ఈమధ్యన విషాంధ మహాసభకు చెందిన సి.నరసింహారావు అనే ఒక మేధావి(?) అసలు "ఈఆధునిక కాలంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవస్థీకృత దోపిడీ ఉండదు, ఉండడానికి వీల్లేదు" అంటూ గొప్పగా సిద్ధాంతీకరించాడు. అప్పుడప్పుడు టీవీషోల్లో కనబడే ఈమహానుభావుడు ప్రాంతీయ అస్తిత్వవాదానికీ, ప్రాంతీయ విద్వేషానికి తేడా కూడా తెలియదని నిరూపించుకుంటూ ఇంకా చాలా గొప్ప గొప్ప సిద్ధాంతీకరణలు చేశారు. పైగా అందుకు ఉదాహరణలు జెర్మనీ, అమెరికా లాంటి పరిణితి చెందిన సమాజాలూ, వాటితో ఇప్పుడిప్పుడే ఫ్యూడల్ వ్యవస్థనుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న విభిన్న జాతులు, భాషలు, కుల, మత, సామాజిక తేడాలున్న మన సమాజంతో పోలిక.
దుప్పులనూ మేకలనూ ఒకే కంచెలో మేతకు వదిలితే మేకలను దుప్పులు తిననివ్వవు, అక్కడ గడ్డి రెంటికీ సరిపోయేంత ఉన్నాసరే. మనరాష్ట్రంలో గత యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే అధికారం చేజిక్కించుకుంటారు. అసెంబ్లీలో 70 శాతానికి పైబడి ఈరెండు సమాజిక వర్గాలే ఉంటాయి. వీరికి సమాజంలో మెజారిటీ ఎక్కువా అంటే అదీలేదు, ఇద్దరూ కలిపి 3 శాతానికి మించరు. అంతా ప్రజాస్వామ్యబద్దంగానే జరుగుతుంది, ప్రజలే ఎన్నుకుంటున్నారు, నరసింహారావుగారి థీరీ ప్రకారం అసలు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవస్థీకృత దోపిడీ ఉండదు కాబట్టి మిగతా సామాజిక వర్గాలకు అసలు అధికారం చేపట్టడం, ఎమ్మెల్యేలూ, ఎంపీలు కావడం ఇష్టం లేదా?
బలవంతుడు బలహీనున్ని దోచుకోవడం ప్రకృతి ధర్మం. ఆప్రకృతి ధర్మంపై పోరాడుతూ మనిషి బలహీనున్ని కూడా బలవంతుడితో సమానంగా అవకాశాలు లభించేలా న్యాయాన్ని అమలు చేస్తాడు. ఈన్యాయం అంతటా ఒకే సూత్రం ప్రకారం చెయ్యలేం. వెనుకబడిన ప్రాంతాల అవకాశాలు అభివృద్ధి చెందిన ప్రాంతం వారు చేజిక్కించుకోవడానికి ఆప్రాంతాన్ని విడదీసి పాలిస్తారు, దాని ఫలితమే ఇటీవలి ఉత్తరాంచల్, ఝార్ఖండ్, చత్తీస్‌ఘర్ రాష్ట్రాల ఏర్పాటు. అదే అన్ని ప్రాంతాలలోను ఉండే షెడ్యూల్డ్ కులాలూ, గిరిజనులూ, వెనుకబడిన తరగతులూ, స్త్రీలు లాంటి వర్గాలను విడదీసి పాలించడం సాధ్యం కాదు కాబట్టి వారికి రిజర్వేషన్ల లాంటి రాజ్యాంగబద్దమయిన ఏర్పాట్లు చేశారు.
