Saturday, 7 September 2013

బాధాతప్త ’తెలంగాణా’– భయం నిండిన ’సమైక్యాంధ్రా’

రాష్ట్ర విభజన గూర్చి ఒక సీమాంధ్రుడి పోస్టు.
********************************


ఆంధ్రా ప్రాంతలో పుట్టి పెరగడం, తెలంగాణంలో నివసించడం వలన ఇరు ప్రాంతాలలో జరిగే ఉద్యమాలను దగ్గరగా చూసే అవకాశం, అనుభవం ఉంది. ఈ మొత్తం ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది, తిరుగుతూనే ఉంది. ఇరు ప్రాంతాలలోనూ నాపై కొంత వ్యతిరేక భావన ఉండడం గమనార్హం. ఆంధ్రా ప్రాంతంలో వ్యతిరేకత ఎందుకంటే నేను తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం కావడం. తెలంగాణా ప్రాంతంలో వ్యతిరేక భావన కలుగడానికి కారణం నేను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడను కావడం. ఆంధ్రా వాడు ఎప్పటికైనా ఆంధ్రావాడే అవుతాడు కాబట్టి అనేది సాధారణ అవగాహన అయి ఉండవచ్చు. ఏది ఏమైనా అవి నా మీద కలగిన భావనలే అయినప్పటికీ, నాలో కలిగిన భావనలు కాదు కాబట్టి నేను పెద్దగా బాధ పడవలసిన అవసరం లేదు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అయిన సందర్భంలో సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా సాగుతున్న తరుణంలో కొన్ని అనుభవాలు భలే గమ్మత్తుగా అనిపించాయి. అవేవనగా
(1)   బహుశా నాలుగేళ్ళ క్రితం అనుకుంటా? Hair saloon కి వెళ్లాను. అక్కడ Barber కి నాకు జరిగిన సంభాషణ ఇలా వుంది.
బా: ఈ తెలంగాణా గొడవ జరుగుతుంది కదండీ? మీ కెలా వుంటుందండీ? Problem ఏమీ లేదా?
నేను: అబ్బే మాకలాంటి సమస్యలేమీ రాలేదు? అయినా నేను తెలంగాణా రాష్ట్రానికి వ్యతిరేకిని కాను.
బా: అదెలాగా? మీరు ఈ ప్రాంతానికి చెందిన వారై, వాళ్లకు ఎలా support చేస్తారు.
నే: నేను support చేసేది ప్రాంతాన్ని బట్టికాదు. వాళ్ళ demand లో సామాజిక న్యాయం ఉంది. అందుకే నా నైతిక మద్దత్తు ఆ ఉద్యమానికి ఉంది.
బా: (గట్టిగా నవ్వి) మీరు భలే తెలివైన వారండీ? ఏ ఎండకా గొడుగు పడతారన్న మాట. ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట మాట్లాడుతున్నారా?
నే: నాకు అంత భయం లేదు సార్. నా మద్దత్తు ఇవ్వడానికి సరిపడా అన్ని కారణాలు అక్కడ ఉన్నాయి. అంతే.
బా: మీకు తెలంగాణా వాళ్ల గురించి మీకు తెలియదు సార్. అక్కడ తెలంగాణా ఇచ్చేస్తే మనం ఆకలితో చచ్చిపోతాం.
నే: అవునా ఏమిటది (నేను అప్పటికి 10 ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నాను)
బా: అవునండీ! వాళ్ళుమనకి నీళ్ళు రానివ్వరు. ఈ సస్యశ్యామలమైన ఈ నేలలో మీరు కరువు చూడవలసి వస్తుంది. మనం తిండి లేక చనిపోవాల్సి వస్తుంది.
(నేను గట్టిగా నవ్వేను)
బా: మీరు నవ్వకండి. మీకంత వయసులేదు. మీకు ఇప్పుడు అర్ధం కాదు.
నేను: రాష్ట్రం రెండుగా విడిపోవడం వలన మీరు నడిపే ఈ బిజినెస్ కి ఏమైనా నష్టం వస్తుందా?
బా: రాదు, కానీ, హైదరాబాదుని మనమే develop చేసాము.
నే: ఏమోనండి నాకు తెలియదు. మా కుటుంబం నుండి హైదరాబాదు వెళ్ళినోడిని నేనొక్కడినే. నేను వెళ్ళింది చదువుకోవడానికి మాత్రమే. హైదరాబాదు అభివృద్ది చేయడంలో నాకు గానీ, మా కుటుంబానికి గానీ ఏ విధమైన పాత్ర లేదు.
బా: (కళ్లల్లో కోపం) మీకంత వెటకారం అవసరం లేదు. మీకసలు సమస్యే అర్ధం కావడం లేదు (మాటల్లో చెప్పలేని చిరాకు). [అప్పటికే అతని కత్తి నా గడ్డం గీస్తూ ఉంది. ఈ మాటల సందర్భంలో అది నా గొంతు దగ్గర ఉంది. రాష్ట్రం కన్నా ప్రాణం ముఖ్యం అనిపించింది. నేను ఇక అతనితో మాట్లాడలేదు. నాతో నేను మాట్లాడుకోవడం మొదలెట్టాను “ఇంత భయాన్ని పోగొట్టెదెలా?”.
