Wednesday, 11 May 2011

తెలంగాణ, సీమాంధ్ర సామాజిక స్థితిగతిలో తేడాలు

సమైక్యవాదులు రాష్ట్రాన్ని ఎందుకు విడదీయగూడదో వాదిస్తూ మనదంతా ఒకేజాతి, మనం ఎన్నో ఏళ్ళనుండీ కలిసే ఉన్నాము కావాలంటే ఫలానా మ్యాపులు చూడండి అని వాదిస్తారు. అలాగే తెలంగాణ వాదులు మనం ఎప్పుడూ పూర్తిగా కలిసి లేము కావాలంటే ఫలానా ఫలానా మ్యాపులు చూడండి అని వారూ చెబుతారు. అసలు రాష్ట్రానికి జాతి ఏమిటో, ఎందుకు అవసరమో నాకయితే అర్ధం కాదు, ఇద్దరి వాదనలూ అనవసరమయినవే అని నా భావన. భారతదేశంలో ఉంటున్నాం కనుక మనందరిదీ భారత జాతి అనుకుంటున్నాము. భారతదేశం నిజానికి కొన్ని వేల విభిన్న జాతుల సమాహారం. మనరాష్ట్రంలోనే ఎన్నో జాతులూ,ఉపజాతులు ఉండవచ్చు. కాబట్టి ఒకజాతికి ఒక రాష్ట్రం అనేది ఇప్పుడూ లేదు, ఎప్పటికీ సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం.

ఒక రాష్ట్రంగా ఉండడానికి కావలసింది పరిపాలనా సౌలభ్యం, ప్రజల సామాజిక జీవనంలో సమతౌల్యత. కాబట్టి నేను జాతి అనే అంశం జోళికి వెల్లకుండా ఆంధ్రా, తెలంగాణ ప్రజల సామాజిక జీవనంలో ఉన్న తేడాలేమిటి, అవి సమైక్య రాష్ట్రంలో తెలంగాణా ప్రజల ప్రయోజనాలను  ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే అంశం మీద ఫోకస్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందులో ఎవరిది మంచీ, ఎవరిదీ చెడూ అనే జడ్జిమెంటల్ ధోరణిలోకి వెల్లకుండా ఈతేడాలు పరిపాలనను ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదే ఆలోచించాలి.

తెలంగాణా ఎక్కువకాలం నైజాం పరిపాలనలో ఉండి ముస్లిములు, మరాఠీ, కన్నడ ప్రాంతాలతో కలిసి ఉంది. తెలంగాణాలో ముందునుండీ మార్వాడీలు, సింధీలు, గుజరాతీలు కూడా వ్యాపారాలు చేసుకున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజలలో ఒకలాంటి కాస్మోపాలిటన్ జీవన విధానం ఉంది. వారు భేషజాలు లేకుండా కొత్తవారిని తమలో కలుపుకుంటారు. ఆంధ్రాలో ఈపరిస్థితి తక్కువ. వారు కొత్తప్రాంతాలకు వెల్లినప్పుడు అక్కడివారితో కలుస్తారు కానీ తాము  మెజారిటీ ఉన్నప్పుడు కొత్తవారిని తమలో కలుపుకోవడం ఇక్కడివారికి కొంచెం కష్టం. అనుకే నైజాం కాలంలో ఆంధ్రానుండి ఉద్యోగరీత్యా తెలంగాణాకు వచ్చినవారు బాగానే ఉన్నారు, కానీ తెలంగాణనుండి కూలిపనులకోసం ఆంద్రాకు వెల్లినవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ తెలంగాణా కార్మికులు పొట్టకూటికోసం షోలాపూర్, భీవండి, బొంబాయి, నౌసారి, సూరత్ వెలుతుంటారు కానీ ఎవ్వరూ ఆంధ్రా ప్రాంతం మాత్రం వెల్లలేరు, వెల్లి అక్కడివారితో ఇమడలేరు.

తెలంగాణాలో ఎక్కువమంది వెనుకబడిన కులాలకు చెందినవారు. దేశంలోని అన్నిప్రాంతాలలాగే ఇక్కడకూడా కులాల పట్టింపులు ఉన్నాయి, కానీ కులాల దురభిమానం మాత్రం లేదు. బీసీల్లో ఎక్కువకులాలు ఉండడం వల్ల ఏకులంకూడా మిగతావారిపై ఆధిపత్యం చేయాలని చూడరు. ఉన్నతకులాలయిన రెడ్డి, వెలమలో కూడా కొద్దిమంది మాత్రం మునుపటి దేశ్ముఖ్లకు చెందినవారు, ఇప్పటికీ వారే కాంగ్రేస్లో ముఖ్యనాయకులు, కానీ ఎక్కువమంది ఉన్నతకులాలవారు మధ్యతరగతి వారే. ఇక్కడ కులాల గుంపులు, తగాదాలు పెద్దగా ఉండవు. కనుక ఎవరో ఒక కులం నాయకుడు పెద్ద నాయకుడు అయిపోడు. అలాగే తెలంగాణాలో వ్యక్తిపూజ తక్కువ, ఏనాయకున్నీ తెచ్చి నెత్తినపెట్టుకోరు. ఎవరికీ అన్‌కండీషనల్ సపోర్ట్ ఇవ్వరు. పద్దతిగా ఉంటే గెలిపిస్తారు, లేకపోతే వోడిస్తారు. కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఎక్కువ.

