"రమేశ్, నువ్వు గదిఖాలీ చేయడానికి వీల్లేదంతే!" గదమాయించి మరీ చెప్పాడు సుబ్బారావ్.
సుబ్బారావు, రమేశ్ ఇద్దరూ బ్యాచిలర్లు. చెరో ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఒకే అపార్ట్‌మెంటులో కలిసి అద్దెకు ఉంటున్నారు. మొదట్లో ఇద్దరూ బాగానే ఉన్నారు. కాలం గడిచే కొద్దీ సుబ్బారావు పెద్దరికం మరీ ఎక్కువయిపోయింది.
సుబ్బారావు రమేశ్ కన్నా కొంచెం బలంగా ఉంటాడు. పైగా భూస్వాముల కుటుంబం నుండి వచ్చినవాడు కావడంతో కాస్త పొగరెక్కువ. బలముంది కదా అని సుబ్బారావు ఈమధ్య రమేశ్‌ను ఊరికే ఎగతాళి చేస్తున్నాడు. పైగా అద్దెకూడా సరిగా కట్టట్లేదు. అన్ని పనులూ ఎగ్గొడుతుంటాడు.
సుబ్బారావు పద్దతి నచ్చక రమేశ్ కొన్నిరోజులుగా ఇల్లు మారుదామని చూస్తున్నాడు. నిజానికి ముందే సుబ్బారావు గురించి తెలిసిన రమేశ్ అతనితో రూంమేట్‌గా కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. అయితే వేరే రూమ్మేటు దొరక్క, ఒక్కడికే అద్దె మొత్తం కట్టే స్థోమత లేక సుబ్బారావే వచ్చి రమేశ్ గదిలోచేరాడు.
మొదట అదే ఇంట్లో రమేశ్, రంగనాథ్ కలిసి ఉండేవారు. రంగనాథ్ ఉద్యోగం ట్రాన్స్‌ఫర్ అవడంతో గది ఖాలీచేసి వెల్లిపోయాడు. రంగనాథ్ వెల్లిపొయ్యాక రమేశ్ ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడ్డాడు. సుబ్బారావు వచ్చి తను జాయిన్ అవుతానని అడిగినా అతనిగురించి ముందే విని ఉన్నాడు కాబట్టి మొదట రమేశ్ ఒప్పుకోలేదు. అయితే సుబ్బారావు అనేక రకాలుగా హామీలిచ్చి ఒప్పించి మరీ వచ్చి చేరాడు. తీరా ఇప్పుడు ఇదీ వంతు. ఇక లాభం లేదనుకుని తాను విడిగా ఉందామనుకుంటున్నాని రమేశ్ తన ఉద్దేషాన్ని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు అదీ రభస.
"అదేంటి సుబ్బారావ్ అలాగంటావ్? నాకిక్కడ ఇబ్బందిగా ఉందని చెబుతున్నాగా?"
"లేదు , నువ్విక్కడే ఉండి తీరాల్సిందే, లేకపోతే చూడు ఏం చేస్తానో!"
"ఏం చేస్తావేంది?"
"నీమీద వోనరుకు కంప్లైంటిస్తా!"
"సరే చేసుకో."
"అంతే కాదు, నా ఫ్రెండ్సుని తీసుకొచ్చి మన ఇంటిముందు ధర్నా చేస్తా, మీ ఆఫీసుకొచ్చి భైటాయిస్తా!"
"సరే. నీ ఇష్టం"
"ఇంకా నీ టీవీ పగుల గొడతా, నీ బైకును పెట్రోలు పోసి తగలబెడుతా".
