్పుడు విడిపోదామన్నారు..అదికూడా కనీసం దేశంలో అత్యంత ఉన్నతమయిన న్యాయపీఠం ఒక తీర్పునిస్తే దాన్ని గౌరవించకుండా!

అంటే ఇక్కడ ఉద్యమాలకు ఒక సిద్ధాంతాలు, గట్రా ఉండవు. ఇక్కడి భూస్వామ్య, ధనిక వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకు వీల్లు ఏదయినా వాదించగలరు అనితెలుస్తోంది. రేప్పొద్దున కేంద్రప్రభుత్వం సమైక్య రాష్ట్రాన్ని అలాగే ఉంచి తెలంగాణకు న్యాయం జరిగేలా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే మల్లీ ఈనాయకులే తమ స్వరం మార్చి రాష్ట్రాన్ని విడగొట్టాలనే డిమాండ్ చేయగలరు.

నిజమైన ప్రజా ఉద్యమాలు:

మరి ఇక్కడ నిజమయిన ప్రజా ఉద్యమాలు జరగలేదా అంటే జరిగాయి. మొన్న కాకరాపల్లిలో థెర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమం, కారంచేడు దళితుల ఊచకోతకు వ్యతిరేకంగా చేసిన ఉద్యం, ఇలాంటివే మరికొన్ని. వీటికి ఇక్కడి ఏపెద్దనాయకుడు తమ మద్దతునివ్వడు, గట్టిగా పోరాడడు, ఏదో మొక్కుబడి ఖండనలు తప్ప. పేదోల్లకి న్యాయంజరిగేలా చేసే ఉద్యమాలకు ఇక్కడ కనీసంచదువుకుని పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా మద్దతివ్వదు, ఎందుకంటే వీరిలో అత్యధికులు సీమాంధ్ర ధనిక భూస్వామ్య వర్గాలవారే కాబట్టి.

Sunday, 20 May 2012

ఎగిలివారుతోంది..



~ అంతం లింగాడ్డి

డిసెంబర్ 9, 2010. సమయం రాత్రి సుమారు 11 గంటలు. విజయవాడ మహానగరం పూర్తిగా నిద్రలోకి జారనే లేదు. నడిరోడ్డున ఖరీదైన అద్దాల మేడలో మూన్‌లైట్ వెలుగులో సావివూతమ్మ తన భర్తతో సమైక్యాంధ్ర ఉద్యమంపై ఆరా తీస్తూ టీవీ చూస్తోంది. ఊహకందని రీతిలో కేంద్ర హోం మంత్రి ప్రకటన చదవడం ప్రారంభించాడు. ఊపిరి బిగబట్టుకొని శ్రీనివాసరావు వినసాగాడు. process of forming the State of Telangana will intiated. An appropriate resolution will be moved in the State Assembly.అది వింటున్న సావివూతమ్మ నిర్ఘాంతపోయింది. శ్రీనివాసరావు నిశ్చేష్టుడై దిగ్గున కుర్చీలోంచి లేచి నిలబడి, శాలువా ఒకసారి విదిల్చి భుజాన కప్పుకొని వడివడిగా బయటకు వెళ్లసాగాడు.. ‘‘ఇంతరాత్రి వేళ ఎక్కడికండీ?’’ అదుర్దగా సావివూతమ్మ అడుగుతుంది. ‘‘ఎక్కడికని అడుగుతావేంటి? రాష్ట్రం విడిపోతుందంటా, వినలేదా? అదెలా సాధ్యమౌతుందో తేల్చుకోవాలి. మన సత్తా ఏంటో కేంద్రానికి తెలియాలి. ఇప్పుడే వస్తాను’’ అంటూ విసురుగా బయటకు వెళ్లాడు. సావివూతమ్మ మాత్రం టీవీ వైపు చూస్తూ ఏదో దిగులుతో ఆలోచనలో పడింది. శ్రీనివాసరావు తోటి నాయకులను కలిసి మరి కొందరిని ఫోన్లో సంప్రదించి ఏవేవో భవిష్యత్ ప్రణాళికలు వేసుకొని, తెల్లవారి 4 గంటల వేళ ఇల్లు చేరాడు. సావివూతమ్మ ఇంకా కుర్చీలో ఒరిగి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ‘‘ఏమిటి సావిత్రీ! నువ్వు రాత్రంతా పడుకోలేదా? ఏమి... ! నాగురించి మాత్రమే కాదు, నీ ఆరోగ్యం గురించి కూడా కాస్తా పట్టించుకో’’ అంటూ బాత్రుంలోకి వెళ్ళాడు.

మర్నాడు రోజంతా శ్రీనివాసరావు క్షణం తీరిక లేకుండా ఎవ్నవరినో కలుసుకొని ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాడు. సావివూతమ్మ ఆలోచనలు అన్నీ తెలంగాణ పట్లనే తిరుగుతున్నాయి. అది గమనించిన శ్రీనివాసరావు ‘‘ఏమైంది సావిత్రీ! నిన్నటి నుంచి అదోలా ఉన్నావు, ఎందుకు?‘‘ఏమీ లేదండి, మన అమ్మాయి శ్రీదేవి గుర్తొచ్చింది. ఎంత చెడ్డా ఒక్కగా నొక్క కూతురే కదాండి. రాష్ట్రం విడిపోతుందని అంటున్నారు. మన అమ్మాయి పొరుగు రాష్ట్రం అయిపోతుంది. ఇక మనల్ని కలుస్తుందన్న ఆశ లేదండి. మీరు ఇంకా దాని మీద కోపం ప్రదర్శించకుండా ఒక్కసారి చూసొద్దామండి.’’‘‘మనల్ని కాదని వెళ్లిన ఆ పరువు తక్కువ దానిపై నీకెందుకు సావిత్రీ అంత ప్రేమ? అమ్మ, నాన్నలను కాదని ఇతర కులస్తునితో వెళ్లిన దానిని మనం వెతుక్కుంటూ వెళ్లడం ఏమిటి. అయినా, దానివల్ల గ్రామ పంచాయితీ నుంచి సచివాలయం వరకూ ఎంత మంది ఫలానా ‘పైరవీదారు శ్రీనివాసరావు గారి అమ్మాయి’ అంటూ గుసగుసలాడతారో నీకు తెలుసా? తల ఎత్తుకోకుండా చేసి వెళ్లినా దాని గురించి పదే పదే మాట్లాడితే బాగుండదు, మన పరువే పోతుంది. ముందు భోజనం వడ్డించు, ఆకలిగా ఉంది’’ అంటూ భోజనానికి కూర్చున్నాడు. 

సావిత్రి మారు మాట్లాడకుండా అన్నం వడ్డించి కళ్లు తుడ్చుకుంటూ పక్కనే నిలబడింది. భోజనం ముగించుకొని బెడ్‌రూంలోకి వెళ్లి బెడ్‌పై ఒరిగి కూర్చొని పుస్తక పఠనం మొదపూట్టాడు శ్రీనివాసరావు. సావివూతమ్మ పక్కనే పడుకొని బలవంతంగా కళ్లు మూసుకొని నిద్ర పోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ, కారే కన్నీళ్లు ఆమె దరికి నిద్రను రాకుండా చేస్తున్నాయి. శ్రీనివాసరావు ఉన్నట్టుండి కూతురి ఫొటోను ఎదపై ఉంచుకొని కళ్లు మూసుకొని కన్నీరు కార్చుతున్నాడు. అది గమనించిన సావివూతమ్మ తన భర్త కూతురిపై ద్వేషాన్ని పెంచుకున్నాడే గానీ ప్రేమను చంపుకోలేదన్న విషయం ప్రస్ఫుటంగా అర్థమైంది. భర్త భయానికి ఎంత ఆపుకున్నా సావివూతమ్మ దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చి భర్తపై వాలి ఏడవ సాగింది. ‘‘ఊరుకో సావిత్రి... రేపు అమ్మాయి వాళ్ల ఊరు వెళదామని’’ ముక్తసరిగా అన్నాడు. అదే పదివేలుగా భావించిన సావివూతమ్మ భర్తతో మరేం మాట్లాడకుండా లోపలికి వెళ్లి చిన్న సూటుకేసు సర్దసాగింది. 
మరునాడు పొద్దునే సావివూతమ్మ తన కూతురి గది మొత్తం వెతికి చూడగా అందులో ఒక పాత ఉత్తరం దొరికింది. తను అనుకున్నట్టుగానే కూతురు ప్రేమించిన అతని చిరునామా దొరికింది. ‘పేరు: బిక్షపతి, గ్రామం: బంజరుపల్లి, మం: హుస్నాబాద్, జిల్లా: కరీంనగర్’ అడ్రస్ ఉన్న కవర్‌ను జాగ్రత్తగా తన పర్సులో దాచుకుంది.

భార్యాభర్తలు ఇద్దరు రైలు ప్రయాణం, బస్ ప్రయాణాల ద్వారా ఎట్టకేలకు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం బంజరుపల్లి గ్రామానికి చేరుకున్నారు. చివరకు ఆ పల్లె చేరడానికి కాలినడక కూడా తప్పలేదు. ఎటు చూసినా పట్నం తుమ్మలు, పరికి కంపలు, మోదుగ చెట్లు దర్శనమిస్తున్నాయి. ఊరిలోకి ప్రవేశించి, ‘బిక్షపతి ఇల్లు ఎక్కడ’ అని వాకబు చేశాడు.తదేకంగా చూస్తూ ఆ ఊరి మలుపులో కూర్నున్న కొంతమంది ఊరివాళ్లు వీళ్లను ‘వీళ్లు ఆంధ్రోళ్ల లెక్క ఉన్నరు... మన ఊరికి ఎందుకు వచ్చిండ్రు? అదేరా ఆ బిక్షపతిగాడు ఆంధ్రోళ్ల పిల్లను తెచ్చుకొని లగ్గం చేసుకోలేదా? వాళ్ల అమ్మ, నాయినా కావచ్చురా.’ ఇలా చావడికాడి మాటలు శ్రీనివాసరావు దంపతుల చెవుల్లో ముళ్లలా గుచ్చుకుంటున్నాయి. తమను తాము తమాయించుకుంటూ ‘‘అయ్యా... మేం బిక్షపతి ఇంటికే వచ్చాము... ఆయన ఇల్లు కాస్తా చూపిస్తారా’’ అని అడిగాడు.

వీళ్లను గమనిస్తున్న ఒకాయన దగ్గరగా వచ్చి ‘‘గీడనె, గిట్టపోయి మూల తిరుగంగనే బొడ్డురాయి గద్దె ఉంటుంది. దానిపొంట ఉన్న ఇల్లు వాళ్లదే’’ అంటూ బదులిచ్చాడు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లారు.
పాత గోడలతో మరమ్మత్తుకు సిద్ధంగా ఉన్న కుమ్మరి పెంకుల ఇల్లు. ఇంటి ముందు తాటాకులతో వేసిన పందిరి, ఆ పందిరి కింద ఎర్ర మన్ను పూసిన మట్టి గద్దెపై కూర్చొని వెల్లుల్లిపాయలు ఒలుస్తూ కనిపించింది శ్రీదేవి. అకస్మాత్తుగా కనిపించిన అమ్మానాన్నను చూసిన శ్రీదేవి ఎక్కడలేని ఆనందంతో పరుగెత్తుకుంటూ వచ్చి తల్లిని హత్తుకుంది.కూతుర్ని చూసిన సావివూతమ్మ రాలుతున్న ఆనంద భాష్పాలను తుడుచుకుంటూ తనివితీర కూతుర్ని కౌగిలించుకుంది. అమ్మానాన్నలను లోపలికి తీసుకెళ్లి ‘కూర్చోమంటూ’ నులక మంచం వాల్చింది శ్రీదేవి. ఇదంతా గమనించిన శ్రీనివాసరావు అసహనంగా, అసౌకర్యంగా వాల్చిన మంచం పట్టెమీద ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు.

