లొక్‌సత్తా పత్రిక ఎడిటర్ గంగాధరరావు గారి లొక్‌సత్తా టైంస్‌లోని వ్యాసం ఈక్రింద చూడవచ్చు. తెరాసపై, కేసీఆర్‌పై దుమ్మెత్తిపొయ్యడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నప్పటికీ ఈవ్యాసం తెలంగాణవాదానికి అనుకూలంగానే ఉన్నది. ఇటీవలే లోక్‌సత్తా శ్రీక్రిష్ణ కమిటీ 8వ అధ్యాయాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన కూడా చేసింది. ఈపరిణామాలను చూస్తుంటే లోక్‌సత్తా ఆలస్యంగానైనా తెలంగాణ అంశంపై న్యాయం వైపు అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది.
*******************
అన్ని పార్టీల మద్దతూ అవసరమే
- కొంగర గంగాధరరావు
ఈ వేళ తెలంగాణలో నూటికి 90 శాతం మంది ప్రజల బలమైన వాంఛ తెలంగాణ రాష్ట్రం. ఈ ఉద్యమాన్ని కెసిఆర్ కళ్ళతోనో లేక తెలంగాణ కాంగ్రెస్/టిడిపి నాయకుల దృష్టితోనో చూస్తే, అది తెలంగాణ ప్రజల్లో ప్రబలంగా ఉన్న ఆకాంక్షను అవమానించడమే అవుతుంది. మరి ఇంత ప్రబలంగా ఉన్న ఈ వాంఛ సఫలీకృతం కావడానికి గల అడ్డంకులేమిటి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయిందని పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు వేయకుండా సాగతీయడానికి గల కారణాలేమిటి?
మనమందరం విస్మరించకూడని విషయం మరొకటుంది. ఏ ఉద్యమంలోనైనా ప్రజలందరూ పాల్గొనరు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో నిజంగా పాల్గొన్న యోధులు వేలల్లోనే ఉన్నారు. కాని అది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లొంగదీసుకొంది. మరి లక్షలాది ప్రజలు రోడ్లపైకి వచ్చినా, కోరుకొంటున్నది దేశ సార్వభౌమత్వానికి ఏ రకంగానూ భంగకరం కాని, ఒకప్పుడు ప్రత్యేకంగా వుండి నేడు సమై క్య ఆంధ్రప్రదేశ్‌లో అస్తిత్వాన్ని కోల్పోయిన తెలంగాణ రాష్ట్రాన్నే అయినా, కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసి మరీ వెనుక అడుగులు ఎందుకు వేస్తోంది? దీనికి కారణభూతులు ఎవరు? తెలుసుకోవాలంటే ముందుగా మనం ఉద్యమ మూలాల్లోకి వెళ్ళాలి.
1953 అక్టోబరులో ఆంధ్ర రాష్ట్ర మేర్పడినప్పుడు చెన్న పట్టణాన్ని తమిళులకు కోల్పోయిన ఆంధ్ర ప్రజల్లో, నాయకుల్లో విశాలాంధ్ర ఏర్పడాలన్న కోరిక పురుడు పోసుకొంది. అంతకు రెండు శతాబ్దాల క్రితం తెలుగు మాట్లాడే ప్రాంతాలు విడిపోయాయి. ఆంధ్ర మహాసభ తదితర కార్యక్రమాలతో ఇటు హైదరాబాద్ రాష్ట్రంలోను, అటు కోస్తాంధ్ర, రాయలసీమలోను తెలుగు మాట్లాడే ప్రాంతాలు కలిసి పోతే మరింత ఎదగగలమని ఆశ పొడసూపింది. 1948లో పోలీస్ యాక్షన్ ద్వారా భారత్‌లో విలీనమయిన హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగువారిని, నిజాం నవాబుల కాలంలో అనుభవించిన బాధలు, విశాలాంధ్ర వైపు అడుగులు వేసేలా చేశాయి.
