Sunday, 20 May 2012

ఎగిలివారుతోంది..~ అంతం లింగాడ్డి

డిసెంబర్ 9, 2010. సమయం రాత్రి సుమారు 11 గంటలు. విజయవాడ మహానగరం పూర్తిగా నిద్రలోకి జారనే లేదు. నడిరోడ్డున ఖరీదైన అద్దాల మేడలో మూన్‌లైట్ వెలుగులో సావివూతమ్మ తన భర్తతో సమైక్యాంధ్ర ఉద్యమంపై ఆరా తీస్తూ టీవీ చూస్తోంది. ఊహకందని రీతిలో కేంద్ర హోం మంత్రి ప్రకటన చదవడం ప్రారంభించాడు. ఊపిరి బిగబట్టుకొని శ్రీనివాసరావు వినసాగాడు. process of forming the State of Telangana will intiated. An appropriate resolution will be moved in the State Assembly.అది వింటున్న సావివూతమ్మ నిర్ఘాంతపోయింది. శ్రీనివాసరావు నిశ్చేష్టుడై దిగ్గున కుర్చీలోంచి లేచి నిలబడి, శాలువా ఒకసారి విదిల్చి భుజాన కప్పుకొని వడివడిగా బయటకు వెళ్లసాగాడు.. ‘‘ఇంతరాత్రి వేళ ఎక్కడికండీ?’’ అదుర్దగా సావివూతమ్మ అడుగుతుంది. ‘‘ఎక్కడికని అడుగుతావేంటి? రాష్ట్రం విడిపోతుందంటా, వినలేదా? అదెలా సాధ్యమౌతుందో తేల్చుకోవాలి. మన సత్తా ఏంటో కేంద్రానికి తెలియాలి. ఇప్పుడే వస్తాను’’ అంటూ విసురుగా బయటకు వెళ్లాడు. సావివూతమ్మ మాత్రం టీవీ వైపు చూస్తూ ఏదో దిగులుతో ఆలోచనలో పడింది. శ్రీనివాసరావు తోటి నాయకులను కలిసి మరి కొందరిని ఫోన్లో సంప్రదించి ఏవేవో భవిష్యత్ ప్రణాళికలు వేసుకొని, తెల్లవారి 4 గంటల వేళ ఇల్లు చేరాడు. సావివూతమ్మ ఇంకా కుర్చీలో ఒరిగి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ‘‘ఏమిటి సావిత్రీ! నువ్వు రాత్రంతా పడుకోలేదా? ఏమి... ! నాగురించి మాత్రమే కాదు, నీ ఆరోగ్యం గురించి కూడా కాస్తా పట్టించుకో’’ అంటూ బాత్రుంలోకి వెళ్ళాడు.

మర్నాడు రోజంతా శ్రీనివాసరావు క్షణం తీరిక లేకుండా ఎవ్నవరినో కలుసుకొని ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాడు. సావివూతమ్మ ఆలోచనలు అన్నీ తెలంగాణ పట్లనే తిరుగుతున్నాయి. అది గమనించిన శ్రీనివాసరావు ‘‘ఏమైంది సావిత్రీ! నిన్నటి నుంచి అదోలా ఉన్నావు, ఎందుకు?‘‘ఏమీ లేదండి, మన అమ్మాయి శ్రీదేవి గుర్తొచ్చింది. ఎంత చెడ్డా ఒక్కగా నొక్క కూతురే కదాండి. రాష్ట్రం విడిపోతుందని అంటున్నారు. మన అమ్మాయి పొరుగు రాష్ట్రం అయిపోతుంది. ఇక మనల్ని కలుస్తుందన్న ఆశ లేదండి. మీరు ఇంకా దాని మీద కోపం ప్రదర్శించకుండా ఒక్కసారి చూసొద్దామండి.’’‘‘మనల్ని కాదని వెళ్లిన ఆ పరువు తక్కువ దానిపై నీకెందుకు సావిత్రీ అంత ప్రేమ? అమ్మ, నాన్నలను కాదని ఇతర కులస్తునితో వెళ్లిన దానిని మనం వెతుక్కుంటూ వెళ్లడం ఏమిటి. అయినా, దానివల్ల గ్రామ పంచాయితీ నుంచి సచివాలయం వరకూ ఎంత మంది ఫలానా ‘పైరవీదారు శ్రీనివాసరావు గారి అమ్మాయి’ అంటూ గుసగుసలాడతారో నీకు తెలుసా? తల ఎత్తుకోకుండా చేసి వెళ్లినా దాని గురించి పదే పదే మాట్లాడితే బాగుండదు, మన పరువే పోతుంది. ముందు భోజనం వడ్డించు, ఆకలిగా ఉంది’’ అంటూ భోజనానికి కూర్చున్నాడు. 

