Monday, 31 December 2012

తొర్రూరు డిపో బస్సుపై విజయవాడలో దాడి

డ్రైవర్ కండక్టర్‌కు గాయాలు 
పోలీసుల అదుపులో నలుగురు నిందితులు 
విజయవాడ: తొర్రూరు బస్ డిపోకు చెందిన ఏపీ36 జెడ్ 146 నెంబర్ గల బస్సుపై విజయవాడ సమీపంలో కొంతమంది వ్యక్తులు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. డ్రైవర్, కండక్టర్‌ను తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన ఆదివారం రాత్రి విజయవాడ సమీపంలో చోటుచేసుకుంది. కండక్టర్ కృష్ణయ్య ‘టీ మీడియా’తో ఫోన్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు డిపో నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరుపతికి బస్సు బయలుదేరింది. విజయవాడ మరో మూడు కిలోమీటర్లు ఉందనగా ఏపీ16బీసీ177 వాహనంలో వచ్చిన ఐదుగురు, ద్విచక్ర వాహనంపై వచ్చిన మరో ఇద్దరు కలిసి తమ వెంట తెచ్చుకున్న కర్రలు, బస్సులోని రాడ్లను తీసుకొని డ్రైవర్ జనార్దన్, కండక్టర్ కృష్ణయ్యలపై దాడి చేశారు. అడ్డువచ్చిన ప్రయాణికులపై కూడా దాడి చేశారు. దీంతో భయంతో అందరూ పరుగుపెట్టారు. దాడి జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులు విపరీతంగా మద్యం సేవించి ఉండటం, అసభ్యంగా ప్రవర్తించడంతో ఎవరూ అడ్డుకోలేక పోయారు. ‘వారంతా వరంగల్‌కు చెందినవారు. వాళ్లని చితకబాదండి’ అంటూ దాడి చేశారు. 
ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టి, కొద్ది దూరం వెళ్లాక స్థానికులకు విషయం తెలుపడంతో వారు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. విజయవాడ వన్‌టౌన్ సీఐ ఘటనాస్థలికి చేరుకొని బస్సును స్టేషన్‌కు తరలించి, గాయపడిన కండక్టర్ కృష్ణయ్య, డ్రైవర్ జనార్దన్‌ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు బాధ్యులైన నలుగురు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్, కండక్టర్ టీఎంయూకు చెందినవారు కావడం, విజయవాడలో ఘటన జరగడంతో తెలంగాణ వ్యక్తులపై కావాలనే దాడులకు పాల్పడ్డారని తెలుస్తోందని, దీనిపై విచారణ జరపాలని టీఎంయూ డివిజన్ కార్యదర్శి మల్లికార్జున్, గౌరవాధ్యక్షుడు సోమయ్య, డిపో కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Your comment will be published after the approval.