అయితే వాటితోపాటే అనుమానాలు ఏర్పడ్డాయి. వివిధ చారిత్రక కారణాల వల్ల అటు ఆంగ్ల విద్యలో, ఇటు లౌక్యంలో ఎంతో ముందంజలో ఉన్న కోస్తాంధ్ర ప్రజ లు అటు రాయలసీమ ప్రాంత ప్రజల్లో, ఇటు తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయారు. రాయలసీమ వాసులతో శ్రీబాగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుని కలుపుకున్న కోస్తాంధ్ర నాయకత్వం ఇటు తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకోవాలని తహతహలాడింది.
అందుకే పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం తదితర ఒడంబడికలు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకుల మధ్య జరిగాయి. ఫజల్ అలీ కమిషన్, అయిదేళ్ళు ఆగి ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగి కొత్తగా ఎన్నికయిన ఆ ప్రజాప్రతిధులు ఇరు ప్రాంతాల శాసనసభలలోను మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదిస్తే అప్పుడు విశాలాంధ్రను ఏర్పరచాలని అభిప్రాయపడింది.
కాని నిజాం ప్రతినిధి మోయిన్ నవాజ్ జంగ్ ఐక్యరాజ్యసమితిలో స్వతంత్ర హైదరాబాదు రాజ్యానికి సంబంధించి ఇచ్చిన అర్జీ తదితర కారణాల వల్ల భారత ప్రభుత్వం హైదరాబాదు రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించింది. ఐదు జిల్లాలను మహారాష్ట్రలో, మూడు జిల్లాలను కర్ణాటకలో కలిపి మిగిలిన హైదరాబాదు ప్రాంతాన్ని (తెలంగాణ) సీమాంధ్రతో జోడించింది. భాష తెలిసిన ఎవరికయినా ఇది జోడింపు (అఛిఛ్ఛిఛ్ఛీ) మాత్రమేనని, కలయిక/ విలీనం (అఝ్చజూజ్చఝ్చ్టజీౌn) కాదని తెలిసిపోతుంది.
ఈ జోడింపు తెలంగాణ ప్రాంత ప్రజల్లోని అభద్రత భావాన్ని తొలగించకపోగా మరింత పెంచింది. పాలనా వ్యవహరాల్లో ఉపయోగపడేందుకు తెలుగు, ఆంగ్లం ఎక్కువగా తెలిసిన సీమాంధ్ర వారిని ఉన్నతాధికారులుగా హైదరాబాద్ తీసుకురావడం, తెలుగు వారయినా నిజాం పాలనలో ఉర్దూ మాధ్యమంలో చదువుకోవడం వల్ల సీమాంధ్రులతో పోటీబడే స్థాయిలో తెలంగాణ ప్రజలు లేకపోవడం ఈ దూరాన్ని పెంచింది. ఒక కాకి పదికాకులను పిలిచినట్లుగా సీమాంధ్ర ఉన్నతాధికారులు సీమాంధ్ర విద్యాధికులకు పెద్దపీట వేసి తివాచీ పరచి ఆహ్వానించడంతో తెలంగాణ ప్రజానీకానికి తమచోటే తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సిరావడం బాధాకరంగా పరిణమించింది.
అగ్నికి వాయువు తోడైనట్లుగా సీమాంధ్రుల అభిజాత్య అహంకారపు ధోరణి తెలంగాణ ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లయింది. ఇక ఉర్దూ కలగలిసిన తెలంగాణ తెలుగు మాండలికాన్ని సీమాంధ్రులు చిన్నచూపు చూడటం విద్వేషాగ్నిని రగిల్చింది. తమ దైన భాష, సంస్కృతి తమ చోటే తిరస్కృతికి గురికావడం తెలంగాణ ప్రజానీకం తిగరబడేలా చేసింది. దానికి విద్యార్థి నాయకులు త్యాగం, కొద్దిమంది తెలంగాణ రాజకీయనాయకుల స్వార్థం తోడవడంతో 1969లో ఉవ్వెత్తున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఎగసింది.