సావిత్రి మారు మాట్లాడకుండా అన్నం వడ్డించి కళ్లు తుడ్చుకుంటూ పక్కనే నిలబడింది. భోజనం ముగించుకొని బెడ్‌రూంలోకి వెళ్లి బెడ్‌పై ఒరిగి కూర్చొని పుస్తక పఠనం మొదపూట్టాడు శ్రీనివాసరావు. సావివూతమ్మ పక్కనే పడుకొని బలవంతంగా కళ్లు మూసుకొని నిద్ర పోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ, కారే కన్నీళ్లు ఆమె దరికి నిద్రను రాకుండా చేస్తున్నాయి. శ్రీనివాసరావు ఉన్నట్టుండి కూతురి ఫొటోను ఎదపై ఉంచుకొని కళ్లు మూసుకొని కన్నీరు కార్చుతున్నాడు. అది గమనించిన సావివూతమ్మ తన భర్త కూతురిపై ద్వేషాన్ని పెంచుకున్నాడే గానీ ప్రేమను చంపుకోలేదన్న విషయం ప్రస్ఫుటంగా అర్థమైంది. భర్త భయానికి ఎంత ఆపుకున్నా సావివూతమ్మ దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చి భర్తపై వాలి ఏడవ సాగింది. ‘‘ఊరుకో సావిత్రి... రేపు అమ్మాయి వాళ్ల ఊరు వెళదామని’’ ముక్తసరిగా అన్నాడు. అదే పదివేలుగా భావించిన సావివూతమ్మ భర్తతో మరేం మాట్లాడకుండా లోపలికి వెళ్లి చిన్న సూటుకేసు సర్దసాగింది. 
మరునాడు పొద్దునే సావివూతమ్మ తన కూతురి గది మొత్తం వెతికి చూడగా అందులో ఒక పాత ఉత్తరం దొరికింది. తను అనుకున్నట్టుగానే కూతురు ప్రేమించిన అతని చిరునామా దొరికింది. ‘పేరు: బిక్షపతి, గ్రామం: బంజరుపల్లి, మం: హుస్నాబాద్, జిల్లా: కరీంనగర్’ అడ్రస్ ఉన్న కవర్‌ను జాగ్రత్తగా తన పర్సులో దాచుకుంది.

భార్యాభర్తలు ఇద్దరు రైలు ప్రయాణం, బస్ ప్రయాణాల ద్వారా ఎట్టకేలకు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం బంజరుపల్లి గ్రామానికి చేరుకున్నారు. చివరకు ఆ పల్లె చేరడానికి కాలినడక కూడా తప్పలేదు. ఎటు చూసినా పట్నం తుమ్మలు, పరికి కంపలు, మోదుగ చెట్లు దర్శనమిస్తున్నాయి. ఊరిలోకి ప్రవేశించి, ‘బిక్షపతి ఇల్లు ఎక్కడ’ అని వాకబు చేశాడు.తదేకంగా చూస్తూ ఆ ఊరి మలుపులో కూర్నున్న కొంతమంది ఊరివాళ్లు వీళ్లను ‘వీళ్లు ఆంధ్రోళ్ల లెక్క ఉన్నరు... మన ఊరికి ఎందుకు వచ్చిండ్రు? అదేరా ఆ బిక్షపతిగాడు ఆంధ్రోళ్ల పిల్లను తెచ్చుకొని లగ్గం చేసుకోలేదా? వాళ్ల అమ్మ, నాయినా కావచ్చురా.’ ఇలా చావడికాడి మాటలు శ్రీనివాసరావు దంపతుల చెవుల్లో ముళ్లలా గుచ్చుకుంటున్నాయి. తమను తాము తమాయించుకుంటూ ‘‘అయ్యా... మేం బిక్షపతి ఇంటికే వచ్చాము... ఆయన ఇల్లు కాస్తా చూపిస్తారా’’ అని అడిగాడు.

