Sunday, 15 September 2013

రూంమేట్లు!!



"రమేశ్, నువ్వు గదిఖాలీ చేయడానికి వీల్లేదంతే!" గదమాయించి మరీ చెప్పాడు సుబ్బారావ్.

సుబ్బారావు, రమేశ్ ఇద్దరూ బ్యాచిలర్లు. చెరో ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఒకే అపార్ట్‌మెంటులో కలిసి అద్దెకు ఉంటున్నారు. మొదట్లో ఇద్దరూ బాగానే ఉన్నారు. కాలం గడిచే కొద్దీ సుబ్బారావు పెద్దరికం మరీ ఎక్కువయిపోయింది.

సుబ్బారావు రమేశ్ కన్నా కొంచెం బలంగా ఉంటాడు. పైగా భూస్వాముల కుటుంబం నుండి వచ్చినవాడు కావడంతో కాస్త పొగరెక్కువ.  బలముంది కదా అని సుబ్బారావు ఈమధ్య రమేశ్‌ను ఊరికే ఎగతాళి చేస్తున్నాడు. పైగా అద్దెకూడా సరిగా కట్టట్లేదు. అన్ని పనులూ ఎగ్గొడుతుంటాడు.

సుబ్బారావు పద్దతి నచ్చక రమేశ్ కొన్నిరోజులుగా ఇల్లు మారుదామని చూస్తున్నాడు. నిజానికి ముందే సుబ్బారావు గురించి తెలిసిన రమేశ్ అతనితో రూంమేట్‌గా కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. అయితే వేరే రూమ్మేటు దొరక్క, ఒక్కడికే అద్దె మొత్తం కట్టే స్థోమత లేక సుబ్బారావే  వచ్చి రమేశ్ గదిలోచేరాడు.

మొదట అదే ఇంట్లో రమేశ్, రంగనాథ్ కలిసి ఉండేవారు. రంగనాథ్ ఉద్యోగం ట్రాన్స్‌ఫర్ అవడంతో గది ఖాలీచేసి వెల్లిపోయాడు. రంగనాథ్  వెల్లిపొయ్యాక రమేశ్ ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడ్డాడు. సుబ్బారావు వచ్చి తను జాయిన్ అవుతానని అడిగినా అతనిగురించి ముందే విని ఉన్నాడు కాబట్టి మొదట రమేశ్ ఒప్పుకోలేదు. అయితే సుబ్బారావు అనేక రకాలుగా హామీలిచ్చి ఒప్పించి మరీ వచ్చి చేరాడు. తీరా ఇప్పుడు ఇదీ వంతు. ఇక లాభం లేదనుకుని  తాను విడిగా ఉందామనుకుంటున్నాని రమేశ్ తన ఉద్దేషాన్ని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు అదీ రభస.

"అదేంటి సుబ్బారావ్ అలాగంటావ్? నాకిక్కడ ఇబ్బందిగా ఉందని చెబుతున్నాగా?"

"లేదు , నువ్విక్కడే ఉండి తీరాల్సిందే, లేకపోతే చూడు ఏం చేస్తానో!"

"ఏం చేస్తావేంది?"

"నీమీద వోనరుకు కంప్లైంటిస్తా!"

"సరే చేసుకో."

"అంతే కాదు, నా ఫ్రెండ్సుని తీసుకొచ్చి మన ఇంటిముందు ధర్నా చేస్తా, మీ ఆఫీసుకొచ్చి భైటాయిస్తా!"

"సరే. నీ ఇష్టం"

"ఇంకా నీ టీవీ పగుల గొడతా, నీ బైకును పెట్రోలు పోసి తగలబెడుతా".

"ఏంది సుబ్బారావ్? ఇంత చిన్న విషయానికి ఇలా ఫైరయిపోతావ్? నా బైకును తగలబెడితే నీకేమొస్తుంది? ఇష్టం లేకుండా ఇలా ఎందుకు కలిసి ఉండడం చెప్పు? నేనెల్లిపోతే నువ్వొక్కడివే నీ ఇష్టం ఉన్నట్టు హాయిగా ఉండొచ్చుగా? అడిగేవారెవరూ ఉండరు. ఒకవేళ అద్దె ఎక్కువనిపిస్తే ఇంకెవరినయినా తెచ్చుకో. ఈమాత్రానికి నా బైకును తగలబెడితే నీకేమొస్తుంది?"రమేశ్‌కి కోపం వచ్చింది.

