Friday, 18 May 2012

వంచన, దోపిడీ పునాదులుగా (నాటకం)



సీన్-1:
ప్రకాశ్, గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్ కలిసి గదిలో మంతనాలు చేస్తున్నారు
.
సంజీవ్:                భజగోవిందం, భజగోవిందం. అంతా అయిపోయింది. ఆఖరుకు ఎమ్మెల్యే పదవి కూడా దక్కలేదు. ఈకమ్యూనిస్టులు చెయ్యబట్టి సొంత నియోజకవర్గంలో ఓడిపోయాను. ఇంతబతుకూ బతికి ఇంటెనుక చచ్చినట్టు ముఖ్యమంత్రినవుదామని కలలు గంటే ఎమ్మెల్యేగిరీ దక్కలేదు.

బ్రహ్మానంద్:  నాపరిస్థితి కూడా సేం టు సేం. నేనెవరితో చెప్పుకునేది?

గోపాల్:         బాగుంది వరస. నేను మాత్రం ఎమన్న ఎక్కువ బావుకున్నానా? నేనూ మీవంతే. ఇంగ్లీసోడి చదువులు చదువుకున్నందుకు ఇన్నాల్లూ కాంగ్రేస్ పార్టీలో నాయకత్వం వెలగబెట్టాము గానీ ఇప్పుడా ఇంగ్లీసోడు వెల్లిపొయ్యాక మన ఇంగ్లీసుకు విలువ లేదు. సొంతనియోజక వర్గంలో ప్రజలు మనల్ని నమ్మడం లేదు. ఇప్పుడేం మార్గం?

గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్:      ప్రకాశ్, నువ్వే ఏదో ఒక మార్గం చెప్పు. నువ్వు చక్కగా మంత్రి పదవి వెలగబెడుతున్నావుగా?

ప్రకాశ్:       నాగోడెవరితో చెప్పుకునేది? ఈ రాజా ఢిల్లీకి వెల్లినవాడు అక్కడే ఉండక వెనక్కొచ్చి ముఖ్యమంత్రి పదవి లాగేసుకున్నాడు. మనకు ఇక బతికుండగా ముఖ్యమంత్రి పదవి దక్కడం కష్టం.

సంజీవ్:      అయితే ఇప్పుడు ఏమిటి సాధనం?

ప్రకాశ్:        దీనికొక్కటే మార్గం ఉంది. మనం వెంటనే మనకో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేద్దాం. ప్రజల్లో మల్లీ పలుకుబడి వస్తుంది. ఒకవేళ రాష్ట్రం గానీ వస్తే గిస్తే మనం ముగ్గురం ముఖ్యమంత్రి పదవులు పంచుకోవచ్చు.

బ్రహ్మానంద్: మనం ఉద్యమం చేస్తే ఎవరు నమ్ముతారు? పోనీ నిరాహార దీక్షలూ గట్రా చేద్దామంటే మనకసలే అలవాటు లేదాయే?

ప్రకాశ్:          మన చేతికి మట్టంటించుకోవడం ఎందుకు? ఏదారే పోయే శ్రీరాం గాన్నో దీక్షకు కూర్చోపెడితే సరి, చస్తే వాడే చస్తాడు. పదవులు మనం కొట్టేయొచ్చు.

సంజీవ్:        బాగుంది ఈ ఐడియా. మరి ఎప్పుడు మొదలెడుదాం?

గోపాల్:    ఆలస్యం అమృతం విషం, శుభస్య శీఘ్రం. 
సీన్- 2:
ప్రకాశ్, గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్ గదిలో తీవ్రంగా వాదులాడుకుంటున్నారు.

సంజీవ్:           ముఖ్యమంత్రి పదవి నాకే దక్కాలి. లేకపోతే నేను నామద్దతు విరమించుకుంటాను. మా ప్రాంతం కొత్తరాష్ట్రంలో కలవనివ్వను.

గోపాల్:            నేనొప్పుకోను, నాకే దక్కాలి. నీక్కావాలంటే ఉపముఖ్యమంత్రి పదవి తీసుకో.

ప్రకాశ్: మీరు కాస్త ఊరుకోండి. వయసు పైబడ్డవాన్ని. ఈసారికి నన్ను ముఖ్యమంత్రిని కానివ్వండి. తరువాత మీఇష్టం.

పక్కగదిలో నుంచి బలహీనంగా మాటలు వినిపిస్తున్నాయి. "ఆకలి. ఆకలి. నాక్కాస్త అన్నం పెట్టండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నాకింకా ఈదీక్ష వద్దు. కాస్త అన్నం పెట్టండి, వచ్చేజన్మలో మీకడుపులో పుడతాను."

గోపాల్:              చచ్చేట్టున్నాడు. ఏం చేద్దాం? కాస్త తిండి పడేద్దామా?

సంజీవ్:             పైవాడు ఇంకా మన ఉద్యమానికి పూర్తిగా స్పందించలేదు. ఇప్పుడు దీక్ష విరమిస్తే ఎలా?

ప్రకాశ్:              అవున్నిజమే. ఇప్పుడు తిండి ఇవ్వొద్దు.

పక్క గదిలో నుండి దబ్బుమని కింద పడ్డ శబ్దం. ముగ్గురూ అక్కడికి వెల్తారు.

