Tuesday, 31 May 2011

ఎర్రబిల్లీ, ఏంది నీ లొల్లి?

ఈమధ్యన కొత్తగా తెలంగాణ తెలుగుదేశం ఫోరుం అధ్యషుడయిన ఎర్రబిల్లి దయాకర్ రావు చంద్రబాబు అండ జూసుకొని ఎగిరెగిరి పడుతుండు. తెలంగాణాపై పార్టీవైఖరి గురించి చంద్రబాబును నిలదీసి సస్పెండయిన నాగంపై రోజూ ఏదో మొరుగుతున్నడు.

అయితే ఎర్రబిల్లి దగ్గర నాగం అడిగే ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదు కని ఒక్కటే "నాగం, నీ ఆరాటం తెలంగాణ కోసం కాదు అంటున్నడు". ఎర్రబిల్లీ మరి నీ ఆరాటం  దేనికోసం? పక్కా సమైక్యవాది అయిన చంద్రబాబు చెప్పుకింద నువ్వేం ఉద్యమం జేస్తవ్, ప్రజలు నిన్నేం నమ్ముతరు జెప్పు? మహానాడులో కనీసం మాటవరసకు, నాగంకు సమాధానం జెప్పడం కోసమన్న తెలంగాణపై అనుకూల ప్రకటన చేయించని నువ్వు తెలంగాణ దెస్తనంటె జనం నీ మొహమ్మీద ఉమ్మెయ్యరా జెప్పు? ఒక్కసారి నీ సొంత నియోజకవర్గం పాలకుర్తికి మందీమార్బలం లేకుంట వెల్లు, జనం నీ మొహమ్మిద కొడుతరో లేదో తెలుస్తది.

తెలంగాణ రణభేరి అనిజెప్పి రాయలసీమనుండి గూండాలను నీరక్షణ కోసం తెచ్చుకుని మీటింగు పెట్టినా పోలీసులు, నువ్వు దెచ్చుకున్న గూండాలు, మీటింగును ఆపడానికి వచ్చినోల్లు దప్ప వేరెవ్వరు రాకపాయె, ఇంక ఎందుకు నీకు తెలంగాణ ఉద్యమం గని ఎల్లు, నోర్మూసుకుని నీసిమాంధ్ర దొరలకు చంచాగిరీ జెయ్యి.

ఔను, తెలంగాణ రైలు జీవిత కాలం లేటే!

1956 లో ఫజల్ అలి కమీషన్ రిపోర్టుతో మొదలయిన తెలంగాణ రైలుకు అడుగడుగునా కష్టాలు, మోసాలే ఎదురయ్యాయి. మాటిమాటికీ పట్టాలు తప్పిస్తున్న స్వార్ధపూరిత రాజకీయ నాయకుల మోసాల ఫలితంగా ఈరైలు ఇప్పటికే జీవిత కాలం లేటు అయ్యింది.

1956లో ఆంధ్రా నాయకుల సామ్రాజ్యవాదానికి కమ్యూనిష్టుల స్వార్ధ విశాలాంధ్ర నినాదమనే బ్లాక్‌మెయిలు తోడవడంతో పట్టాల్లు తప్పిన తెలంగాణ రైలును తిరిగి పట్టాలపై నిలబెట్టడం కోసం తెలంగాణ వాసులు ప్రాణాలకు తెగించి పోరాడారు. అయితే ఏం లాభం, కుత్సిత నాయకుల రాక్షస నీతి ఫలితంగా వందల ప్రాణాలు నేలకొరిగాయి, ప్రజల ఆవేశం పోలీసుల దమనకాండ, నాయకుల వంచన, ప్రభుత్వ కపటనీతి వలన మూగపోయింది.

తెలంగాన రైలును మేము తీసుకొస్తామన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిమెజారిటీ తెచ్చుకోలేక కుత్సిత చంద్రబాబు మద్దతు తీసుకోవడం వలన 2000లో ఉత్తరాంచల్, చత్తీస్ఘర్, ఝార్ఖండ్ అనే మూడు రైళ్ళను ఏర్పాటు చేసిన ఎండీయే ప్రభుత్వం తెలంగాణ రైలును మాత్రం విస్మరించింది. 2001లో చంద్రశేఖరుడు తన స్వార్ధం కోసమే అయినా సరే మల్లి మరచిపోయిన తెలంగాణా రైలును ప్రజలకు గుర్తు చేశాడు. అయినా రైలు పట్టలపైకి మాత్రం రాలేకపోయింది.

తెలంగాన రైలు విషయంలో నేను మద్దతు ఇస్తానంటూ 2004లో మాట ఇచ్చిన దుష్టబుద్ది రాజశేఖరుడు ఏరు దాటగానే తెప్ప విషయం మరిచిపొయ్యాడు. 2008 ఎలక్షన్లొచ్చేసరికి మల్లీ మోసగాడు చంద్రబాబు నేను మారాను, నేను మీ తెలంగాణకు జరిగిన అన్యాయం తెలుసుకున్నాను అంటూ మాట మార్చి తెలంగాణ రైలును తన మానిఫెస్టోలో పెట్టుకుని మరీ ఎలక్షన్లలోకి వెల్లి 36 సీట్లు గెలుచుకున్నాడు.

చివరికి రెండువేల ఎనిమిదిలో చిదంబరం తెలంగాణ రైలును మొదలు పెడుతున్నామని చెప్పగానే ఒక్కసారి కుత్సిత నాయకుల వికృత రూపాలన్నీ బయటపడ్డాయి. నేను మారాను, తెలంగాణకు నేను మద్దతిస్తాను అంటూ, ఒకరోజు ముందు వరకూ బిల్లు పెట్టండి మద్దతివ్వ్వకపోతే అడగండి అన్న నక్కబాబు ఒక్కసారి మాటమార్చి ఎవరినడిగి ఈ అర్ధరాత్రి ప్రకటన అంటూ బీరాలు పొయ్యాడు, ఒకపక్క తన మనుషుల చేత తనే స్వయంగా కృత్రిమ ఉద్యమం రూపొందించాడు. మరోపక్క ఇచ్చేదీ తెచ్చేదీ మేమేనన్న వారంతా ఒక్క సారి అడ్డం తిరిగి రాజీనామాల డ్రామాలు చేశారు. అసలు లేనే లేని సమైక్యరైలును పీసీ సర్కార్లా మాయచేసి చూపించారు. ఏదయితేనేం తెలంగాణ రైలును మల్లీ పట్టాలు దించేశారు.

ఇంతలో మాయదారి శ్రీక్రిష్ణ కమిటీ వచ్చింది, మయసభలాగా అంతా మాయజేసి ఒక దిక్కుమాలిన రిపోర్టు తయారుజేసింది, తెలంగాణ రైలు మరో రెండడుగులు వెనక్కి వెల్లిపొయ్యింది.

చూస్తుండగానే ఒక జీవితకాలం గడచిపొయ్యింది. తేడా అల్లా ప్రజలకు ఇప్పుడు మునుపటిలా లేరు. నక్కబాబులూ, సోనియమ్మలు ఇంకా ప్రజలను ఏమార్చడం సాధ్యం కాదు. ఇప్పుడు ఇచ్చేదీ తెచ్చేదీ మేమే నన్నా, నేను మారాను నాకు తెలంగాణాకు జరిగిన అన్యాయం అర్ధమయింది అన్నా ప్రజలు నమ్మరు. మరి తెలంగాణా రైలుకు మద్దతు ఇస్తారో లేక తెలంగాణలో మీపార్టీల నాయకులు కాలుపెట్టలేకుండా చేసుకుంటారో మీ ఇష్టం. ఒక జీవిత కాలం ఇప్పటికే గడచిపోయింది, ఇప్పుడు ఇంకో జీవితకాలం ప్రజలు ఆగే స్థితిలో లేరు, మరి వినాయకులూ మీవైఖరి తేల్చుకోండి.

Monday, 30 May 2011

తెలంగాణ ఏర్పాటుకు నేనెందుకు వ్యతిరేకం?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందుకు వ్యతిరేకమో ఒక సగటు సమైక్యవాదికి గల కారణాలు:

1) హైదరాబాదులొ నేను ఇల్లస్థలాలూ, ఫ్లాట్సూ కొనుక్కున్నాను. ఇప్పుడు విడిపోతే నా ప్రాపర్టీ ధరలు పడిపోతే? వామ్మో వాయ్యో... ( అంతా నా స్వార్ధమే... సామాన్య జనం ఎటుపోతే నాకేం).