అప్పటికింకా ఐక్యరాజ్యసమితిలో నిజాం మంత్రి మొయిన్ నవాజ్ జంగ్ పెట్టిన అర్జీ తేలకపోవడం, జాతీయ సమగ్రత అంశాలు కలగలిసి ఉండటంతో ఇందిరాగాంధీ నేతృత్వంలోని నాటి జాతీయ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ససేమిరా అంది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారిని ప్రలోభ పరచి, ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది. తెలంగాణ ప్రజానీకానికి తాయిలాలు వేసి ఉద్యమాన్ని చల్లార్చి రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఉంచడంలో సఫలీకృతం అయింది.
అప్పుడప్పుడు అసంతృప్త తెలంగాణ రాజకీయ నాయకులు ఈ కాంక్షను వాడుకోవాలని చూసినా 1969లో మోసపోయిన తెలంగాణ ప్రజానీకం అంత త్వరగా స్పందించ లేదు. కాని 2002లో చంద్రబాబుపై కోపంతో ప్రత్యేక తెలంగాణ సమరాంగణంలో దూకిన కల్వకుర్తి చంద్రశేఖర్‌రావు ఉరఫ్ కెసిఆర్ ఈ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. విద్వేష భావాలు రెచ్చకొడుతూనే ఎక్కడా హింసాత్మక రూపం తలదాల్చకుండా అటు అణచివేతకు అవకాశమీయకుండా ఇటు ఉద్యమ స్ఫూర్తి చల్లారినప్పుడల్లా తనదైన ఎత్తుగడలతో ఉవ్వెత్తున ఎగసిపడేలా చేస్తూ కెసిఆర్ చేసిన ఉద్యమ ప్రస్థానం తెలంగాణ ప్రజానీకపు ప్రగాఢ కాంక్షను మరింత బలీయం చేసింది.
బలమయిన ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హెలిక్టార్ ప్రమాదంలో కోల్పోవడంతో చంద్రబాబును ఎదుర్కోలేమన్న భయంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కెసిఆర్‌ను ప్రోత్సహించింది. తత్ఫలితమే కెసిఆర్ నిరాహార దీక్ష, 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి ప్రకటన. మొయిన్ నవాజ్ జంగ్ అర్జీకి కూడా 1975లో ఐక్యరాజ్యసమితిలో కాలం చెల్లిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్ 10న పార్లమెంటులో సైతం ప్రకటించిన జాతీయ ప్రభుత్వం ఆ తరువాత చంద్రబాబు ఎదురుదాడికి తల్లడిల్లింది.
అంతవరకు ప్రత్యేక తెలంగాణకు ఉత్తుత్తి మద్దతు ప్రకటించిన చంద్రబాబు, ఇది తనపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ప్రయోగించిన అస్త్రంగా గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు. సీమాంధ్రలో డిసెంబర్ 10 నుంచి ప్రజ్వరిల్లిన సమైక్యాంధ్ర ఉద్యమం ఇటు చంద్రబాబు అప్రకటిత మద్దతుతో, అటు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు హైదరాబాదులో వున్న ప్రయోజనాల దృష్ట్యా ఉవ్వెత్తున ఎగియడంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వెనక్కి తగ్గింది. పరిష్కారాలు వెతకడం కోసం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. సంవత్సరం పాటు కాలహరణం చేసిన శ్రీకృష్ణ కమిటీ మరింత వివాదాస్పదంగా తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీ రహస్యంగా 8వ అధ్యాయాన్ని సమర్పించి జస్టిస్ శ్రీకృష్ణ ప్రతిష్ఠను పాతాళానికి తొక్కింది.
మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తిరిగి ఊపందుకునే ప్రయత్నంలో వుంది. అయితే సంవత్సరం క్రితం ఉన్న ఆనందోత్సాహాలు, తెలంగాణ వస్తుందన్న విశ్వాసం ఇప్పుడు లేవు. మోసపోయామన్న బాధ, పోరాడాలన్న కసి తప్ప ఏంచేస్తే తెలంగాణ వస్తుందో తెలియని పరిస్థితిలో తెలంగాణ ప్రజానీకం, నాయకత్వం వుంది. కారణాలేమి టి?