‘‘శ్రీదేవీ! చూశావా ఎంత దుర్భరంగా ఉందో నీ జీవితం. రాణీలాంటి జీవితాన్ని వదిలి ఈ కష్టాల కుంపటికి వచ్చి పడ్డావు. ఈ కొంపలో ఎవరూ గతిలేరా? నిన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్లారు. కనీసం కూర్చోడానికి ఈ ఇంట్లో ఒక కుర్చీ కూడా లేదు’’ అంటూ బాధతో నిండిన ప్రేమను కోపంగా వెళ్లగక్కుతూ అడిగాడు శ్రీనివాసరావు. ‘‘ఎవరూ లేరు నాన్నా. మా మామయ్య నేను రాకముందే దుబాయ్‌కి వెళ్ళాడు. అక్కడ ఏదో పని చేసుకుంటూ మాకు నెలనెలా డబ్బులు పంపిస్తున్నాడు. ఇక మా అత్తమ్మ రోజంతా కూలీకి వెళ్లి వచ్చి తానే వంట చేసి పెడుతుంది పాపం. నన్ను కూతురికంటే ఎక్కువ చూసుకుంటుంది. కనీసం కూరగాయలు కూడా నన్ను తరగనివ్వదు. చేద్దామని వెళ్లినా ‘చదువుకున్న దానివి. పైగా ఉన్న ఇంటి నుంచి వచ్చిన దానివి, నీకెందుకు ఈ పనులు? నేను ఉన్నానుగా’ అంటూ నన్ను ఏ పనీ ముట్టనివ్వదు. మాకు పది ఎకరాల భూమి ఉంది. కానీ, నీళ్లులేక బీడు భూములయ్యాయి.’’ 

‘‘అదేంది గోదావరి దగ్గరే కదా...’’ ఆలోచనగా అన్నాడు శ్రీనివాసరావు. 
‘‘అవును నాన్నా! ప్రస్తుతం ఆ నీళ్లు మా ప్రాంతానికి వచ్చే ప్రయత్నం చేయలేదు. పైగా నీరు దిగువ ప్రాంతాలకు ఇవ్వడమే సాధ్యమౌతుందని పాలకులంతా సాకులు చెబుతున్నారటా. ఇక ఇక్కడి వాళ్ళేమో ‘వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా మన వంతు వస్తుంది అన్నట్లుగా ఆంధ్రావాళ్లు పాలకులైనంత కాలం నీటి చుక్క రానియ్యరు’ అని తిడుతుంటారు నాన్నా!’’ యథాలాపంగా చెబుతూ పోతుంది శ్రీదేవి. కూతురి మాటలకు అసహనంగా సరేనంటూ, ‘‘మరి ఏరికోరి ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ ఆయన గురించి చెప్పవేం’’ అన్నాడు శ్రీనివాసరావు. ‘‘ఆయన మా మండలం హుస్నాబాద్‌లో ఓ గోల్డ్‌లోన్ ఆఫీస్‌లో పని చేస్తున్నాడు నాన్నా. సాయంత్రం వరకు వస్తాడు. అత్తమ్మ కూడా సాయంవూతం కల్లా వస్తుంది’’ అని చెప్పుకుంటూవారికి మజ్జిగ చేసి అందించింది శ్రీదేవి. ‘‘అదేంటి చుట్టుపక్కల ఆంధ్రాబ్యాంక్ లేదా? వారు గోల్డ్‌లోన్‌లు ఇస్తారు కదా.’’ 

‘‘ఉంది నాన్నా! కానీ, ఈ పల్లె జనాలు బంగారు నగలపై లోన్ కోసం ఆంధ్రా బ్యాంక్ వెళ్లడానికి ఇష్టపడరు.’’సావివూతమ్మ ఆత్రుతగా స్వరం తగ్గించి ‘‘మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడామ్మా?’’ అంది. ‘‘చాలా బాగా చూసుకుంటున్నాడు. నాకు అమ్మ, నాన్న ఖరీదైన బంగ్లా జీవితం లేదు కానీ కడుపునిండా తిండి, కంటికి రెప్పలా’ చూసుకునే భర్త అంతకన్నా ఎక్కువ అనురాగం, ఆప్యాయతలు, చూపే ఆత్మీయులు ఉన్నారు. నేను జీవితంలో ఏదీ కోల్పోవడం లేదు అనేంత సంతోషంగా ఉన్నానమ్మా.’’ వీళ్లు మాట్లాడుతుండగానే కూలీకెళ్లిన భాగ్యమ్మ ఇల్లు చేరింది. వీరిని చూసింది. ఎవరని అడిగే లోపే శ్రీదేవి పరిచయం చేసింది. ‘‘అయ్యో! తొవ్వ దొరకడానికి ఎంత తిప్పలైందో. మీరు వస్తున్నట్లు మతులవ్ చేస్తే నా కొడుకును హుస్నాబాద్‌లో ఉండమని చెబుతును కదా. ప్రయాణం బాగా జరిగిందా? ఎపుడు బయపూల్లిండ్రో ఏమో. శ్రీదేవి ఏవన్నా తినడానికి ఇచ్చినవా లేదా?’’ 
‘‘లేదు అత్తమ్మా, వచ్చేటప్పుడు హోటల్‌లో భోజనం చేశారట.’’ ‘‘అయితే నువ్వు వట్టిగనే కూసోబెట్టినవా? సుట్టాలు వచ్చినప్పుడు వీళ్లింటికాడా వండిన బువ్వకుండ ఉన్నదో లేదో అని అనుకొని తినచ్చమని చెబుతారు. ఉండు, దబదబ నేను ఏదన్న చేసి పెడతా’’ అంటూ చకచక టిఫిన్, టీ తయారు చేసి అందించింది బాగ్యమ్మ. ‘‘మీరు మాట్లాడుకుంటూ ఉండుండ్రి. నేను పొయికాడ పని చేసుకొని వస్తా’’ అంటూ వంట చేసి కోడి గుడ్డు కూర చారుతో భోజనం రెఢీ చేసింది భాగ్యమ్మ. ‘‘అన్నయ్యా! అన్నంతిందురు రండీ’’ అని పిలిచింది. ‘‘ఫరవాలేదు లెండి, నీ కొడుకు రానీ. వచ్చిన తర్వాత తింటా’’మంటూ ఆరుబయట కూర్చున్నారు. 

బిక్షపతి కోసం అందరు ఎదురు చూస్తున్నారు. దోమలతో ఇబ్బంది పడుతున్నట్లుగా గమనించిన భాగ్యమ్మ వేపాకు ఎదిరి పొగ తయారు చేసింది. దాంతో దోమల బెడద చాలావరకు తగ్గింది. బిక్షపతి రానే వచ్చాడు. ఇంట్లోకి వస్తూనే ‘‘నమస్కారమండి మామయ్యగారు! ఎప్పుడు వచ్చారు?’’ అంటూ పలకరించాడు. ఆశ్చర్యపోయిన శ్రీనివాసరావు ‘‘నేను ముందే తెలుసా?’’ అని అడిగాడు. ‘‘తెలుసు మామయ్యా! ప్రతి రోజు మీ ఫొటోను చూపిస్తూ మీ గురించి ఒక్క మాటైన చెప్పనిది మీ కూతురు నిద్రపోదు, పోనివ్వదు. అందుకే మిమ్మల్ని గుర్తుపట్టాను. నేను వస్తుంటే మా ఊరి వాళ్లు అందరూ ‘మీ అత్త, మామ వచ్చారురా బుచ్చిగా’ అన్నారు. చాలా సంతోషం. మా ఇంటికి వచ్చినందుకు. అమ్మా, చూశావా వారు పెద్ద మనస్సు చేసుకొని మన ఇంటికి వచ్చారు’’ అన్నాడు బిక్షపతి. ‘‘అవునురా వీళ్లు రావడం నిజంగా మన గోదారి మన ఇంటికి వచ్చినట్టుంది’’ అని సంబరపడింది భాగ్యమ్మ.

శ్రీనివాసరావు ఊహించని రీతిలో బిక్షపతి వాళ్ల నడవడి మాటల తీరు చూసి మురిసిపోయి వారిని మెచ్చుకోలుగా నాలుగు మాటలు మాట్లాడాలనిపించింది. కానీ, అహం ఆడ్డొచ్చి పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. లోలోపల మాత్రం తన కూతురు మంచి వ్యక్తిని ప్రేమించిందనుకున్నాడు. అందరూ భోజనాలు ముగించుకున్నారు.బిక్షపతి అత్త, మామలకు కొత్త మంచాలు, పరుపులు ఆరు బయట పరిచాడు. మరో పక్క వారికి ఏర్పాట్లు చేశాడు. రోజంతా శ్రమించడం వల్లనో ఏమో తొందరగానే నిద్రలోకి జారుకున్నాడు. భాగ్యమ్మ వియ్యపురాలు అందం, హోదా, దర్పం చూసి మురిసిపోయింది. ‘ఆమె మెడనిండా ఎన్ని నగలు వేసుకుందో! బాగా ఉన్నవాళ్లలాగా ఉన్నారు. మా వాడు దమ్మిడికూడా ఆశ పడకుండా కలవారి ఇంటిపిల్లనే తీసుకొచ్చాడని’ తనలోతానే మురిసిపోతూ వారి మాటలు వినసాగింది. 
శ్రీనివాసరావు సిగట్ ముట్టించుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ గాలిలోకి పొగ వదులుతూ ‘‘శ్రీదేవి! మీ ఆయన ఎంతవరకు చదివాడు?’’ అని అడిగాడు. ‘‘ఎం.ఎ. గోల్డ్ మెడల్ నాన్నా...’’ ‘‘అవునా, మరి సిటీకి పోయి ఏదైనా కాలేజీలో చేరి ఇంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు కదా!’’ అని అడిగాడు. మధ్యలో కలుగజేసుకుంటూ భాగ్యమ్మ ‘‘మాకే పది ఎకరాల పొలం ఉంది, వానలు పడక కరువు వచ్చి పంటలు లేక మేం కైకిలి చేసుకోవలసి వచ్చింది. లేకుంటే ఇద్దరు జీతగాళ్లు, నాలుగు నాగళ్లు పెట్టి వ్యవసాయం చేసేటోళ్లం. అలాంటి వ్యవసాయం నీళ్లు లేక భూమి బీటలు వారిపోయింది. కరువు తట్టుకోలేక నా పెనిమిటి దుబాయ్‌కి పోయిండు. అక్కడ ఈడికంటే ఎక్కువ పని దొరుకుతుందట... ప్రతి నెల మాకు పైసలు పంపిస్తడు. నా కొడుకు ఏదో పరీక్ష రాస్తే నౌకరి వస్తుందన్నరు.

మల్ల ఏ దేవుని నోట్లో మన్ను పడ్డదో నౌకరి రాలేదు. నౌకరి వచ్చిన మాకు మీది మీది అప్పులు తీరేవి. ఇపుడు సిటీకి పోయి సంపాదించడానికి ఊరు విడిచి పోతామంటే ఊళ్లో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటరు. ‘బాకీలు ఎగబెట్టి పోతుండ్రు’ అని తిడతారు.’’ ‘‘పరీక్ష ఏంటిదమ్మా’’ శ్రీదేవిని అడిగాడు శ్రీనివాసరావు. ‘‘అవును నాన్న! ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్ష రాస్తే మంచి మెరిట్ మార్కులే వచ్చాయి. ఇంటర్వ్యూలో కూడా మంచి మార్కులే వచ్చాయి. లిస్ట్‌లో పేరు కూడా వచ్చింది. ఉద్యోగం వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో ఈ జోన్‌లోని ఉద్యోగాల్ని ఆంధ్రజోన్‌లలో పైరవీ చేసి నింపారట. అందుకే నాన్నా! ఉద్యోగాల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఈయన బాధపడ్డారు నాన్నా. కూతురి మాటలు విన్న శ్రీనివాసరావు గొంతులో పచ్చి వెలక్కాయపడ్డంత పనైంది. లోలోపల బాధపడ్డాడు.మరునాడు పొద్దున్నే బిక్షపతి లేచి తన పనుల్ని ముగించుకొని శ్రీనివాసరావు కోసం చూస్తున్నాడు. శ్రీనివాసరావు మాత్రం తన ఇంట్లోలాగానే నెమ్మదిగా లేచాడు. స్నానం చేసి టిఫిన్ ముగించుకున్నాడు. ‘కోపతాపాలు ఎన్ని ఉన్నా చేసిన మర్యాదల కోసమైన పలకరించాలి’ అన్నట్లు శ్రీనివాసరావు ప్రాంతీయత గురించి లేవనెత్తాడు. 

