Sunday 30 December 2012

రెండు కళ్లు.. నాలుగు నాలుకలు


అంశం ఒక్కటే.. సమయం, అవసరాన్నిబట్టి మాటలు మారిపోయాయి. ఇన్ని మాటలు చెప్పటం ఎవరికైనా సాధ్యపడుతుందా.. ఒక్క తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి తప్ప..! చిదంబరం ప్రకటనకు ముందొక మాట. ఆ తర్వాత మరో మాట. తెలంగాణ ఉప ఎన్నికలప్పుడు ఒక ముచ్చట. అవి ముగిశాక ఇంకొక ముచ్చట. పరకాలలో మరో మాట. ఆ ఎన్నిక ముగియగానే ఆ ముచ్చటా మారిపోయింది. ఇలా నాలుగేళ్లలో అనేకానేక మలుపుల మాటలు. పేరుకు ప్రధాన ప్రతిపక్షం. ప్రధాన సమస్యపై నిలకడలేనితనం. ‘మా పార్టీ వైఖరి ఏ ఎండకా గొడుగు అన్న చందంగా ఉంది’ అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించేంతటి పరిస్థితి. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర హోం శాఖ మంత్రికి అందజేసిన లేఖలోనూ ఇదే విధమైన అస్పష్ట వైఖరిని ప్రదర్శించారన్న విమర్శలు వస్తున్నాయి.

అప్పుడు అధికారం కోసం..

తెలుగుదేశం పార్టీ తొలుత సమైక్య వాదాన్ని ప్రదర్శించింది. అయితే, 2009లో జరిగే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం 2008లో తెలంగాణకు అనుకూలమని ప్రకటించింది. ఆ ఏడాది దసరా పండుగ రోజున టీడీపీ పొలిట్‌బ్యూరో తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించిందని అధినేత చంద్రబాబు ప్రకటించారు. తర్వాత పది రోజులకే ‘తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చిందని మీకు తెలియజేస్తున్నాం’ అంటూ అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ రాశారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని, తెలంగాణ ఏర్పాటుకు శాసనపరమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రచారం కూడా చేశారు.

చిదంబరం ప్రకటనపై అగ్గిమీద గుగ్గిలం!

ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన దరిమిలా 2009 డిసెంబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ తెలంగాణకు మద్దతు పలుకుతుందని ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే (డిసెంబర్ 9న) అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూల ప్రకటన చేశారు. మరుసటి రోజు టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. ‘తెలంగాణ అంశంపై ఎవ్వరితోనూ చర్చించకుండా, నచ్చచెప్పకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ఒకరు అడుగుతారు, మరొకరు ఇస్తారు. కాంగ్రెస్ దీన్ని ఒక మ్యాచ్‌ఫిక్సింగ్‌లా చేసింది. స్వీయ రాజకీయ ప్రయోజనాలేవో ఆశించి ఇలా వ్యవహరించింది. సోనియాగాంధీ ఏమీ ఆలోచించకుండా అర్ధరాత్రి నిర్ణయం ప్రకటించి చేతులు దులుపుకున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు.

రెండు కళ్ల సిద్ధాంతం

2010 ఫిబ్రవరి 4న చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ‘తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ల లాంటివి. తెలంగాణ, సమైక్య వివాదాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే’ అని ప్రకటించారు. ఈ ప్రకటన పెద్ద వివాదాన్ని రేపింది. దీంతో కొద్దిరోజులు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత అదే ఏడాది తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. 2010 జూన్ 19న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ‘తెలంగాణ, సీమాంధ్ర రెండూ నాకు రెండు కళ్ల వంటివని నేను ఎందుకు అన్నానో తెలుసా? రెండు కళ్లంటే రెండు రాష్ట్రాలని అర ్థం’ అని మాట మార్చారు.

నేను తటస్థం

తెలంగాణలో రెండు కళ్ల సిద్ధాంతం పనిచేయకపోవడంతో చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. ‘రాష్ర్ట విభజన విషయంలో నేను తటస్థంగా ఉంటా. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇరు ప్రాంతాల నేతలకు చెప్పాను. ఈ విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీనే’ అని 2011 మే 9న చెప్పారు.