2) ఇప్పటిదాకా మాకు తేరగా క్రిష్ణా జలాలు వస్తున్నాయి మాకు న్యాయమయిన వాటాలేకపోయినా. ఇప్పుడు మీరాష్ట్రం ఏర్పడితే మరి రాష్ట్రాల మధ్య నీల్లవాటా బోర్డు నిర్ణయిస్తుంది కదా. అప్పుడు ఇప్పటిలాగా మాకు తేరగా నీల్ల రావుకదా ఎలా, అమ్మో?(ఇప్పుడు మాకు దక్కాల్సినదానికంటే ఎక్కువ దక్కుతుందనేది నిజమేననుకోండి).

3) ఇప్పుడంటే APSEBలోనూ, APSRTC లోనూ, అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలోనూ అన్నిచోట్ల పై అధికారులు మావారే కాబట్టి మావాల్లు మెల్లగ దొడ్డిదారిలో దూరిపోతారు. లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎలాగూ ఉంది మావారికి ఉద్యోగాలు ఇప్పించడానికి. ఇవన్నీ కాకపోతే దొంగ సర్టిఫికెట్ పెట్టి తెలంగాణ కోటాలో ఉద్యోగం తెచ్చుకోవచ్చు.

రేపు రాష్ట్రం ఏర్పడితే మాప్రాంతంలోని ఉద్యోగాల్లోనే మాలో మేమే పోటీపడాలికదా, ఎలా మరి?

4) ఇప్పుడంటే తెలంగాణ మాతో ఉంది కాబట్టి అందరం కలిసి ఇక్కడ తినేస్తాం కానీ రేపు విడిపోతే మాలో మేమే (సీమ, ఆంధ్రా వాల్లం) మీరు దోచుకుంటున్నారంటే మీరని కొట్టుకుంటాం, అలా మేం కొట్ట్కోవడం అవసరమా?

5) ఇప్పుడంటే తెలంగాణాకు చెందాల్సిన ఫండ్సన్నీ మాకు వచ్చేస్తున్నాయి, విడిపోతే మాప్రాంతంలోని ఆదాయంపై మాత్రమే మేము ఆధారపడాలి, అలా అయితే ఎలా?

6) ఇప్పుడంటే సమైక్య రాష్ట్రంలో మాకులం వాల్లు బలమయిన స్థానంలో ఉన్నారు. అధికారం మాకులానికి లేక ఫలానా కులం వారికే ఎప్పుడూ దక్కుతుంది. రేపు రాష్ట్రాలు విడిపోయి చిన్న రాష్ట్రం అయితే బడుగు వర్గాలు మమ్మల్ని వెనక్కి నెట్టేసి అధికారం చేజిక్కించుకుంటే, అమ్మో ఎలా?

7) మాకు సొంత గుండెకాయ లేదే? ఇంతకుముందు మద్రాసే మాగుండె అనుకున్నాం. అది అందకపొయ్యేసరికి హైదరాబాదే మాగుండె అని ఇప్పుడనుకుంటున్నాం. ఇప్పుడు విడిపోతే మాగుండెకాయ వెతుక్కోవాలి, ఎక్కడుందో ఏమో?

తెలంగాణకు సీమాంధ్ర బడుగు వర్గాల మద్దతు

తెలంగాణ విషయం పదేళ్ళనుంచి నానుతున్నా, అన్ని ప్రధాన పార్టీలు తెలంగాణకు వివిధ సమయాల్లో మద్దతు పలికి మానిఫెస్టోల్లో పెట్టుకున్నా ఏనాడూ అడ్డుచెప్పని కొన్ని సీమాంధ్ర వర్గాలు, కొంతమంది నాయకులు చిదంబరం ప్రకటన వెలువడగానే కృత్రిమ ఉద్యమాన్ని తయారు హ్చెయాడం అందరికీ తెలిసిన విషయమే. ఈ సమైక్యవాదులు సీమాంధ్ర ప్రజలందరి అభిప్రాయం రాష్ట్రం విడిపోగూడదనే అన్నట్లు చెప్పుకొచ్చినా ఈ సమైక్య ఉద్యమం నడిపిస్తుంది సీమాంధ్రకు చెందిన మూడు నాలుగు అగ్రకులాలకు చెందిన నాయకులు కాగా ప్రజల్లో కూడా కొద్దిమంది అగ్రకుల ధనిక వర్గం మాత్రమే రాష్ట్రం విడిపోవద్దంటున్నారు, ఎక్కువ మందికి నిజానికి రాష్ట్రం విడిపోయినా కలిసిఉన్నా పోయేదేం లేదు కనుక ఆవిషయంపై అంత ఉత్సాహం లేదు. అయితే సీమాంధ్ర బడుగువర్గాల్లో మాత్రం అత్యధికులు రాష్ట్రం విడిపోతే చిన్న రాష్ట్రంలో తమకు అవకాశాలు పెరుగుతాయనే ఆశతో తెలంగాణా ఏర్పాటును కోరుతున్నారు.

1969లో మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినపుడు ఉత్తరాంధ్రకు చెందిన బడుగువర్గాల నేత సర్దార్ గౌతు లచ్చన్న తానుకూడా స్వయంగా ఉద్యమంలో పాల్గొని తెలంగాణకు మద్దతుగా నిరాహారదీక్ష కూడా చేపట్టాడు. గౌతు లచ్చన్న పెద్ద మనుషుల ఒప్పందం పై ఆంధ్ర ప్రాంతం తరఫున సంతకం చేసినవారిలో ఒకరు. మిగతా ఆంధ్రా పెద్దమనుషులు, మరీ ముఖ్యంగా ఆ తరువాత ముఖ్యమంత్రులయిన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేయగా గౌతు లచ్చన్న మాత్రం ధర్మానికి కట్టుబడి తెలంగాణకు మద్దతుగా నిలిచారు. అగ్రకులాలకు చెందినప్పటికీ నిజాయితీపరుడిగా పేరున్న ఎన్.జీ.రంగా కూడా అప్పట్లో తెలంగాణకు మద్దతు పలికాడు.

ఇప్పటి తరంలో సీమాంధ్రా దళితులు ప్రధానంగా తెలంగాణాకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. పెద్ద రాష్ట్రాలలో ధనబలం కలిగిన అగ్రకులాల పెత్తనం మరీ బలంగా ఉంటుంది కాబట్టి రాష్ట్రం చిన్నదయితే వీరికి అవకాశాలు పెరుగుతాయనడంలో వాస్తవం ఉంది. దళిత మహాసభకు చెందిన కత్తి పద్మారావు, దళిత వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తెలంగాణకు మద్దతు ఇస్తున్నారు.బీసీల్లో కూడా అనేక మంది తెలంగాణాకు మద్దతు ఇస్తున్నారు. బొత్సా ఇప్పటికే మద్దతు ఇవ్వగా ఇంకొంతమంది బయటపడకున్నా తెలంగాణకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరి రాష్ట్ర ఏర్పాటు విషయంలో పూర్తి మద్దతున్న తెలంగాణ ప్రజలు, సీమాంధ్రలోని మెజారిటీ దళిత బీసీ వర్గాల వారి మాట నెగ్గాలా, లేక రెండు మూడు సీమాంధ్ర అగ్రకుల ధనిక వర్గాలవారి మాట నెగ్గాలా? సమైక్య రాష్ట్రంలో ఎప్పుడూ అధికారం ఈరెండుమూడు సీమాంధ్రా అగ్రకులాల చేతిళొనే ఉంటుంది, ఎప్పుడూ వారి మాటే నెగ్గుతుంది కాబట్టి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వారు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు, అది వారి స్వలాభానికి చెందిన విషయం మరి.