ఉద్యమం అంత ఉద్ధృతంగా సాగినా ఫలితాన్ని సాధించడంలో ఎందుకు విఫలం అవుతోంది? అసలు ప్రత్యేక తెలంగాణ సాధనకు గల అడ్డంకులేమిటో ఒకసారి పరిశీలిద్దాం. తరచి తరచి చూస్తే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ బలమే దానికి బలహీనతగా పరిణమించిందని అర్థమవుతుంది.కెసిఆర్‌పై అధికంగా ఆధారపడటం ఉద్యమ గమనానికి ఎంతఅవసరమైందో, లక్ష్యసాధన లో అంతే అడ్డంకిగా నిల్చింది. కారణాలు విశ్లేషిద్దాం.
(అ) నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు సీమాంధ్రులకు అభ్యంతరం లేదు. కానీ ఉద్యమంలో ఉద్రేకం చల్లారకుండా వుండేందుకు కెసిఆర్, అతన్ని అనుసరిస్తూ ఇతర తెలంగాణ ప్రాంత నాయకులు వాడిన పదజాలం సీమాంధ్రులను గాయపరచింది. అందుకే తమకు పోయేదేమి లేకున్నా, తమ నాయకుల స్వార్థ ప్రయోజనాలు ఇమిడివున్నా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సామాన్య సీమాంధ్రులు సైతం బలపరిచారు.
(ఆ) తెలంగాణలో ప్రబలంగా వున్న తెలుగుదేశం పార్టీని నిర్వీర్యపరుస్తాడనుకున్న కెసిఆర్ తెలంగాణలో తమని కూడా తుడిచి పెడుతున్న విషయాన్ని గమనించిన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణ ఇచ్చి కెసిఆర్‌ను మరింత బలపరిస్తే ఆ ప్రాంతంలో తమకు నూకలు చెల్లినట్లేనని గ్రహించింది.
(ఇ) అటు సీమాంధ్రలో చంద్రబాబును పక్కనపెట్టి ముందుగా వై.ఎస్.జగన్ అంటే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం భయపడుతోంది. అటు జగన్ బలాన్ని అంచనా వేయలేక, ఇటు తెలంగాణ ప్రకటిస్తే ఆ కారణంతో అటు సీమాంధ్రలో జగన్ తమని తుడిచిపెడితే తమగతి రెంటికీ చెడ్డ రేవడి అవుతుందేమోనని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తల్లడిల్లుతోంది.
(ఈ) ఇక ఎలాగూ తెలంగాణ వస్తోంది కాబట్టి, తెలంగాణలో ప్రత్యర్థుల నిర్మూలనకు కెసిఆర్ పూనుకున్నారు. టిడిపిిని దాదాపుగా తుడిచిపెట్టిన కెసిఆర్ తమను విడిచి పెడతారని కాంగ్రెస్ అధినాయకత్వం భావించడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో కెసిఆర్ ప్రభ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణ ఇవ్వాలంటే భయపడే రీతిలో వుంది.
అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వనట్లేనా? దీనికెవరిని నిందించాలి? మితిమీరిన కెసిఆర్ స్వార్థ నాయకత్వమా? కెసిఆర్‌పై అతిగా ఆధారపడి మిగిలిన రాజకీయ పక్షాలను తెలంగాణలో శూన్య స్థితికి తెచ్చిన రాజకీయ జేఏసీ కారణమా? తెలంగాణ ఏర్పాటు రాజకీయ ప్రక్రియ అని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాల్సిన అవసరం వున్నదన్న విషయం మరచి, తెలంగాణలో జై తెలంగాణ అనని రాజకీయ పక్షాల అస్థిత్వాన్ని నిర్మూలించాలన్న వ్యూహం తెలంగాణ ఉద్యమం పట్ల ఆత్మహత్యా సదృశం అయ్యిందా? దీనికెవరిని నిందించాలి?
