Tuesday, 10 May 2011

ప్రాపగాండా -2: హైదరాబాదు కోసమే తెలంగాణా

ఈమధ్యన సీమాంధ్రా మీడియా, కుహనా సమైక్యవాదులు అంతా ఒక కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టారు.అదేంటంటే ఇప్పుడు హైదరాబాదు బాగా అభివృద్ధి చెందింది, ఐటీ, ఫార్మా కంపనీలు పెరిగాయి, అందువల్లనే తెలంగాణావాదులు ఇప్పుడు తెలంగాణా అంశాన్ని లేవదీశారు అని.  ఇది పచ్చి అబద్దమని కాస్త విషయపరిఙ్నాణమున్నవారికెవరికైనా అర్ధమవుతుంది.

తెలంగాణా ఉద్యమం ఇప్పుడు కొత్తగా మొదలయింది కాదు, 1969లోనే తీవ్రస్థాయిలో ఉద్యమం జరిగింది, ఆఉద్యమంలో ఐదువందల ప్రాణాలు నేలకొరిగాయి. అప్పుడు సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి పోలీసు కాల్పులూ, నాయకులకు పదవులు లాంటి కుట్రలద్వారా ఉద్యమాన్ని అణచివేశారనేది అందరికీ తెలిసిన విషయమే. అసలు 1956లో తెలంగాణా ఆంధ్రతో కలిసేటప్పుడే ఎందరికో ఈ కలయికపై అనుమానాలున్నాయి, తెలంగాణా కాంగ్రేస్ పార్టీ నాయకులకు కూడా ఇది ఇష్టం లేదు, కానీ కమ్యూనిస్టుల విశాలాంధ్ర స్వప్నం (ఎప్పటిలాగే ఆచరణకు పనికిరాని కమ్యూనిస్టు ఆదర్శం) వలన అది కూడా కొన్ని శరతులతో కూడిన ఒప్పందాలద్వారాజరిగిందనేది అందరికీ తెలిసిందే.

తెరాస పార్టీ వెలిసి కూడా 10 సంవత్సరాలు గడచింది. తెరాస పుట్టినప్పుడు హైదరాబాద్ ఐటీలో పెద్దగా అభివృద్ధి చెందలేదనేదీ తెలిసిందే. మరి ఏవిధంగా వీరి ప్రచారం నిజమవుతుందో ఇలా అబద్దాలు చెప్పేవారే చెప్పాలి.

ఐతే వీరి వాదన ద్వారా ఒక్క విషయం తెలుస్తుంది.అదేంటంటే మునుపెన్నడూ లేకుండా ఇప్పుడు రాత్రికి రాత్రి మొదలయిన ఉద్యమం ఏదయినా ఉందంటే అది సమైక్యాంధ్ర ఉద్యమం. ఈసమైక్యాంధ్ర ఉద్యమం మాత్రం హైదరాబాద్ కోసమే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆమాటకొస్తే 1956లో సీమాంధ్ర తెలంగాణాతో కలవడానికి తహతహలాడింది కూడా తమ రాజధాని అవసరాలకోసమే అనేది అందరికీ తెలిసిందే. ఈమధ్యన సమైక్య నాటకాన్ని రంజుగా సాగిస్తున్న లగడపాటి లారివారు చేసేది హైదరాబాదులోని కబ్జాలకోసమే అనేదీ తెలిసిందే. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు హైదరాబాదుకు ఆశపడి దొంగ ఉద్యమాలు చేస్తున్నారు?

ఇంకొంతమంది అతితెలివికలిగినవారు మేము 1972లో జైఆంధ్ర ఉద్యమం చేస్తుంటే మీరెక్కడికిపొయ్యారు అని అమాయకంగా అడుగుతారు. అలా అడిగేవారు మీరు జైఆంధ్రా ఉద్యమం చేసేప్పుడు తెలంగాణా వారు వద్దని కౌంటర్ ఉద్యమాలు లేవదీయలేదని గమనించాలి. మీజైఆంధ్రా ఉద్యమం మొత్తం అంతా కూడా ముల్కీ రూల్స్ తీసివేతకేగానీ నిజంగా విడిపోవడానికి కాదని కూడా గమనించాలి.

No comments:

Post a Comment

Your comment will be published after the approval.