‘‘మీరు తెలంగాణ ఉద్యమం చేయడంలో అర్థం ఉందనే భావిస్తున్నారా బిక్షపతి?’’ దానికి సమాధానంగా చిన్నగా నవ్వి ‘‘అవును మామయ్యా’’ అన్నాడు. ‘‘చదువుకున్నవాడిగా నీవే చెప్పు. మీ నుండి ఆంధ్రా వాళ్లు బలవంతంగా లాక్కుంటున్నది ఏమిటి ఈ ప్రజాస్వామ్యంలో?’’ ‘‘ఎందుకుండదు మామయ్య! ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పాలకులు తయారు చేసే నిబంధనలే చెల్లుతాయి. అయితే, ఆ పాలకులు ప్రాంతీయ పక్షపాతంతో నిబంధనలు అమలు చేస్తే ఇట్లాంటి ఉద్యమాలే పుట్టుకొస్తాయి.’’ ‘‘నీకు తెలియకుండా మోసం చేసి తీసుకెళ్లేది ఏమీ లేదు కదా?’’ అన్నాడు శ్రీనివాసరావు. ‘‘సరే మామయ్యా! అవకాశాల్ని ఉపయోగించుకుంటున్నాము అని మీరంటున్నారు. అవసరాలు కూడా తీరకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మా వాళ్లు అనుకుంటున్నారు. కానీ, మా తెలంగాణ త్వరలోనే ఎగిలి వారబోతుంది (ఉషోదయం లేదా తెల్లవారుతోంది). ఎగిలిబారేదాకా మేమంతా ఉద్యమం చేస్తూనే ఉంటాం’’ అని వాదించకుండా ఊరుకున్నాడు బిక్షపతి. శ్రీనివాసరావు కూడా ప్రయాణానికి వేళ అయిందని చెప్పి సావివూతమ్మతో బయలుదేరాడు. 

బిక్షపతి, భాగ్యమ్మ ఊరి బయట వరకూ వచ్చారు. బస్టాండ్‌లో ఉన్నవారందరికీ భాగ్యమ్మ తన వియ్యపురాలిని గర్వంగా పరిచయం చేస్తూనే ఉంది బస్ కదిలే వరకు.తిరుగు ప్రయాణంలో రైలులో రద్దీ మామూలుగానే ఉంది. ఒకే సీటుపై పక్కపక్కన కూర్చున్నారు శ్రీనివాసరావు, సావివూతమ్మ. కదులుతున్న రైలు కిటికీలోంచి బయట చూస్తూ సావివూతమ్మ కూతురి జీవితం గురించే పదే పదే ఆలోచిస్తుంది. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కోసం బీద కుటుంబంలోకి వెళ్లాల్సి వచ్చింది. అయిందేదో అయింది. అమ్మాయిని, అల్లుణ్ని ఇంటికి పిలిస్తే బాగుండును. చూసొద్దామం చిర్రుమన్నాడు, ఇక వారిని ఇంటికి పిలుద్దామంటే పరువు, ప్రతిష్ట అంటూ కోపగించుకుంటాడేమో అనుకుంటూ భర్తవైపు నెమ్మదిగా చూసింది. అప్పటికే నిద్రపోతున్నట్టుగా కనిపిస్తున్న శ్రీనివాసరావు మూసిన కనుప్పల నడుమ నుండి అస్పష్టంగా కన్నీటి ధార కనిపించింది. 
బహుశా భర్త కూడా కూతురి గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నాడేమో! అని భావించిన సావిత్రి ‘‘ఏమండి’’ అంటూ తట్టి లేపింది. కళ్లు తుడుచుకుంటూ ‘‘ఏమిటి సావిత్రీ?’’ అని అడిగాడు. ‘‘దిగులుగా ఉన్నారు. శ్రీదేవి గురించే ఆలోచిస్తున్నారా?’’ ‘‘అవును సావిత్రీ!’’ ‘‘బాధపడటం ఎందుకండీ? గుణవంతుడైన భర్త, ఆప్యాయంగా చూసుకునే అత్తగారు దొరికారు.’’ ‘‘లేదు సావిత్రీ! అమ్మాయి చెప్పినట్లు తెలంగాణ జోన్లలోని ఉద్యోగాలు ఆంధ్రజోన్‌లలో వారికి ఇప్పించడంలో నా పాత్ర కూడా ఇమిడి ఉంది. కానీ, నా కూతురికే అన్యాయం జరుగుతుందని ఆలోచించలేక పోయాను’’ అంటూ కుమిలిపోయాడు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా రైలు నిలిచిపోయింది. అప్పుడే బోగీలోకి ప్రవేశించిన టి.సి.ని ‘‘ఏమైంది?’’ అని అడిగాడు శ్రీనివాసరావు. ‘‘డిసెంబర్ 9 ప్రకటనకు నిరసనగా ఆంధ్ర ప్రాంతం మొత్తం రైలురోకో జరుగుతోందట, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది’’ అంటూ తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోయాడు.

జార్జిరెడ్డి ఎవరు?