ఖచ్చితంగా రాజకీయ జేఏసీనే. రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు స్వార్థం లేనిదే మనుగడలేదు. పైచేయి సాధించడం, ప్రత్యర్థులను తుదముట్టించడమే రాజకీయ పక్షాల లక్ష్యం. కానీ రాజకీయ జేఏసీ లక్ష్యం అదికాదు. స్వార్థం దానిగుణం కాదు. కేవలం ఉద్యమ ఉద్ధృతికి కెసిఆర్‌పై ఆధారపడవలసి వచ్చినా, ఇతర రాజకీయ పక్షాల నిర్మూలనలో కెసిఆర్‌కు రాజకీయ జేఏసీ సహకరించడమే ప్రస్తుత దుర్గతికి కారణం. నిరాహార దీక్ష రెండోరోజునే పళ్ళరసం తాగిన కెసిఆర్ దిమ్మతిరిగేలా విద్యార్థి ఉద్యమ నాయకత్వం హెచ్చరికలు పంపి కెసిఆర్‌ని నిరాహార దీక్ష కొనసాగించేలా చేసిన వైనం, రాజకీయ జేఏసీ మరచిపోయింది.
కేసీఆర్‌పై ఆధారపడుతూనే అతడిని, అతడి రాజకీయ వ్యూహాలను అదుపులో పెట్టవలసిందిపోయి, కెసిఆర్ చెప్పినట్లుగా చేసి ఇతర రాజకీయ పక్షాలకు దూరమయ్యింది. అన్ని రాజకీయ పార్టీలకు విశ్వాసం కలిగించి, తెలంగాణ రావడం ఆ పార్టీలకు శరాఘాతం కాదని, అన్ని రాజకీయ పక్షాలకు కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కూడా సమాదరణ ఉంటుందనే భావన కల్పించడం మరచిపోయి, కెసిఆర్ అడుగులకు మడుగులొత్తని రాజకీయ పక్షాల పీచమణచేందుకే తన శక్తి యుక్తులనుపయోగించింది. పర్యవసానమే ఈ దుస్థితి.
ఇకనైనా రాజకీయ తదితర జేఏసీలు ప్రాప్తకాలజ్ఞతతో అన్ని రాజకీయ పక్షాలతోనూ చర్చించి వాటి విశ్వాసాన్ని చూరగొనాలి. రాజకీయ పక్షాలు సహకరించకుండా, వాటి పీచమణచడం ద్వారా తెలంగాణ సాధించడం అసాధ్యం. అలాకాకుండా అన్ని రాజకీయ పక్షాలను సమాదరిస్తూ, వాటికి విశ్వాసాన్ని కలిగించగలిగితే రాజకీయ ప్రక్రియలో అన్ని రాజకీయ పక్షాలను పాల్గొనేలా చేయగలిగితే ఉద్యమంలో ఉద్ధృతి రేకెత్తించేందుకు సీమాంధ్ర ప్రాంతీయులపై ద్వేషాన్ని వెళ్ళగక్కే విధానం పోయినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుసాధ్యమవుతుంది. అలాకాకుండా ప్రస్తుతం జరుగుతున్నట్లుగా అంతా కేసీఆర్ మయం అనుకుంటే 2014 ఎన్నికల్లో అన్ని తెలంగాణ సీట్లు (పార్లమెంట్,అసెంబ్లీ) కెసిఆర్ గెలుచుకున్నా తెలంగాణ రాదు,
అలాగే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చినా ప్రస్తుత పరిస్థితులే ఆంధ్ర ప్రాంత ఎంపీలపై ఆధారపడటంఅప్పుడూ వుంటే బిజెపి కూడా తెలంగాణ ఇవ్వదు. తెలంగాణ రావాలంటే అన్ని రాజకీయ పక్షాల సహకారం అవసరం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహిస్తున్న రాజకీయ, విద్యార్థి తదితర జేఏసీలు ఈ విషయాన్ని గ్రహించి తదనుగుణమైన కార్యాచరణను చేపడితే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం కల సాకారమవుతుంది.
- కొంగర గంగాధరరావు
లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు
--