Saturday, 28 May 2011

సమైక్యవాదం అంటే? (విశాలాంధ్ర వారి రాతల్లో)

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని బృహత్తర మహాశయంతో ఈమధ్యన పరకాల ప్రభాకర్ అధ్వర్యంలో ఒక వెబ్ సైటు, బ్లాగు వెలిసాయి. సమైక్యవాదం గురించి వారు ఈమధ్యన విపరీతంగా రాతలు గుప్పిస్తున్నారు. మరి వారి సమైక్యవాదానికి అర్ధం ఏమిటో వారి టపాల వారు చెప్పే విషయాల అధారంగా చూద్దాం:
1) రాష్ట్రాన్ని ఇప్పటిలాగే ఎప్పటికీ కలిపే ఉంచాలి. మీకిష్టం ఉన్నా లేకపోయినా మా సొంత లాభం కొరకు మీరు  మాతో చచ్చినట్టు కలిసి ఉండాల్సిందే (లేదంటే ఊరుకునేది లేదు). మాకిష్టం లేకపోతే ఎందుకు కలిసి ఉండాలి అంటారా.. ఫలానా కుతుబ్ షాహి కాలంలో మనం కలిసే ఉన్నాం కనుక ఇకముందు అనంతకాలం వరకూ కలిసే ఉండాలంతే.
2) సహజంగా నీళ్ళు ఎప్పుడూ కిందికే ప్రవహిస్తాయి కనుక డెల్టా ప్రాంతానికి నీరొస్తున్నాయి, లక్ష సంవత్సరాల క్రితం కూడా డెల్టాకే నీల్లొచ్చాయి కనుక ఇప్పుడూ వస్తాయి, ఇకముందుకూడా తెలంగాణాకు వాటా ఇచ్చేది లేదు. సాగునీల్ల విషయంలో తెలంగాణాకేం అన్యాయం జరుగలేదు, అంతా ప్రకృతి ధర్మం ప్రకారం జరుగుతుంది.
బలవంతుడు బలహీనుడిని దోచుకోవడం కూడా డార్విన్ సిద్ధాంతంలోని survival of the fittest సూత్రం ప్రకారం జరుగుతుంది కనుక తెలంగాణ వనరులు దోపిడీకి గురయితే అది ప్రకృతి సిద్ధాంతమే కనుక మీరు దాన్ని దోపిడీ అనడానికి వీల్లేదు.
3) మా లగడపాటి మీ తెలంగాణా బంజరుభూములపై, కొండలూ,చెరువులు, గుల్లూ స్మశానాలూ, వక్ఫ్ భూములపై  అందమయిన భవంతులు కడుతుంటే చూడండి మీ విమలక్క వచ్చి దౌర్జన్యంగా జెండాలు పాతింది? మీ తెలంగాణ ఉద్యమకారులే మాఅంధ్రా వ్యాపారుల ఆస్థులు దోచుకుంటున్నారు.
ఇలాంటివే ఇంకా మరెన్నో.ఇంత అసహజమయిన తర్కానికి అందని వాదనలెందుకంటారా? మరి వారి అబద్ధపు వాదనను సమర్ధించుకోవడానికి హేతుబద్దమయిన వాదనలు దొరకవు.

Friday, 27 May 2011

తెలంగాణపై మా వైఖరి స్పష్టం



తెలంగాణ విషయంలో అన్ని పార్టీలకంటే మాపార్టీయే స్పష్టమైన వైఖరి కలిగి ఉంది. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై నిర్ణయం తీసుకుంటే మేము అందుకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం చేపడతాం, అలా కాకుండా కేంద్రం రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికే నిర్ణయం తీసుకుంటే మేం మా 2008 ఎలక్షన్ మానిఫెస్టోకి కట్టుబడి ఉండి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఆవిధంగా  ముందుకు పోతాం.

ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ నిర్ణయాలనన్నింటినీ ఎండగట్టడం మా భాద్యత..అందుకే మేం కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తున్నాను. అప్పటివరకూ ఇలాగే రెండు ప్రాంతాలలో రెండు రకాల స్పష్టమైన వైఖరితో ముందుకు బోతాం.
 - మహానాడులో చంద్రబాబు

Tuesday, 17 May 2011

కలిసి ఉంటే కలదు సుఖం (నాకుమాత్రమే!!)


Image taken from http://www.gideetelangana.blogspot.com/
రాష్ట్రం మొత్తం ఇప్పుడు ప్రత్యేక, సమైక్య వాదులుగా చీలిపోయింది. రెండు వర్గాలవారూ తాము చెప్పేదే రైటూ, అవతలివారిది అబద్దాలు అంటారు. ఇంతకూ సమైక్యవాదం, ప్రత్యేక తెలంగాణవాదం ఈ రెండు వాదనలలో ఉన్న తేడాలేమిటి?

- తెలంగాణా కోరుకునే వారు మాట్లాడేది మానీళ్ళు, మాఉద్యోగాలు, మాప్రాంతానికి ఫండ్సూ అని, ఇవన్నీ ఇన్నిరోజులు సరిగ్గా పంచబడలేదు కాబట్టి మాకు స్వయంపాలన కావాలని. సమైక్యవాదులు చెప్పేది మనదంతా ఒకే భాష కాబట్టి అంతా కలిసే ఉండాలి అని. నీళ్ళు, నియామకాలలో అన్యాయం జరుగుతుందని వాపోతుందన్నవారు కేవలం భాషను చూసి కలిసిఉండాలంటే ఎలాఉంటారు? సమాన అవకాశాలు, సమాన న్యాయం లేకుండా సమైక్య భావన ఎలా ఉంటుంది? కడుపు కాలుతుంటే తెలుగుజాతి గౌరవం అంటూ నినాదాలు ఎవరిని ఉత్తేజపరుస్తాయి?

- ఒక వ్యక్తి తెలంగాణా కావాలని వాదిస్తే అది తనకోసం కాదు, తనప్రాంతంలో ఉండే సామాన్యుడి కోసం. తెలంగాణా వస్తే బ్లాగుల్లో ఆర్టికల్స్ రాసుకునే ఐటీ ఉద్యోగికి ఒరిగేదేమీ ఉండదు, కానీ తాను వాదించేది తనకోసమో లేక తనలాంటి ఉన్నతవర్గం కోసమో కాదు. తెలంగాణా వాదులు వాదించేది ఎకరం భూమి ఉండి సాగునీటికోసం  దశాబ్దాలతరబడి ఎదురుచూస్తున్న ఒక రైతుకోసమో, ఒక డిగ్రీ చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే బీద మధ్యతరగతి యువకులకోసమో లేక ఫ్లోరైడ్‌తో జబ్బులు తెచ్చుకుంటున్న సామాన్యుడికి తాగునీటికోసమో.

ఒక సమైక్యవాది వాదించేది మాత్రం సీమాంధ్రలోని సామాన్యులకోసం కాదు (తెలంగాణలోని సామాన్యుడికోసం అసలు కాదు, ఐడియల్గా సమైక్యవాది ఇరుప్రాంతాలవారికోసం మాట్లాడాలి). హైదరాబాదులో భూములధరలగురించి, హైదరాబాదులో ఉండే ధనిక సీమాంధ్రులకోసం, తను లేక తమలాంటి రిచ్ అండ్ ఎలైట్ కోసం.

- తెలంగాణావాదులు మాట్లాడేది తమ ప్రాంత సామాన్యులకు న్యాయంగా రావాల్సిన నీల్లు, నిధులు, ఉద్యోగాలకోసం. సమైక్యవాదులు మాట్లాడేది తము ఇప్పటిదాకా అక్రమంగా కొల్లగొడుతున్న నీల్లు, నిధులు, ఉద్యోగాలకోసం.

- తెలంగాణ ఉద్యమం పేద మధ్యతరగతి ప్రజల, వెనుకబడిన తరగతులు, దళితుల ఉద్యమం. సమైక్య వాదన మాత్రం ధనిక అగ్రకుల వర్గాలవారి వాదన, సీమాంధ్ర సామాన్యులలో, సీమాంధ్ర దళిత వెనుకబడినవారిలో లేని భావన.

- తెలంగాణ వాదులు చెప్పేది తాము స్వయంగా అనుభవించిన వివక్షను గురించి. సమైక్యవాదులు చెప్పేది వివక్ష అనేది అబద్ధం, అంతా బాగానే ఉంది అని. మీరు అనుభవించనిదాన్ని అబద్ధం అని ఎలా చెబుతారు? కడుపుకాలిన వాడు నాకు ఆకలవుతుందని చెబితే పక్కన ఉన్న కడుపు నిండిన వాడు నీ ఆకలి అంతా ఉట్టి అబద్ధం అంటే ఎలాఉంటుంది?