మహానాడులో కొత్త తీర్మానం

2009 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్న టీడీపీ.. 2011 మే 29న మహానాడులో కొత్త తీర్మానాన్ని ఆమోదించింది. ‘తెలంగాణ విషయంలో ఇంకా ఎంతకాలం ఈ అనిశ్చితి కొనసాగిస్తారు? ఈ విషయంలో టీడీపీ చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పేసింది. కేంద్రం సత్వర నిర్ణయం తీసుకొని ఈ అనిశ్చితిని తొలగించాలి. చేతకాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అంటూ తీర్మానం చేసింది. మరోపక్క రెండు ప్రాంతాల నేతలు ఒకరు సమైక్యం, మరొకరు తెలంగాణ ఉద్యమాలు చేసుకోవడానికి బాబు అంగీకారం తెలిపారు. ‘రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలు వారి ప్రాంతాల మనోభావాలను ప్రతిబింబించక తప్పదు. అందుకే పార్టీ అధ్యక్షుడిగా నేను ఏది చెబితే అదే పార్టీ వైఖరి. మిగతా ఎవరేం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం లేదా వారి ప్రాంత అభిప్రాయం మాత్రమే’ అని 2011 జూలై 29న చంద్రబాబు మరో విధంగా మాట్లాడారు.

ఉప ఎన్నికల కోసం మాట మారింది!!

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు విభజన వాదాన్ని అంగీకరించలేదని ఎన్నికల ఫలితాల ప్రకటించిన వెంటనే చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది చెప్పి వారం గడవక ముందే 2011 మార్చి 11న కామారెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడతూ.. ‘నేనెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇకపైనా మాట్లాడబోను’ అని మాట మార్చేశారు. 

పార్టీని గెలిపిస్తే ఉద్యమమే చేస్తాం

ఉప ఎన్నికలలో పార్టీ వరసగా ఓటమిని ఎదుర్కోవడంతో తమను గెలిపిస్తే తెలంగాణ కోసం ఉద్యమం చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది మే 24న పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మా పార్టీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని గెలిపిస్తే ఆయనతోనే చిదంబరానికి లేఖ పంపిస్తాం. ఇక్కడి నుంచే ఉద్యమం చేస్తాం’ అని ప్రకటించారు. ఆ ఉప ఎన్నికలు ముగియగానే ‘తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తాం’ అంటూ మరోసారి మాట మార్చారు. 

ఈ ఏడాది జూలై 10న చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ అంశంపై పార్టీలోని నాయకులతో మాట్లాడుతున్నాను. మధ్యలో ఉప ఎన్నికలు రావటంవల్ల అందరితో మాట్లాడటం కుదరలేదు. అందరి అభిప్రాయాలు తీసుకొని త్వరలోనే స్పష్టత ఇస్తాం’ అని చెప్పారు. చివరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో తెలంగాణ అంశం తేల్చడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ చంద్రబాబు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు.

తాజాగా శుక్రవారం కేంద్ర హోం మంత్రికి పంపిన లేఖలోనూ ఆయన ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదు. 2008లో అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీకి అందజేసిన లేఖ మీ వద్దే ఉందని, దాన్ని తామింతవరకు ఉపసంహరించుకోలేదని మాత్రం పేర్కొన్నారు. 2009లో యూపీఏ-1 ప్రభుత్వం పోయి యూపీఏ-2 ప్రభుత్వం ఏర్పడినందున ఆ లేఖలోని విషయాలనే మరోసారి చెబితే బాగుండేదని, అలా చేయకపోవడంవల్ల అనుమానాలు రేకెత్తిస్తోందని తెలంగాణ ప్రాంత ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. తమ రాజకీయ అవసరానికి తగినట్టుగా వాడుకునే విధంగా తప్పించుకునే ధోరణితో లేఖ ఇవ్వడం వల్ల ప్రజల్లో విశ్వసనీయత లేకుండా పోతోందని సీమాంధ్ర ఎమ్మెల్యే ఒకరు వాపోయారు.

తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది: 2008లో అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ

మా పార్టీ తెలంగాణకు మద్దతు పలుకుతుంది.. : 2009 డిసెంబర్ ఏడో తేదీన ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ప్రతినిధులు 
తెలంగాణ అంశంపై ఎవ్వరితోనూ చర్చించకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు.. : 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూల ప్రకటన చేసిన మరుసటి రోజు చంద్రబాబు

తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ల లాంటివి.. : 2010 ఫిబ్రవరి 4న చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం 

రెండు కళ్లంటే రెండు రాష్ట్రాలని అర ్థం.. : 2010 జూన్ 19వ తేదీన ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు

తెలంగాణపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలి: 2011 మే 29న మహానాడులో తీర్మానం

యూపీ ప్రజలు విభజన వాదాన్ని అంగీకరించలేదు: 2011 యూపీ ఎన్నికలు ముగియగానే చంద్రబాబు వ్యాఖ్య

నేనెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: ఆ తర్వాత కొద్ది రోజులకే కామారెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

మా పార్టీ అభ్యర్థిస్తే ఇక్కడి నుంచే ఉద్యమం చేస్తాం : ఈ ఏడాది మే 24న పరకాల ఉప ఎన్నికల సభలో చంద్రబాబు

తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తాం : ఈ ఏడాది జూలై 10న చంద్రబాబు

No comments:

Post a Comment

Your comment will be published after the approval.