"ఏంది సుబ్బారావ్? ఇంత చిన్న విషయానికి ఇలా ఫైరయిపోతావ్? నా బైకును తగలబెడితే నీకేమొస్తుంది? ఇష్టం లేకుండా ఇలా ఎందుకు కలిసి ఉండడం చెప్పు? నేనెల్లిపోతే నువ్వొక్కడివే నీ ఇష్టం ఉన్నట్టు హాయిగా ఉండొచ్చుగా? అడిగేవారెవరూ ఉండరు. ఒకవేళ అద్దె ఎక్కువనిపిస్తే ఇంకెవరినయినా తెచ్చుకో. ఈమాత్రానికి నా బైకును తగలబెడితే నీకేమొస్తుంది?"రమేశ్‌కి కోపం వచ్చింది.
సుబ్బారావు స్వరం పెంచాడు."నువ్వు నాకు లెక్చర్లిస్తావా? ఏమనుకున్నావ్ నేనంటే అసలు? మాఫామిలీ గురించి తెలుసా నీకు? నేను గానీ పిలిచానంటే మా ఊరినుంచి రేప్పొద్దుటిలోగా కత్తులేసుకుని వందమంది సుమోల్లో దిగుతారు!"
రమేశ్‌కు కాస్త భయమేసింది. సుబ్బారావు ఫామిలీ గురించి రమేశ్‌కు తెలుసు. సుబ్బారావు అన్నంత పనీ చేయగలడు మరి. వాళ్ళ ఊరిలో బాగా డబ్బూ, భూములూ ఉన్న జమీందారీ వంశం. సుబ్బారావు కుటుంబానికీ వాల్ల పక్క ఊరిలోని మరో కుటుంబానికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. వీల్ల గొడవల వల్ల ఆరెండూ ఊర్లమధ్య ఎప్పుడూ ముఠాతగాదాలవుతుంటాయి. చిన్న చిన్న విషయాలమీద పంతాలూ పగలకు పోయే ఈరెండు కుటుంబాలవల్ల ఇప్పుడా రెండు ఊర్లలో శాంతి లేకుండా పోయింది.
రమేశ్ మెల్లిగా కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు.
"సుబ్బారావ్, ఇది నీకు తగదు. ఎంత చెడ్డా మనిద్దరం ఇన్నాల్లు కలిసి ఉన్నాం. ఇలా కొట్టుకోవడం ఎందుకు చెప్పు? నాకిష్టం లేకుండా ఎలా ఉండమంటావ్? అయినా నువ్వు సుమోల్లో మీఊరిజనాలను దించితే ఊర్కోడానికి ఇదేమన్నా మీఊరా? నేనెల్లి ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే నీ పని అయిపోద్ది. నేనెల్లినంత మాత్రాన నీకొచ్చే నష్టమేంటి అయినా నువ్వేనాడయినా నా ఇబ్బందులేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించావా?"
"నాకదంత తెల్వదు, నువ్వు విడిపోవడానికి వీల్లేదంతే. అసలిది దేశ సమగ్రతకే పరీక్ష."
"ఏందీ? మనం రూంమేట్లుగా ఉండక విడిపోతే దేశ సమగ్రతకు ముప్పు వస్తుందా? ఏంది సుబ్బారావ్ ఈదారుణం? అసలు నీమాటల్లో కాస్తయినా అర్ధముందా?"
"నీకు తెలీదు. మందు మనం విడిపోతాం, అతరువాత మన ఓబులేసు, నారాయణ విడిపోతారు. ఆతరువాత శ్రీనివాసు, సింహాచలం విడిపోతారు. అలా ఒకరితరువాత ఒకరుగా అందరూ విడిపోతే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా?" రమేశ్‌ను ఈసారి నిజంగానే ఇరికించానని లోలోపల తనతెలివికి తనే మురిసిపోతూ సుబ్బారావు తన వాదన చెప్పుకొచ్చాడు.
తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఇలా సుబ్బారావు అర్ధం లేని వాదనలు చేయడం చూసి రమేశ్‌కు చిర్రెత్తింది. "ఇదిగో సుబ్బారావూ, నువ్వూ, నేను విడిపోతే ఈదేశానికి వచ్చే ముప్పేమీ లేదు గానీ నీకొచ్చే ముప్పేమిటో చెప్పు" రమేశ్ కోపంతో అరిచాడు.