- హైదరాబాదులో ఉండే కొద్దిమంది సెక్యూరిటీకి నష్టం అనే ఊహజనిత వాదన గురించి, కనీసం మిగతా తెలంగాణ ప్రాంతంలోని సీమాంధ్ర సెటిలర్ల సెక్యూరిటీగురించి కూడా కాదు.

మరి ఇందులో ఏది అసలయిన ఉద్యమం, ఏది అబద్దపు ఉద్యమం?

part of the content used from http://sujaiblog.blogspot.com/search/label/Telangana?updated-max=2010-02-25T12%3A03%3A00%2B05%3A30&max-results=20

Sunday, 15 May 2011

గ్రామ స్వరాజ్యాలు, జిల్లా ప్రభుత్వాలు - సర్వరోగ నివారిణి

మన స్వయంప్రకటిత మేధావి జేపీ నారాయణ తెలంగాణ ఊసెప్పుడు వచ్చినా వేసే రికార్డు జిల్లా ప్రభుత్వాలు. మేము మా మానిఫెస్టోలో పెట్టిన జిల్లా ప్రభుత్వాలే సర్వరోగ నివారిణి, తెలంగాణా సమస్యకు మూలకారణాలన్నీ మా జిల్లా ప్రభుత్వాలతో తొలగిపోతాయి అంటాడు. ఈమధ్యన విశాలాంధ్ర మహాసభ అంటూ పెట్టుకున్నవారు గాంధీ చెప్పిన గ్రామస్వరాజ్యం అమలు చేస్తే చాలు, చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యవలసిన అవసరం లేదు అని చెబుతున్నారు.

అసలు state reorganization committy ఏర్పాటుచేసినప్పుడు ఆరోజుల్లోనే అంబేద్కర్ రాబోయే సమస్యలను కల్లకు కట్టినట్లుగా ఊహించి తన రిపోర్టులో పొందు పరిచారు. రాష్ట్రాలు పెద్దవయితే అభివృద్ధి చెందిన వర్గం వారు బలమయిన వర్గంగా తయారయి మిగతావారి అవకాశాలను కొల్లగొట్టే అవకాశం ఉంది, బలహీనమయిన వారు ఎక్ష్ప్లాయిటేషన్‌కు గురవ్వొచ్చు అని రాశారు. అలాగే ఒకే రాష్ట్రంలో ఒకటికంటే ఎక్కువ భాషలు మాట్లాడే ప్రజలు ఉంటే వారిమధ్య ద్వేషాలు పొడసూపే అవకాశంకూడా ఉంది అని రాశారు. కాబట్టి అంబేద్కర్ ప్రతిపాదన ఏమిటంతే ఒకభాష మాట్లాడే ప్రజల్లో ఎన్ని విభిన్న ప్రాంతాలు ఉంటే అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యాలి. గాంధీగారి ఫాన్సీ ఐడియాలలాగా కాకుండా అంబేద్కర్ ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పడనేదానిలో సందేహం అక్కరలేదు.
అధికార వికేంద్రీకరణ, గ్రామస్వరాజ్యం, పంచాయితీలకు ఎక్కువ అధికారాలు, జిల్లాలకు ఎక్కువ నిధులు అందరూ అడిగేదే, అందులో కొత్తవిషయం ఏమీలేదు, అందరూ అడిగేదే. అయితే ఇదే సర్వరోగనివారిణి, ఇలాచేస్తే తెలంగాణా అవసరం లేదు, చిన్నరాష్ట్రాల అవసరం లేదు అనే వాదనమాత్రం పూర్తిలోపభూయిష్టమయినది.

గ్రామస్వరాజ్యం గానీ, జిల్లాప్రభుత్వాలుగానీ వ్యవస్థీకృత వివక్షను అడ్డుకోలేదు. ఒకపంచాయితీకి తమ ప్రాంతానికి కాలువలద్వారా నదీజలాలను తరలించే అధికారం ఏగ్రామ స్వరాజ్యం వచ్చినా ఉండదు. జిల్లా ప్రభుత్వాలు 610 జీవోను అమలు చెయ్యలేవు, ప్రభుత్వ శాఖలలో, పబ్లిక్ సర్వీస్ కమీషన్ లలో నియామకాలు, పదోన్నతులలో జరిగే వివక్షను అడ్డుకోలేదు, దొంగ రెసిడెన్సీ సర్టిఫికెట్ల పంపిణీ అరికట్టలేదు, ఉన్నత విద్యాలయాలు, యూనివర్సిటీల ఏర్పాటులో, నిధులపంపిణీలలో జరిగే వివక్షను అడ్డుకోలేదు. మరి ఈజిల్ల ప్రభుత్వాల సర్వరోగనివారిణీ తెలంగాణా ప్రజలు చెబుతోన్న ఏసమస్యను తీర్చగలదు?

కాబట్టి ఇక్కడి ప్రజలు కోరుకునేదేమంటే అధికారవికేంద్రీకరణ, లోకల్ బాడీలకు ఎక్కువ అధికారాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చెయ్యాలి, కానీ దానికి తెలంగాణాతో గానీ చిన్నరాష్ట్రాలఏర్పాటుతోగాని లింకు పెడితే లాభంలేదు. ఇక జయప్రకాశ్ నారాయణగారు వారి ఫ్యాన్సీ ఐడియాలను ముందు ఏదో ఒకప్రాంతంలో పైలట్ ప్రాజెక్టులాగా అమలుచేసి నిరూపించాలి అంతే గానీ ఊరికే ఉపన్యాసాలు దంచి ప్రజలమీద ప్రయోగాలు చేస్తానంటే లాభం లేదు.

Wednesday, 11 May 2011

భాషాప్రయుక్త రాష్ట్రాల గురించి అంబేద్కర్ ఏం చెప్పాడు?

అంబేద్కర్ భాషాప్రయుక్త రాష్ట్రాలగురించి ఏం చెప్పాడు? ఒక భాషకు ఒక రాష్ట్రం ఉండాలన్నాడా లేక ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండాలన్నాడా?

భాషాప్రయుక్త రాష్ట్రాల గురించి అంబేద్కర్ ఏం చెప్పాడు?

అంబేద్కర్ భాషాప్రయుక్త రాష్ట్రాలగురించి ఏం చెప్పాడు? ఒక భాషకు ఒక రాష్ట్రం ఉండాలన్నాడా లేక ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండాలన్నాడా?

అంబేద్కర్ రాష్ట్రాల విభజన కమిటీకి ఇచ్చిన రిపోర్టు ఇక్కడ చూడొచ్చు. అందులో ఒక రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ ప్రధాన భాషలుంటే వచ్చే ప్రమాదాలతో పాటు కేవలం భాషపేరుతో అసమాన అభివృద్ధి సాధించిన, భిన్న సంస్కృతులు కలిగిన ప్రాంతాలను కట్టిపడేస్తే జరిగే నష్టాలు కూడా వివరంగా రాశాడు.
http://ambedkar.org/ambcd/05C.%20Thoughts%20on%20Linguistic%20States%20PART%20III.htm

భాషాప్రయుక్త రాష్ట్రాల గురించి అంబేద్కర్ సూచనలు ఇవి:
CHAPTER VIII
SUMMARY OF PRICIPLES COVERING THE ISSUE
For the sake of the reader I summarise below the principles which should underly the creation of Linguistic States which are already enunciated In
the foregoing pages but which lie about scattered. These principles may be staled as below :
(1) The idea of having a mixed State must be completely abandoned.
(2) Every State must be an unilingual State. One State, one language.
(3) The formula one State, one language must not be confused with the formula of one language, one State.
(4) The formula one language, one State means that all people speaking one language should be brought under one Government irrespective of area, population and dissimilarity of conditions among the people speaking the language. This is the idea that underlies the agitation for a united Maharashtra with Bombay. This is an absurd formula and has no precedent for it. It must be abandoned. A people speaking one language may be cut up into many States as is done in other parts of the world.
(5) Into how many States a people speaking one language should be cut up, should depend upon (1) the requirements of efficient administration, (2) the needs of the different areas, (3) the sentiments of the different areas, and (4) the proportion between the majority and minority.
(6) As the area of the State increases the proportion of the minority to the majority decreases and the position of the minority becomes precarious and the opportunities for the majority to practise tyranny over the minority become greater. The States must therefore be small.
(7) The minorities must be given protection to prevent the tyranny of the majority. To do this the Constitution must be amended and provisions must be made for a system on plural member constituencies (two or three) with cumulative voting. 