-ఆకెళ్ల రాఘవేంద్ర

ఉస్మానియా క్యాంపస్‌లో హత్యకు గురైన యువకుడు. అదీ 40 ఏళ్ల కిందట. కాని నేటికీ అతడి ప్రగతిశీల ఉద్యమ పాదముద్రలు చైతన్యస్ఫోరకంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. కాలం ఒక రోడ్డురోలర్. ఆ కాలచక్రం కింద నలిగి ఎవరైనా నామరూపాల్లేకుండా పోవాల్సిందే!
అణచివేయలేనంత అపారమైన ప్రతిభ ఉంటేనే- చరిత్రపుటల్లో చోటు దక్కుతుంది. నాలుగు దశాబ్దాలయినా ఇంకా జార్జి సిద్ధాంతపరంగా ఉద్యమాల రూపంలో బతికి ఉన్నాడంటే సామాన్య విషయం కాదు. జార్జిరెడ్డి కేవలం ఓ ఉద్యమ భావజాల యువనేత మాత్రమే కాడు; ‘ఇజం’ ఏదైనా, పోరుబాట ఎలాంటిదైనా, నాయకుడెవరైనా- అనుసరించదగ్గ నాయకత్వ వ్యక్తిత్వం ఉన్నవాడు.
భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా ఏడునెలల ముందు జన్మించాడు జార్జి- 1947 జనవరి 15న. లీలా వర్గీస్, రఘునాథరెడ్డి దంపతులకు నాల్గవ సంతానం! పుట్టింది కేరళలోని పాలక్కాడ్. తల్లి మలయాళీ. ఉపాధ్యాయురాలు. తండ్రిది చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రొంపిచర్ల గ్రామం. ఆయన ఉద్యోగరీత్యా అనేక ఊర్లు తిరిగేవారు. జార్జిరెడ్డి అన్నయ్య కారల్‌రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్.
చిన్నప్పటినుంచి జార్జిరెడ్డి పుస్తకాల పురుగు. చదువులో ఫస్ట్. నిజాం కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి ఆపై ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరాడు. అప్పటికే సాంఘిక చైతన్యంతో సమకాలీన సమాజంలోని విషాదాల్ని- ఒకరు మరొకర్ని దోపిడీ చేసే వర్గదృక్కోణాన్ని అవలోకనం చేసుకుంటూ ఉన్నాడు. వామపక్షతత్వ అంశాల్ని, మార్క్సిస్ట్ ఆలోచనల్ని నీలం రామచంద్రయ్య మాస్టారి దగ్గర మరింత తెలుసుకున్నాడు జార్జిరెడ్డి.
జార్జి ఆలోచనలు పదును తేలాయి. తాను పుట్టింది తన కోసం కాదని పీడిత తాడిత లోకం కోసమని తెలిసొచ్చింది. ఎమ్మెస్సీలో ఉండగా విద్యార్థుల సమస్యల్ని అర్థం చేసుకోవడం, వాటికై పోరాడటం సహజంగానే జరిగిపోయేది. ఓసారి క్యాంపస్‌లో చిన్న గొడవ జరగడంతో జార్జిరెడ్డిని ఏడాదిపాటు క్లాసులకు రాకుండా నిషేధం విధిస్తూ ‘రస్టికేట్’ చేశారు ప్రిన్సిపాల్.
మరొకరెవరైనా అయితే – క్లాసులకు వెళ్లలేని ఆ ఏడాదిపాటూ అల్లరిచిల్లరగా తిరిగేవారేమో, నిరాశతో గడిపేవారేమో! కాని జార్జిరెడ్డికి ఆ సంవత్సరం బంగారంలాంటి కాలం. ఆ ఒక్క ఏడాదిలో ఎన్ని పుస్తకాలు చదివాడో అంతులేదు. అప్పటికే ఘనీభవించిన జ్ఞానమూలమైన పుస్తకమంటే పిచ్చిప్రాణం జార్జికి. తన సబ్జెక్టులయిన భౌతిక, గణిత శాస్త్ర ప్రాథమిక సూత్రాల్ని మరింత అధ్యయనం చేశాడు. మార్కోవ్ గణితశాస్త్ర పాఠ్యపుస్తకాల లెక్కల్ని ఆమూలాగ్రం సాల్వ్ చేసేవాడు. అంతేకాదు, చుట్టూ ఎప్పుడూ పది పదిహేనుమంది విద్యార్థులు. వారికి ఆయా గణితశాస్త్ర సమస్యల్ని ఇట్టే విడమరచి చెప్పేవాడు.
బెర్క్‌లీ ఫిజిక్స్ పుస్తకంపై సవివరమైన నోట్స్ తయారు చేసుకున్నాడు. నోమ్ చామ్స్కీ, ‘ఎట్ వార్ విత్ ఆసియా’, ఫ్రెడరిక్ హెగెల్ ‘సైన్స్ ఆఫ్ లాజిక్’, జేమ్స్ జాల్ ‘ది అనార్కిస్ట్’, అలెక్స్ హేలీ ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ ఎక్స్’, రెజిదిబ్రె ‘రివల్యూషన్ ఇన్ రివల్యూషన్’, ఫ్రాంజ్ ఫెనన్ ‘రెచ్‌డ్ ఆఫ్ ది ఎర్త్’ లాంటి అనేకానేక పుస్తకాల్ని అధ్యయనం చేశాడు. పాతికేళ్లు కూడా లేని ఒక కుర్రాడు అన్నేసి గంటలపాటు ఇన్నేసి పుస్తకాలు చదవడం ఆశ్చర్యకరమైన విషయం. లాటిన్ అమెరికా దేశాల్లో ప్రజల విముక్తి కోసం విప్లవ సాయుధ గెరిల్లా పోరాటం సాగించిన చే గువేరా – జార్జిని అమితంగా ఆకర్షించాడు. చే రచించిన ‘గెరిల్లా వార్‌ఫేర్’, ‘ఆన్ రివల్యూషన్’. ‘వెన్ సెరిమోస్, ‘బొవీలియన్ డైరీ’ లాంటి గ్రంథాలు జార్జిని విశేషంగా ప్రభావితం చేశాయి.
అంతేకాదు, ట్రాట్స్కీ, ప్లేటో, సిగ్మండ్ ఫ్రాయిడ్ రచనల్ని సైతం అక్షరమక్షరమూ ఔపోసన పట్టాడు జార్జిరెడ్డి. మార్క్సిజాన్ని, ఆ తత్త్వంతో మానవ సమాజ పరిణామాన్ని, పీడన సాగే విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడు. ఏడాది అజ్ఞాతవాసం లాంటి ‘రస్టికేషన్’ ముగిసింది. ఎమ్మెస్సీ పరీక్షలు జరిగాయి. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాడు. గోల్డ్‌మెడల్ పొందాడు.
ఓ పక్క సబ్జెక్ట్, మరోపక్క గ్రంథపఠనం- అసలైన విద్యను అందుకున్నాడన్నమాట. విస్తృత అధ్యయనం వల్ల జార్జిరెడ్డిలో మార్క్సిస్టు సైద్ధాంతిక విశ్వాసాలు, విప్లవభావాలు, స్పష్టమైన రూపు కట్టాయి. శాస్త్రీయ సోషలిస్ట్ సిద్ధాంతాల అన్వేషణ అతనిలో ప్రారంభమైంది. ఆంధ్రదేశంలోనే కాదు, దేశంలోనూ, ప్రపంచంలోనూ 1960 దశకంలో జరిగిన అనేకానేక పరిణామాలు జార్జిలోని ప్రశ్నించే తత్వాన్ని తట్టిలేపాయి. ఆలోచనను మరింత చురకత్తిని చేశాయి. 1967 నాటి పశ్చిమబెంగాల్ నక్సల్బరీ పోరాటం, తెలంగాణలోని అశాంతి, నిరుద్యోగం, శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం, వియత్నాం యుద్ధం… అన్నీ జార్జిరెడ్డిని అవ్యక్తపుటూహలతో కుదిపేసేవి.
1968 మేలో ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డిగిలె ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది కార్మికులు ఏకమై చేసిన విద్యార్థి ఉద్యమం కావచ్చు; దక్షిణాఫ్రికాలో సొవెటో ప్రాంతంలో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కావచ్చు; వర్ణవివక్షకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన పోరాటం కావచ్చు; అమెరికాలో 1966లో ఆఫ్రో అమెరికన్ విప్లవ వామపక్షవాదులు తీసుకొచ్చిన బ్లాక్ పాంథర్స్ ఉద్యమం కావచ్చు; అమెరికా సామ్రాజ్యవాదంపై ఎక్కుపెట్టిన వియత్నాం ప్రజాపోరాటాలు కావచ్చు… అన్నీ జార్జిరెడ్డిపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఒక మార్క్స్, ఒక హెగెల్, ఒక చేగువేరా, ఒక మిఖాయిల్ బుకునిన్ అందించిన దార్శనికతతో ఆయా విప్లవ పోరాటాల్ని సశాస్త్రీయ హేతువాద దృష్టితో అవలోకనం చేసుకున్నాడు. ప్రపంచమేమిటో, బలవంతులు బలహీనులను దోపిడీ చేసే ప్రక్రియ ఏమిటో, లోకపుటన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలూ, దౌర్జన్యాలూ ఏమిటో అర్థమైంది జార్జిరెడ్డికి. వెరసి ఒక ఆకర్షణీయమైన, ఆదర్శనీయమైన వ్యక్తిత్వం సంతరించుకుంది జార్జిలో! దరిమిలా జార్జిరెడ్డి క్యాంపస్‌లో ఓ ‘హీరో’అయ్యాడు.
అయిదడుగుల ఆరంగుళాల ఎత్తు, గోధుమవన్నె రంగు, కొద్దిగా గడ్డం, సన్నటిమీసం, దృఢకాయం, ఎడమపాపిట, పొట్టిచేతులతో కూడిన బుష్‌షర్ట్‌తో అప్పుడప్పుడు; ఆపై వెడల్పాటి జేబులు, పొడుగు చేతుల ఆలివ్‌గ్రీన్ చొక్కా, కాటన్ జీన్స్‌తో నడుస్తుంటే జార్జిరెడ్డి ఆత్మవిశ్వాసం నడుస్తున్నట్లుగా ఉండేది. చెదరని చిరునవ్వు, కాంతిపుంజాల్లా కళ్లు, రోజూ గంటపాటు జిమ్‌లో బస్కీలు, గుంజీలు, బ్యాక్ బెండింగ్, పొత్తికడుపు వ్యాయామాలు, మల్లయుద్ధం ప్రాక్టీస్ చేసేవాడు. స్వతహాగా జార్జి బాక్సర్, బ్లేడ్ ఫైటర్.
అడిగినవారికీ అడగనివారికీ సహాయం చేసేవాడు జార్జిరెడ్డి. ఫీజులు, మెస్సులు, పుస్తకాలు, అణచివేతలు, అవమానాలు, దుఃఖాలు, ఆత్మన్యూనతలు… ఇలా విద్యార్థుల్లో ఎలాంటి కష్టాలున్నా వెంటనే హాజరయ్యేవాడు. క్యాంపస్ వాతావరణంపై అనవసర పట్టు సాధించాలని ప్రయత్నించే స్వార్థపు శక్తులతో పోరాడేవాడు. ఆ క్రమంలో అనేకసార్లు భౌతికంగా దాడులు జరిగాయి జార్జిపై. అందుకే ఎప్పుడూ తనతోపాటు ఆరంగుళాల కత్తి సిద్ధంగా ఉండేది.
ఇదంతా ఒక ఎత్తు, విద్యార్థులలో సాంఘిక స్పృహ, ప్రగతిశీల భావాల్ని పెంచేందుకు జార్జి చేసిన కృషి ఒకటీ ఒక ఎత్తు. సైన్స్ కాలేజీకి, ఆస్ట్రానమీ డిపార్ట్‌మెంటుకీ ఆనుకొని ఉన్న క్యాంటీన్ వారందరికీ అడ్డా. క్యాంటీన్‌ని ఆనుకుని ఉన్న వేపచెట్టు, దానికింద నాలుగైదు బండరాళ్లు, వాటిపై కూచొని కబురులు… రాత్రిళ్లు, అందునా వర్షం కురుస్తున్న రాత్రిళ్లు, వెన్నెల రాత్రిళ్లు… నలభై ఏభై మంది చుట్టూ… మధ్యలో జార్జి…
అంతగా రాని తెలుగులో, హైదరాబాదీ హిందీలో, చక్కటి ఇంగ్లిష్‌లో జార్జిరెడ్డి ప్రసంగాల్లాంటి ప్రసారాలు… బండక్యాంటీన్ దగ్గర.. స్పష్టమైన మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంతో పాలస్తీనా సమస్య, గ్వాటెమాలా సంఘటనలు, ఫోకోసిద్ధాంతం, గెరిల్లా పోరాటం, ఆఫ్రికా ప్రజల విముక్తి ఉద్యమాలు.. ఇలా ఎన్నెన్ని అంశాలపై జార్జిరెడ్డి ఉపన్యాస ధార సాగేదో అంతులేదు.
కేవలం భావజాలమే కాదు, ఆచరణ కూడా జార్జిరెడ్డిలో కనిపించే తత్త్వం. స్లిప్పర్లే వేసుకునేవాడు. బట్టలు ఎక్కువ ఉండేవి కావు. రెండే రెండు జతలు. కొనుక్కోలేక కాదు. కొనుక్కోవడానికి ఆస్కారం లేని లక్షలాది పేదల్లా తానూ బతకాలని! ఒక పూటే తినేవాడు. ఆకలితో మలమల్లాడుతున్న నిర్భాగ్య అన్నార్తుల ఆకలి కేకలేంటో తానూ అనుభవించాలని! కాగితమ్మీద రాస్తే… మొత్తమంతా ఎక్కడా ఖాళీలేకుండా రాసేవాడు. దేన్నయినా మితంగా, పొదుపుగా ఉపయోగించేవాడు. నిర్లక్ష్యం, అహంకారం అతగాడికి తెలీవ్. ఎప్పుడూ సిటీబస్సుల్లోనే తిరిగేవాడు.
అతని మాటల్లో తీవ్రత, నిజాయతీ, స్పష్టత ఉండేవి. తనకు వచ్చే స్కాలర్‌షిప్ డబ్బుల్ని ఏ ఆధారం లేని ఓ బాల్యమిత్రుడికి వ్యాపారం పెట్టుకోమని ఇచ్చేశాడు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృష్టిని, విషయ పరిజ్ఞానాన్ని పెంచేందుకు అనేకానేక సెమినార్లు నిర్వహించాడు. రిక్షా కార్మికులతో కలసి భోజనం చేసేవాడు.
అయితే అదే సమయంలో క్యాంపస్‌లోని సమస్యలపై పోరాడేవాడు. ఫలితంగా శత్రువులు పెరిగారు. సోషలిస్టు భావాల్ని, ఆద ర్శాల్ని వ్యాప్తి చెయ్యాలన్న లక్ష్యంతో స్టడీసర్కిల్‌ను ఏర్పాటు చేశాడు. జార్జిరెడ్డి అప్రతిహతంగా సాగిస్తున్న ఉద్యమబాటను నిరోధించాలన్న కుట్రతో 1972 ఫిబ్రవరిలో జార్జిపై డీడీ కాలనీలోని అతని ఇంటి సమీపంలో దాడి జరిగింది.
గాయాలపాలయ్యాడు. ఒంటరిగా తిరగడం మంచిది కాదని మిత్రులు సూచించారు. ‘చావు అంత తేలికగా తన దగ్గరకు రాదని’ నవ్వుతూ అనేవాడు. అలా అన్న వారానికే- ఏప్రిల్ 14న సాయంత్రం ఇంజినీరింగ్ కాలేజీ భవనం దగ్గర ప్రత్యర్థుల చేతిలో హతుడయ్యాడు.తాను మరణించి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి పునాది అయ్యాడు. విద్యార్థి నాయకుడు- జ్ఞానం, ప్రేమ, మానవతల విషయంలో ఎలా ఉండాలో నేర్పాడు. తాను పుట్టిపెరిగిన సహజ జీవన స్థితినుంచి పేదల జీవిత స్థితికి మారాలనుకున్న తత్త్వం జార్జిలో విశేషమైంది. జీవన విధానాన్ని కింది వర్గాలకు అనుగుణంగా మార్చుకునే డీ క్లాసిఫై తత్త్వమే – జార్జిని అమరుణ్ని చేసింది. అతడు బతికుంటే.. ఇండియన్ చే గువేరా అయి ఉండేవాడు. సందేహం లేదు.

Saturday, 19 May 2012

సీమాంధ్రలో ఉద్యమాలు ఎలా జరుగుతాయి?



ఏ సమైక్యవాదిని కదిలించినా తెలంగాణ ఉద్యమం హింసాయుతంగా జరుగుతుందనీ, ఉద్యమకారులు భాద్యతగా ప్రవర్తించడంలేదనీ లెక్చర్లు దంచుతారు, తెలంగాణవాదులను తిడుతుంటారు. పైగా తాము సమైక్యాంధ్రకోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్నామనీ, అలా చేస్తున్న తమనోర్లు నొక్కుతున్నారనీ అంటుంటారు. నిజానికి ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం జరగడంలేదు, జరిగేది తెలంగాణ ఉద్యమమే. డిసెంబరు 9, 2009 తరువాత రెండువారాలు మాత్రం జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎన్నో హింసాత్మక చర్యలు చోటుచేసుకున్నాయి. బస్సులు, రైలు పెట్టెలూ తగలబెట్టడమేకాక గాక అనంతపురం బీఎస్సెన్నెల్ ఆఫీసు గోడౌన్లలో కోట్ల ఆస్తులు కాల్చివేశారు.   

ఆంధ్రరాష్ట్రం కొఱకు జరిగిన ఉద్యమం శాంతియుతంగా గాంధీమార్గంలో పొట్టిశ్రీరాములు దీక్షవలన జరిగిందని చెబుతారు. అప్పుడు ఎంత హింస జరిగిందీ, ఎలా పొట్టి శ్రీరాములు ప్రాణాలను పొట్టనబెట్టుకుందీ గత టపాల్లో చెప్పుకున్నాం. 

ఇక  ముల్కీ నిబంధనలపై తెలంగాణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు జరిగిన జై-ఆంధ్రా ఉద్యమం ఎలా జరిగిందో ఒక్కసారి పాత న్యూస్‌పేపర్లను తిరిగేస్తే తెలుస్తుంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, విభజన వ్యతిరేకించిన నాయకుల ఇళ్ళలోకి దూరి కొట్టడం, ఇంట్లో ఫర్నీచర్ తగలబెట్టడం లాంటి అనేకసంఘటణలు కనిపిస్తాయి. వీటన్నింటికీ పరాకాష్ఠ ఏమిటంటే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విజయవాడలో జరిగిన సభకు జనం లారీల్లో దివి తాలూకా నుంచి వచ్చి తిరిగి వెల్తుంటే లారీని ఉయ్యూరు సమీపంలో అడ్డుకుని అందులోని స్త్రీలను వివస్త్రలను చేసి అఘాయిత్యం చెయ్యడం. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? ఈవిషయంపై అప్పట్లో విశాలాంధ్ర పత్రికలో వచ్చిన సంపాదకీయం ఇక్కడ చూడొచ్చు.


కేవలం వంగావీటి, పరిటాల లాంటి వ్యక్తుల హత్యలకు జరిగిన నిరశనల్లో జరిగిన ప్రభుత్వ ఆస్తి నష్టం లెక్కలేనిది. అలాంటిది లక్షలకొద్ది ప్రజలు పాల్గొనే ప్రజా ఉద్యమాలు సీమాంధ్రలో జరిగితే ఎలాగుంటాయంటే పైన ఉదహరించినట్లే ఉంటాయి. 


Friday, 18 May 2012

వంచన, దోపిడీ పునాదులుగా (నాటకం)



సీన్-1:
ప్రకాశ్, గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్ కలిసి గదిలో మంతనాలు చేస్తున్నారు
.
సంజీవ్:                భజగోవిందం, భజగోవిందం. అంతా అయిపోయింది. ఆఖరుకు ఎమ్మెల్యే పదవి కూడా దక్కలేదు. ఈకమ్యూనిస్టులు చెయ్యబట్టి సొంత నియోజకవర్గంలో ఓడిపోయాను. ఇంతబతుకూ బతికి ఇంటెనుక చచ్చినట్టు ముఖ్యమంత్రినవుదామని కలలు గంటే ఎమ్మెల్యేగిరీ దక్కలేదు.

బ్రహ్మానంద్:  నాపరిస్థితి కూడా సేం టు సేం. నేనెవరితో చెప్పుకునేది?

