Thursday, 20 February 2014

అప్పుడే ఒప్పుకుని ఉంటే!!


చివరికి అనివార్యమైన రాష్ట్ర విభజన జరిగిపోతుంది. తెలంగాణ ప్రజల అరవై ఏళ్ళ కళ సాకారం కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు.

అలాగే సీమాంధ్ర ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు. సీమాంధ్ర ప్రజలకు ఈవిభజన వలన ఒక అస్తిత్వం వచ్చింది. ఇకనుంచి సీమాంధ్రకు మాత్రమే లాభించే ఏవిషయాన్ని కూడా తెలుగుజాతికి లాభంగా చెప్పుకుని తమను తము మోసం చేసుకోనక్కర్లేదు, సీమాంధ్రకు లాభం అని చెప్పుకోవచ్చు. ఇకనుంచైనా తమ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టుకోవచ్చు. విభజన జరిగేవరకూ ఈసమస్య రగులుతూనే ఉంటుంది కాబట్టి సమస్య పరిష్కారం అందరికీ మంచిదే. 
   
ఈవిభజన జరిగిన విధానం సీమాంధ్రకు అన్యాయం జరిగేట్లు ఉంది, బిల్లును తమపైకి బుల్‌డోజు చేశారు అని బాధపడేవారు ఇలాంటి పరిస్థితి రావడానికి తమనేతలే కారణమని తెలుసుకోవాలి. బిల్లులో సీమాంద్ర కోరికలు పూర్తిగా తీరలేదు అనుకునేవారు తెలంగాణప్రజల కోరికలుకూడా పూర్తిగా తీరలేదని గ్రహించాలి. ఉమ్మడి రాజధాని, ఉద్యోగులు పంపిణీ విధానం, విద్యాసంస్థల్లో ప్రవేశార్హతలు లాంటి పలు విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. అలాగే పోలవరంకు తెలంగాణ అంగీకారం చేసినట్లు ఉన్న క్లాజు, పోలవరంకోసం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపి గిరిజనులను నిట్టనిలవునా ముంచడం లాంటివి అస్సలు బాగోలేవు. కాకపోతే పంపకాల్లో అన్నీ అనుకూలంగా ఉండాలనుకుంటే కుదరదు, పట్టువిడుపులు అవసరం కాబట్టి తెలంగాణ నేతలు ఇవి అన్యాయం అని తెలిసీ ఒప్పుకోవడం జరిగింది. 

అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది 2009లోనే యూపీయే ప్రభుత్వం తెలంగాణను ప్రకటించడం జరిగితే సీమాంధ్రలో పోటీ ఉద్యమం లేవదీసి విభజనను ఇన్నిరోజులు ఆపడం వలన సీమాంధ్ర ప్రాంత ప్రజలు పొందిన లాభమేమీ లేదు. పైగా అనేక నష్టాలు జరిగాయి.

రెండువేలతొమ్మిదిలోనే విభజన జరిగిఉంటే అప్పుడు సీమాంధ్ర ఎంపీల మద్దతు యూపీయేకు అవసరమైన తరుణంలో సీమాంధ్ర ఇంకాస్త గట్టిగా తమ ప్రాంత ప్రజల అవసరాలగురించి నెగోషియేట్ చేసే అవకాశం ఉండేది. దానివల్ల సీమాంధ్రకు లాభాలు బాగానే జరిగేవనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆఖరు నిముషంలో జరిగిన విభజన వలన సీమాంధ్ర ఎంపీల మద్దతు ఎవరికీ అవసరంలేని సమయంలో ఎన్ని డ్రామాలు చేసినా ఎలా తుస్సుమన్నాయో చూశాం. బ్రహ్మాస్త్రాలన్నీ తోకపటాకుల్లా తుస్సుమన్నాయి తప్ప పేలలేదు.

ఈమూడేల్లలో సీమాంధ్ర రాజధాని నిర్ణయం జరగడమేకాక షుమారు కావల్సిన ఇంఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తయేది.  ఎవరి బడ్జెట్ వారేసుకుని ఎవరి ప్రాంత అభివృద్ధిని వారు చూసుకునేవారు. సీమాంధ్రకు కేంద్రం ప్రతిపాదించిన IIT,IIM లాంటివాటిలో కొన్నైనా ఈపాటికి పూర్తయేవి. అన్నివిధాలుగా సీమాంధ్ర ప్రజలకు విభజన మూడేళ్ళకిందట జరిగిఉంటే లాభం అధికంగా ఉండేది. 

అయితే మూడేళ్ళు ఈవ్యవహారాన్ని సాగదీయడం వలన లాభపడింది ఎవరు ఎంటే సీమాంధ్ర ముఖ్యమంత్రి, మంత్రులూ, ఎంపీలో ఇతర నేతలు. ఎలాగు విభజన జరిగిపోతుందని వీరికి ముందే తెలుసు కనుక తెలంగాణను సాధ్యమయినంత దోచుకున్నారు. జలయగ్నం కాంట్రాక్టులు, ఇతర సివిల్ కాంట్రాక్టుల్లో సీమాంధ్ర పొలిటికో బుజినెస్‌మెన్ అయిన ఎంపీలు కోట్లు దండుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి ఆఖరి వారంలో పెట్టిన సంతకాలద్వారానే కోట్లు చేతులు మారాయని వినికిడి, ఈమూడేళ్ళలోకూడా బాగానే వెనకేసి ఉంటాడు.
  
అప్పుడే విభజన జరిగి ఉంటే ఎందరో యువకుల ప్రాణాలు మిగిలి ఉండేవి, పోలీసుల లాఠీచార్జీల్లో దెబ్బలు తిని కాళ్ళిరగ్గొట్టుకునే బాధ తప్పేది, తెలంగాణ ప్రజలు కూడా మూడేళ్ళ స్వయంపాలన అనుభవించేవారు.

కనుక సీమాంధ్ర ప్రజలారా, మిమ్మల్ని ఇన్నిరోజులూ విభజన జరగనే జరగదు, మేము జరగనివ్వం అని చెప్పి మోసగించిన నేతలకు ఈఆలస్యం కోట్లు తెచ్చిపెడితే సామాన్యులైన మీకు మాత్రం నష్టమే జరిగింది.    సీమాంధ్ర నేతలు తాములేవదీసిన దొంగ ఉద్యమం, రాజీనామా నాటకాలతో సీమాంధ్ర ప్రజల కళ్ళళ్ళనే పొడిచారని ఇకనైనా గ్రహించాలి. 

ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవడం వలన తెలంగాణకు లాభం కూడా జరిగింది. తెలంగాణలో ప్రజలంతా ఒక్క నినాదంతో ఒక్కటయ్యారు. ఉద్యమం అన్ని వర్గాలను దగ్గర చేర్చింది. ప్రజల్లో పోరాట పటిమను నింపింది. రాష్ట్రావశ్యకత చిన్న పిల్లవాడిదగ్గరినుండి ముసలివాళ్ళందరికీ స్పష్టంగా అర్ధం అయింది. ప్రజాఉద్యమాలపట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఈస్పిరిట్ ఇలాగే కొనసాగితే తెలంగాణ ప్రజలు తమ చైతన్యంతో తమ రాష్ట్రాన్ని కుల, మత భేధాలు లేని ఒక చక్కని రాష్ట్రంగా తీర్చి దిద్దుకునే అవకాశం ఉంది. 


తెలంగాణ గెలిచింది, సమైక్యాంధ్ర కోల్పోయింది


తెలంగాణ ప్రజల ఉద్యమం ఫలించింది. తెలంగాణ రాష్ట్రం కళ నిజమయింది. అయితే గత నాలుగేళ్ళలో తెలంగాణ ఉద్యమకారులు సాధించిందేమిటి, సమైక్యాంధ్ర మద్దతుదారులు కోల్పోయింది ఏమిటి అని ఆలోచిస్తే చాలానే అది ఒక్క రాష్ట్రసాధన మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది.

తెలంగాణ ఉద్యమం ప్రజల్లో ఐక్యతను నింపింది. ఉద్యమం బీజేపీ దగరినుండి సీపీఐ, న్యూడెమాక్రసీ వరకూ అందరినీ ఒకేవేదికపై పనిచేసేలా చేసింది. యూనివర్సిటీల్లో కుల మతభేదాలు మరిచి అందరు కలిసికట్టుగా పోరాడారు. బీద, దళిత వర్గాలు ఉద్యమంలో ముందున్నారు.

తెలంగాన ఉద్యమం ప్రజల్లో న్యాయం గెలుస్తుందనే నమ్మకాన్ని మిగిల్చింది. ఉద్యమం మూలంగా ప్రజలు తమ చారిత్రక, సాంస్కృతిక మూలాల్లోకి వెల్లగలిగారు. తెలంగాణ పాట, డప్పు, బతుకమ్మ పునరుజ్జివనం పొందాయి.

తెలంగాణ కళాకారులకు ఆదరణ పెరిగింది, తెలంగాణ పల్లెల్లో చైతన్యం వచ్చింది. తెలంగాణ ఉద్యమం తమనుండి దాచబడిన తురేబాజ్‌ఖాన్, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డిలగురించి ప్రజలకు తెలియజేసింది. ఇప్పుడు ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజానీకానికి తమకు జరిగిన అన్యాయం లెక్కలతో సహా తెలిసింది. ఇది ఇప్పుడూ రాష్ట్రం ఏర్పడ్డాక తాము సాధించాల్సిన అభివృద్ధిని గుర్తుచేస్తుంది.

తెలంగాణ ఉద్యమం ప్రజలకు మంచి నాయకత్వాన్ని అందించింది. కేవలం రాజకీయపార్టీలు మాత్రమే కాక వివిధ రంగాలనుండి నాయకులు ఏర్పడగలిగారు.

మరి సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఉద్యమకారులకేం ఒరిగింది? ఉద్యమం ప్రజలను కులాలుగా విడదీసింది. దళితులు ఉద్యమానికి దూరంగా ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఉద్యమ నాయకత్వంకోసం పోటీ వచ్చింది. ఒక అగ్రవర్ణంపై ప్రజలకు వ్యతిరేకత ఏర్పడింది.

మొదట్నుంచీ సమైక్యాంధ్ర మద్దతుదారులు తెలంగాణ ప్రజలకు తెలంగాణ వస్తుందని చెప్పి నాయకత్వం మోసగిస్తుందని ప్రచారం చేసింది. కానీ చివరికి వారికి తమనాయకులే తాము విభజనను ఆపగలమని చెప్పి మోసగించారని అర్ధమయింది.

ఇప్పుడు కనీసం సీమాంధ్ర ప్రజలు తాము ఏరాజకీయపార్టీని సమర్ధించాలో కూడా తెలియని పరిస్థితి. ఉన్న ప్రతి రాజకీయపార్టీ కూడా విభజన నిర్ణయానికి ముందొకలాగ తరువాత ఇంకోలాగ మాట్లాడి మోసగించినవారే. ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే ముఖ్యమంత్రి పార్టి లక్ష్యం ఏమిటో కూడా తెలియదు.

ఇక సమైక్యాంధ్ర అనే నినాదంలో నిజాయితీ లేదని ఆనినాదాన్ని ఎత్తుకున్నవారందరికీ తెలుసు. ఒక ప్రాంతం వారి భాగస్వామ్యం లేకుండా కేవలం మరో ప్రాంతం కలిసి ఉండాల్సిందేనని బలవంతపెట్టడం, ఉద్యమం అంటే కేవలం అవతలి పక్ష నేతలను తిట్టడం, దిష్టిబొమ్మలు తగలబెట్టడం తప్ప సమైక్యాంధ్ర వలన ఎందుకు లాభమో తెలంగాణ ప్రజలకు చెప్పలేకపోయారు. వారికీ తెలుసు, సమైక్యతవలన తెలంగాణకు నష్టం తప్ప లాభం లేదని.