తెలంగాణ, సీమాంధ్ర సామాజిక స్థితిగతిలో తేడాలు

సమైక్యవాదులు రాష్ట్రాన్ని ఎందుకు విడదీయగూడదో వాదిస్తూ మనదంతా ఒకేజాతి, మనం ఎన్నో ఏళ్ళనుండీ కలిసే ఉన్నాము కావాలంటే ఫలానా మ్యాపులు చూడండి అని వాదిస్తారు. అలాగే తెలంగాణ వాదులు మనం ఎప్పుడూ పూర్తిగా కలిసి లేము కావాలంటే ఫలానా ఫలానా మ్యాపులు చూడండి అని వారూ చెబుతారు. అసలు రాష్ట్రానికి జాతి ఏమిటో, ఎందుకు అవసరమో నాకయితే అర్ధం కాదు, ఇద్దరి వాదనలూ అనవసరమయినవే అని నా భావన. భారతదేశంలో ఉంటున్నాం కనుక మనందరిదీ భారత జాతి అనుకుంటున్నాము. భారతదేశం నిజానికి కొన్ని వేల విభిన్న జాతుల సమాహారం. మనరాష్ట్రంలోనే ఎన్నో జాతులూ,ఉపజాతులు ఉండవచ్చు. కాబట్టి ఒకజాతికి ఒక రాష్ట్రం అనేది ఇప్పుడూ లేదు, ఎప్పటికీ సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం.

ఒక రాష్ట్రంగా ఉండడానికి కావలసింది పరిపాలనా సౌలభ్యం, ప్రజల సామాజిక జీవనంలో సమతౌల్యత. కాబట్టి నేను జాతి అనే అంశం జోళికి వెల్లకుండా ఆంధ్రా, తెలంగాణ ప్రజల సామాజిక జీవనంలో ఉన్న తేడాలేమిటి, అవి సమైక్య రాష్ట్రంలో తెలంగాణా ప్రజల ప్రయోజనాలను  ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే అంశం మీద ఫోకస్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందులో ఎవరిది మంచీ, ఎవరిదీ చెడూ అనే జడ్జిమెంటల్ ధోరణిలోకి వెల్లకుండా ఈతేడాలు పరిపాలనను ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదే ఆలోచించాలి.

తెలంగాణా ఎక్కువకాలం నైజాం పరిపాలనలో ఉండి ముస్లిములు, మరాఠీ, కన్నడ ప్రాంతాలతో కలిసి ఉంది. తెలంగాణాలో ముందునుండీ మార్వాడీలు, సింధీలు, గుజరాతీలు కూడా వ్యాపారాలు చేసుకున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజలలో ఒకలాంటి కాస్మోపాలిటన్ జీవన విధానం ఉంది. వారు భేషజాలు లేకుండా కొత్తవారిని తమలో కలుపుకుంటారు. ఆంధ్రాలో ఈపరిస్థితి తక్కువ. వారు కొత్తప్రాంతాలకు వెల్లినప్పుడు అక్కడివారితో కలుస్తారు కానీ తాము  మెజారిటీ ఉన్నప్పుడు కొత్తవారిని తమలో కలుపుకోవడం ఇక్కడివారికి కొంచెం కష్టం. అనుకే నైజాం కాలంలో ఆంధ్రానుండి ఉద్యోగరీత్యా తెలంగాణాకు వచ్చినవారు బాగానే ఉన్నారు, కానీ తెలంగాణనుండి కూలిపనులకోసం ఆంద్రాకు వెల్లినవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ తెలంగాణా కార్మికులు పొట్టకూటికోసం షోలాపూర్, భీవండి, బొంబాయి, నౌసారి, సూరత్ వెలుతుంటారు కానీ ఎవ్వరూ ఆంధ్రా ప్రాంతం మాత్రం వెల్లలేరు, వెల్లి అక్కడివారితో ఇమడలేరు.

తెలంగాణాలో ఎక్కువమంది వెనుకబడిన కులాలకు చెందినవారు. దేశంలోని అన్నిప్రాంతాలలాగే ఇక్కడకూడా కులాల పట్టింపులు ఉన్నాయి, కానీ కులాల దురభిమానం మాత్రం లేదు. బీసీల్లో ఎక్కువకులాలు ఉండడం వల్ల ఏకులంకూడా మిగతావారిపై ఆధిపత్యం చేయాలని చూడరు. ఉన్నతకులాలయిన రెడ్డి, వెలమలో కూడా కొద్దిమంది మాత్రం మునుపటి దేశ్ముఖ్లకు చెందినవారు, ఇప్పటికీ వారే కాంగ్రేస్లో ముఖ్యనాయకులు, కానీ ఎక్కువమంది ఉన్నతకులాలవారు మధ్యతరగతి వారే. ఇక్కడ కులాల గుంపులు, తగాదాలు పెద్దగా ఉండవు. కనుక ఎవరో ఒక కులం నాయకుడు పెద్ద నాయకుడు అయిపోడు. అలాగే తెలంగాణాలో వ్యక్తిపూజ తక్కువ, ఏనాయకున్నీ తెచ్చి నెత్తినపెట్టుకోరు. ఎవరికీ అన్‌కండీషనల్ సపోర్ట్ ఇవ్వరు. పద్దతిగా ఉంటే గెలిపిస్తారు, లేకపోతే వోడిస్తారు. కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఎక్కువ.

సీమాంధ్రాలో పరిస్థితి ఇలాకాదు. ఇక్కడ ఉన్నతకులాలకు చెందినవారు ఎక్కువకాగా వారిలో ఆధిపత్య పోరు కూడా ఎక్కువే. ఏ ప్రొఫెషనల్ కాలేజీకి వెల్లినా, యూనివర్సిటీకి వెల్లినా విద్యార్థులు కులాలపేరుతో గుంపులు కడుతారు. ప్రవాసభారతీయుల్లో రాష్ట్రాలవారీగా జనం కలిసిపోతే సీమాంధ్రులు మాత్రం తెలుగువారిలోకూడా కులాలవారీగా జట్లు కడతారు. ఇక్కడి మూడు పెద్దకులాలవారు మూడు పార్టీలకు ప్రస్తుతం సపోర్ట్ ఇస్తున్నారు. వీరి మద్దతు అన్‌కండీషనల్....వీరి నాయకులు ఎంత నీచానికి దిగజారినా వారు మద్దతు ఇస్తూనే ఉంటారు. అందుకే ఎంతో చదువుకున్నవారిలో  కూడా జగన్ అవినీతిని సమర్ధించేవారున్నారు,  చిరంజీవి చేతకానితనాన్ని సమర్ధించేవారూ ఉన్నారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయాలను సమర్ధించేవారూ ఉన్నారు, కేవలం కులం కారణం వలన. ఇందుకు భిన్నంగా తెలంగాణాలో ఏనాయకుడికీ అన్‌కండీషనల్ మద్దతు ఉండదు, కనీసం కేసీఆర్‌కు కూడా.

సీమాంధ్రా రాజకీయాల్లో ఏకులం వారు ఆకులం నాయకులు గెలవాలనుకుంటారు, సహజంగానే వారి నాయకులు గెలిస్తే ఆకులానికి, లేక ఆకులం ఎక్కువగా ఉండే ప్రాంతానికి మేలు చెయ్యడానికి ప్రయత్నిస్తారు. వీరి అన్‌కండీషనల్ సపోర్ట్ వలన సీమాంధ్ర నాయకులు రాజకీయంగా ఎక్కువబలంగా ఉంటారు. అందుకే ఇక్కడ బలమయిన నాయకత్వం తయారవుతుంది. ఎక్కువమంది చెప్పేట్లుగా ఎప్పుడూ సీమాంధ్రాకే అధికారం రావడానికి కారణం అక్కడ ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడం కాదు, పై కారణాలవలన ఎక్కువ బలమయిన నాయకత్వం ఎదగడం అందుకు కారణం. అందుకే ఈపరిస్థితులు లేని ఉత్తరాంధ్రలో తెలంగాణాలాగే ఎప్పుడూ బలమయిన నాయకత్వం ఎదగలేదు, వారికి అధికారం దక్కలేదు.