గోపాల్:         బాగుంది వరస. నేను మాత్రం ఎమన్న ఎక్కువ బావుకున్నానా? నేనూ మీవంతే. ఇంగ్లీసోడి చదువులు చదువుకున్నందుకు ఇన్నాల్లూ కాంగ్రేస్ పార్టీలో నాయకత్వం వెలగబెట్టాము గానీ ఇప్పుడా ఇంగ్లీసోడు వెల్లిపొయ్యాక మన ఇంగ్లీసుకు విలువ లేదు. సొంతనియోజక వర్గంలో ప్రజలు మనల్ని నమ్మడం లేదు. ఇప్పుడేం మార్గం?

గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్:      ప్రకాశ్, నువ్వే ఏదో ఒక మార్గం చెప్పు. నువ్వు చక్కగా మంత్రి పదవి వెలగబెడుతున్నావుగా?

ప్రకాశ్:       నాగోడెవరితో చెప్పుకునేది? ఈ రాజా ఢిల్లీకి వెల్లినవాడు అక్కడే ఉండక వెనక్కొచ్చి ముఖ్యమంత్రి పదవి లాగేసుకున్నాడు. మనకు ఇక బతికుండగా ముఖ్యమంత్రి పదవి దక్కడం కష్టం.

సంజీవ్:      అయితే ఇప్పుడు ఏమిటి సాధనం?

ప్రకాశ్:        దీనికొక్కటే మార్గం ఉంది. మనం వెంటనే మనకో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేద్దాం. ప్రజల్లో మల్లీ పలుకుబడి వస్తుంది. ఒకవేళ రాష్ట్రం గానీ వస్తే గిస్తే మనం ముగ్గురం ముఖ్యమంత్రి పదవులు పంచుకోవచ్చు.

బ్రహ్మానంద్: మనం ఉద్యమం చేస్తే ఎవరు నమ్ముతారు? పోనీ నిరాహార దీక్షలూ గట్రా చేద్దామంటే మనకసలే అలవాటు లేదాయే?

ప్రకాశ్:          మన చేతికి మట్టంటించుకోవడం ఎందుకు? ఏదారే పోయే శ్రీరాం గాన్నో దీక్షకు కూర్చోపెడితే సరి, చస్తే వాడే చస్తాడు. పదవులు మనం కొట్టేయొచ్చు.

సంజీవ్:        బాగుంది ఈ ఐడియా. మరి ఎప్పుడు మొదలెడుదాం?

గోపాల్:    ఆలస్యం అమృతం విషం, శుభస్య శీఘ్రం. 
సీన్- 2:
ప్రకాశ్, గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్ గదిలో తీవ్రంగా వాదులాడుకుంటున్నారు.

సంజీవ్:           ముఖ్యమంత్రి పదవి నాకే దక్కాలి. లేకపోతే నేను నామద్దతు విరమించుకుంటాను. మా ప్రాంతం కొత్తరాష్ట్రంలో కలవనివ్వను.

గోపాల్:            నేనొప్పుకోను, నాకే దక్కాలి. నీక్కావాలంటే ఉపముఖ్యమంత్రి పదవి తీసుకో.

ప్రకాశ్: మీరు కాస్త ఊరుకోండి. వయసు పైబడ్డవాన్ని. ఈసారికి నన్ను ముఖ్యమంత్రిని కానివ్వండి. తరువాత మీఇష్టం.

పక్కగదిలో నుంచి బలహీనంగా మాటలు వినిపిస్తున్నాయి. "ఆకలి. ఆకలి. నాక్కాస్త అన్నం పెట్టండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నాకింకా ఈదీక్ష వద్దు. కాస్త అన్నం పెట్టండి, వచ్చేజన్మలో మీకడుపులో పుడతాను."

గోపాల్:              చచ్చేట్టున్నాడు. ఏం చేద్దాం? కాస్త తిండి పడేద్దామా?

సంజీవ్:             పైవాడు ఇంకా మన ఉద్యమానికి పూర్తిగా స్పందించలేదు. ఇప్పుడు దీక్ష విరమిస్తే ఎలా?

ప్రకాశ్:              అవున్నిజమే. ఇప్పుడు తిండి ఇవ్వొద్దు.

పక్క గదిలో నుండి దబ్బుమని కింద పడ్డ శబ్దం. ముగ్గురూ అక్కడికి వెల్తారు.

సంజీవ్:             చచ్చినట్టున్నాడు. ఇప్పుడేమిటి చెయ్యడం?

ప్రకాశ్:               ఇదే మంచి అదును. మన వాల్లకు చెప్పి అల్లర్లు చేయిద్దాం. బెజవాడ, నెల్లూరు, వైజాగ్ అన్నీ ఒక్కసారి అదిరిపోవాలి. ఈదెబ్బకు కేంద్రం దిగి రావాలి.


సీన్ - 3

టెంట్ హౌజ్ నుండి తెచ్చి వేసిన ఒక షామియాన కింద సంజీవ్, ప్రకాశ్, బ్రహ్మానంద్, గోపాల్ కూర్చుని మంతనాలు చేస్తుంటారు. పక్కనే కాస్త దూరంగా కొందరు మేకలు కాసుకునేవారు మాట్లాడుకుంటూ వీల్లే మన ముఖ్యమంత్రీ, మంత్రులూ నంట, ఈషామియానాలోనే మన పెబుత్వం నడుస్తుందంట నీకు తెలుసా అని చెవులు కొరుక్కుంటుంటారు.

సంజీవ్:                 శ్రీరాం గాడి చావు పుణ్యమా అని రాష్ట్రం, పదవులూ అయితే దక్కాయి గానీ ఏమిటీ విధి వైపరీత్యం? షామియానాలకింద అసెంబ్లీలూ, సెక్రెటేరియట్లూనూ!!

ప్రకాశ్:                  నా పరిస్థితి అయితే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది. ఇంతకుముందు చక్కగా మంత్రి పదవి వెలగబెడుతూ క్రిష్ణా రామా అంటూ ఉండేవాడిని. ఇప్పుడు ముఖ్యమంత్రినయ్యాను గానీ ఒక అసెంబ్లీ లేదు, ఒక కారు లేదు. ఎండలో కూర్చోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు జీతాలడుగుతున్నారు, ఇద్దామంటే ఒక్క పైసా లేదు.

గోపాల్:                ఇప్పుడేం చేద్దాం?

బ్రహ్మానంద్:          ఇలా ఎక్కువరోజులు భరించలేం, ఏదో ఒకటి చేసి ఈపరిస్థితినుండి బయట పడాలి. కేంద్రం ఏమన్నా డబ్బిస్తుందంటావా?

గోపాల్:                కేంద్రామా నా బొందా, ఒక చిప్ప ఇస్తుంది.

ప్రకాశ్:                ఎలాగోలా మనం భాగ్యనగర్‌ను దక్కించుకున్నామంటే మన కష్టాలన్నీ తీరిపోయి మల్లీ భాగ్యం చేతికొస్తుంది. దానికోసం ఏం చెయ్యాలో మార్గాలు వెతకాలి.

గోపాల్:               మనదగ్గర రాజధాని కాదు గదా ఒక జిల్లాను పరిపాలించడానికి కూడా సరిపోయే నగరం ఒక్కటంటే ఒక్కటి లేదు.

సంజీవ్:             మరెందుకాలస్యం? తొందరగా భాగ్యనగర్‌ను దక్కించుకునేందుకు పావులు కదుపుదాం. అక్కడ మిగులు బడ్జెట్ కూడా ఉందంట. మన కష్టాలన్నీ తీరిపోతాయి.

బ్రహ్మానంద్:           మనం కలవమంటే వాల్లు కలుస్తారా? మన సంగతి తెలిసినవారు ఎవరైనా మనల్ని నమ్ముతారంటావా?

సంజీవ్:           వాల్లు మనల్ని నమ్మరనేది నిజం, కానీ ఎలాగయినా నమ్మించాలి మరో మార్గం లేదు.

ప్రకాశ్:             ఐదుగురు పెద్దమనుషులను కూర్చోపెట్టి పంచాయితీ పెడదాం వాల్లేం అడిగితే అది ఒప్పుకుని సంతకాలు పెడదాం. అమలయేనాటికి ఎవడు బతికుంటాడో, ఎవడు చస్తాడో ఎవరికి తెలుసు?

సంజీవ్:           ఈ ఐడియా బాగానే ఉంది గానీ ముందు ఢిల్లీ ఒప్పుకుంటుందా?

ప్రకాశ్:            నీకన్నీ అనుమానాలే. మనం గట్టిగా లాబీయింగ్ చెయ్యాలి గానీ ఢిల్లీని ఒప్పించడం పెద్ద కష్టమా?

గోపాల్:           మరి అక్కడి ప్రజలసంగతో? వారు ఇందుకు అస్సలు ఒప్పుకోరు. మొదట్నుంచీ మన జనాలు వాల్లను తక్కువగా చూస్తారనీ, వాల్ల యాసను వెక్కిరిస్తారనీ వారికి తెలుసు కదా?

ప్రకాశ్:           అందరం తెలుగువాల్లమే అనీ, తెలుగు జాతి ఐక్యత అనీ ప్రచారం చెయ్యాలి. తెలుగుతల్లి విగ్రహాలు ఊరూరా పెట్టాలి. మన శ్రీరాం గాడి బొమ్మను కూడా అక్కడ ఊరూరా పెడదాం. మెల్లగా జనాలు దారికొస్తారు.

Tuesday, 15 May 2012

రెండు కళ్ళ సిద్ధాంతి






"తెలంగాణ, సీమాంధ్రా నాకు రెండు కళ్ళలాంటివి, రెండు చోట్లా మాపార్టీని కాపాడుకోవడమే మాలక్ష్యం, తెలంగాణలో తెలంగాణకు అనుకూలంగా సీమాంధ్రలో సమైక్యాంధ్రకు అనుకూలంగా మేము ఉద్యమిస్తం, ఆవిధంగా చాలా స్పష్టమైన వైఖరితో ముందుకుపోతున్నాం" ఇదే మన చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం. ఏమాత్రం నిజాయితీ ఉన్న మనిషైనా ఒక రాజకీయ పక్షం ఇలా రెండుకళ్ళవైఖరి కలిగిఉండడాన్ని ఒక నీతిబాహ్యమైన, మోసపూరిత విధానంగా ఒప్పుకుంటారు, పచ్చకామెర్లొచ్చిన పచ్చబాబులు తప్ప. 

ఒక ఇష్యూపై రెండువర్గాలు ఘర్షణపడుతున్నప్పుడు ఆప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక రాజకీయపార్టీ తమవైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సరే వైఖరి చెప్పడం సాధ్యం కాదు అనుకుంటే కనీసం తటస్థంగా ఉండాలి, అంతేకానీ ఇలా రెండుచోట్లా ఉద్యమం చేసి రెండుచోట్లా రాజకీయంగా లాభపడదాం, కేంద్రం ఏవైఖరి చెప్పినా అందుకు వ్యతిరేక సెంటిమెంటును కొళ్ళగొడదాం అని వ్యవహరించడం పచ్చి అవకాశవాదం. 

ప్రస్తుతం దేశంలో రగులుతున్న కొన్ని సమస్యలపై రెండుకల్లవిధానాన్ని అప్లై చేస్తే ఎలాగుంటుందో చూద్దాం:

అవినీతి, జన్‌లోక్‌పాల్ బిల్లు: మాపార్టీలో ఉన్న అవినీతిపరులైన నాయకులందరికీ జన్‌లోక్‌పాల్ బిల్లు ఇష్టం లేదు, ఆబిల్లు వస్తే వారికి అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు దండుకోవడం కష్టం. కానీ మాపార్టీలో మధ్యతరగతి కార్యకర్తలు అవినీతికి వ్యతిరేకం. కాబట్టి మాలంచగొండి నేతలు ఈబిల్లుకు వ్యతిరేకంగా, మిడిల్ క్లాస్ కార్యకర్తలు బిల్లుకు అనుకూలంగా ఉద్యమిస్తారు. మాపార్టీ ఇద్దరికీ మద్దతిస్తుంది, ఉద్యమానికి కావల్సిన మెటీరియల్‌ను ఇద్దరికీ సప్లై చేస్తుంది, ఆవిధంగా మేము ముందుకు పొతా ఉంటాము.