వీళ్లను గమనిస్తున్న ఒకాయన దగ్గరగా వచ్చి ‘‘గీడనె, గిట్టపోయి మూల తిరుగంగనే బొడ్డురాయి గద్దె ఉంటుంది. దానిపొంట ఉన్న ఇల్లు వాళ్లదే’’ అంటూ బదులిచ్చాడు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లారు.
పాత గోడలతో మరమ్మత్తుకు సిద్ధంగా ఉన్న కుమ్మరి పెంకుల ఇల్లు. ఇంటి ముందు తాటాకులతో వేసిన పందిరి, ఆ పందిరి కింద ఎర్ర మన్ను పూసిన మట్టి గద్దెపై కూర్చొని వెల్లుల్లిపాయలు ఒలుస్తూ కనిపించింది శ్రీదేవి. అకస్మాత్తుగా కనిపించిన అమ్మానాన్నను చూసిన శ్రీదేవి ఎక్కడలేని ఆనందంతో పరుగెత్తుకుంటూ వచ్చి తల్లిని హత్తుకుంది.కూతుర్ని చూసిన సావివూతమ్మ రాలుతున్న ఆనంద భాష్పాలను తుడుచుకుంటూ తనివితీర కూతుర్ని కౌగిలించుకుంది. అమ్మానాన్నలను లోపలికి తీసుకెళ్లి ‘కూర్చోమంటూ’ నులక మంచం వాల్చింది శ్రీదేవి. ఇదంతా గమనించిన శ్రీనివాసరావు అసహనంగా, అసౌకర్యంగా వాల్చిన మంచం పట్టెమీద ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు.

‘‘శ్రీదేవీ! చూశావా ఎంత దుర్భరంగా ఉందో నీ జీవితం. రాణీలాంటి జీవితాన్ని వదిలి ఈ కష్టాల కుంపటికి వచ్చి పడ్డావు. ఈ కొంపలో ఎవరూ గతిలేరా? నిన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్లారు. కనీసం కూర్చోడానికి ఈ ఇంట్లో ఒక కుర్చీ కూడా లేదు’’ అంటూ బాధతో నిండిన ప్రేమను కోపంగా వెళ్లగక్కుతూ అడిగాడు శ్రీనివాసరావు. ‘‘ఎవరూ లేరు నాన్నా. మా మామయ్య నేను రాకముందే దుబాయ్‌కి వెళ్ళాడు. అక్కడ ఏదో పని చేసుకుంటూ మాకు నెలనెలా డబ్బులు పంపిస్తున్నాడు. ఇక మా అత్తమ్మ రోజంతా కూలీకి వెళ్లి వచ్చి తానే వంట చేసి పెడుతుంది పాపం. నన్ను కూతురికంటే ఎక్కువ చూసుకుంటుంది. కనీసం కూరగాయలు కూడా నన్ను తరగనివ్వదు. చేద్దామని వెళ్లినా ‘చదువుకున్న దానివి. పైగా ఉన్న ఇంటి నుంచి వచ్చిన దానివి, నీకెందుకు ఈ పనులు? నేను ఉన్నానుగా’ అంటూ నన్ను ఏ పనీ ముట్టనివ్వదు. మాకు పది ఎకరాల భూమి ఉంది. కానీ, నీళ్లులేక బీడు భూములయ్యాయి.’’ 