ఈతేడాలవలన తెలంగాణాకేం నష్టం, ఇవన్నీ ఆయా ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాలు అని వాదించేవారు తెలుసుకోవల్సిందేమంటే సీమాంధ్రలోని ఈఫ్యూడల్ పరిస్థితులవల్ల ఏరాజకీయపార్టీలోనయినా రాష్ట్రానికి సంబంధించి బలమయిన నాయకుడు సీమాంధ్రలోనే ఉంటాడు, ఏకులం వారికి అధికారం చిక్కినా అధికారం ఉండేది సీమాంధ్ర చేతిలోనే, వీరెప్పుడూ ఆప్రాంత ప్రయోజనాలగూర్చే ఆలోచిస్తారు. పొరపాటున ఎప్పుడయినా తెలంగాణా నాయకుడికి అధికారం వచ్చినా అది తొందరలోనే ఊడిపోతుంది. ఒకవేళ అధికారంలో వారున్నా వారికి సీమాంధ్ర నాయకులలాగా తమ కుల, ప్రాంతాల అన్‌కండీషనల్ మద్దతు ఉండదు కనుక వారు ఒకప్రాంతానికే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులుగా వ్యవహరించరు. మరి ఈపరిస్థితిలో తెలంగాణా ప్రజలు సీమాంధ్రను అనుకరించి ఫ్యూడల్ వ్యవస్థలోకి వెల్లాలా లేక ముందుకు వెల్లాలా?

ఈకులతత్వానికి తోడు రాయలసీమలో ఉండే ముఠాతగాదాలవల్ల రాయలసీమ నాయకత్వం కోస్తానాయకత్వం కంటే కూడా బలంగా ఉంటుంది. అందుకే ఎక్కువ సార్లు అధికారంలోకి వచ్చేది రాయలసీమ వారే. వీరి తోడ్బాటువల్ల అక్కడిఫాక్షన్ నాయకులు హైదరాబాదు లాంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లూ, మైనింగ్ మాఫియాలూ తయారవుతున్నాయి. ఇవన్నీ తెలంగాణా ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రజలలో మనం ఈసీమాంధ్ర వారితో గెలవలేము, విడిపోతే మనవాటా మనం చూసుకోవచ్చు అనే ఒక మైండ్‌సెట్ కు దారితీయడంలో తప్పులేదు.

సీమాంధ్రా ప్రజలను విమర్శించడం నాఉద్దేషం కాదు, నేను ఇది తప్పు, ఇది ఒప్పు అని జడ్జ్ చెయ్యట్లేదు, అయితే ఈతేడాలు తెలంగాణా (కొంతవరకూ ఉత్తరాంధ్రా) ప్రజల ప్రయోజనాలకు నష్టం ఎలా కలుగజేస్తున్నాయో మాత్రమే చెబుతున్నాను. మరి ఈపరిస్థితిలో విభజన జరగడమే ఇరువర్గాలకూ ఉత్తమం.

Tuesday, 10 May 2011

ప్రాపగాండా -2: హైదరాబాదు కోసమే తెలంగాణా

ఈమధ్యన సీమాంధ్రా మీడియా, కుహనా సమైక్యవాదులు అంతా ఒక కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టారు.అదేంటంటే ఇప్పుడు హైదరాబాదు బాగా అభివృద్ధి చెందింది, ఐటీ, ఫార్మా కంపనీలు పెరిగాయి, అందువల్లనే తెలంగాణావాదులు ఇప్పుడు తెలంగాణా అంశాన్ని లేవదీశారు అని.  ఇది పచ్చి అబద్దమని కాస్త విషయపరిఙ్నాణమున్నవారికెవరికైనా అర్ధమవుతుంది.

తెలంగాణా ఉద్యమం ఇప్పుడు కొత్తగా మొదలయింది కాదు, 1969లోనే తీవ్రస్థాయిలో ఉద్యమం జరిగింది, ఆఉద్యమంలో ఐదువందల ప్రాణాలు నేలకొరిగాయి. అప్పుడు సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి పోలీసు కాల్పులూ, నాయకులకు పదవులు లాంటి కుట్రలద్వారా ఉద్యమాన్ని అణచివేశారనేది అందరికీ తెలిసిన విషయమే. అసలు 1956లో తెలంగాణా ఆంధ్రతో కలిసేటప్పుడే ఎందరికో ఈ కలయికపై అనుమానాలున్నాయి, తెలంగాణా కాంగ్రేస్ పార్టీ నాయకులకు కూడా ఇది ఇష్టం లేదు, కానీ కమ్యూనిస్టుల విశాలాంధ్ర స్వప్నం (ఎప్పటిలాగే ఆచరణకు పనికిరాని కమ్యూనిస్టు ఆదర్శం) వలన అది కూడా కొన్ని శరతులతో కూడిన ఒప్పందాలద్వారాజరిగిందనేది అందరికీ తెలిసిందే.

తెరాస పార్టీ వెలిసి కూడా 10 సంవత్సరాలు గడచింది. తెరాస పుట్టినప్పుడు హైదరాబాద్ ఐటీలో పెద్దగా అభివృద్ధి చెందలేదనేదీ తెలిసిందే. మరి ఏవిధంగా వీరి ప్రచారం నిజమవుతుందో ఇలా అబద్దాలు చెప్పేవారే చెప్పాలి.

ఐతే వీరి వాదన ద్వారా ఒక్క విషయం తెలుస్తుంది.అదేంటంటే మునుపెన్నడూ లేకుండా ఇప్పుడు రాత్రికి రాత్రి మొదలయిన ఉద్యమం ఏదయినా ఉందంటే అది సమైక్యాంధ్ర ఉద్యమం. ఈసమైక్యాంధ్ర ఉద్యమం మాత్రం హైదరాబాద్ కోసమే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆమాటకొస్తే 1956లో సీమాంధ్ర తెలంగాణాతో కలవడానికి తహతహలాడింది కూడా తమ రాజధాని అవసరాలకోసమే అనేది అందరికీ తెలిసిందే. ఈమధ్యన సమైక్య నాటకాన్ని రంజుగా సాగిస్తున్న లగడపాటి లారివారు చేసేది హైదరాబాదులోని కబ్జాలకోసమే అనేదీ తెలిసిందే. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు హైదరాబాదుకు ఆశపడి దొంగ ఉద్యమాలు చేస్తున్నారు?

ఇంకొంతమంది అతితెలివికలిగినవారు మేము 1972లో జైఆంధ్ర ఉద్యమం చేస్తుంటే మీరెక్కడికిపొయ్యారు అని అమాయకంగా అడుగుతారు. అలా అడిగేవారు మీరు జైఆంధ్రా ఉద్యమం చేసేప్పుడు తెలంగాణా వారు వద్దని కౌంటర్ ఉద్యమాలు లేవదీయలేదని గమనించాలి. మీజైఆంధ్రా ఉద్యమం మొత్తం అంతా కూడా ముల్కీ రూల్స్ తీసివేతకేగానీ నిజంగా విడిపోవడానికి కాదని కూడా గమనించాలి.

