Monday 10 December 2012

తెలంగాణ, జన్‌లోక్‌పాల్




రెండోసారి యూపీయే అధికారం చేపట్టాక దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన రెండు ప్రజా ఉద్యమాలవలన యూపీయే  ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవి ఒకటి అవినీతి వ్యతిరేకతతో మొదలయిన జన్‌లోక్‌పాల్ కాగా మరొకటి పాలనా వివక్ష వలన మొదలయిన తెలంగాణ ఉద్యమం. ఈరెండు ఉద్యమాలలో చాలా సారూప్యం కనిపిస్తుంది..కొన్ని చోట్ల తేడాలూ కనిపిస్తాయి.

తెలంగాణ ఉద్యమం ఇప్పుడూ ప్రజల్లో చొచ్చుకుపోవడానికి కారణం 2009లో కేసీఆర్ చేసిన దీక్ష కారణం కాగా జన్‌లోక్‌పాల్ ఉద్యమం అన్నా దీక్షవలన ప్రాచుర్యం పొందింది. రెండు ఉద్యమాలకూ ప్రజలనుండీ వస్తున్న మద్దతును చూసి యూపీయే ప్రభుత్వం దిగివచ్చి ఉద్యమాల డిమాండ్లకు మొదట ఒప్పుకుంది. కేసీఆర్ దీక్ష తరువాత తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం ప్రకటన చేస్తే అన్నా దీక్ష తరువాత జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం స్థూలంగా ఒప్పుకుంది. అయితే తరువాత ప్రభుత్వం రెండువిషయాల్లో వెనక్కి తగ్గింది.

తెలంగాణ ఉద్యమం తెలంగాణలో అన్నివర్గాల్లో చొచ్చుకుపోయి అన్ని తరగతుల ప్రజల మద్దతు విశేషంగా లభిస్తుంటే జన్‌లోక్‌పాల్ ఉద్యమానికి మాతర్మ్ ఎగువ మధ్యతరగతి వర్గం వారిమద్దతు మాత్రమే ఉంది. సామాన్య ప్రజానీకానికి అసలు అదేంటో కూడా తెలియదు.

జన్‌లోక్‌పాల్ ఉద్యమం సందర్భంగా మొదటిసారి అన్నా దీక్ష చేసినప్పుడు నేషనల్ మీడియా విపరీతంగా మద్దతు ఇచ్చింది. రెండోసారి మాత్రం అసలు మద్దతు ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమానికి నేషనల్ మీడియా మద్దతు లేకపోగా లోకల్ మీడియా మొత్తం సీమాంధ్ర పెద్దల కనుసన్నల్లో ఉద్యమంపై విషం చిమ్ముతుంది.

రెండు ఉద్యమాలనూ నీరు గార్చడానికి ప్రభుత్వం అనేక కుట్రలు పన్నింది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నవారిపై ఆరోపణలు చేయడం, మీడియా మేనేజ్‌మెంటు చెయ్యడం చేసింది. ఫలితంగా అన్నా టీంను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. అయితే తెలంగాణ ఉద్యమంలో మాత్రం వీరి ఉపాయాలు పారలేదు. ఎంతగా విభజిద్దామన్నా తెలంగాణలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న తెరాస రోజురోజుకూ ప్రజల మద్దతుతో బలపడుతుంది.


తెలంగాణ ఉద్యమానికి సీమాంధ్ర నేతలు, ధనిక వర్గం అడ్డుకాగా జన్‌లోక్‌పాల్ ఉద్యమానికి  అవినీతివలన లాభపడుతున్న అన్ని పార్టీలూ వ్యతిరేకమే. జన్లోక్‌పాల్ బిల్లుకు ప్రజల్లో తెలంగాణ ఉద్యమంలా విశేష మద్దతు లేకున్నా ప్రజలెవరిలో వ్యతిరేకత కూడా లేదు. దీనికి అడ్డు పూర్తిగా రాజకీయ పార్టీలే. తెలంగాణ ఏర్పాటుపై సాధారణ సీమాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత లేకున్నా సమైక్యాంధ్రలో లాభపడుతున్న డెల్టా భూస్వామ్య వర్గం వ్యతిరేకంగా ఉంది. కొందరు సీమాంధ్ర నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలద్వారా కొన్నివర్గాల సీమాంధ్ర ప్రజల్లో హైదరాబాద్ మనది కాకుండా పోతుంది, తెలంగాణ వస్తే మనకు నీళ్ళు రావు లాంటి అనవసర భయాందోళణలు రగిలించారు.

అవినీతి వ్యతిరేకంగా ఇప్పుడు మొదలయిన ఆంâఅద్మీ పార్టీ తెలంగాణ విషయంలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, తెలంగాణ ఉద్యమంలో నిజాయితీని గ్రహించి మద్దతివ్వడం మంచి పరిణామం. అవినీతికంటే కూడా వివక్ష ప్రమాదకరం. అవినీతిని చట్టాలద్వారా అణచివేయొచ్చుగానీ పాలనా వివక్షను ఏచట్టాలద్వారా సవరించలేము. వివక్షను అధిగమించడానికి విడిపోవడం తప్ప మరో మార్గం లేదు.






No comments:

Post a Comment

Your comment will be published after the approval.