సంజీవ్:             చచ్చినట్టున్నాడు. ఇప్పుడేమిటి చెయ్యడం?

ప్రకాశ్:               ఇదే మంచి అదును. మన వాల్లకు చెప్పి అల్లర్లు చేయిద్దాం. బెజవాడ, నెల్లూరు, వైజాగ్ అన్నీ ఒక్కసారి అదిరిపోవాలి. ఈదెబ్బకు కేంద్రం దిగి రావాలి.


సీన్ - 3

టెంట్ హౌజ్ నుండి తెచ్చి వేసిన ఒక షామియాన కింద సంజీవ్, ప్రకాశ్, బ్రహ్మానంద్, గోపాల్ కూర్చుని మంతనాలు చేస్తుంటారు. పక్కనే కాస్త దూరంగా కొందరు మేకలు కాసుకునేవారు మాట్లాడుకుంటూ వీల్లే మన ముఖ్యమంత్రీ, మంత్రులూ నంట, ఈషామియానాలోనే మన పెబుత్వం నడుస్తుందంట నీకు తెలుసా అని చెవులు కొరుక్కుంటుంటారు.

సంజీవ్:                 శ్రీరాం గాడి చావు పుణ్యమా అని రాష్ట్రం, పదవులూ అయితే దక్కాయి గానీ ఏమిటీ విధి వైపరీత్యం? షామియానాలకింద అసెంబ్లీలూ, సెక్రెటేరియట్లూనూ!!

ప్రకాశ్:                  నా పరిస్థితి అయితే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది. ఇంతకుముందు చక్కగా మంత్రి పదవి వెలగబెడుతూ క్రిష్ణా రామా అంటూ ఉండేవాడిని. ఇప్పుడు ముఖ్యమంత్రినయ్యాను గానీ ఒక అసెంబ్లీ లేదు, ఒక కారు లేదు. ఎండలో కూర్చోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు జీతాలడుగుతున్నారు, ఇద్దామంటే ఒక్క పైసా లేదు.

గోపాల్:                ఇప్పుడేం చేద్దాం?

బ్రహ్మానంద్:          ఇలా ఎక్కువరోజులు భరించలేం, ఏదో ఒకటి చేసి ఈపరిస్థితినుండి బయట పడాలి. కేంద్రం ఏమన్నా డబ్బిస్తుందంటావా?

గోపాల్:                కేంద్రామా నా బొందా, ఒక చిప్ప ఇస్తుంది.

ప్రకాశ్:                ఎలాగోలా మనం భాగ్యనగర్‌ను దక్కించుకున్నామంటే మన కష్టాలన్నీ తీరిపోయి మల్లీ భాగ్యం చేతికొస్తుంది. దానికోసం ఏం చెయ్యాలో మార్గాలు వెతకాలి.

గోపాల్:               మనదగ్గర రాజధాని కాదు గదా ఒక జిల్లాను పరిపాలించడానికి కూడా సరిపోయే నగరం ఒక్కటంటే ఒక్కటి లేదు.

సంజీవ్:             మరెందుకాలస్యం? తొందరగా భాగ్యనగర్‌ను దక్కించుకునేందుకు పావులు కదుపుదాం. అక్కడ మిగులు బడ్జెట్ కూడా ఉందంట. మన కష్టాలన్నీ తీరిపోతాయి.

బ్రహ్మానంద్:           మనం కలవమంటే వాల్లు కలుస్తారా? మన సంగతి తెలిసినవారు ఎవరైనా మనల్ని నమ్ముతారంటావా?

సంజీవ్:           వాల్లు మనల్ని నమ్మరనేది నిజం, కానీ ఎలాగయినా నమ్మించాలి మరో మార్గం లేదు.

ప్రకాశ్:             ఐదుగురు పెద్దమనుషులను కూర్చోపెట్టి పంచాయితీ పెడదాం వాల్లేం అడిగితే అది ఒప్పుకుని సంతకాలు పెడదాం. అమలయేనాటికి ఎవడు బతికుంటాడో, ఎవడు చస్తాడో ఎవరికి తెలుసు?

సంజీవ్:           ఈ ఐడియా బాగానే ఉంది గానీ ముందు ఢిల్లీ ఒప్పుకుంటుందా?

ప్రకాశ్:            నీకన్నీ అనుమానాలే. మనం గట్టిగా లాబీయింగ్ చెయ్యాలి గానీ ఢిల్లీని ఒప్పించడం పెద్ద కష్టమా?

గోపాల్:           మరి అక్కడి ప్రజలసంగతో? వారు ఇందుకు అస్సలు ఒప్పుకోరు. మొదట్నుంచీ మన జనాలు వాల్లను తక్కువగా చూస్తారనీ, వాల్ల యాసను వెక్కిరిస్తారనీ వారికి తెలుసు కదా?

ప్రకాశ్:           అందరం తెలుగువాల్లమే అనీ, తెలుగు జాతి ఐక్యత అనీ ప్రచారం చెయ్యాలి. తెలుగుతల్లి విగ్రహాలు ఊరూరా పెట్టాలి. మన శ్రీరాం గాడి బొమ్మను కూడా అక్కడ ఊరూరా పెడదాం. మెల్లగా జనాలు దారికొస్తారు.

No comments:

Post a Comment

Your comment will be published after the approval.