సుబ్బారావు స్వరం పెంచాడు."నువ్వు నాకు లెక్చర్లిస్తావా? ఏమనుకున్నావ్ నేనంటే అసలు? మాఫామిలీ గురించి తెలుసా నీకు? నేను గానీ పిలిచానంటే మా ఊరినుంచి రేప్పొద్దుటిలోగా కత్తులేసుకుని వందమంది సుమోల్లో దిగుతారు!"

రమేశ్‌కు కాస్త భయమేసింది. సుబ్బారావు ఫామిలీ గురించి రమేశ్‌కు తెలుసు. సుబ్బారావు అన్నంత పనీ చేయగలడు మరి. వాళ్ళ ఊరిలో బాగా డబ్బూ, భూములూ ఉన్న జమీందారీ వంశం. సుబ్బారావు కుటుంబానికీ వాల్ల పక్క ఊరిలోని మరో కుటుంబానికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. వీల్ల గొడవల వల్ల ఆరెండూ ఊర్లమధ్య ఎప్పుడూ ముఠాతగాదాలవుతుంటాయి. చిన్న చిన్న విషయాలమీద పంతాలూ పగలకు పోయే ఈరెండు కుటుంబాలవల్ల ఇప్పుడా రెండు ఊర్లలో శాంతి లేకుండా పోయింది.


రమేశ్ మెల్లిగా కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు.

"సుబ్బారావ్, ఇది నీకు తగదు. ఎంత చెడ్డా మనిద్దరం ఇన్నాల్లు కలిసి ఉన్నాం. ఇలా కొట్టుకోవడం ఎందుకు చెప్పు? నాకిష్టం లేకుండా ఎలా ఉండమంటావ్? అయినా నువ్వు సుమోల్లో మీఊరిజనాలను దించితే ఊర్కోడానికి ఇదేమన్నా మీఊరా? నేనెల్లి ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే నీ పని అయిపోద్ది. నేనెల్లినంత మాత్రాన నీకొచ్చే నష్టమేంటి అయినా నువ్వేనాడయినా నా ఇబ్బందులేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించావా?"

"నాకదంత తెల్వదు, నువ్వు విడిపోవడానికి వీల్లేదంతే. అసలిది దేశ సమగ్రతకే పరీక్ష."

"ఏందీ? మనం రూంమేట్లుగా ఉండక విడిపోతే  దేశ సమగ్రతకు ముప్పు వస్తుందా? ఏంది సుబ్బారావ్ ఈదారుణం? అసలు నీమాటల్లో కాస్తయినా అర్ధముందా?"

"నీకు తెలీదు. మందు మనం విడిపోతాం, అతరువాత మన ఓబులేసు, నారాయణ విడిపోతారు. ఆతరువాత శ్రీనివాసు, సింహాచలం విడిపోతారు. అలా ఒకరితరువాత ఒకరుగా అందరూ విడిపోతే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా?" రమేశ్‌ను ఈసారి  నిజంగానే ఇరికించానని లోలోపల తనతెలివికి తనే మురిసిపోతూ సుబ్బారావు తన వాదన చెప్పుకొచ్చాడు.

తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఇలా సుబ్బారావు అర్ధం లేని వాదనలు చేయడం చూసి రమేశ్‌కు చిర్రెత్తింది. "ఇదిగో సుబ్బారావూ, నువ్వూ, నేను విడిపోతే ఈదేశానికి వచ్చే ముప్పేమీ లేదు గానీ నీకొచ్చే ముప్పేమిటో చెప్పు" రమేశ్ కోపంతో అరిచాడు.

నిజానికి రమేశ్ విడిపోతే సుబ్బారావుకు నష్టం ఏమీ లేదు. ఇంకో రూమ్మేటును వెతుక్కోవచ్చు, ఒంటరిగానూ ఉండొచ్చు. కానీ రమేశ్ ఉండడం వలన సుబ్బారావుకు చాలా కలిసొస్తుంది. ఎప్పుడూ ఇంట్లో పనులు రమేశే చక్కబెడతాడు, పైగా తను అప్పుడప్పుడూ అద్దె ఎగ్గొట్టినా నడుస్తుంది. ఇలా అదనంగా వచ్చే లాభాలు రమేశ్ విడిపోతే ఉండవు. కానీ ఆవిషయం ఒప్పుకోవడానికి సుబ్బారావుకు ఇష్టం లేదు.

