Sunday, 9 February 2014

కొందరికి పోలవరం, ఎందరికో శాపం




పోలవరం అనే ప్రాజెక్టు గోదావరి నదిపై ధవళేస్వరం నకు కొంచెం ఎగువన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ఈప్రాజెక్టుపై ఎన్నో కాంట్రావర్సీలు ఉన్నప్పటికీ రాజకీయనాయకుల వత్తిడితో త్వరలో దాదాపు జాతీయహోదా కూడా రాబోతున్నట్టు సమాచారం. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తికాకుండానే, ఆతరువాత ఒక్కప్రాజెక్టు కూడా చేపట్టకుండానే ఇప్పటికే ప్రాజెక్టు ఉన్నప్రాంతానికి మరో ప్రాజెక్టు అవసరమా లాంటి విషయాలు వదిలేసి అసలు ఈప్రాజెక్టు ఎంతవరకు సమర్ధనీయం అనే విషయం చర్చిద్దాం. 

పోలవరం వలన ఏర్పడే ఆయకట్టు 3 లక్షల హెక్టేర్లు ( సుమారు ఏడు లక్షల ఎకరాలు). అయితే ప్రభుత్వం చూపిస్తున్న ఆయకట్టులో 2.5 లక్షల ఎకరాలు ఇప్పటికే ప్రకాశం బారేజీకింద ఉన్న ఆయకట్టు. అంటే కొత్తగా వచ్చే ఆయకట్టు 4 లక్షల ఎకరాలు. ఈప్రాజెక్టు వలన ముంపుకు గురీయే ప్రాంతం అక్షరాలా 1.2 లక్ష ఎకరాలు అంటే 47 వేల హెక్టేర్లు. అందులో 11,782 హెక్టేర్ల మాగాణీ, 32,667 హెక్టేర్ల మెట్ట, 2,481 హెక్టేర్ల ఆటవీ ప్రాంతం. మొత్తం నిర్వాసితులు 276 గ్రామాలలోని 1,17,034 మనుషులు (2001 జనాభా లెక్కల ప్రకారం).అంటే ప్రతి 4 ఎకరాల ఆయకట్టుకోసం ఒక ఎకరం భూమి మునిగిపోతుంది, ఒక మనిషి నివాసం కోల్పోవలిసి వస్తుంది.

ఇంతే అనుకుంటే బాగుండేది కానీ, ఈముంపుకు ఇంకా కథ ఉంది. ఇక్కడ విలువయిన గ్రాఫైట్ గనులు కూడా మునిగిపోతున్నాయి. గ్రాఫైట్ మునిగిపోవడం వలన జరిగే నష్టం ఒక ఎత్తు కాగా ఆగ్రాఫైట్ నీటిలో కలిసి నీటిని కాలుష్యం చెయ్యడం మరో ఎత్తు.

ఇంకా ముంపులో ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా మునిగిపోతుంది. నిర్వాసితులలో ఎక్కువభాగం ట్రైబల్స్. ట్రైబల్స్‌ను మరో చోటికి తరలించడం ద్వారా వారి జీవనవిధానానికి లోటు. ఇక ట్రైబల్స్‌కు అడవిపై ఉండే హక్కులకు సంబంధించిన కేసు విచారణలో ఉంది. ఆకేసు వ్యవహారం తేలేంతవరకూ ట్రైబల్స్‌ను తరలించే హక్కు ప్రభుత్వానికి లేదు.

గోదావరి నీటిలో సెడిమెంటేషన్, స్లిట్ ఫామేషన్ ఎక్కువ. దానివలన డాంకు ప్రమాదం ఏర్పడొచ్చు.

ప్రస్తుత ప్రాజెక్టు డిజైన్ 2003లో ఏర్పరిచారు, కాబట్టి అప్పటి వరదల డాటా ప్రకారం ఏర్పడింది. కానీ 2008లో గడచిన వందేల్లళో రానంత వరదలు వచ్చాయి. ఇలా వస్తే ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు రాజమండ్రి పట్టణం మొత్తం కొట్టుకుపోతుంది.




పోలవరం ఎవరికోసం?

పోలవరం కుడి కాలువ ద్వారా 1,29,00 హెక్టేర్ల ఆయకట్టు లభిస్తే ఎడమ కాలువ ద్వారా 1,62,000 హెక్టేర్ల ఆయకట్టు లభిస్తుంది. అయితే ఎడమకాలువ వెల్లే ప్రాంతంలోనే ఇటేవలే తాడిపూడి, పుష్కరం అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తిచేశారు. ఇదివరకే ఇదే ప్రాంతంలో చంగల్‌నాడు, తొర్రిగెడ్డ, ఏలేరు లిఫ్ట్ ఇరిగేష్న్లు వాడకంలో ఉన్నాయి. వీటి ద్వారా ఎడమకాలువల ఆయకట్టులో 95% ఇప్పటికే ఉన్న ఆయకట్టు. మిగతా ఐదు శాతం అసలు సాగుభూమి కాదు. ఎడమ కాలువ వెల్లే ప్రాంతంలో కూడా మెజారిటీ ప్రాంతం బావులద్వారా, గొట్టపు బావులద్వారా సాగులో ఉంది. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోలా భూగర్భ జలాలు అడుగంటలేదు కాబట్టి బావులద్వారా వ్యవసాయం బాగానే సాగుతుంది. కుడి, ఎడమ కాలువలు కలిపి 75% ఆయకట్టు ఇప్పటికే ఏదో ఒక రీతిలో ఉన్నదే.