‘‘అదేంది గోదావరి దగ్గరే కదా...’’ ఆలోచనగా అన్నాడు శ్రీనివాసరావు. 
‘‘అవును నాన్నా! ప్రస్తుతం ఆ నీళ్లు మా ప్రాంతానికి వచ్చే ప్రయత్నం చేయలేదు. పైగా నీరు దిగువ ప్రాంతాలకు ఇవ్వడమే సాధ్యమౌతుందని పాలకులంతా సాకులు చెబుతున్నారటా. ఇక ఇక్కడి వాళ్ళేమో ‘వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా మన వంతు వస్తుంది అన్నట్లుగా ఆంధ్రావాళ్లు పాలకులైనంత కాలం నీటి చుక్క రానియ్యరు’ అని తిడుతుంటారు నాన్నా!’’ యథాలాపంగా చెబుతూ పోతుంది శ్రీదేవి. కూతురి మాటలకు అసహనంగా సరేనంటూ, ‘‘మరి ఏరికోరి ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ ఆయన గురించి చెప్పవేం’’ అన్నాడు శ్రీనివాసరావు. ‘‘ఆయన మా మండలం హుస్నాబాద్‌లో ఓ గోల్డ్‌లోన్ ఆఫీస్‌లో పని చేస్తున్నాడు నాన్నా. సాయంత్రం వరకు వస్తాడు. అత్తమ్మ కూడా సాయంవూతం కల్లా వస్తుంది’’ అని చెప్పుకుంటూవారికి మజ్జిగ చేసి అందించింది శ్రీదేవి. ‘‘అదేంటి చుట్టుపక్కల ఆంధ్రాబ్యాంక్ లేదా? వారు గోల్డ్‌లోన్‌లు ఇస్తారు కదా.’’ 

‘‘ఉంది నాన్నా! కానీ, ఈ పల్లె జనాలు బంగారు నగలపై లోన్ కోసం ఆంధ్రా బ్యాంక్ వెళ్లడానికి ఇష్టపడరు.’’సావివూతమ్మ ఆత్రుతగా స్వరం తగ్గించి ‘‘మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడామ్మా?’’ అంది. ‘‘చాలా బాగా చూసుకుంటున్నాడు. నాకు అమ్మ, నాన్న ఖరీదైన బంగ్లా జీవితం లేదు కానీ కడుపునిండా తిండి, కంటికి రెప్పలా’ చూసుకునే భర్త అంతకన్నా ఎక్కువ అనురాగం, ఆప్యాయతలు, చూపే ఆత్మీయులు ఉన్నారు. నేను జీవితంలో ఏదీ కోల్పోవడం లేదు అనేంత సంతోషంగా ఉన్నానమ్మా.’’ వీళ్లు మాట్లాడుతుండగానే కూలీకెళ్లిన భాగ్యమ్మ ఇల్లు చేరింది. వీరిని చూసింది. ఎవరని అడిగే లోపే శ్రీదేవి పరిచయం చేసింది. ‘‘అయ్యో! తొవ్వ దొరకడానికి ఎంత తిప్పలైందో. మీరు వస్తున్నట్లు మతులవ్ చేస్తే నా కొడుకును హుస్నాబాద్‌లో ఉండమని చెబుతును కదా. ప్రయాణం బాగా జరిగిందా? ఎపుడు బయపూల్లిండ్రో ఏమో. శ్రీదేవి ఏవన్నా తినడానికి ఇచ్చినవా లేదా?’’ 
‘‘లేదు అత్తమ్మా, వచ్చేటప్పుడు హోటల్‌లో భోజనం చేశారట.’’ ‘‘అయితే నువ్వు వట్టిగనే కూసోబెట్టినవా? సుట్టాలు వచ్చినప్పుడు వీళ్లింటికాడా వండిన బువ్వకుండ ఉన్నదో లేదో అని అనుకొని తినచ్చమని చెబుతారు. ఉండు, దబదబ నేను ఏదన్న చేసి పెడతా’’ అంటూ చకచక టిఫిన్, టీ తయారు చేసి అందించింది బాగ్యమ్మ. ‘‘మీరు మాట్లాడుకుంటూ ఉండుండ్రి. నేను పొయికాడ పని చేసుకొని వస్తా’’ అంటూ వంట చేసి కోడి గుడ్డు కూర చారుతో భోజనం రెఢీ చేసింది భాగ్యమ్మ. ‘‘అన్నయ్యా! అన్నంతిందురు రండీ’’ అని పిలిచింది. ‘‘ఫరవాలేదు లెండి, నీ కొడుకు రానీ. వచ్చిన తర్వాత తింటా’’మంటూ ఆరుబయట కూర్చున్నారు. 