విగ్రహాల కూల్చివేతపై సీమాంధ్ర మీడియా అబద్దాలు

డిసెంబరు 9 చిదంబరం ప్రకటన తరువాత సీమాంధ్ర మీడియా అంతా తెలంగాణా ఉద్యమంపై కత్తికట్టి ఉద్యమానికి వ్యతిరేకంగా వార్తలను ప్రచురించడం, ప్రసారం చెయ్యడం మొదలుపెట్టింది. ఉద్యమాన్ని తక్కువచేసి చూపడం కొరకు వీరు పాటించే ద్వంద్వ ప్రమాణాలకు పరాకాష్ట మిలియన్ మార్చ్. మిలియన్ మార్చ్ అనుమతి కోసం ఉద్యమ నేతలు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా, పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మార్చ్ వ్యవధి తగ్గించి మధ్యాహ్నానికి మార్చినా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోగా ఈ ఉద్యమాన్ని ఎలాగయినా అణచివెయ్యాలనే ఏకైక లక్ష్యంతో లక్షలమందిని తెలంగాణా యావత్తూ అక్రమంగా నిర్భందించి స్కూల్లూ హాస్టల్లలో భందించింది. హైదరాబాద్ వచ్చే అన్ని బస్సులనూ, రైల్లనూ ఆపేసింది, ప్రైవేటు బస్సులను వాడకుండా చర్యలు తీసుకుంది. వేలమంది స్పెషల్ ఫోర్సులను ఉపయోగించి హైదరాబాద్ రోడ్లన్నీ నిర్భందించింది. ఇంత నిర్భందం మధ్య అందరు ట్యాంక్ బండ్ చేరుకోవడం ఒకపెద్ద విజయం. కానీ మీడియా మాత్రం అదేదీ రాయకుండా కేవలం విగ్రహాల విధ్వంసాన్నే పెద్దగా చేసి చూపించింది.

ఇదంతా ఒకయెత్తయితే సీమాంధ్ర మీడియా విగ్రహ విధ్వంసం పధకం ప్రకారం జరిగినది అనే అబద్దాన్ని సమర్ధవంతంగా ప్రచారం చేసింది. మార్చ్ తరువాతి రోజు పోలిసులు ఒకప్రకటనలో సంఘటన స్థలంలో కొన్ని ఇరన్ రాడ్స్ దొరికాయి, దీన్ని బట్టి విధ్వంసానికి ముందే పధకం జరిగిందేమో అనే అనుమానాన్ని వ్యక్తపరిచింది. అంతే, మీడియా దానికి మరికాస్త మసాలా కలిపి వార్తలు గుప్పించింది. కొన్ని పేపర్లూ, చానెల్లూ సంఘటన పధకం ప్రకారమే జరిగిందని పోలీసులు తేల్చేశారని చెబితే, మరికొన్ని ఇంకాస్త ముందుకు వెల్లి అక్కడే విగ్రహాలను కూల్చివెయ్యడానికి అన్ని టూల్స్ దొరికాయి, ముందే అక్కడ టూల్స్ చేరవేశారు అని చెప్పాయి. ఇంకొందరయితే అక్కడ పానాలూ, స్క్రూ డ్రైవర్లూ, గ్యాస్ కట్టర్లూ అన్నీ దొరికాయని ప్రసారం చేశారు, సీమాంధ్ర జనం దాన్నే నమ్మింది.

మరుసటి రోజు పోలీసులు మరో ప్రకటనలో అక్కడ దొరికిన రాడ్స్ పోలీసులు పెట్టిన బారికేడ్స్ మాత్రమే, ఉద్యమకారులు ఆ బారికేడ్స్‌ను పీకి కూల్చివేతలో ఉపయోగించారు, కూల్చివేత పధకం ప్రకారం జరగలేదు అని చెప్పారు. అయితే ఈషయాన్ని మాత్రం ఒక్క తెలుగు మీడియా కూడా చూపించలేదు, రాయలేదు. ఆంగ్ల మీడియా టైంస్ ఆఫ్ ఇండియా మాత్రం ఆవార్త ప్రచురించింది.

నిజానికి అక్కడ కూల్చివేతకు ఎలాంటి పధకమూ జరగలేదు, మార్చ్ చాలాసేపు ప్రశాంతంగానే జరిగింది. అయితే ఆరోజే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య పాల్పడ్డారు, అదికూడా మిలియన్ మార్చ్‌పై పోలీసుల నిర్భంధంపై నిరసనగా వారు చనిపొయ్యారు అని తెలిసినతరువాత ఉద్యమకారులు సహజంగానే ఉద్రేకానికి లోనయ్యారు. అంతోటి విగ్రహాలను కూల్చివెయ్యడానికి పెద్ద పనిముట్లు అవసరం లేదు, అవికేవలం ఇటుకలతో కట్టిన దిమ్మలపై పెట్టిన విగ్రహాలు, నలుగురు కలిసి రెండు దెబ్బలేస్తే అవేకూలుతాయి. అసలు ట్యాంక్‌బండ్ అప్పటికి మూడు నాల్గు రోజులముందునుండే పోలీసుల ఆధీనంలో ఉంది, ట్యాంక్బండ్ పైనే వేలమంది స్పెషల్ ఫోర్సులు ఉన్నారు, వారెవరికీ చిక్కకుండా అక్కడ టూల్స్ దాయడం సాధ్యం కాదు, అంత అవసరం కూడాలేదు. కానీ ఉద్యమంపై విషప్రచారం చెయ్యడానికి మీడియాకు మాత్రం ఈవాస్తవాలేమీ అవసరం లేదు, తెలంగాణా ఉద్యమాన్ని తక్కువచెయ్యడమే కదా వారికి కావల్సింది, అందుకు వచ్చిన అవకాశాన్ని వీరు చక్కగా వినియోగించుకుని కూల్చివేత పధకం ప్రకారమే జరిగిందనే అబద్దాన్ని ప్రచారం చేసింది.

సంబంధిత టైమ్స్ వార్త ఇక్కడ చూడవచ్చు

extract:
***************
In a new twist, cops are also veering to the opinion that the act of vandalism, perhaps, was not planned as was believed earlier. Vandals had desecrated 12 statues of Telugu icons during the March 10 event. They threw most of the damaged statues into the Hussainsagar.
Police had initially claimed the protesters had brought hammers, ropes and nails along with them, but the ongoing Central Crime Station (CCS) probe has revealed that iron rods used in demolition were actually broken railings of police barricades. Rope and ladders used in the attack were picked up on the way from a nearby shopping complex at Lower Tank Bund. Water hose and boulders used in breaking and pulling down statues were very readily available on Tank Bund.
***************

Monday, 9 May 2011

పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం - కఠోరనిజాలు

మద్రాసు రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారికి మద్రాసు రాజధానిగా ప్రత్యేకరాష్ట్రం కావాలనే డిమాండుతో పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశాడనేది అందరికీ తెలిసిన  విషయమే. కాకపోతే మన చరిత్ర పుస్తకాలలో దీనికి కాస్త మసిపూసి పొట్టి శ్రీరాములు తెలుగు మాట్లాడే అందరి కొరకు ప్రత్యేక రాష్ట్రం కొరకు దీక్ష చేశాడు, ఆదీక్ష ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ (ఆంధ్ర రాష్ట్రం కాదు!! ) ఏర్పడింది అని ప్రచారం చేశారు, అదే  మన బడులలో నేర్పించారు. సరే, ఏదో ఒకటి, కానీ అసలు పొట్టి శ్రీరాములు త్యాగం నిజంగా తప్పనిసరి పరిస్థితిలోనే జరిగినదా లేక ఈత్యాగాన్ని అప్పటి నాయకులు ఆపగలిగి ఉండి కూడా ఆపలేదా అనేది ఒక ప్రశ్న.


మనలో ఎక్కువమందికి తెలియని విషయమేమిటంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకోసం అప్పట్లో ఏర్పాటు చేసిన జేవీపీ కమిటీ ( ఇప్పటి శ్రీక్రిష్ణ కమిటీ లాగా మాయదారి కమిటీ కాదు) ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఒప్పుకుంది. మద్రాసు నగరం విషయంలో మాత్రం ఆంధ్రా నేతలు తమ పట్టు విడవకపోవడంతో రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతుంది. ఆసమయంలో మద్రాసు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉండాలనే డిమాండుతో పొట్టి శ్రీరాములు  దీక్షను ప్రారంభించాడు. అప్పటి ప్రత్యేక వాదుల్లో (వేర్పాటు వాదులు?!) ముఖ్యమయిన నేతలయిన ప్రకాశం పంతులు, సంజీవరెడ్డి, గోపాలరెడ్డి లాంటి వారికి మద్రాసు రాజధాని సాధించడం సాధ్యం కాదని తెలిసినా వారెవరూ పొట్టి శ్రీరాములును వారించలేదు. పొట్టి శ్రీరాములు స్వతహాగా రాజకీయనాయకుడు కాదు, కాబట్టి రాజకీయనాయకుల కుతంథ్రాలు పెద్దగా తెలియవు. అతను చిన్నవయసులోనే భార్యా, పిల్లల వియోగం జరిగి గాంధేయవాదం స్వీకరించాడు.