మరి ఇప్పటికే ఆయకట్టు ఉన్న ప్రాంతంలో ఇంతమందిని నిరాశ్రయులను చేస్తూ, రాజమండ్రి నగరాన్ని రిస్కు చేస్తూ ఈప్రాజెక్టు ఎవరికోసం అంటే విశాఖ, కాకినాడలో కొత్తగా రాబోయే పరిశ్రమలకోసం. ఇక్కడ జిండాల్ అల్యూమినియం ప్లాంటుతో పాటు అనేక కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి, వీటికి పెద్దేత్తులో నీరు అవసరం. అంటే పోలవరం అందరూ అనుకునేట్టుగా డెల్తా రైతులకోసం కాదు, విశాఖ, కాకినాడలో పరిశ్రమలకోసం.

ముంపు, నిర్వాసితులు:

పోలవరం ద్వారా 270 గ్రామాల్లో లక్షా ఇరవై వేలమంది నిర్వాసితులవుతారనేవి 2001 జనాభాలెక్కల ఆధారంగా ప్రభుత్వ లెక్కలు. అయితే వాస్తవానికి ఇంకా ఎక్కువ గ్రామాలు మునిగిపోతాయి, అక్కడ గతపదేల్లలో ఇంకా ఎక్కువ జనాభా పెరిగింది అని ఎంజీవోలు చెబుతున్నాయి. వీరి అంచనా ప్రకారం కాలువల తవ్వకం వలన నిర్వాసితులయ్యేవారిని కలుపుకుంటే  మొత్తం నిర్వాసితులు నాలుగు లక్షల మంది వరకూ ఉంటారు. అందులో మెజారిటీ దళితులు, ఆదివాసీలు. లక్ష ఎకరాలు కూడా కొత్తగా ఆయకట్టు తీసుకురాని ఒక ప్రాజెక్టుకోసం నాలుగులక్షలమంది ప్రజలు తమ ఇల్లు, పొలాలు వదులుకుని మరోచోటికి వెల్లాలి.

ఇందులో పావువంతుదాకా ఆయకట్టుకింద వ్యవసాయం చేసుకుంటున్నవారు. అంటే లక్ష ఎకరాల కొత్త ఆయ్కట్టుకోసం 25వేల ఎకరాల ఆయకట్టు భూమిని వదులుకోవాలి. వీరికి పునరావాసంలో మల్లీ ఆయకట్టుకింద భూములు దొరకడం కల్ల. ఆదివాసీలు అడవిపైనే ఆధారపడతారు, వారిని తరలించడమంటే వారి పొట్ట కొట్టడమే.

ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు:

ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో కొంత ఒరిస్సా, చత్తీస్‌ఘర్ లలో కూడా ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాలలో ముంపును తప్పించడానికి మన ప్రభుత్వం చూపించిన పరిష్కారం అక్కడ ఎత్తయిన అడ్డుకట్ట కట్టడం. ఈ అడ్డుగోదల ఖర్చు ప్రాజెక్టు ఖర్చుకు అదనం. అయితే దీనిపై ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం జరగలేదు, వరదలను దృష్టిలో పెట్టుకుంటే ఎంత అడ్డుకట్ట కట్టాలనే దానిలో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదు.

ఈ ప్రాజెక్టును ఎలాగయినా అడ్డుకోవాలనే సంకల్పంతో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పావులు కదుపుతూ సుప్రీం కోర్టుకు వెల్లాడు. సుప్రీం కోర్టులో కేసు వోడిపోయే అవకాశాలే మనరాష్ట్రానికి ఎక్కువ. అంటే కేసు వోడిపోతే మనం పెట్టే ఖర్చంతా శుద్ద వేష్టు. అంటే ఇప్పుడేదో ఈప్రాజెక్టువల్ల ఉపయోగం ఉందని కాదు గానీ అప్పుడు పూర్తిగా ఆపేయాల్సి వస్తుంది.

ఇన్ని సమస్యలు ఉన్నా ఈప్రాజెక్టు కావాలని అన్ని రాజకీయ పార్టీలూ రోజూ ఉద్యమాలు చేస్తున్నది ఎవరికోసం అంటే కొందరు పారిశ్రామిక వేత్తలు, మరియు ప్రాజెక్టు వస్తే తాము మూడో పంటకూడా వేసుకోవచ్చునేమో నని ఆశపడే కొందరు ధనికులు.

1 comment:

  1. పోలవరం అంటే ఏంటో తెలియని వాడు కూడా 'తెలంగాణా వాళ్ళు వ్యేతిరేకిస్తున్నారు' అనే ఒకే ఒక్క కారణంచే పోలవరం నిర్మించాల్సిందే అని మడి కట్టుకు కూర్చున్నారు. అట్లాంటి మూర్ఖులకు ఎవరు సర్ది చెప్పగలరు?

    ReplyDelete

Your comment will be published after the approval.