బిక్షపతి కోసం అందరు ఎదురు చూస్తున్నారు. దోమలతో ఇబ్బంది పడుతున్నట్లుగా గమనించిన భాగ్యమ్మ వేపాకు ఎదిరి పొగ తయారు చేసింది. దాంతో దోమల బెడద చాలావరకు తగ్గింది. బిక్షపతి రానే వచ్చాడు. ఇంట్లోకి వస్తూనే ‘‘నమస్కారమండి మామయ్యగారు! ఎప్పుడు వచ్చారు?’’ అంటూ పలకరించాడు. ఆశ్చర్యపోయిన శ్రీనివాసరావు ‘‘నేను ముందే తెలుసా?’’ అని అడిగాడు. ‘‘తెలుసు మామయ్యా! ప్రతి రోజు మీ ఫొటోను చూపిస్తూ మీ గురించి ఒక్క మాటైన చెప్పనిది మీ కూతురు నిద్రపోదు, పోనివ్వదు. అందుకే మిమ్మల్ని గుర్తుపట్టాను. నేను వస్తుంటే మా ఊరి వాళ్లు అందరూ ‘మీ అత్త, మామ వచ్చారురా బుచ్చిగా’ అన్నారు. చాలా సంతోషం. మా ఇంటికి వచ్చినందుకు. అమ్మా, చూశావా వారు పెద్ద మనస్సు చేసుకొని మన ఇంటికి వచ్చారు’’ అన్నాడు బిక్షపతి. ‘‘అవునురా వీళ్లు రావడం నిజంగా మన గోదారి మన ఇంటికి వచ్చినట్టుంది’’ అని సంబరపడింది భాగ్యమ్మ.

శ్రీనివాసరావు ఊహించని రీతిలో బిక్షపతి వాళ్ల నడవడి మాటల తీరు చూసి మురిసిపోయి వారిని మెచ్చుకోలుగా నాలుగు మాటలు మాట్లాడాలనిపించింది. కానీ, అహం ఆడ్డొచ్చి పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. లోలోపల మాత్రం తన కూతురు మంచి వ్యక్తిని ప్రేమించిందనుకున్నాడు. అందరూ భోజనాలు ముగించుకున్నారు.బిక్షపతి అత్త, మామలకు కొత్త మంచాలు, పరుపులు ఆరు బయట పరిచాడు. మరో పక్క వారికి ఏర్పాట్లు చేశాడు. రోజంతా శ్రమించడం వల్లనో ఏమో తొందరగానే నిద్రలోకి జారుకున్నాడు. భాగ్యమ్మ వియ్యపురాలు అందం, హోదా, దర్పం చూసి మురిసిపోయింది. ‘ఆమె మెడనిండా ఎన్ని నగలు వేసుకుందో! బాగా ఉన్నవాళ్లలాగా ఉన్నారు. మా వాడు దమ్మిడికూడా ఆశ పడకుండా కలవారి ఇంటిపిల్లనే తీసుకొచ్చాడని’ తనలోతానే మురిసిపోతూ వారి మాటలు వినసాగింది. 
శ్రీనివాసరావు సిగట్ ముట్టించుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ గాలిలోకి పొగ వదులుతూ ‘‘శ్రీదేవి! మీ ఆయన ఎంతవరకు చదివాడు?’’ అని అడిగాడు. ‘‘ఎం.ఎ. గోల్డ్ మెడల్ నాన్నా...’’ ‘‘అవునా, మరి సిటీకి పోయి ఏదైనా కాలేజీలో చేరి ఇంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు కదా!’’ అని అడిగాడు. మధ్యలో కలుగజేసుకుంటూ భాగ్యమ్మ ‘‘మాకే పది ఎకరాల పొలం ఉంది, వానలు పడక కరువు వచ్చి పంటలు లేక మేం కైకిలి చేసుకోవలసి వచ్చింది. లేకుంటే ఇద్దరు జీతగాళ్లు, నాలుగు నాగళ్లు పెట్టి వ్యవసాయం చేసేటోళ్లం. అలాంటి వ్యవసాయం నీళ్లు లేక భూమి బీటలు వారిపోయింది. కరువు తట్టుకోలేక నా పెనిమిటి దుబాయ్‌కి పోయిండు. అక్కడ ఈడికంటే ఎక్కువ పని దొరుకుతుందట... ప్రతి నెల మాకు పైసలు పంపిస్తడు. నా కొడుకు ఏదో పరీక్ష రాస్తే నౌకరి వస్తుందన్నరు.