ఈసారి ఇంకేం లాజిక్ వెతకాలా అని ఆలోచిస్తున్న సుబ్బారావుకు తనూ, రమేశ్ ఒకే కాలేజీలో చదివిన విషయం గుర్తొచ్చింది. "ఇదిగో.. ఇది మన కాలేజీ ఐక్యతకే దెబ్బ. నువ్వు వెల్లిపోవడానికి వీల్లేదు."

"చాల్చాల్లే సుబ్బారావ్" మనిద్దరం విడిపోతే మన కాలేజీ పరువుకొచ్చిన నష్టం ఏమీలేదు, నేను వచ్చే నెల వెల్లిపోతున్నాను. ఇక నీ ఇష్టం."  రమేశ్ ఆవేశంతో అక్కడున్నా బల్లపై గ్లాసు గుద్ది మరీ చెప్పాడు. ఆదెబ్బకి గ్లాసుకు కింద పెద్ద సొట్టపడింది.

"ఒరేయ్ రమేశ్, ఎంత ధైర్యంరా నీకు? నాగ్లాసుకు సొట్ట బెడుతావా? అసలు నువ్వు తాలిబన్‌వి." అంతకుముందురోజు ఎవరో తాలిబన్ అనే పదం వాడితే విన్న సుబ్బారావు అదేంటో తెలీకపోయినా మరీ అరిచాడు.

"ఛీ, వీడితో వాదన అనవసరం. వీడికి ఎదుటివారి హక్కులను గౌరవించడం చేతకాదు, సాటిమనుషుల ఆత్మగౌరవం వీడికి పట్టదు" అనుకుంటూ రమేశ్ గదినుంచి బయటికి వచ్చి బరువెక్కిన హృదయంతో రోడ్డుపై నడక సాగించాడు. ఇంతలో ఎదురుగా "మారాష్ట్రం మాకు కావాలి, జై తెలంగాణ!!" అని నినాదాలు చేస్తూ సాగుతున్న ఉద్యోగుల ర్యాలీ ఎదురురాగా తానూ ర్యాలీలో కలిసిపొయి వారి నినాదాలతో గొంతు కలిపాడు.

19 comments:

  1. కథ సరే, ఓ‌ మాదిరిగా బాగానే అల్లారు.
    మరి ఇలాంటి కథలు ఆవలి పక్షంవారూ వ్రాయగలరు కదా?
    ఇలా ఊరికే ఆడిపోసుకోవటం కార్యక్రమం‌ వల్ల ఉపయోగం లేదు.
    ఇప్పటికి సృష్టించబడిన అపార్థాలు చాలట్లేదా?

    ReplyDelete
    Replies
    1. Thank you sir for your sane comments.

      Delete
    2. @శ్యామలీయం

      రాయనీయండి, ఎవరొద్దన్నారు? చదివేవాళ్ళు ఎందులో నిజాయితీ ఉందని చూసుకోరా?

      Delete
    3. సార్!
      కథలో అసలు మెలికను మరిచిన్రు.
      సుబ్బారావు తను రాక ముందునుంచి ఉన్న రమేశ్ స్వంత సోఫా మీద నాకు కూడా హక్కుందని లొల్లి బెట్టిండు. ఎందుకంటే ఆ సోఫా మీద ఇన్ని రోజులసంది నేను గూడ గూసున్న. నాకు మమకారమున్నది అన్నడు సుబ్బారావు. రమేశ్ గట్లెట్లయితది అంటే, అయితె సోఫా విడిచిపెట్టి పో, లేకుంటే కలిసుండు.... అన్నడు సుబ్బారావు. ఇగ గిది లొల్లి.... రమేశ్కు మండుకొచ్చి, గదే సోఫా లేపి సుబ్బారావు మూతి పగలగొట్టి, తన సోఫా తను దీస్కొని బయటకు గదిలిండు. ........

      Delete
  2. Katha alladam kadu... jarugutunna vastava sanghatanalanu katha roopam lo malichadu... neeke ardham avvaledanukunta... poor Andhra fellow...

