Monday 14 May 2012

గద్దరన్న, జెర పరేషాన్ జెయ్యకే!



గద్దరన్న నువ్వు పాటపాడితె మంచిగనిపిస్తది, ఉషారొస్తది, మల్లి మల్లి ఇనాలనిపిస్తది. నీ పాటంటె మాకందరికీ ఇష్టం. నీమాటె....ఎట్లెట్లనో ఉంటది.  అర్ధమయినట్లె ఉంటది..కని చివరికి చెప్పేదేందో అర్ధం కాదు..పెద్దపెద్ద మాటలేవో జెప్పుతవ్..శాస్త్రీయ మిలిటెంటు ఉద్యమం అంటవ్, యుద్ధ పంథా అంటవ్ ఏందో సమజ్ గాదు. నీ మాటలతోటి పరేషాన్ అయితదే.

తెలంగాణ ప్రజా ఫ్రంట్ అని ఏదో ఫ్రంట్ పెట్టినవు, నేను తెలంగాణ వచ్చేదాక ఇంటికి పోను, ప్రజలతోనె ఉంట అన్నవు, అట్లన్నంక మల్లి కనపడలేదు, ఏడికి పొయినవె ఇన్నిరోజులు ఇంట్ల గూసున్నవా?  

ఒక్క మాట మంచిగ జెప్పినవు..ఉద్యమం ప్రజలను ఐక్యం జేస్తుంటె ఎన్నికలు ప్రజలను విడగొడుతున్నయి అని జెప్పినవు..మంచిగనిపించింది. కని దానికి నువ్వు జెప్పె పరిష్కారమె బాగనిపిస్తలేదె. ఎన్నికల్లో పాల్గోకుండా ఉట్టి ఉద్యమాలతోనె తెలంగాణ ఎట్ల వొస్తదే?మనము ఎన్నికలను బహిష్కరిస్తె ఎవడో సీమాంధ్ర తొత్తు వచ్చి ఎలక్షన్ల నిలబడి గెలిస్తడు. తర్వాత వాడె మన నెత్తికెక్కి గూసుంటడు, గప్పుడెట్లనే.

నిన్న టీవీల నీప్రోగ్రాం ఇంటుంటె కొంచెం సమజ్ గాలె.. తెలంగాణకోసం కోకొకోలమీద ఉద్యమం ఎందుకు జెయ్యాల్నె? నాకు తెలిసి తెలంగాణ ఉద్యమమనేది నిధులు, నీళ్ళు, నియామకాల్లో పాలకవర్గం తెలంగాణపై జూపుతున్న వివక్ష నుండి బయట పడేందుకు. గట్లనే మన సంస్కౄతీ, మన చరిత్రలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులనుండి బయటపడేందుకు. మరి గీ కోకొకోలోనికి తెలంగాణ అయితేంది, ఆంధ్ర అయితేంది ఎవరు దాగిన అందులొ పురుగులమందు జెయ్యబట్టి కడుపు కరాబు అయితది గదనె.

అయినా గీ కోకొకోలోడు మన తెలంగాణనేమన్న రాకుండ అడ్డుకుంటున్నడా, గానిమీద పోరాటం జేస్తె తెలంగాణ వస్తదా? తెలంగాణ వచ్చినంక నిమ్మలంగా కోకొకోలోన్ని తెలంగాణల ఉంచాల వద్దా అనేది డిసైడ్ జేద్దాం గిప్పుడెందుకే కోకోకోల ముచ్చట?

No comments:

Post a Comment

Your comment will be published after the approval.