మల్ల ఏ దేవుని నోట్లో మన్ను పడ్డదో నౌకరి రాలేదు. నౌకరి వచ్చిన మాకు మీది మీది అప్పులు తీరేవి. ఇపుడు సిటీకి పోయి సంపాదించడానికి ఊరు విడిచి పోతామంటే ఊళ్లో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటరు. ‘బాకీలు ఎగబెట్టి పోతుండ్రు’ అని తిడతారు.’’ ‘‘పరీక్ష ఏంటిదమ్మా’’ శ్రీదేవిని అడిగాడు శ్రీనివాసరావు. ‘‘అవును నాన్న! ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్ష రాస్తే మంచి మెరిట్ మార్కులే వచ్చాయి. ఇంటర్వ్యూలో కూడా మంచి మార్కులే వచ్చాయి. లిస్ట్‌లో పేరు కూడా వచ్చింది. ఉద్యోగం వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో ఈ జోన్‌లోని ఉద్యోగాల్ని ఆంధ్రజోన్‌లలో పైరవీ చేసి నింపారట. అందుకే నాన్నా! ఉద్యోగాల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఈయన బాధపడ్డారు నాన్నా. కూతురి మాటలు విన్న శ్రీనివాసరావు గొంతులో పచ్చి వెలక్కాయపడ్డంత పనైంది. లోలోపల బాధపడ్డాడు.మరునాడు పొద్దున్నే బిక్షపతి లేచి తన పనుల్ని ముగించుకొని శ్రీనివాసరావు కోసం చూస్తున్నాడు. శ్రీనివాసరావు మాత్రం తన ఇంట్లోలాగానే నెమ్మదిగా లేచాడు. స్నానం చేసి టిఫిన్ ముగించుకున్నాడు. ‘కోపతాపాలు ఎన్ని ఉన్నా చేసిన మర్యాదల కోసమైన పలకరించాలి’ అన్నట్లు శ్రీనివాసరావు ప్రాంతీయత గురించి లేవనెత్తాడు. 

‘‘మీరు తెలంగాణ ఉద్యమం చేయడంలో అర్థం ఉందనే భావిస్తున్నారా బిక్షపతి?’’ దానికి సమాధానంగా చిన్నగా నవ్వి ‘‘అవును మామయ్యా’’ అన్నాడు. ‘‘చదువుకున్నవాడిగా నీవే చెప్పు. మీ నుండి ఆంధ్రా వాళ్లు బలవంతంగా లాక్కుంటున్నది ఏమిటి ఈ ప్రజాస్వామ్యంలో?’’ ‘‘ఎందుకుండదు మామయ్య! ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పాలకులు తయారు చేసే నిబంధనలే చెల్లుతాయి. అయితే, ఆ పాలకులు ప్రాంతీయ పక్షపాతంతో నిబంధనలు అమలు చేస్తే ఇట్లాంటి ఉద్యమాలే పుట్టుకొస్తాయి.’’ ‘‘నీకు తెలియకుండా మోసం చేసి తీసుకెళ్లేది ఏమీ లేదు కదా?’’ అన్నాడు శ్రీనివాసరావు. ‘‘సరే మామయ్యా! అవకాశాల్ని ఉపయోగించుకుంటున్నాము అని మీరంటున్నారు. అవసరాలు కూడా తీరకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మా వాళ్లు అనుకుంటున్నారు. కానీ, మా తెలంగాణ త్వరలోనే ఎగిలి వారబోతుంది (ఉషోదయం లేదా తెల్లవారుతోంది). ఎగిలిబారేదాకా మేమంతా ఉద్యమం చేస్తూనే ఉంటాం’’ అని వాదించకుండా ఊరుకున్నాడు బిక్షపతి. శ్రీనివాసరావు కూడా ప్రయాణానికి వేళ అయిందని చెప్పి సావివూతమ్మతో బయలుదేరాడు. 