    ReplyDelete
  3. chala simple ga baga chepparu.. chaduvuthunnantha sepu chivariki iddarini rendu pranthaluga antaremo anukunna kani chala baga end chesaru, story ni alage vunchi reality tho..
    "ఇంతలో ఎదురుగా "మారాష్ట్రం మాకు కావాలి, జై తెలంగాణ!!" అని నినాదాలు చేస్తూ సాగుతున్న ఉద్యోగుల ర్యాలీ ఎదురురాగా తానూ ర్యాలీలో కలిసిపొయి వారి నినాదాలతో గొంతు కలిపాడు."

    ReplyDelete
  4. కథెలాగున్నా ఎక్కడో లాజిక్ తన్నింది మాస్టారు. అంత డబ్బున్న జమీందారు కుటుంబంనుండి వచ్చిన సుబ్బారావుకి (అయితే వేరే రూమ్మేటు దొరక్క, ఒక్కడికే అద్దె మొత్తం కట్టే స్థోమత లేక సుబ్బారావే వచ్చి రమేశ్ గదిలోచేరాడు.) అద్దెకట్టే స్థోమతకూడా లేదా ;)

    ReplyDelete
    Replies
    1. @Anonymous14 September 2013 22:51
      జమీందారు కుటుంబం గనక తాతలు దోచుకున్న భూములు, ఆస్థులు ఉన్నయి,కానీ ఉద్యోగం వల్ల వచ్చే నెలసరి ఆదాయం తక్కువ.

      Delete
    2. అంతే కాదు విశ్వరూప్ గారు!
      డబ్బులున్నా ఖర్చు పెట్టే గుండె ధైర్యం ఉండాలి కదా!
      పైసా పైసా లెక్కలేసుకొని ఖర్చు పెట్టే వ్యాపార దృష్టితో కూడిన పిసినారితనం సుబ్బారావు సహజ లక్షణం!

      Delete
    3. @shayi

      పిసినారితనంతోపాటు ఇంకా పక్కవాడికి, నమ్మినవాడికి టోపీలు పెట్టడం సుబ్బారావు లక్షణం. అందుకే సుబ్బారావు ఒంటరిగా ఉండలేడు, టోపీలు వేయడంకోసం ఎప్పుడూ పక్కన ఒకరు ఉండేలా చూసుకుంటాడు. అందుకోసం రూమ్మేటు సుబ్బారావుకు ఒక అవసరం.

      Delete
  5. విశ్వరూప్ గారికి నమస్కారాలు! సీమాంధ్రుల తీరే ఇంత. దౌర్జన్యం, దౌష్ట్యం...మీ కథలో కళ్ళకు కట్టినట్లుగా రాశారు! అభినందనలు...

    అన "సమైక్యాంధ్ర" కాదు, "సమైక్య భార
    త" మ్మనవలెను జను! లంతదనుకఁ దారు
    "భారతీయులు కా" రని తెలియవలెను;
    లేనిచో మానవత్వమ్ము లేనివారె!! (1)

    ఒకఁడు విడిపోదు ననుచుండ, నొకఁడు కలసి
    జీవనము సేయఁ గోరుట, శ్రేయ మగునె?
    దోపిడీ సేయఁబడినట్టి దోష రహితు,
    "దోచుకొందును ర" మ్మనెదోయి, తగునె? (2)

    కలిసి యుండఁగ వలెనన్న కావలయును
    నిరువు రంగీకృతులుగాను నిక్కముగను!
    వేఱు పడవలె నన్నచో, వేఱు పడెడి
    వారి యంగీకృతమ్మె కావలయు నంతె!! (3)

    "మేము కలసి యుండుఁ డటన్న, మీరు కలసి
    యుండఁగా వలె! విడిపోవ నొప్పుకొనము!!
    కలసి మా తోడ నుండి, బాధలను బొంద,
    మాకుఁ బట్ట" దనెడి మాట మంచితనమె? (4)

    మా తెలంగాణ ప్రజల సన్మానసముల
    బాధ పెట్టక యుండ సంప్రార్థన లివె!
    ప్రాంతములుగాను విడిపోయి, భ్రాతలుగను
    కలిసి యుందము సీమాంధ్ర ఘనత యెసఁగ!! (5)

    ReplyDelete
    Replies
    1. గుండు మధుసూదన్ గారు,

      మీపద్యాలు చాలా బాగున్నాయి, అభినందనలు.