పొట్టి శ్రీరాములు దీక్ష చేపట్టిన తరువాత అనేకసార్లు ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు తమకు సమ్మతమే అని తెలిపినప్పటికీ శ్రీరాములు తన దీక్ష విరమించలేదు. దీక్ష మొదలయిన యాభై రోజుల తరువాత శ్రీరాములు పూర్తి అపస్మారక స్థితిలో ఉండి సొంత నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆసమయంలో బూర్గుల రామక్రిష్ణారావు గారు శ్రీరాములుకు దీక్ష ఆపమని చెబుతూ నెహ్రూ తరఫున ఈవిధంగా టెలిగ్రాం పంపించాడు.
 “Your fast is causing much anxiety and distress in the whole country. Panditji (Jawaharlal Nehru) is prepared to constitute a Boundary Commission immediately and has given an assurance of other steps. I earnestly entreat you to break your fast, and give all leaders a fair opportunity.”
(http://www.hindu.com/2002/12/14/stories/2002121401100902.htm)


ఈపరిస్థితిలో నిజంగా అప్పటి కాంగ్రేస్ నాయకులకు శ్రీరాములు ప్రాణాలపై ప్రేమ ఉంటే అతని దీక్షను ఆపించి వైద్యం చేపించేవారు. కానీ ఎవరూ అలాంటి నిర్ణయం తీసుకోలేదంటే అప్పటివారికి శ్రీరాములు ప్రాణాలపై ఉన్న నిబద్దత తెలుస్తుంది. ఇంతకంటే మరో  కఠోరమయిన విషయం ఇంకోటి ఉంది.  జీవీ రామక్రిష్ణారావు అనే ఒక అప్పటి IAS అధికారీ, మాజీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ తన ఆటోబయోగ్రఫీలొ శ్రీరాములు దీక్ష మొదలుపెట్టాక ఆహారం కోసం తన మద్దతుదారులను ఎంతబతిమిలాడినప్పటికీ వారు ఆయన అభ్యర్థనలు పట్టించుకోలేదని రాశారు. ఇదే నిజమయితే మాత్రం ఇన్నాల్లూ శ్రీరాములును జాతిరత్నంగా ప్రచారం చేసినవారు తమ నాయకుల వంచనకు సిగ్గుతో  తలలు వంచుకోవలసిన విషయం. రామక్రిష్ణారావు బయోగ్రఫీలోనీ సంబంధిత పేరా యధాతధంగా ఇలా ఉంది.





ఒకవేళ G.V: Ramakrishna Rao తన ఆటోబయోగ్రఫీలో రాసుకుంది నిజం అయినా కాకపోయినా, మిగతా విషయాలు చాలు అప్పటి ఆంధ్ర నాయకులను ఎండగట్టడానికి. మద్రాసును సాధించడం సాధ్యపడదనీ, ఒకవేళ సాధ్యమయినా అది ఇరువర్గ ప్రజలకు సంబందించినది కాబట్టి కేవళం సత్యాగ్రహం అనబడే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ద్వారా పొందడం సాధ్యపడదనీ, సుదీర్ఘ మంతనాలు అవసరమనీ తెలిసీ శ్రీరాములును ఎందుకు దీక్షకు ఉసిగొలిపారు, ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించి, శ్రీరాములు అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఎందుకు దీక్షను విరమిపజేసి వైద్యం అందించలేదు? దీనివలన తేలేదేమంటే పోట్టి శ్రీరాములు ఆంధ్ర కొరకు ఆత్మత్యాగం చెయ్యలేదు, కొందరు స్వార్ధ నాయకులహేత రాజకీయ అవసరాలకొరకు బలిపశువయ్యాడు.
  

source: missiontelangana.com

Sunday, 8 May 2011

పలు రకాల పలుకుల పరకాల విషవృక్షం

పరకాల ప్రభాకర్ పేరు వినగానే గుర్తొచ్చేది పీఆర్పీ నుంచి వెలుతూ పీఆర్పీ పార్టీ ఒక కంపనీ, ఒక విషవృక్షం అంటూ చెప్పిన డైలాగులు. పాపం, అంతకు ఒక వారం ముందు వరకూ అదే పీఆర్పీ ఆయనకు తనకు ఎమ్మెల్యే పదవిని అందించే కల్పవృక్షంలాగా కనపడింది. టిక్కెట్టు దొరక్కపోతే అదే పీఅర్పీ కాస్తా విషవృక్షం అయిపొయ్యింది. అప్పటికే రెండు పార్టీలు మారి వుండడం వల్ల పాపం ఆతరువాత ఎటెల్లాలో తెల్వక మల్లీ టీవీషోలు చేసుకుంటున్నట్టున్నాడు.

ఈమధ్యన కొత్తగా పాపం పబ్లిసిటీ కొరకు "విశాలాంధ్ర మహాసభ" అంటూ అక్కడక్కడ కాస్త హడావుడీ చేస్తున్నాడు. అంతకు ముందు ఈయనే పీఆర్పీలో ఉన్నప్పుడు తెలంగాణాకు మద్దతుగా భారీగానే స్టేట్మెంట్లు గుప్పిచ్చాడు. సరే ఇప్పుడు పీఆర్పీ విడిచినాక ఏ లగడపాటో, కావూరో కల్పవృక్షాల్లా కనపడి ఉంటారు, స్టాండు మారినట్టుంది.

ఈయన పెద్ద "మేధావి"(??!!) వర్గం కదా, ఎందుకు రాష్ట్రం విడిపోగూడదో ఏదయినా కొత్త విషయం చెపుతాడో చూద్దాం అంటే అదే అరిగిపోయిన టేప్ రికార్డరు. ఆంధ్ర అన్నా తెలంగాణ అన్నా ఒక్కటే, అసలు అలాంటి తేడా ఏమీ లేదు, అంతా ఒకటే, కాబట్టి కలిసుండాలి. ఈమాత్రం చత్త వాదన కోసం మల్లీ కొత్తగా ఈయనెందుకు? తెలంగాణా ఏంటో ఆంధ్రా ఏంటో చంటిపిల్లాడినడిగినా చెబుతాడు, ఇప్పుడు కొత్తగా ఇదిగో చూడండి "ఆంధ్ర మహాసభ" తెలంగాణలోనే వెలిసింది, కాబట్టి అంతా ఒకటే అనికబుర్లు చెబితే ఎవరు వింటారు? అందునా ఇలా పూటకో పార్టీ, గంటకో మాట చెప్పే ఆయారాం గయారాంల వల్ల సమైక్యవాదులకు ఒరిగేదేమిటి?

నా తెలంగాణా.. కోటి రతనాల వీణ!!

వందల సంవత్సరాలు పరాయి పాలనలో మ్రగ్గిపోయిన తెలంగాణ, స్వాతంత్రం వచ్చి ఇన్నాల్లయినా ఇంకా స్వయం పరిపాలనకు నోచుకోలేదు. దేశ చరిత్రలో స్వాతంత్రం కోసం అతిపెద్ద సాయుధ పోరాతం చేసిన తెలంగాణ ప్రజలకు స్వయం పాలన ఇంకా ఒక స్వప్నం గానే మిగిలిపోయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా వివక్షకు గురవుతూ, తమ వనరులు తమకల్లముందే దోపిడీకి గురవుతుంటే తమవనరులపై హక్కు కొరకు చేస్తున్న తెలంగాణ ఉద్యమం ఇప్పుడు అడుగడునా కష్టాలు ఎదుర్కొంటుంది.

ఈబ్లాగు యొక్క ఉద్దేశం తెలంగాణ ఉద్యమంపై ప్రభుత్వం, మీడియా, రాజకీయపార్టీలు చేస్తున్న వంచనను ఎండగట్టి నిజాలను తెలియజేయడం. సీమాంధ్ర ప్రజలపై మాకెలాంటి కోపం లేదు, భాగో అన్నా, దోపిడీ అన్నా అది ఇక్కడి మావనరులను కొల్లగొట్టే కొద్దిమంది దోపిడీ వర్గాన్నే తప్ప సామాన్యుడిని కాదని సీమాంధ్ర ప్రజలకు చెప్పటం.

ధన్యవాదాలు!!