బిక్షపతి, భాగ్యమ్మ ఊరి బయట వరకూ వచ్చారు. బస్టాండ్‌లో ఉన్నవారందరికీ భాగ్యమ్మ తన వియ్యపురాలిని గర్వంగా పరిచయం చేస్తూనే ఉంది బస్ కదిలే వరకు.తిరుగు ప్రయాణంలో రైలులో రద్దీ మామూలుగానే ఉంది. ఒకే సీటుపై పక్కపక్కన కూర్చున్నారు శ్రీనివాసరావు, సావివూతమ్మ. కదులుతున్న రైలు కిటికీలోంచి బయట చూస్తూ సావివూతమ్మ కూతురి జీవితం గురించే పదే పదే ఆలోచిస్తుంది. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కోసం బీద కుటుంబంలోకి వెళ్లాల్సి వచ్చింది. అయిందేదో అయింది. అమ్మాయిని, అల్లుణ్ని ఇంటికి పిలిస్తే బాగుండును. చూసొద్దామం చిర్రుమన్నాడు, ఇక వారిని ఇంటికి పిలుద్దామంటే పరువు, ప్రతిష్ట అంటూ కోపగించుకుంటాడేమో అనుకుంటూ భర్తవైపు నెమ్మదిగా చూసింది. అప్పటికే నిద్రపోతున్నట్టుగా కనిపిస్తున్న శ్రీనివాసరావు మూసిన కనుప్పల నడుమ నుండి అస్పష్టంగా కన్నీటి ధార కనిపించింది. 
బహుశా భర్త కూడా కూతురి గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నాడేమో! అని భావించిన సావిత్రి ‘‘ఏమండి’’ అంటూ తట్టి లేపింది. కళ్లు తుడుచుకుంటూ ‘‘ఏమిటి సావిత్రీ?’’ అని అడిగాడు. ‘‘దిగులుగా ఉన్నారు. శ్రీదేవి గురించే ఆలోచిస్తున్నారా?’’ ‘‘అవును సావిత్రీ!’’ ‘‘బాధపడటం ఎందుకండీ? గుణవంతుడైన భర్త, ఆప్యాయంగా చూసుకునే అత్తగారు దొరికారు.’’ ‘‘లేదు సావిత్రీ! అమ్మాయి చెప్పినట్లు తెలంగాణ జోన్లలోని ఉద్యోగాలు ఆంధ్రజోన్‌లలో వారికి ఇప్పించడంలో నా పాత్ర కూడా ఇమిడి ఉంది. కానీ, నా కూతురికే అన్యాయం జరుగుతుందని ఆలోచించలేక పోయాను’’ అంటూ కుమిలిపోయాడు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా రైలు నిలిచిపోయింది. అప్పుడే బోగీలోకి ప్రవేశించిన టి.సి.ని ‘‘ఏమైంది?’’ అని అడిగాడు శ్రీనివాసరావు. ‘‘డిసెంబర్ 9 ప్రకటనకు నిరసనగా ఆంధ్ర ప్రాంతం మొత్తం రైలురోకో జరుగుతోందట, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది’’ అంటూ తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోయాడు.

No comments:

Post a Comment

Your comment will be published after the approval.