మహిళా రిజర్వేషన్: మాపార్టీలో మహిళలు రిజర్వేషన్ కావాలంటున్నారు, కొందరు పురుషులు మాత్రం దానికి వ్యతిరేకం. కనుక మేము ఇద్దరినీ రెండువైపులా ఉద్యమించమని చెప్పాం. మేము ఇద్దరికీ మద్దతిస్తున్నాం, ఆవిధంగా మేము స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నాం.

అయోధ్య, బాబ్రీ మసీదు: మాపార్టీలో ఉన్న హిందువులేమో అక్కడ గుడి కట్టాలంటున్నారు, ముస్లిములేమో మసీదు కట్టాలంటున్నారు. మేము ఇద్దరికీ అనుకూలం కనుక ఇద్దరికీ కత్తులు సప్లై చేసి పొడుచుకుని చావండని చెప్పాం. మాపార్టీ ఈవిషయంపై అన్ని పార్టీలకన్నా అత్యంత స్పష్టమైన వైఖరి కలిగి ఉంది.

దళితుల వర్గీకరణ: మాపార్టీకి మాలలు, మాదిగలు రెండు కళ్ళలాంటివారు. మాకు ఇద్దరి వోట్లూ ముఖ్యమే. ఈరెండు వర్గాల్లో ఎవరివోట్లు రాకపోయినా మాపార్టీకి డిపాజిట్లు దక్కడం కష్టమవుతుంది. అందుకే మేం మాపార్టీలో మాలలకూ, మాదిగలకూ ఇద్దరికీ ఉద్యమాలు చేసుకోవడానికి స్వేఛనిచ్చాం. ఇద్దరినీ వేర్వేరుగా ఉద్యమాలు చేసుకొమ్మనీ, ఎప్పుడయినా ఎదురుపడితే ఒకర్నొకరు కొట్టుకోమనీ సలహా ఇచ్చాం. ఇలా ముందుకు పోతాఉన్నామని నేను మనవి చేసుకుంటాఉన్నాను.  


ఇంతకూ తనపార్టీలో రెండువర్గాలకు ఉద్యమించుకోవడానికి స్వేచ్ఛనివ్వడానికి ఈయనెవరు? స్వేచ్ఛనిచ్చింది భారత రాజ్యాంగం. ఈయనిచ్చింది స్వేచ్చకాదు, రెండువర్గాలమధ్య మంటరాజెయ్యడానికి కావల్సిన నిప్పు. 



ప్రజలను ఏనాయకులూ ఎల్లకాలం మోసగించలేరు. ఈ మోసగాళ్ళ ఆటలు తమమోసం సాగినన్నాల్లు మాత్రమే నడుస్తాయి. మోసం బట్టబయలయాక కూడా ఇంకా మోసం చేద్దామనుకుంటే చివరికి రెండు కళ్ళూ పోయి గుడ్డికళ్ళు మిగుల్తాయి, ప్రస్తుతం ఈరెండుకళ్ళ సిద్ధాంతి పరిస్థితి ఇదే.  

రాజకీయ అమీబా ఈ నాగభైరవుడు

from: missiontelangana.com
లోక్ సత్తా అధినేత నాగభైరవ జయప్రకాశ్ నారాయణను మేం ఇదివరకోసారి ఊసరవెల్లి అని విమర్శించాం. అప్పుడాయన ఫ్యాన్స్ కొందరు తెగ బాధ పడ్డారు. భక్తులను అజ్ఞానంలో ముంచి తమకేదో అతీంద్రియ శక్తులు ఉన్నట్టు నమ్మించే బాబాలతోనూ నాగభైరవుడిని పోల్చాం. అప్పుడూ కొందరు భక్తులు గుండెలు బాదుకున్నారు.
కానీ ఆయన ఇటీవలి చేష్టలు చూస్తుంటే మాకు ఆయనను దేనితో పోల్చాలో కూడా అర్థం కావట్లేదు. బాగా అలోచించిన పిమ్మట  నాగభైరవుడిని అమీబాతో పోలిస్తే సరిగా సరిపోతుందని అనిపించింది మాకు.
ఎందుకంటారా?
ఒకసారి వికీపీడియా చదవండి:
“అమీబా ఒక ఏకకణ జీవి. పాతతరం ప్రకృతివాదులు అమీబాను “ప్రొటియస్ ఎనిమల్ క్యూల్” అని సంబోధించేవారు. గ్రీకుల దేవత “ప్రొటియస్” తన రూపాన్ని అనేకరకాలుగా మార్చుకునేవాడని, అతని పేరుమీద ఈ జీవికి ఆ పేరు పెట్టారు. ఆ తరువాత Bory de Saint-Vincent ఈ జీవికి “అమీబా” అను పేరు పెట్టాడు. గ్రీకు భాషలో అమీబా, అనగా “మార్పు”.
చిత్రంగా అమీబాకు ఉన్న అన్ని లక్షణాలూ లోక్ సత్తా అధినేతకు ఉన్నాయి. లోక్ సత్తా ఒక  ఏకవ్యక్తి పార్టీ. దానికి శాసనసభలో ఉన్నది కూడా ఒక్కడే ఎమ్మెల్యే. ఇక అమీబాలాగానే నాగభైరవుడు కూడా తన రాజకీయ రూపాన్ని అనేక విధాలుగా మార్చుకుంటుంటాడు. అమీబా లాగానే ఈయన కూడా “మార్పు”కు పర్యాయపదం అని అనుకుంటుంటాడు.
జీవితాంతం కమ్యూనిస్టులను, మార్క్సిస్టులను “అభివృద్ధి నిరోధకులని” తిట్టిపోసిన నాగభైరవుడు ఈమధ్య యూ-టర్న్ తీసుకుని రెండు “ఎర్ర” పార్టీలతో చర్చలు జరిపి అందులో మార్క్సిస్టులతో ఏకంగా ఎన్నికల పొత్తే ప్రకటించేశాడు. ప్రపంచబ్యాంకు ప్రవచించే సరళీకృత ఆర్ధిక విధానాలకు కొమ్ముకాసే ఫక్తు క్యాపిటలిస్టు, ఏకంగా మార్క్సిస్టు పార్టీతో జట్టుకట్టడం ప్రపంచ రాజకీయల్లోనే ఒక వింత పరిణామం కావచ్చు.   సారుగారి యూ-టర్న్ ను మింగలేక, కక్కలేక పాపం ఆయన ఆన్ లైన్ భక్తజనం ఈరోజుకీ చస్తున్నారు.

నిన్న ఆయన తమ పార్టీకి తెలంగాణలో మిగిలి ఉన్న కార్యకర్తల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్ధతు ఇస్తున్నట్టుగా కనిపించే ప్రకటన ఒకటి చేశాడు.
డిసెంబర్ 9 ప్రకటన వచ్చాక హుటాహుటిన డిల్లీ వెళ్లి “మీరొక ప్రకటన చేశారు కాబట్టే ఇంత గొడవ జరుగుతోంది, ఇంకొక ప్రకటన చేస్తే గొడవ సద్దుమణుగుతుంది” అని మన్మోహన్ సింగ్ చెవిలో ఊదివచ్చి, తదనంతరం నికృష్ట కమిటీ వేసేటట్టు అయిడియా ఇచ్చాడు నాగభైరవుడు. ఒక యేడాదిపాటు ప్రతి వేదిక మీదా తెలంగాణపై విషం చిమ్మిన ఆయన ప్రజల్లో ఉన్న ప్రబల ఆకాంక్షకు జడిసి తరువాత ఒక కొత్త పాట అందుకున్నాడు. “తెలంగాణ ఏర్పాటు అనేది ఉపద్రవమూ కాదు, అది అన్ని సమస్యలను తీర్చే సర్వరోగ నివారిణీ కాదు” అనే ఈ వింత వైఖరితో ఒక యేడాది గడిపాడు. రెండు ప్రాంతాల్లోని పార్టీ శాఖలకు  తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టే “స్వతంత్రం” ఇచ్చి రెండు నాలుకల విధానం కొంతకాలం కొనసాగించాడు. ఇవేవీ పారకపోవడంతో మొన్నటి ఉప ఎన్నికల్లో “నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు” “తెలంగాణ వస్తే స్వాగతిస్తాను” అనే బూటకపు నినాదాలు తీసుకున్నాడు.
అయితే అంతమాత్రాన నాగభైరవుడు మారుమనసు పొందాడని ఎవరైన వెర్రివెంగళప్పలు అనుకుంటే అది తప్పని ఆయనే నిరూపించాడు.
మొన్న మహబూబ్ నగర్ ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్ ముస్లిం అభ్యర్ధిని నిలబెడితే అతడిని ఓడగొట్టే ఉద్దేశ్యంతో ఎక్కడో హైదరాబాద్ లోని టోలీ చౌకీలో ఉంటున్న ఒక ముస్లిం విద్యావేత్తను తీసుకువచ్చి మరీ ముస్లిం ఓట్లు చీలిపోయేలా చూశాడు. రాష్ట్రంలో ఎన్నో స్థానాల్లో ఎన్నికలు జరుగుతుంటే లోక్ సత్తా ఒక్క మహబూబ్ నగర్లోనే ఎందుకు పోటీ చేసిందో బహిరంగ రహస్యమే.
ఇలా పైకొక మాట, లోపలొక ఆలోచనతో నెట్టుకొస్తున్న ఈ లోక్ సత్తా లీడర్ నిన్న తెలంగాణపై మరొక ప్రహసనానికి తెర తీశాడు.
“ప్రజాస్వామ్యంలో ప్రజల అకాంక్షలు ఎక్కువకాలం గౌరవించకపోవడం మంచిది కాదని, సమగ్ర చర్చతో సామరస్యంగా వచ్చే తెలంగాణకు లోక్ సత్తా పార్టీ అనుకూలం” అని పార్టీ శ్రేణులు చాటాలట.
అబ్బో! పొద్దున లేస్తే ప్రజాస్వామ్యం గురించి లెక్స్చర్లు దంచే నాగభైరవ జయప్రకాశ్ నారాయణకు ఎంత త్వరగా జ్ఞానోదయం అయ్యింది! ప్రజల ఆకాంక్షలు గౌరవించాలని ఇప్పుడు వెలిగిందా సార్ మీకు? బలవంతపు విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాలుగా పోరాటం చేస్తుంటే, ఆ మహత్తర పోరాటాన్ని చూడ నిరాకరించడమే కాదు దాన్ని అవహేళన చేసిన మేధావికి ఇప్పుడు జ్ఞానోదయమయ్యిందా?
ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో వివక్షకు, అవమానాలకు గురై స్వరాష్ట్రం కొరకు ఆంధ్ర ప్రజలు ఉద్యమించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ డిమాండును పరిశీలించడానికి ఒక కమిటీని వేసింది.
జవహర్ లాల్, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలతో కూడిన ఆ కమిటీ (JVP) “ప్రజానీకంలో అత్యధికులు స్వరాష్ట్రం కావాలని గట్టిగా కోరుకుంటే ప్రజాస్వ్యామ్యవాదులుగా దానిని మనం గౌరవించాల్సి ఉంటుంది” అని అంటూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందిగా సిఫారసు చేసింది.
అది యాభై ఏళ్ల నాటి మాట. ఈ మేధావిగారికి ఇంత చిన్న విషయం అర్థం కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. కళ్లముందే ఒక ప్రజాస్వ్యామ్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటే దానిని కళ్లుండీ చూడలేని కబోధిలా మారడం, తన కుల, వర్గ ప్రయోజనాలను కొమ్ముకాసే ఉద్దేశ్యంతో తెలంగాణా వ్యతిరేక ఉద్యమానికి ఊతమివ్వడం, డిల్లీలో తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు రచించడం, తీరా తాను వేయించిన శ్రీకృష్ణ కమిటీ ఒక కుట్రపూరితమైన  రహస్య ఎనిమిదో అధ్యాయం రాస్తే తేలుకుట్టిన దొంగలా మిన్నకుండటం – ఇవి అసలు నాయకత్వ లక్షణాలేనా?.
అయినా ఒక వంక పచ్చి తెలంగాణ వ్యతిరేక మార్క్సిస్ట్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని మరోవంక మేము తెలంగాణకు మద్ధతు అంటే నాగభైరవుడిని నమ్మేవారెవరు?
కొత్త రాజకీయాల గురించి, మార్పు గురించి ఊదరగొట్టే నాగభైరవ జయప్రకాశ్ నారాయణకు నిజంగా తాను మాట్లాడే అంశాలపై చిత్తశుద్ధి ఉండుంటే  ఆయన రాష్ట్ర విభజన అంశంలో ఇంకోలా వ్యవహరించి ఉండేవాడు.
సమాజంలో తనకు మేధావిగా ఉన్న గుర్తింపును, డిల్లీ పెద్దల వద్ద తనకున్న ప్రాబల్యాన్ని ఉపయోగించి తెలుగు ప్రజల మధ్య ఒక సామరస్యపూర్వక విభజనకు తానే ఒక మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. స్వయంగా సీమాంధ్ర ప్రాంతం వాడైనా ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి విభజన సందర్భంగా వచ్చే అనేక చిక్కుముడులను, పంపకాల సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించే అవకాశం ఆయనకు ఉండింది. అలాంటి ఒక పెద్దమనిషి పాత్రను ఆయన పోషించి ఉంటే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేది.
కానీ పైకి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది మరొకటి అనే ఫక్తు రాజకీయ నాయకుడిలాగానే ఆయన ఉండదలిచాడు. రాజకీయాలను మార్చడం కన్నా, తను, తన పార్టీ గాలివాటుగా మారడమే కొత్త రాజకీయం అనుకుంటున్నాడు కాబట్టే ఆయన పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా కొనసాగుతోంది. ఇది మింగుడుపడక ఈమధ్య “మీకు అవసరం లేకపోతే చెప్పండి పార్టీని మూసేస్తాం” అని కూడా బెదిరిస్తున్నాడు.  అందుకే 2014 ఎన్నికల్లో కనుక ఓటమి పాలైతే ఆయన పార్టీని చాపచుట్టేసి పెద్దల సభకు చెక్కేస్తారన్న ప్రచారం కూడా ఇప్పుడు ఊపందుకుంటున్నది.