ఒక అబద్ధపు లక్ష్యాన్ని ఎంచుకుని, తమ హక్కుల సాధనకోసం కాక అవతలివారి హక్కులను ఆపడానికి మాత్రమే ఉద్యమం చేయబోయి చివరికి ఓటమి తరువాత కనీసం పోరాడిన సంతృప్తికూడా లేకుండా చేసుకున్నారు. 
సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలో నాయకత్వలేమిని స్పష్టంగా బయట పెట్టింది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పుకున్న కిరణ్, జగన్, బాబు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని తామే ఛాంపియన్లుగా చెప్పుకోవడానికి ప్రయత్నించారు. లగడపాటి, కావూరు , చిరంజీవి లాంటివారు చివరికి జోకర్లుగా మిగిలిపోయారు. 



Monday, 17 February 2014

మేమేం చేస్తే అదే రైటు!!



కొంతమందికి బుద్ధి సరిగా వికసించకపోవడం వలన చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. అలాంటివారు వాస్తవాలను అంగీకరించక ఎప్పుడూ మేమేం చేస్తే అదే రైటు, ఎదుటివారేం చేసినా అది తప్పే అని వాదిస్తుంటారు. ఆశ్చర్యం ఏమిటంటే అలాంటివారంతా సీమాంధ్రా ఎంపీలుగానూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులుగానూ పదవులు వెలగబెట్టడం. వీరికి దన్నుగా ఉండే వర్గం వారు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తుంటారు.


వీరికి తమ ప్రత్యర్ధి వర్గాన్ని ఒక విషయంపై వెక్కిరించేప్పుడు అరే, తాముకూడా ముందు ఇలాంటి పనే చేశాం అని అస్సలు స్ఫురించదు, ఒకవేళ ఎవరైనా గుర్తు చేసినా పట్టించుకోరు. అలాగే తాము ఏదైనా చర్యను సమర్ధించుకునేప్పుడు ఇంతకంటే చిన్నవిషయంపైనే ఎదుటివారు చేసినపుడు తాము తిట్టిపోసిన విషయాలూ గుర్తుకురావు.


ఉదాహరణకు:


- తాము తమిళులు తమ ఉద్యోగాలూ, నీళ్ళూ దోచుకుంటున్నారని ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడితే అదో పెద్ద గొప్ప విషయం. సరిగ్గా అదే డిమాండ్లతో తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం కోరితే అది తప్పు.


- తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే అదో మహా పాతకం, దేశసమగ్రతకు ముప్పు. తాము కేంద్రాన్ని ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తే అది మాత్రం ఒప్పు.


- రాష్ట్రంలో తెలంగాణబిల్లును తిరస్కరించే తీర్మానాన్ని అజెండాలో లేకుండా, సభ ఆర్డర్లో లేకుండా ఉండగా ముప్పై సెకన్లలో చదివి గెలిపించుకుంటే ఒప్పు. పైగా ఇది "unchallanged vote" అని ముఖ్యమంత్రి సమర్ధించుకోవచ్చు. అదే కేంద్రం  అజెండాలో చేర్చకుండా బిల్లు ప్రవేశపెడితేనే అది పెద్ద తప్పు.


- తెలంగాణవారు తాము ఒక మార్చ్ చేసుకుంటానంటే అనుమతించక నిర్భందాలూ విధిస్తే కడుపుమండి నాలుగు విగ్రహాలు కూలదోస్తే అది మహాపాతకం. అదే తమ ఉద్యమాల్లో జాతీయనేతల విగ్రహాలను తీరుబడిగా కూలదోస్తుంటే ఒప్పు. అంబేద్కర్ విగ్రహాలను పధకం ప్రకారం కూలదోస్తే ఒప్పు.


- తెలంగాణ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే అదో మహానేరం. అదే తమ ఎంపీలు వీధిరౌడీల్లా ప్రవర్తించి తోటి సభ్యులపై పెప్పర్ స్ప్రే చల్లితే అది ఒప్పు. వీడియోల్లో స్పష్టంగా గాలిలోకి విచక్షణారహితంగా స్ప్రే చేస్తున్నట్లూ, స్పీకర్ పై కూడా స్ప్రే చేసినట్లూ తెలుస్తున్నా కేవలం ఆత్మ రక్షణ అని వాదిస్తారు.

ఇంకొన్ని 

* అసెంబ్లీలో మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలి, కాని పార్లమెంటులో మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోకూడదు. 

* అసెంబ్లీ ఆవరణలో ఒక ఎంఎల్ఏ పై ఒక అనామకుడు చెయ్యి చేసుకుంటే ప్రజాస్వామ్యం ఖుని అవుతుంది, కాని సాక్షాత్తు అసెంబ్లీలోనే ఒక ఎంఎల్ఏ ఇంకో ఎంఎల్ఏపై దాడి చేస్తే ప్రజా స్వామ్యం ఉద్దరించబడుతుంది (http://www.youtube.com/watch?v=TO_QaM7PzRQ)

* తెలంగాణా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెసువారు దేశ ద్రోహులు, కాని తెలంగాణా ఏర్పాటు చేస్తాం అని మాట ఇచ్చి ఆ మాట తప్పిన బాబు, చిరు, జగన్ లాంటి వారు దేశం ముద్దు బిడ్డలు.


- సినీనటి శ్రీయను కొందరు అడ్డుకుని "జైతెలంగాణ" అని అనమని బలవంతపెడితే మొత్తం తెలంగాణవాదులందరూ దానికి భాద్యత వహించాలి. అదే నటి తమన్నాను కొట్టినంతపని చేసి "జైసమైక్యాంధ్ర" అనమని బలవంతపెడితే ఎక్కడి దొంగలు అక్కడ గప్‌చుప్.


-- అదుర్స్ సినిమాను నడపకుండా అడ్డుకుంటామనిచెబితే వారు సంఘవ్యతిరేకులు. అదే రాంచరణ్ సినిమా తూఫాన్, మరో అల్లు అర్జున్ సిన్మా విడుదల కానీయకపోతే అది ఒప్పు.

- తెలంగాణలో సకలజనుల సమ్మె చేస్తే అది విద్యార్థుల చదువులు ఖరాబు చేస్తుంది అని గగ్గోలు ( అందులో సగం దినాలు దసరా సెలవులే అయినా). అదే ఆంధ్రాలో వరసపెట్టి బందులు చేసినా, ప్రభుత్వ పాఠశాలలు నెలలతరబడి నడపక, ప్రైవేటు స్కూళ్ళు మాత్రం నడిపినా అది తప్పుకాదు. 

