Saturday 15 February 2014

బేషరమ్!

పార్లమెంటుకు కత్తులు, ఏకే- 47 రైఫిళ్లు కూడా తెస్తారా?.. మైకులు విరగ్గొడితే అవార్డులొస్తాయా?..మీలాంటి వాళ్లను పార్లమెంటు నుంచే కాదు, దేశం నుంచి గెంటేయాలి..మీరు చేతులు జోడించి దేశానికి క్షమాపణ చెప్పాలి..’ తెలుగుజాతి నిండు గౌరవమంటూ ఇన్నాళ్లు మైకులు మింగడంలో ఘనతవహించిన పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ని గురువారంనాటి లోక్‌సభ ఘటనలపై జాతీయ మీడియా కడిగిపారేస్తూ అన్న మాటలివి. పెప్పర్ స్ప్రే ఎంపీ తీరుపై జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ఓ పక్క సిగ్గుచేటు అని అభివర్ణిస్తే, జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతంగా చర్చలు నిర్వహించి దుమ్మెత్తిపోసింది. లైవ్ చర్చల్లో లగడపాటి, సీఎం రమేష్‌లను పిలిచి వారి తీరును తూర్పారబట్టింది. 

rajgopal‘చూడండి పార్లమెంటులో కబడ్డీ ఆడతా’ అంటూ మొన్న వెకిలి వ్యాఖ్యలు చేసిన లగడపాటిని జాతీయ మీడియా ఏకంగా ఫుట్‌బాలే ఆడుకుంది. ‘నీ వల్ల ప్రపంచం ముందు మేంతలదించుకున్నాం’ అంటూ ఆయా టీవీల ఎడిటర్లు లగడపాటిపై ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నపుడు తెలంగాణ ఇవ్వాల్సి ఉంటుందని తెలియదా?అని నిలదీశారు. ఆత్మరక్షణ కోసమే పార్లమెంట్‌కు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లానన్న సాకుపై ఆయనను జాతీయ మీడియా దుమ్ముదులిపింది. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య, రాజకీయ వ్యవస్థలకు మీ తీరు సిగ్గుపడేలా ఉంది అని అత్యంత తీవ్ర పదజాలంతో రాజగోపాల్‌పై మండిపడింది. జాతీయ మీడియా ఒకపక్క ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండగా, రాష్ట్రంలోని సీమాంధ్ర మీడియా మాత్రం షరా మామూలేనన్నట్టు వ్యవహరించింది. దేశం ముందు నేరస్తుడిలా నిలబడ్డ లగడపాటి హీరోయిజం చేసినట్టుగా కథనాలు, వ్యాఖ్యానాలతో తమ నైజాన్ని చాటుకుంది. జాతీయ ప్రధాన చానళ్లలో సీమాంధ్ర ఎంపీల తీరుపై మండిపాటు ఇలా సాగింది.. 

చేతులు జోడించి క్షమాపణ చెప్పు: అర్నాబ్ గోస్వామి 
టైమ్స్‌నౌ నిర్వహించిన చర్చలో ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఎంపీ లగడపాటిని లైవ్‌లో పిలిచి దుమ్ము దులిపారు. పెప్పర్ లగడపాటి అంటూ వ్యంగ్యంగా సంబోధించారు. లోక్‌సభ ఘటన గుర్తుచేస్తూ నీకు సిగ్గుగా లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా పార్లమెంటును నువ్వు నవ్వులపాలు చేశావు’ అంటూ దండయాత్రకు దిగారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమని రాజగోపాల్ అడగ్గా..నీకు మైకు ఇవ్వను ఇది నువ్వు ఇష్టానుసారం మాట్లాడటానికి పార్లమెంట్ కాదు..పార్లమెంట్ మాది అన్నారు. ‘ముందు నువ్వు దేశానికి క్షమాపణలు చెప్పు. రౌడీలా ప్రవర్తించావు. నిన్ను అసలు పార్లమెంట్‌లోపలికి అనుమతించొద్దు. నీ ప్రవర్తనను గుర్తు తెచ్చుకుని సిగ్గుపడు.’ అని మండిపడ్డారు. దీనికి లగడపాటి స్పందిస్తూ పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై తనకు బాధగానే ఉందని అన్నారే తప్ప క్షమాపణలపై నోరు మెదపలేదు.