      Delete
    2. మధుసూదన్ గారూ, మీ బ్లాగు స్ఫూర్తితో!

      మందల బలమే బలముగ
      అందిన దంతయు దోచిరి అరువది ఏండ్లన్,
      చెందదు హైదరబాదని
      బందులు జేసిరి, సమైక్య భావన ముసుగున్!

      Delete
    3. మధుసూదన్ గారు,

      సీమాంద్రప్రజలు అందరూ దౌర్జనన్యకారులూ, దుష్టులూ‌ అంటారు. అంతేనా.
      అక్కడ పుట్టినా, అక్కడి మూలాలు ఉన్నా సీమాంద్ర వాసన కారణంగా వాళ్ళంతా చెప్పరానంత చెడ్దవాళ్ళు.
      అసలు సీమాంద్రవాళ్ళకి మానవత్వమే లేదు. చాలా గొప్పగా చెప్పారు.
      అలాగే తెలంగాణా వాళ్ళంతా సాధువులూ సాక్షాత్తూ దేవతలూ. అంతే‌ నంటారా?
      చాలా సంతోషం.

      మీలా కాకపోయినా నేను కూడా కొద్దో గొప్పో పద్యాలు గిలకగలను.
      మీ‌ పద్యాల్నీ, మీ ధోరణినీ తూర్పారబడుతూ ఇంకా ధాటిగా మరింత సలక్షణంగా మరింత ధారాశుధ్ధిగా వ్రాయగలను.
      కాని అలా చేస్తానని అనుకోవటం లేదు.

      కాని కవులకు సంయమనం ఉండాలి. ఆవేశంతో వ్రాసే కవిత్వం అది ఎంత అందగా ఉన్నా విషాక్తపయఃకుంభం లాంటిదయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఆవేశంతో కాక ఆలోచనతో ముందుకు వెళ్ళండి.

      ఒక ప్రాంతం లో ఉండే ప్రజలంతా దోపిడీదారులూ, దొంగలూ వాళ్ళు మనుషులే‌కారు అనటం క్రూరత్వం క్రిందికి వస్తుంది.

      ఇక విశ్వరూప్‌గారు సీమాంధ్రులది మందబలం అన్నారు. హైదరాబాదులో మందబలం ఎటువైపు ఉందో ఎవరికి తెలియదు?

      తిట్ల పురాణాలు ఆపి సుహృధ్బావవాతావరణం కోసం కృషిచేఏయండి.
      విద్వేషాలు రెచ్చగొట్టటానికి ఆట్టే ప్రతిభ అక్కర లేదు కాని మంచి వాతావరణం నెలకొల్పటానికి ఆలోచనాపరులు పూనుకోవాలి.

      ఇక్కడ మీ‌ యిద్దరి ధోరణీ తప్పని నా అభిప్రాయం.

      Delete
    4. ధన్యవాదాలు విశ్వరూప్ గారూ, మీ కంద పద్యం చాలా బాగుంది. ప్రతి ఒక్క వ్యాసంలో ఒక పద్యం ఉంచడానికి ప్రయత్నించండి. దాశరథిగారే మనకు స్ఫూర్తి. మీ వ్యాసాలు ప్రభావవంతంగా ఉన్నాయి. అభినందనలు!

      Delete
    5. @శ్యామలీయం

      అయ్యా శ్యామలీయం గారూ,

      ఎందుకండీ మీకింత పక్షపాత ధోరణి, ఉలికిపాటు? తెల్లవారు భారతదేశాన్ని దోచుకున్నారు అనగానే ప్రతి బ్రిటిష్ పౌరున్నీ పేరుపేరునా దోపిడీ చేసిండని అన్నట్లా? ఎనదరో బ్రిటిష్ వారు భారతస్వాతంత్రసమరంలో తోడ్పడ్డారని మీకు తెలుసా? అధికారంలో ఉన్నది సీమాంద్ర్హ నాయకులు, వారి పరిపాలన మూలంగా ఇక్కడి వనరులు దోచుకోబడ్డవనేది వాస్తవం. పాలకుల అండదండలు చూసుకుని వారికి కాపుగాచే కొన్నివర్గాలు సైతం దోపిడీలో పరోక్షంగా భాగమయ్యారన్నది వాస్తవం. సీమాంధ్ర ప్రజలందరూ దోపిడీదారులూ, దౌర్జన్యకారులూ అని మధుసూదన్ గారు అనలేదే?