మీరు సామాన్యులు కాదురాబాబూ. లగడపాటికి తక్కువ, అశొక్‌బాబుకు ఎక్కువ. 

Saturday, 15 February 2014

బేషరమ్!

పార్లమెంటుకు కత్తులు, ఏకే- 47 రైఫిళ్లు కూడా తెస్తారా?.. మైకులు విరగ్గొడితే అవార్డులొస్తాయా?..మీలాంటి వాళ్లను పార్లమెంటు నుంచే కాదు, దేశం నుంచి గెంటేయాలి..మీరు చేతులు జోడించి దేశానికి క్షమాపణ చెప్పాలి..’ తెలుగుజాతి నిండు గౌరవమంటూ ఇన్నాళ్లు మైకులు మింగడంలో ఘనతవహించిన పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ని గురువారంనాటి లోక్‌సభ ఘటనలపై జాతీయ మీడియా కడిగిపారేస్తూ అన్న మాటలివి. పెప్పర్ స్ప్రే ఎంపీ తీరుపై జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ఓ పక్క సిగ్గుచేటు అని అభివర్ణిస్తే, జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతంగా చర్చలు నిర్వహించి దుమ్మెత్తిపోసింది. లైవ్ చర్చల్లో లగడపాటి, సీఎం రమేష్‌లను పిలిచి వారి తీరును తూర్పారబట్టింది. 

rajgopal‘చూడండి పార్లమెంటులో కబడ్డీ ఆడతా’ అంటూ మొన్న వెకిలి వ్యాఖ్యలు చేసిన లగడపాటిని జాతీయ మీడియా ఏకంగా ఫుట్‌బాలే ఆడుకుంది. ‘నీ వల్ల ప్రపంచం ముందు మేంతలదించుకున్నాం’ అంటూ ఆయా టీవీల ఎడిటర్లు లగడపాటిపై ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నపుడు తెలంగాణ ఇవ్వాల్సి ఉంటుందని తెలియదా?అని నిలదీశారు. ఆత్మరక్షణ కోసమే పార్లమెంట్‌కు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లానన్న సాకుపై ఆయనను జాతీయ మీడియా దుమ్ముదులిపింది. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య, రాజకీయ వ్యవస్థలకు మీ తీరు సిగ్గుపడేలా ఉంది అని అత్యంత తీవ్ర పదజాలంతో రాజగోపాల్‌పై మండిపడింది. జాతీయ మీడియా ఒకపక్క ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండగా, రాష్ట్రంలోని సీమాంధ్ర మీడియా మాత్రం షరా మామూలేనన్నట్టు వ్యవహరించింది. దేశం ముందు నేరస్తుడిలా నిలబడ్డ లగడపాటి హీరోయిజం చేసినట్టుగా కథనాలు, వ్యాఖ్యానాలతో తమ నైజాన్ని చాటుకుంది. జాతీయ ప్రధాన చానళ్లలో సీమాంధ్ర ఎంపీల తీరుపై మండిపాటు ఇలా సాగింది.. 

చేతులు జోడించి క్షమాపణ చెప్పు: అర్నాబ్ గోస్వామి 
టైమ్స్‌నౌ నిర్వహించిన చర్చలో ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఎంపీ లగడపాటిని లైవ్‌లో పిలిచి దుమ్ము దులిపారు. పెప్పర్ లగడపాటి అంటూ వ్యంగ్యంగా సంబోధించారు. లోక్‌సభ ఘటన గుర్తుచేస్తూ నీకు సిగ్గుగా లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా పార్లమెంటును నువ్వు నవ్వులపాలు చేశావు’ అంటూ దండయాత్రకు దిగారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమని రాజగోపాల్ అడగ్గా..నీకు మైకు ఇవ్వను ఇది నువ్వు ఇష్టానుసారం మాట్లాడటానికి పార్లమెంట్ కాదు..పార్లమెంట్ మాది అన్నారు. ‘ముందు నువ్వు దేశానికి క్షమాపణలు చెప్పు. రౌడీలా ప్రవర్తించావు. నిన్ను అసలు పార్లమెంట్‌లోపలికి అనుమతించొద్దు. నీ ప్రవర్తనను గుర్తు తెచ్చుకుని సిగ్గుపడు.’ అని మండిపడ్డారు. దీనికి లగడపాటి స్పందిస్తూ పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై తనకు బాధగానే ఉందని అన్నారే తప్ప క్షమాపణలపై నోరు మెదపలేదు.

దీనిపై ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. దిస్ ఈస్‌ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ మై పార్లమెంట్. పార్లమెంట్‌లో కబడ్డి ఆడుతావా? అసలేం అనుకుంటున్నావు. ఇలాంటి వాళ్లను సభ్యత్వం నుంచి తొలగించాలి’ అంటూ అరుణబ్ ఊగిపోయారు. ‘లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేతో ఫేమస్ అయ్యావు. నువ్వింకా ఏం చేద్దామనుకుంటున్నావ్. నీ తీరును చూసి సిగ్గుపడుతోంది దేశం. నిన్ను అటాక్ చేస్తేనే పెప్పర్ స్ప్రే చేశానంటువు కదా...? ఎవరు నీపై అటాక్ చేశారో చెప్పగలవా?’ అని నిలదీశారు. దీనికి లగడపాటి రాజగోపాల్ వంద మంది తనపై దాడి చేశారని వారెవరో మాత్రం తనకు తెలియదని తప్పించుకున్నారు. ‘ఏం మాట్లాడుతున్నావ్ రాజగోపాల్ వెల్‌లో వందమంది ఉన్నారా? పార్లమెంటులో ఒక నేరస్తుడిలా ప్రవర్తించావు. క్రిమినల్‌గా బిహేవ్ చేశావు. భారతదేశ రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తివి నువ్వు. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకుని హీరో కావాలనుకుంటున్నావా? పార్లమెంట్‌లో నువ్వు చేసింది ఉగ్రవాద దాడి. నువ్వు ఈ దేశంలోని పిల్లలకు, యువతకు ఏం సందేశం ఇచ్చావో తెలుసా? నీలాంటివారు రాజకీయ, పార్లమెంటరీ, ప్రజాస్వామ్యంలో ఉండటానికి సిగ్గుపడాలి.’ అని అన్నారు. 