Monday, 14 May 2012

గద్దరన్న, జెర పరేషాన్ జెయ్యకే!



గద్దరన్న నువ్వు పాటపాడితె మంచిగనిపిస్తది, ఉషారొస్తది, మల్లి మల్లి ఇనాలనిపిస్తది. నీ పాటంటె మాకందరికీ ఇష్టం. నీమాటె....ఎట్లెట్లనో ఉంటది.  అర్ధమయినట్లె ఉంటది..కని చివరికి చెప్పేదేందో అర్ధం కాదు..పెద్దపెద్ద మాటలేవో జెప్పుతవ్..శాస్త్రీయ మిలిటెంటు ఉద్యమం అంటవ్, యుద్ధ పంథా అంటవ్ ఏందో సమజ్ గాదు. నీ మాటలతోటి పరేషాన్ అయితదే.

తెలంగాణ ప్రజా ఫ్రంట్ అని ఏదో ఫ్రంట్ పెట్టినవు, నేను తెలంగాణ వచ్చేదాక ఇంటికి పోను, ప్రజలతోనె ఉంట అన్నవు, అట్లన్నంక మల్లి కనపడలేదు, ఏడికి పొయినవె ఇన్నిరోజులు ఇంట్ల గూసున్నవా?  

ఒక్క మాట మంచిగ జెప్పినవు..ఉద్యమం ప్రజలను ఐక్యం జేస్తుంటె ఎన్నికలు ప్రజలను విడగొడుతున్నయి అని జెప్పినవు..మంచిగనిపించింది. కని దానికి నువ్వు జెప్పె పరిష్కారమె బాగనిపిస్తలేదె. ఎన్నికల్లో పాల్గోకుండా ఉట్టి ఉద్యమాలతోనె తెలంగాణ ఎట్ల వొస్తదే?మనము ఎన్నికలను బహిష్కరిస్తె ఎవడో సీమాంధ్ర తొత్తు వచ్చి ఎలక్షన్ల నిలబడి గెలిస్తడు. తర్వాత వాడె మన నెత్తికెక్కి గూసుంటడు, గప్పుడెట్లనే.

నిన్న టీవీల నీప్రోగ్రాం ఇంటుంటె కొంచెం సమజ్ గాలె.. తెలంగాణకోసం కోకొకోలమీద ఉద్యమం ఎందుకు జెయ్యాల్నె? నాకు తెలిసి తెలంగాణ ఉద్యమమనేది నిధులు, నీళ్ళు, నియామకాల్లో పాలకవర్గం తెలంగాణపై జూపుతున్న వివక్ష నుండి బయట పడేందుకు. గట్లనే మన సంస్కౄతీ, మన చరిత్రలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులనుండి బయటపడేందుకు. మరి గీ కోకొకోలోనికి తెలంగాణ అయితేంది, ఆంధ్ర అయితేంది ఎవరు దాగిన అందులొ పురుగులమందు జెయ్యబట్టి కడుపు కరాబు అయితది గదనె.

అయినా గీ కోకొకోలోడు మన తెలంగాణనేమన్న రాకుండ అడ్డుకుంటున్నడా, గానిమీద పోరాటం జేస్తె తెలంగాణ వస్తదా? తెలంగాణ వచ్చినంక నిమ్మలంగా కోకొకోలోన్ని తెలంగాణల ఉంచాల వద్దా అనేది డిసైడ్ జేద్దాం గిప్పుడెందుకే కోకోకోల ముచ్చట?

ఒక అన్న, ఒక తమ్ముడు (కథ)

(interesting story that has parallels with state division)
అదో పేద కుటుంబం. ఒకప్పుడు బాగానే బతికినవారు. అయితే చిన్న వయసులో తండ్రి చనిపోవడంతో సంపాదనలేక సంసారం చితికిపోయింది. తల్లే ఎలాగో పిల్లల్ని పెద్ద చేసి పిల్లల పెళ్లిళ్లు కూడా చేసింది. కూతుర్లు అత్తగారింటికి వెళ్లగా మిగిలిన ఇద్దరు కొడుకులూ ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. అన్న ఏ పని చేసేవాడు కాదు. బలాదూరు తిరిగేవాడు. సంపాదన లేకపోయినా ఆయన చేసే పెత్తనాల వల్ల ఊర్లో మంచి పలుకుబడే ఉండేది. తమ్ముడు చిన్న నౌకరీ మీదే కుటుంబం గడిచేది. సంపాదించేది తమ్ముడయినా పెద్దవాళ్లు కాబట్టి ఇంట్లో అన్నా, వదినల పెత్తనమే సాగేది. ఇంటెడు చాకిరీ చేసే తమ్ముడు భార్యకు కడుపునిండా తిండి కూడా దొరికేది కాదు. తమ్ముడు పెళ్లయినప్పుడు తమ్ముడి భార్యకు ఆమె పుట్టింటి వారు ఒక ఆవు దూడనిచ్చారు. కాలం గడుస్తున్న కొద్దీ ఆవు పెద్దదయి బాగా పాలివ్వసాగింది.

అయితే పాలన్నీ అన్న పిల్లలే తాగేవారు. తమ్ముడి పిల్లలకు పాలూ, పెరుగు దొరికేవికావు. ఇంట్లో ఒక దానిమ్మ చెట్టు ఉండేది. ఆ పళ్లని కూడా అన్న పిల్లలే ఆరగించేవారు. ఇలా సంపాదిస్తున్నా ఆహారం దొరకక క్రమంగా తమ్ముడు, తమ్ముడి భార్యా, పిల్లలూ బక్కచిక్కసాగారు. దాంతో వీరికన్నా బలంగా తయారైన అన్న పిల్లలు దౌర్జన్యం చేసేవారు, తమ్ముడి పిల్లలను గేలి చేసేవారు. కొన్నాళ్లకు ఒళ్లు మండిన తమ్ముడి భార్య భర్తతో మనం దోపిడికి గురవుతున్నాం. ఉమ్మడి కుటుంబంలో మనకు ఇబ్బందిగా ఉంది. విడిపోవడం తప్ప ఇంకో మార్గం లేదని తెగేసి చెప్పింది. భర్త ధైర్యం చేయకపోవడంతో తనే ఊర్లో పెద్దమనుషుల పంచాయితీ పెట్టించి ‘ నా భర్త పనిచేసి సంపాదిస్తున్నా మాకు సరిగా తిండి కూడా దొరక అందుకే విడిగా ఉండాలనుకుంటున్నామ’ని మొరపెట్టుకుంది.

అప్పటిదాకా తమ్ముడి సంపాదనతో ఏ పనిచెయ్యకుండా చక్కగా కూర్చుని తింటున్న అన్న కుటుంబానికి ఈ పరిణామంతో గట్టి షాక్ తగిలింది. ‘అమ్మో...విడిపోతే రేపటి నుంచి నేను ఏం చేసి ఈ కుటుంబాన్ని పోషించాలి?’ అని అన్న భయపడ్డాడు. ‘ఉన్నపళంగా విడిపోతే ఇంటిపని, వంటపని నేనే చేసుకోవాలి, ఎలా?’ అని అన్న భార్యా అనుకుంది. ‘ఇప్పుడు చక్కగా ఆవుపాలు తాగుతున్నాం. గడ్డ పెరుగు తింటున్నాం. చిన్నాన్న వాళ్లు విడిగా ఉంటే ఇవేవీ మనకు దక్కవు’ అని పిల్లలూ దిగులు పడ్డారు. అంతాకలిసి ఉమ్మడి కుటుంబం విడిపోకుండా అడ్డుకోవాలని నిర్ణయానికి వచ్చి అన్న, వదినలు తమ కుటుంబం విడిపోవడానికి వీల్లేదంటూ పెద్దమనుషుల దగ్గర ఎదురు పంచాయితీ పెట్టారు. ఇక పంచాయితీ మొదలైంది.

‘అదేంటీ...విడిపోవడానికి వీల్లేదంటూ శాసించే హక్కు మీకెక్కడిది? సంపాదన మాది, కూర్చుని తింటున్నది మీరు. నష్టం, మాకు లాభం మీది. నష్టాలతో కష్టాల్లో ఉన్న మేము నిర్ణయించుకోవాలి కలిసుండాలా? విడిపోవాలా? అని. ఆ హక్కు మాది. మీరెవరు వద్దనడానికి?మేం విడిపోతామని గట్టిగా పట్టుబడుతుంటే ఉన్న ఆస్తిపాస్తులను ఎలా పంచుకోవాలనే విషయంపై పంచాయితీ పెట్టించాలి గాని విడిపోవడానికి వీల్లేదని పంచాయితీ పెట్టడంలో అర్థంలేదు’ అంటూ తమ్ముడు నెత్తి, నోరూ బాదుకున్నాడు. ‘మనం ఒక తల్లి బిడ్డలం. ముందునుంచీ కలిసే ఉన్నాం. ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇదంతా ఆ పక్కింటి ఎల్లయ్యగాడి కుట్రకాకపోతే విడిపోవాలనే పాడుబుద్ధి నీకెలా వస్తుంది?’ అంటూ అన్న ఎదురు ప్రశ్న వేశాడు. ‘చూడు తిండిలేక నా డొక్క ఎట్లా ఎండిపోయిందో? ఇన్నాళ్లూ నా సంపాదన దోచుకున్నారు. ఇకమీదట మీతో కలిసుండడం మాకు సాధ్యం కాదు’కాదంటూ కడుపు మాడిన తమ్ముడు మండిపడ్డాడు. ‘అమ్మో..అమ్మో...నీ సంపాదన మేం దోచుకున్నామా? మమ్మల్ని దొంగలంటావా? ఇట్లాగయితే మిమ్మల్ని అసలు విడిపోనివ్వం’ అంటూ అన్న భార్య హుంకరించింది. ‘ నీ డొక్క ఎండిపోతే దానికి మేమా బాధ్యులం? నీ సమస్యకు మమ్మల్ని కారణం చూపుతావా?’ అంటూ అన్న లాజిక్ లేవనెత్తాడు.‘ నా సమస్యకు నువ్వు కారణం అనడంలేదు. అసలు నా సమస్యే నువ్వు అంటున్నా. అందుకే నీతో కలిసుండే ప్రసక్తే వద్దంటున్నాను’ గొణిగాడు తమ్ముడు. ‘మిమ్మల్ని దోచుకుతింటున్నామని అందరిముందూ మమ్మల్ని దొంగల్లా చిత్రించారు. మీ సంపాదనంతా మేమే హరించినట్టు లెక్కలు, పద్దులతో సహా నిరూపించిండి. అప్పుడు ఒప్పుకుంటాం విడిపోవడానికి’ అన్న భార్య సవాలు విసిరింది. ఆ కటుంబం ఖర్చులు, లెక్కలు అన్నీ అన్నే చూసుకునేవాడు. అవన్ని ముందునుంచి తెలివిగా తనకనుకూలంగానే రాసుకున్నాడు. అయినా తమ్ముడు తనకు జరిగిన నష్టాన్ని లెక్కలతో సహా వివరించాడు. అవి అధికారిక లెక్కలు కావని అన్నా, వదిన కొట్టిపారేశారు. విడిపోవాలనే కుట్రతో దొంగపూక్కలు చూపిస్తున్నారని తమ్ముడి మీదే అపవాదు వేశారు.