(2)   ఈ వారంలో నేను మా అమ్మకు ఫోన్ చేసాను. ఎక్కడున్నావు అంటే ’చర్చిలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము’ అంది. ఎందుకో అని కాకతాళీయంగా అడిగిన నాకు ’సమైక్యాంధ్ర కోసం, శాంతి కోసం’ అన్న సమాధానం నాలో అశాంతిని రేకెత్తించింది. నేను మళ్ళీ అడిగాను “అమ్మా! సమైక్యాంధ్రా కోసమా? శాంతి కోసమా?’. బహుశా ఇది చాలా పిచ్చి ప్రశ్నలా మా అమ్మకి అనిపించి ఉండవచ్చు. “అదేమిటి బాబు, సమైక్యాంధ్ర వస్తే శాంతి వచ్చినట్టే కదా’ అంది. అప్పుడు నేను తమాయించుకొని ఇలా చెప్పాను, “సమైక్యంగా ఉండడం వలననే గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో అశాంతి నెలకొని ఉంది. ఆ అశాంతిని తొలగించి, శాంతిని నెలకొల్పడానికే రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చింది. నువ్వు/ మీరు ఉపవాస ప్రార్థనలతో సమైక్యాంధ్రాను తెచ్చేస్తే పోయిన అశాంతిని తిరిగి తెచ్చినట్టే కదా అమ్మా” అన్నాను. మా అమ్మకేదో అర్ధమయ్యినట్టుంది. ’అలాగా! మరి హైదరాబాదు నుండి మన వాళ్లను పంపించేస్తారట?’ అని అడిగింది. బహుశ ఇది వారి ప్రార్థనలో రెండో అజెండా అయి ఉండవచ్చు. ఇక నుండీ మా సంభాషణ కొంత ఆశక్తికరంగా జరిగింది.
నేను: చాలా మంచి ప్రశ్న అమ్మా. అదే నిజమైతే నేను ఇప్పటికే వచ్చేసి ఉండాలి కదా?
అమ్మ: అవును, కానీ నువ్వు రాలేదు
నేను: పోనీ శరీన్ (సోదరుడు) వచ్చేసాడా?
అమ్మ: లేదు
నేను: మమ్మల్ని వదిలేయ్. పార్వతి కుటుంబం (carpenters in hyd) ఎవరైనా వచ్చారా?
అమ్మ: లేదు
నేను: ఇవన్నీ కాకపోయినా, నీకు తెలిసున్న వాళ్ళు ఏ ఒక్కరైనా వచ్చేసారా?
అమ్మ: లేదు
నేను: అలాంటప్పుడు ఇక్కడనుండి అందరినీ పంపించేస్తారన్న మాట వాస్తవమేనా?
అమ్మ: కాదు, మరి అందరూ అలా ఎందుకు చెబుతున్నట్టు
నేను: రాజకీయం మమ్మీ. భయాన్ని నిర్మిస్తున్నారు. ఈ మొత్తం విశయాన్ని అర్ధం చేసుకోవడానికి నీకు మనకు బాగా తెలిసిన ఒక ఉదాహరణ చెబుతాను. మనం మరియు మరికొన్ని కుటుంబాలు ఉద్యోగ రీత్యా జీవితంలో సింహ భాగం మన జిల్లా ఆదివాసీల ప్రాంతంలో గడిపాము. మీరు ఆ ఊరికి వెళ్ళే సరికి కరెంటు కూడా లేదు. అలాంటి ఊరిలో పీటర్ (తాతయ్య) గారు ప్రతీ కార్యక్రమంలో ముందుండి ఆ ఊరి అభివృద్దికి తన వంతు సాయాన్ని అందించారు. దానికి అక్కడున్న ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్ధులు సహకరించారు. పీటర్ గారు ఒక స్థాయి గౌరవాన్ని అనుభవించారు. ఇలాంటి సమయంలో ఆయన ఈ ఊరిని నేనే అభివృద్ది చేసాను. ఈ ఊరు నాది అని అంటే ఎవరైనా ఊరుకుంటారా?
అమ్మ: ఎందుకు ఊరుకుంటారు
నేను: కదా! ఆ ఊరులో ఇల్లు కొనుకున్నారు, పొలం కౌలుకి తీసుకున్నారు. ఉద్యోగ విరమణ సమయం వరకూ అక్కడే ఉన్నారు. విరమణ తరువాత తమ సొంత ప్రాంతానికి వచ్చేసారు. అలాకాకుండా అక్కడే ఉండిపోయినా సమస్య ఏమీ ఉండదు. కానీ ఇది నాది, నేను మాత్రమే అభివృద్ది చేసాను అంటేనే సమస్య మొదలవుతుంది. హైదరాబాదు సమస్య అలాంటిదే? పెద్ద కొట్టు బాబూరావు, చిన్ని కృష్ణ, జ్యోతుల వెంకట్రావు, సైకిల్ షాపు రాంబాబు లాగా సమాజానికి అవసరమైన వస్తువులను అందించే వ్యాపారం చేసినంత వరకూ ఎవ్వరూ ఏమీ అనరు. మా వల్లే ఈ ఊరు అభివృద్ది చెందింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ’అశాంతి’ వస్తుంది. లాజిక్ అర్ధమయ్యింద అమ్మా?
అమ్మ: అర్ధమయ్యింది బాబూ. వీళ్లందరూ చెబుతుంటే అదే నిజమనుకున్నాను.
నేను: హ హ హ. ఇప్పుడర్ధమయ్యిందిగా. ఈ శుభవర్తమానమును సర్వలోకమునకు తెలియజేయండి. వెళ్లండి.

(అమ్మ నవ్వింది. నా పని ఇప్పుడే మొదలయ్యింది)

No comments:

Post a Comment

Your comment will be published after the approval.