దీనిపై ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. దిస్ ఈస్‌ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ మై పార్లమెంట్. పార్లమెంట్‌లో కబడ్డి ఆడుతావా? అసలేం అనుకుంటున్నావు. ఇలాంటి వాళ్లను సభ్యత్వం నుంచి తొలగించాలి’ అంటూ అరుణబ్ ఊగిపోయారు. ‘లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేతో ఫేమస్ అయ్యావు. నువ్వింకా ఏం చేద్దామనుకుంటున్నావ్. నీ తీరును చూసి సిగ్గుపడుతోంది దేశం. నిన్ను అటాక్ చేస్తేనే పెప్పర్ స్ప్రే చేశానంటువు కదా...? ఎవరు నీపై అటాక్ చేశారో చెప్పగలవా?’ అని నిలదీశారు. దీనికి లగడపాటి రాజగోపాల్ వంద మంది తనపై దాడి చేశారని వారెవరో మాత్రం తనకు తెలియదని తప్పించుకున్నారు. ‘ఏం మాట్లాడుతున్నావ్ రాజగోపాల్ వెల్‌లో వందమంది ఉన్నారా? పార్లమెంటులో ఒక నేరస్తుడిలా ప్రవర్తించావు. క్రిమినల్‌గా బిహేవ్ చేశావు. భారతదేశ రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తివి నువ్వు. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకుని హీరో కావాలనుకుంటున్నావా? పార్లమెంట్‌లో నువ్వు చేసింది ఉగ్రవాద దాడి. నువ్వు ఈ దేశంలోని పిల్లలకు, యువతకు ఏం సందేశం ఇచ్చావో తెలుసా? నీలాంటివారు రాజకీయ, పార్లమెంటరీ, ప్రజాస్వామ్యంలో ఉండటానికి సిగ్గుపడాలి.’ అని అన్నారు. 

ఉగ్రవాదికి ఓ సిద్ధాంతం ఉంటుంది. నీకేం ఉంది అని ప్రశ్నించారు. దీనికి లగడపాటి తాను చేసింది చాలా గొప్పపనేనని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తానీపనిచేశానని సమర్థించుకున్నారు. ‘నీకోసం నేను సమయం వృథా చేయను. నువ్వు చెప్పేది నేను వినదలుచుకోలేదు. ఆ ఆసక్తి కూడా నాకు లేదు. నువ్వు ఈ దేశం పెట్టుకున్న హద్దులు దాటి ప్రవర్తించావు. వెంటనే రెండు చేతులు ఎత్తి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పు. పార్లమెంట్ అంటే సర్కస్ కాదు. ఇలాగే చేస్తానంటే ముందు రాజీనామా చేసి బయటకు వచ్చి ఆటలాడుకో.’ అని అర్నాబ్ అన్నారు. దీనికి లగడపాటి స్పందిస్తూ నేనెప్పుడో రాజీనామా చేశానని, స్పీకర్ ఆమోదించలేదని తెలిపారు. ‘న్యారో, సెల్ఫ్ పొలిటికల్ ఇంట్రెస్టులతో(సంకుచిత,స్వార్థ, రాజకీయ ప్రయోజనాలతో) లగడపాటి మాట్లాడుతున్నారు. వారి తీరు ఈ దేశానికి సిగ్గుచేటు’ అని ఈసడించారు.తర్వాత అరుణబ్ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై మండిపడ్డారు. 

ఆడోళ్ల పెప్పర్ స్ప్రేతో నీకేం పని : ఎన్‌డీటీవీ బర్కాదత్ 
పార్లమెంటు ఘటనలపై చర్చా కార్యక్రమం నిర్వహించిన ఎన్‌డీటీవీ ఎడిటర్ బర్కాదత్ లైవ్ చర్చలో రాజగోపాల్ వైఖరిపై విరుచుకుపడ్డారు. ‘మిస్టర్ రాజగోపాల్. అసలు పెప్పర్ స్ప్రే ఎందుకు తీసుకెళ్లావు? నిబంధనలను ఉల్లంఘించావు. పెప్పర్ స్ప్రేను ఆడవాళ్లు ఆత్మరక్షణ కోసం ఉపయోగిస్తారు. అలాంటి స్ప్రే నీకు ఎందుకు? ’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదాన్ని నేనే దాన్ని వాడను, మగాడివి నీకెందుకు అని నిలదీశారు. నువ్వేమన్నా వీధిలో వెళుతున్నావా? పార్లమెంటులోనే కదా ఉన్నది. అక్కడున్నది నీ సహచరులే కదా? మరి పెప్పర్ స్ప్రే ఎందుకు అని ప్రశ్నించారు.