ఉగ్రవాదికి ఓ సిద్ధాంతం ఉంటుంది. నీకేం ఉంది అని ప్రశ్నించారు. దీనికి లగడపాటి తాను చేసింది చాలా గొప్పపనేనని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తానీపనిచేశానని సమర్థించుకున్నారు. ‘నీకోసం నేను సమయం వృథా చేయను. నువ్వు చెప్పేది నేను వినదలుచుకోలేదు. ఆ ఆసక్తి కూడా నాకు లేదు. నువ్వు ఈ దేశం పెట్టుకున్న హద్దులు దాటి ప్రవర్తించావు. వెంటనే రెండు చేతులు ఎత్తి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పు. పార్లమెంట్ అంటే సర్కస్ కాదు. ఇలాగే చేస్తానంటే ముందు రాజీనామా చేసి బయటకు వచ్చి ఆటలాడుకో.’ అని అర్నాబ్ అన్నారు. దీనికి లగడపాటి స్పందిస్తూ నేనెప్పుడో రాజీనామా చేశానని, స్పీకర్ ఆమోదించలేదని తెలిపారు. ‘న్యారో, సెల్ఫ్ పొలిటికల్ ఇంట్రెస్టులతో(సంకుచిత,స్వార్థ, రాజకీయ ప్రయోజనాలతో) లగడపాటి మాట్లాడుతున్నారు. వారి తీరు ఈ దేశానికి సిగ్గుచేటు’ అని ఈసడించారు.తర్వాత అరుణబ్ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై మండిపడ్డారు. 

ఆడోళ్ల పెప్పర్ స్ప్రేతో నీకేం పని : ఎన్‌డీటీవీ బర్కాదత్ 
పార్లమెంటు ఘటనలపై చర్చా కార్యక్రమం నిర్వహించిన ఎన్‌డీటీవీ ఎడిటర్ బర్కాదత్ లైవ్ చర్చలో రాజగోపాల్ వైఖరిపై విరుచుకుపడ్డారు. ‘మిస్టర్ రాజగోపాల్. అసలు పెప్పర్ స్ప్రే ఎందుకు తీసుకెళ్లావు? నిబంధనలను ఉల్లంఘించావు. పెప్పర్ స్ప్రేను ఆడవాళ్లు ఆత్మరక్షణ కోసం ఉపయోగిస్తారు. అలాంటి స్ప్రే నీకు ఎందుకు? ’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదాన్ని నేనే దాన్ని వాడను, మగాడివి నీకెందుకు అని నిలదీశారు. నువ్వేమన్నా వీధిలో వెళుతున్నావా? పార్లమెంటులోనే కదా ఉన్నది. అక్కడున్నది నీ సహచరులే కదా? మరి పెప్పర్ స్ప్రే ఎందుకు అని ప్రశ్నించారు.

‘కనీసం క్షమాపణలు చెప్పాలనే ఆలోచన కూడా నీలో ఉన్నట్లు నాకు అనిపించడం లేదు, దేశం పరువును తీశానే అనే బాధ ఏమాత్రం లేదా?’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి లగడపాటి రాజగోపాల్ ‘నేను గొప్ప పనే చేశాను. సిగ్గుపడటం లేదు. అయితే సభలో జరిగిన సంఘటనకు బాధ కలుగుతోంది’ అంటూ వాదించే ప్రయత్నం చేశారు. పార్లమెంట్‌లో వీడియో ఫుటేజ్‌ను చూపించాలని అన్నారు. అనంతరం బర్కాదత్ మాట్లాడుతూ ‘మీరు పార్లమెంట్‌లో చేసింది చాలా దుర్మార్గమైన పని. చండాలమైనది. నీకు ఏమన్న బాధ అనిపిస్తోందా? ప్రధాని మొన్ననే ఎంపీల తీరును చూసి నా గుండె రక్తమోడుతోంది అన్నారు. ఇవాళే మీరు ఇలా చేశారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు. సమాధానం చెప్పు రాజగోపాల్.’ అని ప్రశ్నించారు. 

ఇంకా నయం, ఎకే 47 తేలేదు : సీఎన్‌ఎన్-ఐబీఎన్ రాజ్‌దీప్ సర్దేశాయ్ 
ఐబీఎన్ 18లో జరిగిన చర్చలో ఎడిటర్ ఇన్ చీఫ్ రాజ్‌దీప్ సర్దేశాయ్ రాజగోపాల్‌కు పార్లమెంట్‌లో దాడిచేసే ఉద్దేశం లేకుంటే పెప్పర్ స్ప్రేను ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ‘చాలా బాధ కలుగుతోంది. 20 ఏళ్లుగా పార్లమెంట్ కార్యకలాపాలను చూస్తున్నాను. ఇలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగలేదు. మైకులు విరగ్గొట్టారు. హత్యాయత్నాలు చేశారు. ఇది ఏమాత్రం భారతదేశ ప్రజాస్వామ్యానికి ఆమోదయోగ్యం కాదు’ అన్నారు. ఆంధ్రవారి తరపున చేస్తున్నందుకు లగడపాటి రాజగోపాల్ గొప్పవాడిగా అనిపించొచ్చు. 

ఏ అంశంపై అయినా అభిప్రాయాలుంటే పార్లమెంట్ చర్చల్లో పాల్గొని వినిపించాలిగానీ ఇదేమిటి? అని విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీ కూడా డబుల్ గేమ్ ఆడుతోంది. కాంగ్రెస్ తేల్చాలనుకున్నప్పుడు రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టాలి. తెలంగాణ విషయంలో అన్ని వర్గాలు విఫలం అయ్యాయి. సర్వత్రా అవకాశవాద ధోరణి కనిపిస్తున్నది అని అభిప్రాయపడ్డారు. ‘ఇంకా నయం పెప్పర్‌నే స్ప్రే చేశారు. కత్తులు, ఎకే 47లు తెచ్చి వాడలేదు. అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి’ అన్నారు. సీమాంధ్ర ఎంపీల తీరు పార్లమెంటరీ వ్యవహారాలకు అనుగుణంగా ఏమాత్రం లేదని అన్నారు. లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్‌లో ఉన్న అత్యంత ధనిక ఎంపీల్లో ఒకరు... కానీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశాడు అని రాజ్‌దీప్ వ్యాఖ్యానించారు.