      తెలంగాణ ప్రజలనీ, తెలంగాణ ఉద్యమాన్నీ బ్లాగుల్లో ఎగతాళి చేస్తున్నప్పుడు మీరెక్కడా కనబడరే? ఏం, పెద్దమనిషిలాగ ఇది తప్పు అని చెప్పొచ్చుగా? అది చేయరుగానీ తెలంగాణ బ్లాగర్లను మాత్రం ఒకటే కెలుకుతారు?

      మీరు పద్యాలు బాగా రాయగలరని మాకు తెలుసు, అయితే రాయడానికి భాష ఒక్కటే సరిపోదు, భావావేశం కలగాలంటే నినాదంలో నిజాయితీ ఉండాలి. అదిలేదు కనకే ఇవ్వాల సీమాంధ్ర ఉద్యమానికి కవుల తోడ్పాటు లేదని గమనించగలరు.

      Delete
    6. >సీమాంధ్ర ప్రజలందరూ దోపిడీదారులూ, దౌర్జన్యకారులూ అని మధుసూదన్ గారు అనలేదే?
      విశ్వరూప్‌గారూ, గుండువారు ...జను! లంతదనుకఁ... అన్నచోట జనులు అన్నమాటకు ప్రజలు అనే అర్థం వస్తుంది.

      >....ఇది తప్పు అని చెప్పొచ్చుగా? అది చేయరుగానీ తెలంగాణ బ్లాగర్లను మాత్రం ఒకటే కెలుకుతారు?
      తప్పు నా దృష్టికి వచ్చినప్పుడు నా అభిప్రాయం చెబుతాను. బహుశః తెలంగాణా బ్లాగర్లలో హెచ్చు శాతం మంది సంయమనం లేకుండా వ్రాస్తునారు కాబట్టి ఎక్కువసార్లు వారికే నా జవాబు కనిపించవచ్చును. దానికేమి.

      >భావావేశం కలగాలంటే నినాదంలో నిజాయితీ ఉండాలి. అదిలేదు కనకే ఇవ్వాల సీమాంధ్ర ఉద్యమానికి కవుల తోడ్పాటు లేదని గమనించగలరు.
      క్షమించాలి. ఆవేశంతో కాక ఆలోచనతో నిదానించాలి. ఆవేశంతో దూషణలకు దిగుతాం అంటే అది శోభించదు. కవుల తోడ్పాటు లేదన్నది అవాస్తవం. ఇబ్బడి ముబ్బడిగా బ్లాగుల్నిండా సీమాంధ్రకవులు తిట్టిపోతలకు దిగటం లేదంటే వారు మీలా ఆవేశపరులు కారనే అర్థం కాని వారి వాదంలో‌ నిజాయితీ లేదని కాదు.

      Delete
    7. @శ్యామలీయం
      >తప్పు నా దృష్టికి వచ్చినప్పుడు నా అభిప్రాయం చెబుతాను.
      గతంలో అనేక సందర్భాల్లో అనేక బ్లాగర్లు సీమాంధ్ర బ్లాగర్లు తెలంగాణ వాదాన్ని కించపరుస్తూ, తెలబాన్లూ అంటూ ఎగతాళి చేసిన సందర్భాలను అనేకం మీదృష్టికి తేవడం జరిగింది. బహుషా మీకు అవి ఇంపుగా అనిపించి ఉంటాయి కనుక మీరు స్పందించింది లేదు. ఇప్పుడు కూడా మీరు ఒక్కసారి సంకలినిని చూస్తే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ మీకవి పట్టవు

      >క్షమించాలి. ఆవేశంతో కాక ఆలోచనతో నిదానించాలి. ఆవేశంతో దూషణలకు దిగుతాం అంటే అది శోభించదు. కవుల తోడ్పాటు లేదన్నది అవాస్తవం.
      మీకు నచ్చని విమర్శలన్నీ దూషణల్లా మీకు కనిపిస్తే అది మీలోపం మాత్రమే. పద్యాలు రాయగల్గినవారందరూ ప్రజాకవులు కారుగదా? సీమాంధ్ర ప్రజాకవులనేకం తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధిస్తున్నారు.

      ఉదా: http://archives.andhrabhoomi.net/sahiti/telangana-870

      Delete

Your comment will be published after the approval.