సీమాంధ్రాలో పరిస్థితి ఇలాకాదు. ఇక్కడ ఉన్నతకులాలకు చెందినవారు ఎక్కువకాగా వారిలో ఆధిపత్య పోరు కూడా ఎక్కువే. ఏ ప్రొఫెషనల్ కాలేజీకి వెల్లినా, యూనివర్సిటీకి వెల్లినా విద్యార్థులు కులాలపేరుతో గుంపులు కడుతారు. ప్రవాసభారతీయుల్లో రాష్ట్రాలవారీగా జనం కలిసిపోతే సీమాంధ్రులు మాత్రం తెలుగువారిలోకూడా కులాలవారీగా జట్లు కడతారు. ఇక్కడి మూడు పెద్దకులాలవారు మూడు పార్టీలకు ప్రస్తుతం సపోర్ట్ ఇస్తున్నారు. వీరి మద్దతు అన్‌కండీషనల్....వీరి నాయకులు ఎంత నీచానికి దిగజారినా వారు మద్దతు ఇస్తూనే ఉంటారు. అందుకే ఎంతో చదువుకున్నవారిలో  కూడా జగన్ అవినీతిని సమర్ధించేవారున్నారు,  చిరంజీవి చేతకానితనాన్ని సమర్ధించేవారూ ఉన్నారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయాలను సమర్ధించేవారూ ఉన్నారు, కేవలం కులం కారణం వలన. ఇందుకు భిన్నంగా తెలంగాణాలో ఏనాయకుడికీ అన్‌కండీషనల్ మద్దతు ఉండదు, కనీసం కేసీఆర్‌కు కూడా.

సీమాంధ్రా రాజకీయాల్లో ఏకులం వారు ఆకులం నాయకులు గెలవాలనుకుంటారు, సహజంగానే వారి నాయకులు గెలిస్తే ఆకులానికి, లేక ఆకులం ఎక్కువగా ఉండే ప్రాంతానికి మేలు చెయ్యడానికి ప్రయత్నిస్తారు. వీరి అన్‌కండీషనల్ సపోర్ట్ వలన సీమాంధ్ర నాయకులు రాజకీయంగా ఎక్కువబలంగా ఉంటారు. అందుకే ఇక్కడ బలమయిన నాయకత్వం తయారవుతుంది. ఎక్కువమంది చెప్పేట్లుగా ఎప్పుడూ సీమాంధ్రాకే అధికారం రావడానికి కారణం అక్కడ ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడం కాదు, పై కారణాలవలన ఎక్కువ బలమయిన నాయకత్వం ఎదగడం అందుకు కారణం. అందుకే ఈపరిస్థితులు లేని ఉత్తరాంధ్రలో తెలంగాణాలాగే ఎప్పుడూ బలమయిన నాయకత్వం ఎదగలేదు, వారికి అధికారం దక్కలేదు.

ఈతేడాలవలన తెలంగాణాకేం నష్టం, ఇవన్నీ ఆయా ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాలు అని వాదించేవారు తెలుసుకోవల్సిందేమంటే సీమాంధ్రలోని ఈఫ్యూడల్ పరిస్థితులవల్ల ఏరాజకీయపార్టీలోనయినా రాష్ట్రానికి సంబంధించి బలమయిన నాయకుడు సీమాంధ్రలోనే ఉంటాడు, ఏకులం వారికి అధికారం చిక్కినా అధికారం ఉండేది సీమాంధ్ర చేతిలోనే, వీరెప్పుడూ ఆప్రాంత ప్రయోజనాలగూర్చే ఆలోచిస్తారు. పొరపాటున ఎప్పుడయినా తెలంగాణా నాయకుడికి అధికారం వచ్చినా అది తొందరలోనే ఊడిపోతుంది. ఒకవేళ అధికారంలో వారున్నా వారికి సీమాంధ్ర నాయకులలాగా తమ కుల, ప్రాంతాల అన్‌కండీషనల్ మద్దతు ఉండదు కనుక వారు ఒకప్రాంతానికే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులుగా వ్యవహరించరు. మరి ఈపరిస్థితిలో తెలంగాణా ప్రజలు సీమాంధ్రను అనుకరించి ఫ్యూడల్ వ్యవస్థలోకి వెల్లాలా లేక ముందుకు వెల్లాలా?

ఈకులతత్వానికి తోడు రాయలసీమలో ఉండే ముఠాతగాదాలవల్ల రాయలసీమ నాయకత్వం కోస్తానాయకత్వం కంటే కూడా బలంగా ఉంటుంది. అందుకే ఎక్కువ సార్లు అధికారంలోకి వచ్చేది రాయలసీమ వారే. వీరి తోడ్బాటువల్ల అక్కడిఫాక్షన్ నాయకులు హైదరాబాదు లాంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లూ, మైనింగ్ మాఫియాలూ తయారవుతున్నాయి. ఇవన్నీ తెలంగాణా ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రజలలో మనం ఈసీమాంధ్ర వారితో గెలవలేము, విడిపోతే మనవాటా మనం చూసుకోవచ్చు అనే ఒక మైండ్‌సెట్ కు దారితీయడంలో తప్పులేదు.

సీమాంధ్రా ప్రజలను విమర్శించడం నాఉద్దేషం కాదు, నేను ఇది తప్పు, ఇది ఒప్పు అని జడ్జ్ చెయ్యట్లేదు, అయితే ఈతేడాలు తెలంగాణా (కొంతవరకూ ఉత్తరాంధ్రా) ప్రజల ప్రయోజనాలకు నష్టం ఎలా కలుగజేస్తున్నాయో మాత్రమే చెబుతున్నాను. మరి ఈపరిస్థితిలో విభజన జరగడమే ఇరువర్గాలకూ ఉత్తమం.

2 comments:

Your comment will be published after the approval.