Thursday, 13 February 2014

ఆత్మవంచనకు పరాకాష్ఠ



లగడపాటి రాజగోపాల్ ఈరోజు పార్లమెంటులో రెచ్చిపోయాడు. తెలంగాణ నిజమవడానికి రోజులు దగరవుతున్నకొద్దీ ఫ్రస్ట్రేషన్‌తో పిచ్చిపడుతున్న లగడపాటి సైకోలో మారి ఈరోజు పార్లమెంటులో తోటి ఎంపీలపై పెప్పర్‌స్ప్రే చల్లాడు, స్పీకర్ పోడియం అద్దాలు పగలగొట్టాడు, మైకులు విరగ్గొట్టాడు. మరో తెదెపా ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పార్లమెంటులోకి కత్తి తెచ్చాడని సమాచారం. వీరి చర్యలు నిజంగా ఈరోజు పార్లమెంటు పవిత్రతకు కళంకం కలిగించేవి. వీరి చర్యలు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు.

అయితే నాకు వీరిపై కోపం రావడంలేదు, కేవలం వీరి ఉన్మాద స్థితిపై జాళి వేస్తోంది. పాపం, ఎక్కడ తాము అక్రమంగా కూడగట్టుకున్న కోట్లు కరిగిపోతాయో, తమ అక్రమాలు బయటికి వస్తాయో, కబ్జాలు వెలుగులోకి వస్తాయో అనే భయంలో వచ్చిన ఉన్మాదంలో వారు ఈచర్యకు తెగబడ్డారు. 

అయితే ఈపిచ్చి పనులనూ, కుప్పిగంతులనూ కూడా కొందరు సమర్ధిస్తున్నారంటే ఇది ఆత్మవంచనకు పరాకాష్ఠ తప్ప మరోటి కాదు. జేపీమీద ఒక తెలంగాణవాది చెయ్యి చేసుకున్నప్పుడో, ఏపీ అసెంబ్లీలో గవర్నర్ దగ్గరనుండి బడ్జేత్ పేపర్లు లాక్కున్నప్పుడో తాటికాయలంత అక్షరాలతో ఉద్యమాన్ని బూతులు తిట్టిన కొందరికి మాత్రం ఈరోజు ఘటన తప్పుగా అంపించట్లేదట. పైగా పెప్పర్ స్ప్రే మారణాయుధం కాదు కాబట్టి తప్పులేదంట. ఇంతకన్నా ఆత్మవంచన మరోటి ఉంటుందా?  



Tuesday, 11 February 2014

సమాఖ్య స్ఫూర్తి!?


సుబ్బారావును కలిసి చాన్నాళ్ళయ్యింది, ఎలా ఉండోచూద్దామని సుబ్బారావు ఆఫీసుకు వెళ్ళి చూద్దును కదా, సుబ్బారావు కళ్ళు చింతనిప్పుల్లా మండిపోతున్నాయి. 

ఏమయింది సుబ్బారావ్? ఎందుకంత కోపంగా ఉన్నావ్?

కేంద్రం రాష్ట్రవిభజన వ్యవహారం అస్సలు సరిగా చేయడం లేదు.బొత్తిగా సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించడం లేదు తెలుసా?

హమ్మయ్య! అయితే నీకోపం నాపైన కాదు కేంద్రం మీదన్నమాట. ఇంతకూ ఇలాగని ఎవరన్నారు?

ఇంకెవరంటారు? మన చంద్రబాబు, జగన్ బాబు, కిరణ్‌బాబూ రోజూ టీవీల్లో చెబుతున్నారు.

వాళ్ళకీవిషయం ఎలా తెలిసిందబ్బా? వాళ్ళకంత బుర్ర ఉన్నట్టు లేదే?

మన జయప్రకాశ్ నారాయణ వాళ్ళకు చెప్పాడంట.  

ఓహో! అయితే ఇది ఆయన తెలివితేటలన్నమాట. అనుకున్నా. అవును సుబ్బారావ్, ఇంతకూ మన దేశం ఒక సమాఖ్య వ్యవస్థేనంటావా?

నీతెలివితేటలు ఏడ్చినట్టే ఉన్నాయి. కాదు గాబట్టే గదా సమాఖ్య స్ఫూర్తి అంటూ ఏడిచేది? లేకపోతే సమాఖ్యవ్యవస్థకు వ్యతిరేకమని కోర్టుకు వెళ్ళేవాళ్ళు గదా.

అదన్నమాట అసలు సంగతి. కేంద్రం చేయడం చట్టబద్దమే కానీ స్ఫూర్తిని చూపించి రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించాలా? అంటే అప్పుడప్పుడూ మన క్రికెటర్లు అంపైర్ ఔటివ్వకపోయినా క్రీజు వదిలి వెలుతుంటారు, అలాగే కేంద్రం చేయాలంటావా?

కరెక్ట్. ఇప్పుడూ నీకు విషయం సరిగ్గా అర్ధమయింది. ఒకప్పుడు కోర్ట్నీ వాల్ష్ ఇలాగే క్రీడా స్ఫూర్తిని చూపించి ప్రపంచ కప్ క్రికెట్ సెమి ఫైనల్లో ఆఖరు వికెట్ అని తెలిసి కూడా క్రీజుకు ఆమడ దూరంలో ఉన్న సలీం జాఫర్‌ను రన్అవుట్ చేయలేదు తెలుసా? అదీ స్ఫూర్తి అంటే. కేంద్రం దగ్గర ఏమాత్రం స్ఫూర్తిలేదు. ఉంటే అస్సలు ఇలా చేయలేదు.

