Monday, 6 June 2011

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, నాడు-నేడు

మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం భాగంగా ఉన్నప్పుడు ఆంధ్ర మద్రాసులోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను వేరు చేసి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని నాడు ప్రత్యేకాంధ్ర ఉద్యమం మొదలయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాన వేరు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా నడుస్తుంది. ఈ రెండు ఉద్యమాల్లో పోలికలు, తేడాలు:

ఉద్యమానికి కారణాలు:

నాడు ప్రత్యేకాంధ్ర ఉద్యమం మొదలు కావడానికి ప్రధాన కారణం రాజాజీ క్రిష్ణా జలాలో కొంతభాగం పెన్నా, సీమ మీదుగా మద్రాసు నగరానికి తరలించాలని చేసిన ప్రయత్నం కాగా నేడు తెలంగాణ వాదులు చెప్పే అనేక కారణాల్లో ఒక ప్రధాన కారణం ఇరిగేషన్లో తమకు ఇప్పటికే జరిగిన అన్యాయం. అంటే ఆంధ్ర ఉద్యమానికి కారణం తమకు భవిష్యత్తులొ జరగబోతుందనే అన్యాయం అయిటే తెలంగాణకు కారణం ఇప్పటికే అనుభవంలో ఉన్నది.

చివరికి క్రిష్ణా-పెన్నా ప్రాజెక్టు రాకపోయినా మద్రాసుకు క్రిష్ణా నీల్లు అందాయి అయితే ఈసారి అది తెలంగాణా వాటానుంచి. క్రిష్ణాను తమిల ప్రాంతాలకు తరలించడం అప్పుడు తప్పనిపించినట్లే ఇప్పుడు గోదావరి జలాలను పోలవరం ద్వారా క్రిష్ణా డెల్టాకు తరలించడం తప్పని తెలంగాణ వాదులు చెబుతున్నారు. ఇప్పటికే క్రిష్ణాజలాల్లో తెలంగాణ ప్రాజెక్టులను నొక్కేసి అడిగితే క్రిష్ణాలో నీల్లు చాలట్లేదని చెబుతూ గోదావరిని క్రిష్ణా డెల్టాకు తరలించే ప్రయత్నం జరుగుతుంది.

తెలంగాణ ఉద్యమంలో ఇరిగేషన్‌తో పాటు నియామకాలూ, నిధులూ ఇతర ముఖ్య కారణాలు. ఇవి రెండూ కూడా ఏదో భవిష్యత్తులో జరగబోయే అన్యాయం కాదు, ఇప్పటికే దశాబ్దాలుగా జరుగుతున్నది.

ఆత్మగౌరవం, స్వయం పాలన:

అప్పుడు క్రిష్ణా-పెన్నాతో మొదలయిన ఉద్యమం చివరికి తెలుగువాడి ఆత్మగౌరవం, స్వయంపాలన అనే నినాదాలుగా పరిణామం చెందాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా నిధులు, నీల్లు, నియామకాలతో మొదలయి ఇప్పుడు తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సంస్కృతి నినాదాలు రూపుదిద్దుకున్నాయి. ఈ అస్తిత్వ వాదానికి అప్పుడు భాష మూలం అయితే ఇప్పుడు ప్రాంతం.


అప్పటి ఇప్పటి రాష్ట్రాలకు మూలం:

అప్పటి మద్రాస్ స్టేట్ బ్రిటిషువాడు తన పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ప్రెసిడెన్సీ నుండి పుట్టుకొస్తే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు శరతులతో కూడిన ఒప్పందాలతో కలవడం మూలాన జరిగింది. ఆ ఒప్పందాల ఉల్లంఘణ ఇప్పటి విభజనవాదానికి దారితీసింది.


కమిటీల ఏర్పాటు:

అప్పుడు జేవీపీ కమిటీ ఏర్పాటు చేస్తే ఇప్పుడు మాయదారి శ్రీక్రిష్ణ కమిటీ ఏర్పాటు జరిగింది. జేవీపీ కమిటీ సమస్యకు పరిష్కారం సూచిస్తే శ్రీక్రిష్ణ కమిటీ ఉద్యమాన్ని అనైతికంగా అణచివెయ్యడానికి సూచనలు చేసింది.


పీటముడులు:

అప్పుడు మద్రాసు నగరంపై పీటముడి ఏర్పడితే ఇప్పుడు హైదరాబాద్ పీటముడిగా తయారయింది. అప్పుడు మద్రాసు చివరికీ భౌగోళికంగా ఏప్రాంతంలో ఉందో వారికి దక్కింది. ఇప్పుడూ న్యాయంగా చివరికి హైదరాబాద్ భగోళికంగా ఎక్కడ ఉందో వారికే దక్కుద్దేమో అనే భయంతో సమైక్యవాదులు హైదరాబాద్ ఊసెత్తట్లేదు.

ప్రతి ఉద్యమాలు:

అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ప్రతిగా సమైక్య మద్రాసు ఉద్యమం లాంటిదేమీ జరగలేదు, ఇప్పటిలాగా. ఇప్పుడు మాత్రం తమ స్వలాభంకోసం అవతలివారు తమతో కలిసి ఉండాలనే వెరైటీ ఉద్యమం చరిత్రలో తొలిసారి మొదలయింది.


రాజకీయ నిరుద్యోగులు:

తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ నిరుద్యోగులు తెరపైకి తీసుకొచ్చారని సమైక్యవాదులు గోలపెడతారు. అప్పట్లో ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంలో ముఖ్యనేతలు ప్రకాశం, నీలం, బెజవాడ కూడా రాజకీయ నిరుద్యోగులే, ప్రకాశానికి ముఖ్యమంత్రి ఉద్యోగం దక్కలేదు, నీలం, బెజవాడలకు ఎమ్మెల్యే ఉద్యోగం దక్కలేదు, తరువాత అంతా ముఖ్యమంత్రులయిపొయ్యారు.

3 comments:

  1. ఎవరికి అవసరమైనట్లు వారు చరిత్రని మార్చుకోవచన్నమాట...

    ReplyDelete
  2. పచ్చి తెలుగోడు,

    అవునండీ అలాగే జరిగింది ఇన్నాల్లు, అసలు కొంత చరిత్ర చరిత్ర పుతల్లోనుంచి తుడిచివేయబడ్డది కూడా. ఇప్పుడిప్పుడే అసలు చరిత్ర బయటికి వస్తుంది.

    ReplyDelete

Your comment will be published after the approval.