Monday, 18 July 2011

రాష్ట్రవిభజనకు హైదరాబాద్ అడ్డంకి కాదు: జేసీ

రాష్ట్రవిభజనకు హైదరాబాద్ అడ్డంకి కాదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే జలవనరుల సమస్యే ప్రధానమని అసలు విషయం బయట పెట్టారు.

నిజానికి హైదరాబాదు విభజనకు సమస్య అని సమైక్యవాదులు పైకి చెబుతున్నప్పటికీ అది పెద్ద సమస్య కాదు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్ర సెటిలర్ల ఫోరం ఇప్పటికే పలుసార్లు విభజనకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. బెంగులూరు, మద్రాసులో ఉన్న సీమాంధ్రులకి లేని సమస్య హైదరాబాదులో ఉన్నవారికి ఉండజాలదని హైదరాబాద్ ఆంధ్రా సెటిలర్లకు తెలుసు కనుక వారెప్పుడూ విభజన సమయ్స అనుకోలేదు. కేవలం విభజన వ్యతిరేకించే నాయకులు లేని అపోహలు సృష్టిస్తూ హైదరాబాదు సీమాంధ్ర సెటిలర్ల రక్షణ ఒక సమస్య అని చెబుతున్నారు. అలా చెప్పే కుహనా సమైక్యవాదులూ ఏనాడూ తెలంగాణలో ఇతరప్రాంతాల్లో ఉన్న సీమాంధ్రుల రక్షణగురించి మాట్లాడింది లేదు.

అయితే జేసీ చెప్పేట్లు విభజన వలన నీటి వివాదాలు వస్తాయన్న దానిలో నిజం ఉంది. ఒక రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు తెలంగాణా క్రిష్ణా జలాలపై న్యాయమైన వాటాను ట్రిబ్యునల్ ద్వారా పొందగలదు. ఇప్పుడు ఒక్క నాగర్జునసాగర్ ఎడమకాలువలో కొద్ది  వాటా తప్ప (అందులో ఆంధ్రా వాటా పోగా మిగిలింది), మిగతా క్రిష్ణా జలాలు పూర్తిగా  ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్ కుడి కాలువ, శ్రీశైలం కుడి కాలువ, వెలిగొండ, తెలుగుగంగ, హంద్రి-నీవా, కేసీ కెనాల్ లాంటి ప్రాజెక్టుల ద్వారా కోస్తాంధ్ర, రాయలసీమ తరలిపోతున్న విషయం తెలిసిందే. రాజోలి బండ ద్వారా మహబూబ్ నగర్‌కు కాసిని నీటిబొట్లు వస్తే అనేకసార్లు వాటికి అడ్డుపడి రాజోలిబండ గేట్లు పేల్చి జలదోపిడీ చేసిన విషయం, శ్రీశైలం ఎడమకాలువను ఫండ్సు ఇవ్వక దశాబ్దాలపాటుగా పెండింగు పెట్టిన విషయం, నాగార్జున సాగర్ ఎడమకాలువ అలైన్మెంటు మార్చి తెలంగాణ ఆయకట్టు తగ్గించిన విషయం తెలిసిందే. విభజిస్తే ఇప్పటిలా క్రిష్ణా జలాలు పూర్తిగా కొట్టేయడం జరగదని అసలు విషయం బయట పెట్టి ఇప్పుడు తెలంగాణకు క్రిష్ణాలో న్యాయమైన వాటా రావడం లేదని జేసీ చెప్పకనే చెప్పాడు.

1 comment:

  1. Yes this is the truth ....
    Thanks for u r post

    ReplyDelete

Your comment will be published after the approval.