ఈనరసింహ మేధావికంటే తెలివయినవారు యాభై, అరవై సంవత్సరాలక్రితమే రాబోయే కాలంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన వర్గాలు మిగతా వర్గాలను మార్జినలైజ్ చేసే పరిస్థితిని ఊహించి రాజ్యాంగంలో అలాంటి వెసులుబాటులు కల్పించారు. మొదటి ఎస్సార్సీ ఏర్పాటు చేసిన సమయంలోనే అంబేద్కర్ ఈపరిస్థ్తిని ఊహించి చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ఏప్రాంతం వారి అవకాశాలు ఆప్రాంతం వారే అనుభవించొచ్చని చెప్పాడు. దానికి ఎంత చిన్న రాష్ట్రం అయితే సరయినది అనే ప్రశ్నకు ఒక భాష మాట్లాడే ప్రజల్లో ఎన్ని విభిన్న సాంస్కృతిక, సామాజిక, ఆర్ధిక ఎదుగుదల కలిగిన ప్రాంతాలుంటే అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యాలని సూత్రీకరించారు. రెండు విభిన్నస్థాయిలు, విభిన్న చరిత్ర కలిగిన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలవడానికి ముందు వచ్చిన వ్యతిరేకతను మేనేజ్ చెయ్యడానికి పెద్దమనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఏర్పాతు చేసిన రాజకీయ వెసులుబాటులు కూడా ఇలా అసమానతలను మేనేజ్ చేసి ఒకరి అవకాశాలను మరొకరు దోచుకోకుండా చేసిన ప్రయత్నమే.
వ్యవస్థీకృత దోపిడీ అసలు సాధ్యమే కాదని చెప్పే మేతావులు, వారి సూత్రాలకు ఆహా, ఓహో అంటూ చప్పట్లుకొట్టే జనాలకు తమదాకా వస్తే మాత్రం రూల్సు మారుతాయి. ఇదే ఆంధ్రప్రాంతం వారు మద్రాసు నుండి వేరుపడడానికి చెప్పిన కారణం తమిలులు మాఅవకాశాలు దోచుకుంటున్నారు, మమ్మల్ని ఎదగనీయడం లేదు అని.
ఒక పిల్లిని గదిలో భందించి కొడితే అది తిరగబడుతుంది. దీనికి అసలు కారణాన్ని అన్వేషించకుండా పిల్లి తిరగబడింది, పిల్లి విద్వేషాన్ని వెల్లగక్కుతుంది అంటూ అరిచేవారు నిజాలను దాస్తున్నట్లే. అస్తిత్వ వాదాలు అణచివేత, పక్షపాతధోరణులనుంచి పుట్టుకొస్తాయి. సమాజంలో కొన్ని సామాజిక వర్గాలు పెత్తనం చేస్తూ మిగతావారిని అణచివేస్తే కుల అస్తిత్వ వాదాలు పుడుతాయి. అలాగే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం వారు పెత్తనం చేస్తూ మరొక ప్రాంతం వారిని అణచివేసి పరిపాలనలో ఒకప్రాంతంవారిపై పక్షపాతవైఖరి కనబరిస్తే ప్రాంతీయ అస్తిత్వవాదాలు పుడతాయి. అస్తిత్వవాదం విద్వేషం కాబోదు, విద్వేషం వలన అస్తిత్వవాదాలు పుడతాయని నరసింహారవుగారు గమనిస్తే మంచిది.
కుల, మత, భాషా,ప్రాంతీయ విభేధాలు తొలగిపోయి అందరూ ఒకే కుటుంబంలాగా జీవించాలనేది నాతో సహా ఆదర్శభావాలు కలిగినవారందరూ ఒప్పుకునే విషయం. కానీ ఆభేధాలు సమాజంలో ఉన్నప్పుడు అవేవీ లేవు అని నటిస్తూ కూర్చుంటే లాభం లేదు, ముందర ఆభేదాలవలన ఎవరికీ అన్యాయం జరగకుండా చట్టాన్ని అమలు చెయ్యాలి, ఆతరువాత భేదాలు తొలగించడానికి సామాజిక ప్రయత్నం చెయ్యాలి.
చాలా బాగా సమాధానం చెప్పారు.
ReplyDelete