కలిసుండాలనే కోరిక, గౌరవం నాకూ ఉండాలి కదా. కలిసుంటే మేం బతికే అవకాశంలేదు మొర్రో, మేము, మా పిల్లలు బతకడానికైనా విడిపోక తప్పదని మొత్తుకుంటుంటే నువ్వెందుకు మమ్మల్ని మీతో బలవంతంగా కలిపి ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నావ్? నీ లాభం కోసమే కదా...నువ్వు ఈ పట్టుమీదున్నావ్? ఉమ్మడి, సమష్ఠి భావన మీద ఇద్దరికీ గౌరవం ఉండాలి. ఒకరి గౌరవం ఇంకొకరికి లాభం అయినప్పుడు నా భద్రత నాకూ ముఖ్యమే. నా హక్కును నేను పొందడానికి లెక్కపూందుకు?లేని నీ హక్కు కోసం నువ్వెట్లా పంచాయితీ పెడతావు?’ అంటూ తమ్ముడూ గట్టిగానే వాదించాడు. ‘నీ సంపాదన, మీకున్న ఆవును చూసుకునే కదా... విడిపోదామనే పన్నాగాలు పన్నుతున్నారు. ఇన్నాళ్లూ మన ఉమ్మడి పెరట్లో గడ్డిమేసే ఆవు బలిసింది. కాబట్టి అది ఉమ్మడి ఆస్తి. ఇప్పుడు దాన్ని నువ్వొకడివే పట్టుకుపోతానంటే ఎట్లా?’ అన్న తెలివి ప్రదిర్శంచాడు. ‘ఎంత విడ్డూరం? అది మా పుట్టింటివారు నాకిచ్చిన అరణం. ఇన్నాళ్లూ మీరే దాని పాడి అనుభవించారు. విడిపోతున్నప్పుడు నా ఆస్తి నాకు దక్కాలనుకోవడం కూడా తప్పేనా?’ తమ్ముడి భార్య ఆవేదన చెందింది. ఊళ్లో పెద్దమనుషుల దగ్గర అన్నకు మంచి పలుకుబడి ఉంది. దాంతో ఇరు వాదనలు విన్నా..న్యాయం ఎవరి పక్షాన ఉందో తెలిసినా పెద్ద మనుషులు ఏ తీర్పూ ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఆ కుటుంబ సమస్యను సాగదీస్తూనే ఉన్నారు. తమ్ముడి కుటుంబం కడుపు మండినప్పుడల్లా పంచాయితీ నడుస్తుంది గానీ ఒడుస్తలేదు, తెగుత లేదు.

Saturday, 12 May 2012

నిర్వాకం

నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి

సాటివాడు చేరదీస్తే
నోటినిండా మన్ను గొడ్తివి
పదవి అధికారముల బూని
పదిలముగ తల బోడి జేస్తివి

దాపునకు రానిస్తె చనువుగ
టోపి పెడితివి లాభపడితివి
అన్నవై తమ్ముళ్ల తలలను
నున్న జేస్తివి మురియబడితివి

తొత్తులను చుట్టూర జేర్చుక
పెత్తనాలు చేయబడితివి
‘పొచంపాడు’ పథకము
కూచికూచి చేసేస్తివి

‘దొంగ ముల్కి’ సనదులిచ్చి
దొరతనమ్ము వెలిగిస్తివి
తమ్ములను ఇన్నాళ్లబట్టి
వమ్మజేస్తివి తిన్నగుంటివి

ఎన్నిసార్లు మొత్తుకున్నను
అన్నవయ్యును గమ్మునుంటివి
అన్న అధికారమునకు తగిన
న్యాయబుద్దిని కోలుపోతివి

చిలిపి చేష్టలు చేసి ఇప్పుడు
చిలుక పలుకలు పలుకుచుంటివి
–కాళోజి

Friday, 11 May 2012

ఒక సగటు సమైక్యవాది మనోగతం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందుకు వ్యతిరేకమో ఒక సగటు సమైక్యవాదికి గల కారణాలు:

1) హైదరాబాదులొ నేను ఇల్లస్థలాలూ, ఫ్లాట్సూ కొనుక్కున్నాను. ఇప్పుడు విడిపోతే నా ప్రాపర్టీ ధరలు పడిపోతే? వామ్మో వాయ్యో... ( అంతా నా స్వార్ధమే... సామాన్య జనం ఎటుపోతే నాకేం).

2) ఇప్పటిదాకా మాకు తేరగా క్రిష్ణా జలాలు వస్తున్నాయి మాకు న్యాయమయిన వాటాలేకపోయినా. ఇప్పుడు మీరాష్ట్రం ఏర్పడితే మరి రాష్ట్రాల మధ్య నీల్లవాటా బోర్డు నిర్ణయిస్తుంది కదా. అప్పుడు ఇప్పటిలాగా మాకు తేరగా నీల్ల రావుకదా ఎలా, అమ్మో?(ఇప్పుడు మాకు దక్కాల్సినదానికంటే ఎక్కువ దక్కుతుందనేది నిజమేననుకోండి).

3) ఇప్పుడంటే  అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో అన్నిచోట్ల పై అధికారులు మావారే కాబట్టి మావాల్లు మెల్లగ దొడ్డిదారిలో దూరిపోతారు. లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎలాగూ ఉంది మావారికి ఉద్యోగాలు ఇప్పించడానికి. ఇవన్నీ కాకపోతే దొంగ సర్టిఫికెట్ పెట్టి తెలంగాణ కోటాలో ఉద్యోగం తెచ్చుకోవచ్చు.

రేపు రాష్ట్రం ఏర్పడితే మాప్రాంతంలోని ఉద్యోగాల్లోనే మాలో మేమే పోటీపడాలికదా, ఎలా మరి?

4) ఇప్పుడంటే తెలంగాణ మాతో ఉంది కాబట్టి అందరం కలిసి ఇక్కడ తినేస్తాం కానీ రేపు విడిపోతే మాలో మేమే (సీమ, ఆంధ్రా వాల్లం) మీరు దోచుకుంటున్నారంటే మీరని కొట్టుకుంటాం, అలా మేం కొట్ట్కోవడం అవసరమా?

5) ఇప్పుడంటే తెలంగాణాకు చెందాల్సిన ఫండ్సన్నీ మాకు వచ్చేస్తున్నాయి, విడిపోతే మాప్రాంతంలోని ఆదాయంపై మాత్రమే మేము ఆధారపడాలి, అలా అయితే ఎలా?

6) ఇప్పుడంటే సమైక్య రాష్ట్రంలో మాకులం వాల్లు బలమయిన స్థానంలో ఉన్నారు. అధికారం మాకులానికి లేక ఫలానా కులం వారికే ఎప్పుడూ దక్కుతుంది. రేపు రాష్ట్రాలు విడిపోయి చిన్న రాష్ట్రం అయితే బడుగు వర్గాలు మమ్మల్ని వెనక్కి నెట్టేసి అధికారం చేజిక్కించుకుంటే, అమ్మో ఎలా?

7) మాకు సొంత గుండెకాయ లేదే? ఇంతకుముందు మద్రాసే మాగుండె అనుకున్నాం. అది అందకపొయ్యేసరికి హైదరాబాదే మాగుండె అని ఇప్పుడనుకుంటున్నాం. ఇప్పుడు విడిపోతే మాగుండెకాయ వెతుక్కోవాలి, ఎక్కడుందో ఏమో?

Thursday, 10 May 2012

కలిసి ఉంటే కలదు సుఖం (నాకుమాత్రమే!!)


(re-post)
Image taken from http://www.gideetelangana.blogspot.com/
రాష్ట్రం మొత్తం ఇప్పుడు ప్రత్యేక, సమైక్య వాదులుగా చీలిపోయింది. రెండు వర్గాలవారూ తాము చెప్పేదే రైటూ, అవతలివారిది అబద్దాలు అంటారు. ఇంతకూ సమైక్యవాదం, ప్రత్యేక తెలంగాణవాదం ఈ రెండు వాదనలలో ఉన్న తేడాలేమిటి?

- తెలంగాణా కోరుకునే వారు మాట్లాడేది మానీళ్ళు, మాఉద్యోగాలు, మాప్రాంతానికి ఫండ్సూ అని, ఇవన్నీ ఇన్నిరోజులు సరిగ్గా పంచబడలేదు కాబట్టి మాకు స్వయంపాలన కావాలని. సమైక్యవాదులు చెప్పేది మనదంతా ఒకే భాష కాబట్టి అంతా కలిసే ఉండాలి అని. నీళ్ళు, నియామకాలలో అన్యాయం జరుగుతుందని వాపోతుందన్నవారు కేవలం భాషను చూసి కలిసిఉండాలంటే ఎలాఉంటారు? సమాన అవకాశాలు, సమాన న్యాయం లేకుండా సమైక్య భావన ఎలా ఉంటుంది? కడుపు కాలుతుంటే తెలుగుజాతి గౌరవం అంటూ నినాదాలు ఎవరిని ఉత్తేజపరుస్తాయి?

- ఒక వ్యక్తి తెలంగాణా కావాలని వాదిస్తే అది తనకోసం కాదు, తనప్రాంతంలో ఉండే సామాన్యుడి కోసం. తెలంగాణా వస్తే బ్లాగుల్లో ఆర్టికల్స్ రాసుకునే ఐటీ ఉద్యోగికి ఒరిగేదేమీ ఉండదు, కానీ తాను వాదించేది తనకోసమో లేక తనలాంటి ఉన్నతవర్గం కోసమో కాదు. తెలంగాణా వాదులు వాదించేది ఎకరం భూమి ఉండి సాగునీటికోసం  దశాబ్దాలతరబడి ఎదురుచూస్తున్న ఒక రైతుకోసమో, ఒక డిగ్రీ చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే బీద మధ్యతరగతి యువకులకోసమో లేక ఫ్లోరైడ్‌తో జబ్బులు తెచ్చుకుంటున్న సామాన్యుడికి తాగునీటికోసమో.

ఒక సమైక్యవాది వాదించేది మాత్రం సీమాంధ్రలోని సామాన్యులకోసం కాదు (తెలంగాణలోని సామాన్యుడికోసం అసలు కాదు, ఐడియల్గా సమైక్యవాది ఇరుప్రాంతాలవారికోసం మాట్లాడాలి). హైదరాబాదులో భూములధరలగురించి, హైదరాబాదులో ఉండే ధనిక సీమాంధ్రులకోసం, తను లేక తమలాంటి రిచ్ అండ్ ఎలైట్ కోసం.

- తెలంగాణావాదులు మాట్లాడేది తమ ప్రాంత సామాన్యులకు న్యాయంగా రావాల్సిన నీల్లు, నిధులు, ఉద్యోగాలకోసం. సమైక్యవాదులు మాట్లాడేది తము ఇప్పటిదాకా అక్రమంగా కొల్లగొడుతున్న నీల్లు, నిధులు, ఉద్యోగాలకోసం.

- తెలంగాణ ఉద్యమం పేద మధ్యతరగతి ప్రజల, వెనుకబడిన తరగతులు, దళితుల ఉద్యమం. సమైక్య వాదన మాత్రం ధనిక అగ్రకుల వర్గాలవారి వాదన, సీమాంధ్ర సామాన్యులలో, సీమాంధ్ర దళిత వెనుకబడినవారిలో లేని భావన.

- తెలంగాణ వాదులు చెప్పేది తాము స్వయంగా అనుభవించిన వివక్షను గురించి. సమైక్యవాదులు చెప్పేది వివక్ష అనేది అబద్ధం, అంతా బాగానే ఉంది అని. మీరు అనుభవించనిదాన్ని అబద్ధం అని ఎలా చెబుతారు? కడుపుకాలిన వాడు నాకు ఆకలవుతుందని చెబితే పక్కన ఉన్న కడుపు నిండిన వాడు నీ ఆకలి అంతా ఉట్టి అబద్ధం అంటే ఎలాఉంటుంది?


- హైదరాబాదులో ఉండే కొద్దిమంది సెక్యూరిటీకి నష్టం అనే ఊహజనిత వాదన గురించి, కనీసం మిగతా తెలంగాణ ప్రాంతంలోని సీమాంధ్ర సెటిలర్ల సెక్యూరిటీగురించి కూడా కాదు.

మరి ఇందులో ఏది అసలయిన ఉద్యమం, ఏది అబద్దపు ఉద్యమం?