Tuesday 14 June 2011

విశాలాంధ్రే తెలంగాణ కోరుతుంది


ఇటీవల నమస్తే తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సందర్భంగా విశాలాంధ్ర పత్రిక ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పిన మాట "ఇప్పుడు విశాలాంధ్రే తెలంగాణ కోరుతుంది" అని. ఔను, నిజం. విశాలాంధ్ర ఉద్యమం మొదలు పెట్టింది సీపీఐ. సీపీఐ వారి దిన పత్రిక, ప్రచురణాలయం పేర్లు కూడా "విశాలాంధ్ర". ఇప్పుడు ఆ సీపీఐ కూడా తెలంగాణ కోసం ఉద్యమబాట పట్టింది.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని మొదలు పెట్టిన సీపీఐ ఆతరువాతి కాలంలో ఆంధ్ర నాయకుల ప్రభావం వలన ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే కమ్యూనిస్టులకు రాష్ట్రంలో బలం వస్తుందని నమ్మి విశాలాంధ్ర ఉద్యమం చేపట్టింది. అసలు ఫజల్ అలి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలవడానికి ఐదు సంవత్సరాలు ఆగి, ఎలక్షన్లతరువాత ప్రజల అనుమతితో కలవాలని చెప్పినప్పటికీ అలా జరగకపోవడానికి కారణం అప్పటి కమ్యూనిస్టులే. 1969లో కూడా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా సీపీఐ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసింది.

కానీ ఇప్పుడు యాభై సంవత్సరాల అనుభవంతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కల్లకు కట్టినట్టుగా కనిపిస్తుంటే సీపీఐ నాయకత్వం చివరికి వాస్తవాన్ని గమనించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. చిదంబరం ప్రకటన తరువాత మిగతా పార్టీలు వెనక్కి తగ్గినా సీపీఐ తమ మాటకు కట్టుబడి ఉండడమే కాదు ఇప్పుడు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటుంది.

కొంతమంది సీపీఐ దగ్గర "విశాలాంధ్ర" పేరును అరువు తెచ్చుకొని ఒక వెబ్‌సైటును పెట్టుకుని లగడపాటి సమైక్యవాదానికి అనుకూలంగా రాతలైతే రాస్తున్నారు కానీ వారెవరూ సీపీఐ యొక్క ఆదర్శాలు మాత్రం పంచుకోలేక తమవి విశాలాంధ్ర భావాలు కావు విష అంధ భావాలని నిరూపించుకున్నారు. తెలుగు భాషమీద నిజంగా ప్రేమ ఉన్న వారు ఒక్క రాష్ట్రంలో ఉన్నా రెండు రాష్ట్రాల్లో ఉన్నా భాష ఉన్నతికి తోడ్పడతారు. తెలుగు మాట్లాడేవారు అనేకులు ఇతర రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లోనూ ఉండి తెలుగు భాషకు తొడ్పాటునిస్తూ పరిపాలనకూ, భాషాభివృద్ధికి సంబంధం లేదని నిరూపిస్తున్నారు. కానీ ఏనాడూ తెలుగు మాట్లాడే ఇతర రాష్ట్రాల ప్రాంతాలని కలపాలని ఉద్యమాలు చెయ్యనివారు,  తెలుగులో రాయడం కూడా చేతకానివారు ఇప్పుడు తెలుగు వారు తమకోసం ఇంకోరాష్ట్రం కావాలంటే మోకాలడ్డుతున్నారు.

సీపీఐ లాంటి నిజాయితీ గల పార్టీలకు తెలంగాణ ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. రేపు నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జరగబోయే సీపీఐ బహిరంగ సభ విజయవంతం కావాలని ఆశిద్దాం.

No comments:

Post a Comment

Your comment will be published after the approval.