‘కనీసం క్షమాపణలు చెప్పాలనే ఆలోచన కూడా నీలో ఉన్నట్లు నాకు అనిపించడం లేదు, దేశం పరువును తీశానే అనే బాధ ఏమాత్రం లేదా?’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి లగడపాటి రాజగోపాల్ ‘నేను గొప్ప పనే చేశాను. సిగ్గుపడటం లేదు. అయితే సభలో జరిగిన సంఘటనకు బాధ కలుగుతోంది’ అంటూ వాదించే ప్రయత్నం చేశారు. పార్లమెంట్‌లో వీడియో ఫుటేజ్‌ను చూపించాలని అన్నారు. అనంతరం బర్కాదత్ మాట్లాడుతూ ‘మీరు పార్లమెంట్‌లో చేసింది చాలా దుర్మార్గమైన పని. చండాలమైనది. నీకు ఏమన్న బాధ అనిపిస్తోందా? ప్రధాని మొన్ననే ఎంపీల తీరును చూసి నా గుండె రక్తమోడుతోంది అన్నారు. ఇవాళే మీరు ఇలా చేశారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు. సమాధానం చెప్పు రాజగోపాల్.’ అని ప్రశ్నించారు. 

ఇంకా నయం, ఎకే 47 తేలేదు : సీఎన్‌ఎన్-ఐబీఎన్ రాజ్‌దీప్ సర్దేశాయ్ 
ఐబీఎన్ 18లో జరిగిన చర్చలో ఎడిటర్ ఇన్ చీఫ్ రాజ్‌దీప్ సర్దేశాయ్ రాజగోపాల్‌కు పార్లమెంట్‌లో దాడిచేసే ఉద్దేశం లేకుంటే పెప్పర్ స్ప్రేను ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ‘చాలా బాధ కలుగుతోంది. 20 ఏళ్లుగా పార్లమెంట్ కార్యకలాపాలను చూస్తున్నాను. ఇలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగలేదు. మైకులు విరగ్గొట్టారు. హత్యాయత్నాలు చేశారు. ఇది ఏమాత్రం భారతదేశ ప్రజాస్వామ్యానికి ఆమోదయోగ్యం కాదు’ అన్నారు. ఆంధ్రవారి తరపున చేస్తున్నందుకు లగడపాటి రాజగోపాల్ గొప్పవాడిగా అనిపించొచ్చు. 

ఏ అంశంపై అయినా అభిప్రాయాలుంటే పార్లమెంట్ చర్చల్లో పాల్గొని వినిపించాలిగానీ ఇదేమిటి? అని విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీ కూడా డబుల్ గేమ్ ఆడుతోంది. కాంగ్రెస్ తేల్చాలనుకున్నప్పుడు రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టాలి. తెలంగాణ విషయంలో అన్ని వర్గాలు విఫలం అయ్యాయి. సర్వత్రా అవకాశవాద ధోరణి కనిపిస్తున్నది అని అభిప్రాయపడ్డారు. ‘ఇంకా నయం పెప్పర్‌నే స్ప్రే చేశారు. కత్తులు, ఎకే 47లు తెచ్చి వాడలేదు. అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి’ అన్నారు. సీమాంధ్ర ఎంపీల తీరు పార్లమెంటరీ వ్యవహారాలకు అనుగుణంగా ఏమాత్రం లేదని అన్నారు. లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్‌లో ఉన్న అత్యంత ధనిక ఎంపీల్లో ఒకరు... కానీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశాడు అని రాజ్‌దీప్ వ్యాఖ్యానించారు.

1 comment:

  1. adhe enti alla thiduthunnaru ayeena seemandhraa bahgath singh kadaa ???

    ReplyDelete

Your comment will be published after the approval.