బాగుంది. మనం మాత్రం పాకిస్తాన్లా  తొండాట ఆడతాం, కేంద్రం మాత్రం కోర్ట్నీవాల్ష్‌లా  స్ఫూర్తిని ప్రదర్శించాలనుకోవడం అత్యాశ కదా సుబ్బారావ్? మన కిరణ్ బాబు ముప్పై సెకన్లలో రాష్ట్ర అసెంబ్లిలో విభజనకు వ్యతిరేకంగా ఒక బిల్లును ప్రవేశపెట్టి స్పీకర్ ఏం చెబుతున్నాడో ఎవరికి అర్ధం కాకముందే గెలిపించుకున్నాడు. మన చంద్రబాబు విభజన జరిగిపోయే దశకు వచ్చినా తన వైఖరి ఏంటో చెప్పక కొబ్బరికాయలు, రెండు కళ్ళు, ఎంతమంది పిల్లలు అంటూ అందరినీ భయపెడుతాడు. మన జగన్‌బాబేమో అసలు అందరికంటే ముందే నిర్ణయం తీసుకోవాల్సింది ఆర్టికల్ మూడు ప్రకారం కేంద్రమే అని తేల్చి ఇప్పుడు ఎవర్నడిగి నిర్ణయం తీసుకున్నారంటున్నాడు. ఇదంతా తొండి కాదా సుబ్బారావ్? 

అంతేనంటావా?

ఖచ్చితంగా అంతే . అసలు కేంద్రం స్ఫూర్తిని ప్రదర్శించాలని అడగడానికి వీళ్ళెవరికైనా అర్హత ఉందంటావా? పైగా ఇన్నాళ్ళూ తెలంగాణవారు విభజనకోసం కొట్లాడుతుంటే ఏనాడైనా వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం కోసమైనా ప్రయత్నం చేశారా చెప్పు? ఒక్కనాడైనా ఈవిషయంపై అసెంబ్లీలో చర్చ పెట్టారా పోనీ? ఇప్పుడు ఏమొహం పెట్టుకుని సమాఖ్యస్ఫూర్తి అంటూ గోలపెడుతారు? అందుకే మనవాళ్ళ వాదనకు దేశంలో ఏఒక్క పార్టీకూడా మద్దతియ్యట్లేదు. నువ్వూరికే ఆవేశపడిపోయి బీపీ తెచ్చుకోక ఇంటికెళ్ళి మీఅబ్బాయితో తొక్కుడుబిల్లాడుకుని అక్కడ నీక్రీడాస్ఫూర్తిని ప్రదర్శించు. 

సుబ్బారావుకి నేను చెప్పింది తలకెక్కిందో లేదోగానీ ఆరోజు సాయంత్రమే పార్కులో వాళ్ళబ్బాయితో తొక్కుడూబిల్లాడుతూ నాక్కనిపించాడు. 

Sunday, 9 February 2014

కొందరికి పోలవరం, ఎందరికో శాపం




పోలవరం అనే ప్రాజెక్టు గోదావరి నదిపై ధవళేస్వరం నకు కొంచెం ఎగువన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ఈప్రాజెక్టుపై ఎన్నో కాంట్రావర్సీలు ఉన్నప్పటికీ రాజకీయనాయకుల వత్తిడితో త్వరలో దాదాపు జాతీయహోదా కూడా రాబోతున్నట్టు సమాచారం. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తికాకుండానే, ఆతరువాత ఒక్కప్రాజెక్టు కూడా చేపట్టకుండానే ఇప్పటికే ప్రాజెక్టు ఉన్నప్రాంతానికి మరో ప్రాజెక్టు అవసరమా లాంటి విషయాలు వదిలేసి అసలు ఈప్రాజెక్టు ఎంతవరకు సమర్ధనీయం అనే విషయం చర్చిద్దాం. 

పోలవరం వలన ఏర్పడే ఆయకట్టు 3 లక్షల హెక్టేర్లు ( సుమారు ఏడు లక్షల ఎకరాలు). అయితే ప్రభుత్వం చూపిస్తున్న ఆయకట్టులో 2.5 లక్షల ఎకరాలు ఇప్పటికే ప్రకాశం బారేజీకింద ఉన్న ఆయకట్టు. అంటే కొత్తగా వచ్చే ఆయకట్టు 4 లక్షల ఎకరాలు. ఈప్రాజెక్టు వలన ముంపుకు గురీయే ప్రాంతం అక్షరాలా 1.2 లక్ష ఎకరాలు అంటే 47 వేల హెక్టేర్లు. అందులో 11,782 హెక్టేర్ల మాగాణీ, 32,667 హెక్టేర్ల మెట్ట, 2,481 హెక్టేర్ల ఆటవీ ప్రాంతం. మొత్తం నిర్వాసితులు 276 గ్రామాలలోని 1,17,034 మనుషులు (2001 జనాభా లెక్కల ప్రకారం).అంటే ప్రతి 4 ఎకరాల ఆయకట్టుకోసం ఒక ఎకరం భూమి మునిగిపోతుంది, ఒక మనిషి నివాసం కోల్పోవలిసి వస్తుంది.

ఇంతే అనుకుంటే బాగుండేది కానీ, ఈముంపుకు ఇంకా కథ ఉంది. ఇక్కడ విలువయిన గ్రాఫైట్ గనులు కూడా మునిగిపోతున్నాయి. గ్రాఫైట్ మునిగిపోవడం వలన జరిగే నష్టం ఒక ఎత్తు కాగా ఆగ్రాఫైట్ నీటిలో కలిసి నీటిని కాలుష్యం చెయ్యడం మరో ఎత్తు.

ఇంకా ముంపులో ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా మునిగిపోతుంది. నిర్వాసితులలో ఎక్కువభాగం ట్రైబల్స్. ట్రైబల్స్‌ను మరో చోటికి తరలించడం ద్వారా వారి జీవనవిధానానికి లోటు. ఇక ట్రైబల్స్‌కు అడవిపై ఉండే హక్కులకు సంబంధించిన కేసు విచారణలో ఉంది. ఆకేసు వ్యవహారం తేలేంతవరకూ ట్రైబల్స్‌ను తరలించే హక్కు ప్రభుత్వానికి లేదు.

గోదావరి నీటిలో సెడిమెంటేషన్, స్లిట్ ఫామేషన్ ఎక్కువ. దానివలన డాంకు ప్రమాదం ఏర్పడొచ్చు.