నిజానికి రమేశ్ విడిపోతే సుబ్బారావుకు నష్టం ఏమీ లేదు. ఇంకో రూమ్మేటును వెతుక్కోవచ్చు, ఒంటరిగానూ ఉండొచ్చు. కానీ రమేశ్ ఉండడం వలన సుబ్బారావుకు చాలా కలిసొస్తుంది. ఎప్పుడూ ఇంట్లో పనులు రమేశే చక్కబెడతాడు, పైగా తను అప్పుడప్పుడూ అద్దె ఎగ్గొట్టినా నడుస్తుంది. ఇలా అదనంగా వచ్చే లాభాలు రమేశ్ విడిపోతే ఉండవు. కానీ ఆవిషయం ఒప్పుకోవడానికి సుబ్బారావుకు ఇష్టం లేదు.
ఈసారి ఇంకేం లాజిక్ వెతకాలా అని ఆలోచిస్తున్న సుబ్బారావుకు తనూ, రమేశ్ ఒకే కాలేజీలో చదివిన విషయం గుర్తొచ్చింది. "ఇదిగో.. ఇది మన కాలేజీ ఐక్యతకే దెబ్బ. నువ్వు వెల్లిపోవడానికి వీల్లేదు."
"చాల్చాల్లే సుబ్బారావ్" మనిద్దరం విడిపోతే మన కాలేజీ పరువుకొచ్చిన నష్టం ఏమీలేదు, నేను వచ్చే నెల వెల్లిపోతున్నాను. ఇక నీ ఇష్టం." రమేశ్ ఆవేశంతో అక్కడున్నా బల్లపై గ్లాసు గుద్ది మరీ చెప్పాడు. ఆదెబ్బకి గ్లాసుకు కింద పెద్ద సొట్టపడింది.
"ఒరేయ్ రమేశ్, ఎంత ధైర్యంరా నీకు? నాగ్లాసుకు సొట్ట బెడుతావా? అసలు నువ్వు తాలిబన్‌వి." అంతకుముందురోజు ఎవరో తాలిబన్ అనే పదం వాడితే విన్న సుబ్బారావు అదేంటో తెలీకపోయినా మరీ అరిచాడు.
"ఛీ, వీడితో వాదన అనవసరం. వీడికి ఎదుటివారి హక్కులను గౌరవించడం చేతకాదు, సాటిమనుషుల ఆత్మగౌరవం వీడికి పట్టదు" అనుకుంటూ రమేశ్ గదినుంచి బయటికి వచ్చి బరువెక్కిన హృదయంతో రోడ్డుపై నడక సాగించాడు. ఇంతలో ఎదురుగా "మారాష్ట్రం మాకు కావాలి, జై తెలంగాణ!!" అని నినాదాలు చేస్తూ సాగుతున్న ఉద్యోగుల ర్యాలీ ఎదురురాగా తానూ ర్యాలీలో కలిసిపొయి వారి నినాదాలతో గొంతు కలిపాడు.
Nice!
ReplyDeleteThanks Srikanth!!
ReplyDelete"ఒక్కడికే అద్దె మొత్తం కట్టే స్థోమత లేక సుబ్బారావే వచ్చి రమేశ్ గదిలోచేరాడు."
ReplyDelete"వాళ్ళ ఊరిలో బాగా డబ్బూ, భూములూ ఉన్న జమీందారీ వంశం. "
super creativity. continue
Good observation.
DeleteHowever the fact is like this. Though Subbarao hails from rich land lord family, Subbarao's "income" from his job is less. He cannot pay whole rent himself on his own. One should understand the difference between wealth and income.
so subba rao from telangana kada?!
ReplyDeletechivariki naakardam ayindi adi mari.
hahhahhh vene vaallu verri puvvulaite, cheppevaadu telangaana antaadu mari.