ప్రస్తుత ప్రాజెక్టు డిజైన్ 2003లో ఏర్పరిచారు, కాబట్టి అప్పటి వరదల డాటా ప్రకారం ఏర్పడింది. కానీ 2008లో గడచిన వందేల్లళో రానంత వరదలు వచ్చాయి. ఇలా వస్తే ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు రాజమండ్రి పట్టణం మొత్తం కొట్టుకుపోతుంది.




పోలవరం ఎవరికోసం?

పోలవరం కుడి కాలువ ద్వారా 1,29,00 హెక్టేర్ల ఆయకట్టు లభిస్తే ఎడమ కాలువ ద్వారా 1,62,000 హెక్టేర్ల ఆయకట్టు లభిస్తుంది. అయితే ఎడమకాలువ వెల్లే ప్రాంతంలోనే ఇటేవలే తాడిపూడి, పుష్కరం అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తిచేశారు. ఇదివరకే ఇదే ప్రాంతంలో చంగల్‌నాడు, తొర్రిగెడ్డ, ఏలేరు లిఫ్ట్ ఇరిగేష్న్లు వాడకంలో ఉన్నాయి. వీటి ద్వారా ఎడమకాలువల ఆయకట్టులో 95% ఇప్పటికే ఉన్న ఆయకట్టు. మిగతా ఐదు శాతం అసలు సాగుభూమి కాదు. ఎడమ కాలువ వెల్లే ప్రాంతంలో కూడా మెజారిటీ ప్రాంతం బావులద్వారా, గొట్టపు బావులద్వారా సాగులో ఉంది. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోలా భూగర్భ జలాలు అడుగంటలేదు కాబట్టి బావులద్వారా వ్యవసాయం బాగానే సాగుతుంది. కుడి, ఎడమ కాలువలు కలిపి 75% ఆయకట్టు ఇప్పటికే ఏదో ఒక రీతిలో ఉన్నదే.

మరి ఇప్పటికే ఆయకట్టు ఉన్న ప్రాంతంలో ఇంతమందిని నిరాశ్రయులను చేస్తూ, రాజమండ్రి నగరాన్ని రిస్కు చేస్తూ ఈప్రాజెక్టు ఎవరికోసం అంటే విశాఖ, కాకినాడలో కొత్తగా రాబోయే పరిశ్రమలకోసం. ఇక్కడ జిండాల్ అల్యూమినియం ప్లాంటుతో పాటు అనేక కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి, వీటికి పెద్దేత్తులో నీరు అవసరం. అంటే పోలవరం అందరూ అనుకునేట్టుగా డెల్తా రైతులకోసం కాదు, విశాఖ, కాకినాడలో పరిశ్రమలకోసం.

ముంపు, నిర్వాసితులు:

పోలవరం ద్వారా 270 గ్రామాల్లో లక్షా ఇరవై వేలమంది నిర్వాసితులవుతారనేవి 2001 జనాభాలెక్కల ఆధారంగా ప్రభుత్వ లెక్కలు. అయితే వాస్తవానికి ఇంకా ఎక్కువ గ్రామాలు మునిగిపోతాయి, అక్కడ గతపదేల్లలో ఇంకా ఎక్కువ జనాభా పెరిగింది అని ఎంజీవోలు చెబుతున్నాయి. వీరి అంచనా ప్రకారం కాలువల తవ్వకం వలన నిర్వాసితులయ్యేవారిని కలుపుకుంటే  మొత్తం నిర్వాసితులు నాలుగు లక్షల మంది వరకూ ఉంటారు. అందులో మెజారిటీ దళితులు, ఆదివాసీలు. లక్ష ఎకరాలు కూడా కొత్తగా ఆయకట్టు తీసుకురాని ఒక ప్రాజెక్టుకోసం నాలుగులక్షలమంది ప్రజలు తమ ఇల్లు, పొలాలు వదులుకుని మరోచోటికి వెల్లాలి.

ఇందులో పావువంతుదాకా ఆయకట్టుకింద వ్యవసాయం చేసుకుంటున్నవారు. అంటే లక్ష ఎకరాల కొత్త ఆయ్కట్టుకోసం 25వేల ఎకరాల ఆయకట్టు భూమిని వదులుకోవాలి. వీరికి పునరావాసంలో మల్లీ ఆయకట్టుకింద భూములు దొరకడం కల్ల. ఆదివాసీలు అడవిపైనే ఆధారపడతారు, వారిని తరలించడమంటే వారి పొట్ట కొట్టడమే.

ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు:

ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో కొంత ఒరిస్సా, చత్తీస్‌ఘర్ లలో కూడా ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాలలో ముంపును తప్పించడానికి మన ప్రభుత్వం చూపించిన పరిష్కారం అక్కడ ఎత్తయిన అడ్డుకట్ట కట్టడం. ఈ అడ్డుగోదల ఖర్చు ప్రాజెక్టు ఖర్చుకు అదనం. అయితే దీనిపై ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం జరగలేదు, వరదలను దృష్టిలో పెట్టుకుంటే ఎంత అడ్డుకట్ట కట్టాలనే దానిలో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదు.

ఈ ప్రాజెక్టును ఎలాగయినా అడ్డుకోవాలనే సంకల్పంతో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పావులు కదుపుతూ సుప్రీం కోర్టుకు వెల్లాడు. సుప్రీం కోర్టులో కేసు వోడిపోయే అవకాశాలే మనరాష్ట్రానికి ఎక్కువ. అంటే కేసు వోడిపోతే మనం పెట్టే ఖర్చంతా శుద్ద వేష్టు. అంటే ఇప్పుడేదో ఈప్రాజెక్టువల్ల ఉపయోగం ఉందని కాదు గానీ అప్పుడు పూర్తిగా ఆపేయాల్సి వస్తుంది.

ఇన్ని సమస్యలు ఉన్నా ఈప్రాజెక్టు కావాలని అన్ని రాజకీయ పార్టీలూ రోజూ ఉద్యమాలు చేస్తున్నది ఎవరికోసం అంటే కొందరు పారిశ్రామిక వేత్తలు, మరియు ప్రాజెక్టు వస్తే తాము మూడో పంటకూడా వేసుకోవచ్చునేమో నని ఆశపడే కొందరు ధనికులు.